కృష్ణ శాస్త్రి కావ్యరస శివా(శివానీ) ఆనందలహరి

శంకరాచార్య సౌందర్య లహరుల నునుజల్లులు.

పరిశోధనాత్మక వ్యాసం: రెండవ భాగం

-- సుమతి

సాహిత్యం పరమార్థ సిద్ది కొరకు కవి సాగించే జీవన ప్రస్థానం. కాబట్టి కవి తన గమ్యం వైపుగా అన్వేషిస్తూ ఎన్నో మజిలీలు చేయాల్సివుంటుంది. కవి గడిపిన విడిదిలోని ఒక్కోక్క మధుర ఘట్టం ఒక్కోక్క కావ్యం అవుతుంది.

శంకరాచార్యకృత శారాదాదేవి స్తోత్రం "నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని"
6వ శ్లోకం మొదటి పాదం

"యయా వినా జగత్స్వరం శశ్వజ్జీవన్మృతం భవేత్"

3వ శ్లోకం రెండవ పాదం

"భవానీం భవసంతాప నిర్వాపణ సుధానదీం"


భావం:- ఓ భవానీమాతా నీ కరుణా కటాక్షాల వల్లనే జడమైన ఈ సమస్త ప్రపంచ ప్రకృతి నిత్యనూత్నమైన చైతన్యన్ని పొందుతున్నదమ్మ. ఈ జగత్తులో శారీరక, మానసిక తాపములతో అలమటిస్తూ, నీరసించి నిస్తేజులైన మానవులకు ఓజస్సును, తేజస్సును ప్రసాదించె అమృతనదివి తల్లి దు:ఖమగ్నలై జీవచ్చవాలలా బ్రతికే జనులకు నీ దయాదృష్టి మృతసంజివని. ఈతిబాధలు, వ్యాధులు, జరామరణ దు:ఖాల తొలగించు శాశ్వత జీవనామృతమునీ అండనీ ప్రాపు.
కాబట్టి జరలేనిదా యౌవనమ్ము అంటే ఆరోగ్యవంతమైన మన శరీరములతో నిండిన అమర భావన. పరమానంద భావన. ఈ అమరత్వ భావానా సిద్ది ప్రసాదించే ఆ శ్రీమాత కరుణ కొరకు కవి ఆమెను త్రికరణ శుద్ధిగా ధ్యానించాడు. ధ్యానం గురించి ఒక గొప్పమాట. శ్వేతాశ్వతరోపనిషత్:

శ్లో|| త్రిరున్నతం స్థాప్యసమం శరీరం హ్రదీంద్రియాణి
మనసా సన్నిరుద్ధ్య బ్రహ్మొడుపేన ప్రతరేత
విద్వాన్స్రోతాంసి సర్వాని భావహాని


