నటరంజని

వేదాంత విజ్ఞాన-బ్రహ్మ జ్ఞానాల సమ్మేళనం - కూచిపూడి భామాకలాపం : 2

-- శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహం

ఈ భామాకలాపములో దూతికా రాయబారఘట్టము, మందుల పట్టు, సొమ్ములపట్టు దశకామావస్థలు మరియు లేఖా ఘట్టమునందు, అడుగడుగున అభినయ ప్రస్థార క్రమమున మరే నృత్య రీతిలో కానరాని అభినయ భంగులు చూడనగును. కూచిపూడి నృత్యాంశములలో కలాప ప్రదర్శనలో సత్యభామ అష్టవిధ నాయికాభినయములను రసపోషణను గుణముగా తీర్చుటకనువయిన పాత్ర ఒద్దికా వయ్యారములు గల సరస నాయికయై ద్వారకా వాసుని కౌగిటజేరి మనసుదీర మరుని బారి దీర్చుకొన్నట్టిదియై, జగన్నాధుని తన చెప్పు చేతలలో ఉంచుకొని తన కోరిక రీతిని ఆడించిన స్వాధీనపతికగా లోకమంతా నిండియున్న లోకేశ్వరుడు తనకు వశుడనే భావనలో ఉన్నతన వద్దకు కసిగాడు మోవితో, కలకంఠి కాలితో, పసుపంటిన వల్లె వాటుతో, పొసగని నిద్రతో వచ్చి తల వైపు నిలిచియుండ పొమ్మన స్వామి అలిగి దిగ్గున లేచిపోయిన సంగతికి కలహాంతరిత స్థితి దాల్చుట. కలహమయిన పిదప శ్రీకృష్ణునితో గడపిన శ్రుంగార జీవితం కలహకారణాం తలచుకొని స్వామిని గానక వియోగ బాధ భరించలేక వలపుల సాగరమీద లేక "మదనా మదనా" యనుచు మరుని శరముల బారికోర్వలేక విరహాత్కంఠితయై ఇందరిలో ఈ సొమ్ములేల? నా నాధుడే లేని స్త్రీ జన్మమేలనేయని వగచును.

ఇష్ట సఖి మాధవిని రాయబార మొనర్చమని కోరుటలో సత్య ఆవేదన అడుగడుగునా వ్యక్తమగును. రాయబార ఘట్టము అతిరమ్యంగా తీర్చిదిద్ది వాచికాభినయానికి పట్టంగట్టిన నాట్యకళోద్ధారకులు సిద్దేంద్రులు.

సత్యభామగా
వేదాంతం సత్యనారాయణ శర్మ

"శకునాలు మంచివాయెనమ్మా, ఉత్తరాన ఉరుము ఉరుమ పడమర పాలదీర్చ ముత్తైదువలిద్దరు అంగనా శోభనము పాడ, భూసురులిద్దరు పూర్ణ కుంభములు శిరమున నిడుకొని రాగ, 'శకునాలు మంచివాయెనమ్మా' అని మాధవి రాయ బారమైపొయి రాగదమ్మా" అంటూ వేడుకొంటుంది సత్య.

ఇచ్చట శుభశకునాలు సూచన ద్వారా జ్యోతిర్విజ్ఞానము గోచరిస్తుంది. ఈ దరువు ప్రత్యేకంగా భామాకలాపంలో అకారములు సంగీత పరంగా సంగతులు తీర్చిదిద్దుట ప్రత్యేక కొనుగోలు పద్దతులు అనుశృతంగా వస్తున్న ఘట్టము. పల్లవి ప్రస్థారంలాగా భామాకలాపంలో ముఖ్యంగా "మదనా"దరువు - సిగ్గాయనోయమ్మ"దరువు. భామాప్రవేశ దరువులు - సంపాద దరువులు-అభినయ దరువులు- కూచిపూడి శైలికి అద్దంపడుతూ వుంటాయి.

తపనావస్థలో ఉన్న భక్తుని కరుణించ భగవంతుడు రాగా తుది మెట్టు కిందున్న భక్తుడు భగవంతుని గుర్తించ లేకపోవుటే సామాన్య భక్తి. ఇంతకు ముందు మాధవిని రాయబారం పంపటం, నాధుని వశపరుచుకోవచ్చునన్న భ్రమకు లోనైంది సత్య. దూతిక మందయాన అయితే దౌత్యం చాల కష్టం. దౌత్య ప్రయోగం సఫలం అయినా భరింపరాని ఆలస్యం జరిగింది. పరమాత్మ వియోగం అహంకారం, అజ్ఞాన కారణాలుగా తలచక దూతికను శంకిస్తుంది సత్య. మాధవి పరమ భక్తి ప్రబోధన. జటిల వేదాంత బోధనకు కవిచే స్పందించబడిన పాత్ర. కావున పదనాంబు భక్తులైన తపమాచరించిన ముని జనులకు దుర్లభుడగు శ్రీకృష్ణ పరమాత్మను సేవింపుము.