భావం:- వివేకవంతుడు తన దేహములోని ప్రధాన అంగాలైన మూడు భాగాలను (తల, మెడ, ఛాతి) నిశ్చలంగా, నిట్టనిలువుగా ఉంచాలి. తన పంచేంద్రీయ జ్ఞానాన్ని మనస్సులోనికి, మనస్సును హృదయం (ఆత్మలోనికి) చొప్పించాలి. ఇలా ఆచరిస్తే జీవిత సంక్షోభాలు, ఉపద్రవాలనే సుడిగుండాలు బ్రహ్మమను (విశ్వాత్ముని చైతన్యం) నావనెక్కి అవలీలగా దాటి సంసార సాగరాన్ని తరించగలడు.
ఈ సత్యం తెలుసు కాబట్టే 2వ పద్యంలో జడామైన నా పాదాలు స్వేచ్చగా ఈ విశ్వంలో సంచరించగలిగే రెక్కలు, నా కళ్ళు అనంత కాంతితో వెలిగే పరం జ్యోతులు, ఆరని మణి దీపాలు అని అనగలిగాడు. అంటే మన హృదయ కమలం మీద వసించే ఆమెకు జీవన సర్వస్వాన్ని సమర్పించి, అంతర్ దృష్టి ప్రసరింపజేసి, సమస్త భువనాలు తన గర్భంలో ఇముడ్చుకునే ఆ భువనేశ్వరి మాతని సందర్శించి కృతార్థుడయ్యాడు. అన్ని యోగ సాధనలలో మానసిక ధ్యాన ఉత్క్రుష్టతను కవి నిగూఢంగా చెప్పాడు. ఈ సూక్ష్మమైన మోక్షభావంతో కవి తన ఐహిక జివనం శిశిర మధుర మధు జీవవాహిని (చైతన్య స్తబక మకరంద స్రుతిఘరీ గా మారింది. ఆ ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రి అనుగ్రహించిన ఈ జీవితం కవిది. ఆ తల్లి సంకల్పంతో పరమార్థం నిర్దేశింపబడిన అపరూపవరం. ఆ ప్రసవిత్రి స్తన్యం శాశ్వత జీవనామృతం. (జరలెని యౌవనం) త్రాగిన ప్రేమరుపా, ప్రియంకరి తనయుడాయన. కాబట్టె విషజ్వాలలు, తేనె జల్లులు వంటి విషమ మధుర ఘట్టలు, ఇరులు(చీకట్లు) వెలుగులు వంటి దు:ఖ, సుఖానుభూతులతో కూడిన సమ్మిశ్రిత సంక్లిష్ట జీవితం సుమధుర మధురమైనదాతనికి. నవరసలహారులతో కూడిన ఈ జీవన సాగరం, ఆ మాతృమూర్తి దరహాసామృత శివా(శివానీ) ఆందలహరి. ఎన్ని యుగాలైనా ఆ ఆనందలహరులలో ఈదులాడుతూ హాయిగా మనగలడంతాడు ఈ కవి చంద్రుడు. కవినుడివిన ఈ మాటల్లో గొప్ప సందేశ ప్రబోధముంది. నాణానికి రెండు వైపులా బొమ్మ బొరుసుల్లా ప్రతి మానవ జీవితంలో కష్ట సుఖాలు నిత్య సత్యాలు. మానవత్వం పూర్ణమయ్యేది ఈ స్వంద్వాలను సమానంగా స్వీకరించి రెండింటి అంభవాల్ని చవి చూదదం. ఈ అనుభవ జ్ఞానంతో అతి మానస స్థితికి (super mind) చెరుకోవడం. సుఖ దు:ఖాలకు అతీతమైన స్థితి. అదే అద్వితీయమైన పర బ్రహ్మనందం. ఇలాంటి ఉత్క్రుష్ట బ్రహ్మ భావనను కలిగించేదే నరుని జీవితం. దివిలోని దేవతలు సైతం ఈ దివ్యానందం కొరకు యీ పుణ్యభూమి కర్మభూమిలో జన్మనెత్తడం అన్ని యుగాలల్లోను జరుగుతున్న సంగతే.
కవి మొదటి పద్యం "మకుట మాణిక్యమో ప్రభామండలమ్మొ" అనడం చేత ఆ జనయిత్రి పాదపీఠం మణిపీఠాన్ని కూడా ఉద్దేశించి చెప్పాడని తోస్తుంది. సౌందర్య లహరి 25వ శ్లోకంలో

శ్లో|| త్రయాణం దేవానాం..... తవ చరణమో...
మణి పీఠస్యనికటీ ... సమకుటా:

కవి అనర్ఘ్య పద్య మాణిక్య కాంతి మిరుమిట్లలో మొదటి ఆ తల్లి మాణిక్యకిరీటాన్ని, తరువాత నిరుపమాన తేజోనిలయం ఆలోకమాత పాదమణి పీఠాన్ని మన మనస్సులో స్మరింపజేసాడు. సౌందర్యలహరి 84 శ్లోకం:

శ్లో|| శ్రుతీవాం మూర్ధానో.... చూడామణి రుచి

ఉపనిషత్తులకు శిరోభూషణములైనవి, శివజటాజూట గంగకు పాద్యములైనవి, లాక్షారసుంచే మహావిష్ణు కిరీట మాణిక్యములకు కాంతినొసగు ఆ దేవి పాదస్పర్శ పఠితులకు ప్రసాదించాడు. దీనితో ఆ జనని రూపాన్ని ఆ మస్తక కిరీట పాదాంతం మరియు ఆపాద మస్తక పర్యంతం మన మదిలో స్పురింపజేశాడీ కవీశ్వరుడు. ఆ కరుణామయి కమనీయ ముఖబింబ శీతాంశులహరులలో మనలను సుస్నాతులనుజేసి పునీతులను చేశాడీ దేవీభక్తుడు.

కృష్ణపక్షంలోని మరోక ఖండిక భావాల్ని పరిశీలిద్దాం. 'మా బాబయ్య, నాన్నగారు - 5 page 6 '

"నాడు గొంతెత్తి మీరు గానమ్ము జేసి
నారు, భువనాలు తమ శ్రవణాలు విచ్చి,
'ఔ' నటంచు, 'ఓహో ' యంచు నాలకింప
విస్మ యాధిక సమ్మోద విభ్రమమున

అంత హరిదంతముల గూడ నతిశయించి
పొరలి పోవు మీ గీతమాధురుల మ్రోత
తన విపంచీ మనోజ్ఞ నిస్వనము ముంప,
కనుబొమల నెత్తి, మోమెత్తి కడల గాంచు
భారతీదేవి యంగుళక పాడవంట!

దరనిమీలిత దివ్యనేత్రముల తోడ,
నపుడు, మీ పాటలోని యనంత నూత్న
రక్తి కలరి, కవీంద్ర సమ్రాట్టు, లేత
నగవు తోడ, శిర:కంపనమ్ము సేయ,
విశ్వమెల్ల శంసా ప్రభృ విరిసె నంట!"

ఇందులో కవి వారి బాబయ్యగారు, నానగార్ల గానకళా ప్రావీణ్యాన్ని వర్ణించాడు. వారు రామమహీపతి కొలువులో సంగీత విద్వాంసులు. మధురగాత్రమున్నవారు. రాజు సన్నిధిన కొలువులో శ్రవణానందకరంగా ఈ జంట గాయకులు శ్రోతలను సమ్మోహపరుస్తూ పాడుతుంటే వారి గంధర్వగాన ప్రవాహ వీచికలు దశదిశలు ముంచెత్తి భూలోకావనెకాక త్రిబువనాలలో (కైలాస, వైకుంఠ, సత్యలోకాలు) ఎగసి పడుతూ ప్రవ్హించినాయట. సత్యలోకమున వీణవాయిస్తున్న వాణీదేవి కచ్ఛపివీణ నిక్వాణ మాధురలను ముంచివేశాయి. అంత తారాస్థాయికి చేరుకున్న, వారి భోరునమ్రోగు ఆ గీత మాధురల మధురిమకు సరస్వతీదేవి విస్మితురాలై నిశ్చేష్ఠఐనది. తలయెత్తి ఆశ్చర్యార్థికంగా చూపులు ప్రసరిస్తూ, దిక్కులు చూస్తూ ఉంటే ఆమె కాళ్ళు చేతులాడలేదు. దిగ్భ్రమతో వేళ్ళు వీణ తీగను మీటలేక స్థంబించినాయి. ఆ సుధాగాన మందాకిని మాధుర్యమునకు పరవశించిన ఆ సభాపతి, ఆ సామ్రాట్టు మందహాసముతో ప్రశంసా పూర్వక వీక్షణములు ప్రసరించినాడు. విశ్వమంతా ఆ నాదజ్యోతి మెరుపుల మిలమిలలు తళుక్కుమన్నవి.

ఈ ఖండికలోని శీర్షిక తీసివేసి భావాలను యధాతధంగా తీసుకుందాం. కాని మీరు (బాబయ్య, నాన్నగారు) నీవు అన్న పదమునకు గౌరవ సూచిక సంజ్ఞ అని భావిద్దాం. కవి యిక్కడ దేవిని సంబోధిస్తున్నట్లుగా భావింపవచ్చు. "మీ గీత మాధురుల మ్రొత! తన విపంచీ మనోజ్ఞనిస్వనము ముంప .... భరతీదేవి యంగుళులు పాడ వంట. "అన్న మాటలు లలితాసహస్రనామముల 11 వశ్లోకం. " నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ" అంటే లలితాదేవి తన మాధుర్య భాషణములచేత సరస్వతి వీణ కచ్చపిని రాగరస మాధుర్యమున ముంచినది. అంటే పూర్వమున్న మధురనాదము తిరస్కరింపబడినది. వీణామాధుర్యమును మించి లలితా వాజ్మాధుర్యమున్నాది. ఈ పద్యమున దేవీముఖవాణి విన్నది భారతీదేవేకాదు దేవీ భర్త సదాశివుడు కూడా. కవి కవీంద్ర సామ్రాట్టన్నాడూ. పై లలితానామ భావనతో సౌందర్యలహరి 66వశ్లోకం వీక్షిద్దాం.

శ్లో!! "విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతే
స్త్యయా2రబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే,
తదీయైర్మాదుర్యై రపలపిత తంత్రీకల రవాం
నిజాం, వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం"

అమ్మా భగవతీ! నీ ఇష్ట సఖియైన వాణి నిన్ను రంజింపజేయడానికి నీ ప్రాణ విభుడైన శివుని వీరవిహార రసవత్తర గాధలు ఉర్లేఖిస్తు వివిధ సంగతులతో మధురరాగాలను వీణమీద కర్ణరసాయానంగా పలికిస్తున్నది. శారద విపంచి నిక్వాణపు గీత వివిధ గమకాలు దివ్యగాయనీమణీవైన నిన్ను అలరిస్తున్నయి. నీ చెలి సమృతగాంధర్వలహరిని ప్రశంసిస్తూ నీ నోట ఓహో అన్న ఆశ్చర్యార్ధకపదం వెలువడింది. తల్లీ ఆ కమనీయ నీ ఏకైక శ్లాఘ్యపదమే- వాక్యం రసాత్మకం కావ్యంగా అవతరించింది. మృదుమధుర నవనీత సమానమైన గావ్యగీతిగా అలరారి నీ గళాన పాడబడింది. సౌజన్యవతివైన నీ సాధువాక్కు సమ్యక్ గీతమే మరి. నీ కలకంఠ స్వరం నూండి వెలువడిన గాన సుధా స్రవంతి వీచికలు కచ్ఛపిని (సరస్వతి వీణ) పూర్తిగా ముంచెత్తాయి. నీ కలగాన రస లహరిముందు వీణారసం పేలవమైపోయి ఆ అరవిందాసనుని రాణీ కరస్థవీణ చిన్న బుచ్చుకుని మూగవోయింది. అవ్యక్త మధురమైన నీ గళరాన విన్న బ్రహ్మనీ అనిర్వచనీయ బ్రహ్మానుభూతిని పొంది తన్మయురాలై మేనుమరిచింది. ఆమె అంగుళలు వీణమీటుతున్నవల్లా నిలిచిపోయాయి. గీర్వాణీ నీగాని సమ్మొహంతో తన వీణకు గనిసెనతోడిగింది.
ఈ భావనకే దోహదపడే శంకరుని రమ్యార్ధమున్న ఇంకొక శ్లోకాన్ని గమనిద్దం. 60వ్శ్లోకం సౌందర్య లహరి

"సరస్వత్యా సూక్తీ .... లహరీ
. . . . . . . . .. . . . . .
ఝణత్కారై స్తారై: ప్రతినచన మాచష్ట ఐవతే."

దీని భావం ఇది గీర్వాణీ శివుని గూర్చి చేసే గుణ కీర్తన రసామృతాన్ని శర్వాణి శ్రవణాలనే దోసిళ్ళలో ఆస్వాదిస్తు ఆనందసాగరంలో ఓలలాడుతున్నది. మధుర రసానుభూతి నిచ్చే ఆమె సూక్తి చమత్కారాన్ని విని భవాని మెప్పుదలతో తల పంకిస్తుంటే ఆమె చెవికుండలాలు కరలాడి ఝణఝణమంటూ మంద్రమైన సవ్వడి చేస్తున్నవి. ఆ ఝణ ఝణాత