అహంకారము-మాయ తొలగించుకొని ప్రసన్న పురుషుడగు పరమాత్మలో ఐక్యము సిద్ధింప జేసికొమ్మని మాధవి చెప్పును. భామాకృష్ణులు జీవేశ్వరులు, శృంగార-హాస్య రసములను సత్యభామ -మాధవి ద్వారా గ్రోలి ఈ మిత్రరసముల వైభవమును అనుభవించాం.

వృధా నిశ్చంద్రికా రాత్రం
వృధా దుర్లేషు కుసుమం
వృధా నిష్పండి తస్సభ
వృధా నిష్కాంత యవ్వనం

ఈ స్థితిలో పతి వియోగావస్థ కోర్వలేక నాయిక విరహోత్కంఠితయై నాధుడు దరిలేని సమయం అరణ్యంలో పూచిన పుష్పములతోను, చంద్రుడులేని రాత్రి అనగా అమావాస్య నాటి రాత్రి చంద్రునితో పండితులు లేని సభ యెటువంటిదో తన స్థితి స్వామి వియోగావస్థలో ఉన్న తీరును వర్ణించుచు వగచును. పతి వియోగావస్థ కోర్వలేక నాయిక "ఎందుబోతి, ఎందుబోతివి రార నంద నందన" ప్రాణి తోడు నిను చూడక పదవి చేకూరదు. నాట్యమున నిను చూడక, మనసు తీరదు చేర రారా ఈ వేళను అని అభిసారిక స్ఠితి దాల్చి స్వామిని వెదకును.

వియోగ విప్రలంబ శృంగారమునకు ఆలవాలమయిన ఈ ఘట్టంలో సత్య చిత్తజుని బారి కోర్వక సుందర వదనావిందుడగు రాజగోపాల స్వామికి నిటలిత ఘటిత కరకమలై అనేక సాష్టాంగ దండ ప్రణామంబు వ్రాయు లేఖా ఘట్టములో సిద్ధేంద్రులు మాధవి పాత్ర ప్రత్యేకత కలాపంలో చూపారు.

ఇచట మాధవి సత్య భామను అతి దీనంగా ప్రాధేయ పడేటట్లు చేయుటకు కంఠోక్తిగా బోధన చేయకుండా భక్తి పరిణితి చెందేవరకూ ఆత్మ పరిశీలనకు దారితీసే కొన్ని ప్రశ్నలు వేసి భక్తుడు తనను తాను ఉద్ధరించుకొనేటట్లు చేసే ప్రవర్తన ఈ పాత్రది. సత్య చేత మాధవి జగన్నాధుని పేరు చెప్పించుటకు ప్రయత్నించి విఫలురాలగును. చివరకు లేఖ వ్రాయించే ప్రయత్నం చేస్తుంది. కనుక లేఖలో సత్యభామ అంతరంగం ప్రతిబింబమయి అందులో దాసోహం అనిపించేటట్లుగా సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరింపజేసి అహంకారమును నశింపజేస్తుంది. పతి వియోగావస్థను పలు రకాల అనుభవించిన సత్యపై దయగల వాడై రాజగోపాలుడరుదెంచును. వెంటనే సత్యభామ ఖండిత నాయికయై నాయక వంశదూషణ యొనర్చి "లేమలందరూ చూడ నిను జడతో గొట్టకుంటే భామనా సత్యభామనా", అభిజాత్యం కలిగిన సత్రాజిత్తు కుమారయై పరితపిస్తూ "రంగుగ నామెడ మంగళ సూత్రము గట్టిన సంగతి మరువతగునా" అంటూ నాటి ముచ్చటలు తలచుకొని హృదయతాపము, తన అవస్థలను పర్యావలోకన చేసుకుంటూ, ఈ సొమ్ములేలనే అంటూ భూషణములను త్యజిస్తూ, దుఖిస్తూ ప్రియుడు రానపుడు అతడు పెండ్లి కాలమందు ఆడిన మాటలు నెమరు వేసుకుంటూ వానితో గడిపిన మధుర శృంగార జీవితము గూర్చి ఘంటా పురతులతో కాటంపు నెలకొన్న చక్కని మోవి చిరుక్కున నొక్కుచు, మక్కువ దీర్చేటి నాధుని గూర్చి వర్ణించే ప్రోషిత భర్తృక అగును.(ముగింపు వచ్చే మాసం )

హైదరాబాదు వాస్తవ్యులయిన శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ప్రస్తుతము కార్నింగ్, న్యుయార్క్ నివాసస్తు లయిన తమ అబ్బాయి భాగవతుల శాస్త్రి గారి దగ్గరికి వచ్చి వున్నారు. ఎంతో మంది సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందిస్తూ ఎంతో కళా సేవ చేస్తూ పేరుప్రఖ్యాతులు సంపాదించికున్న శాస్త్రి గారిని, వారి రచనలను సుజనరంజని ద్వారా పాఠకులకు పరిచయం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము.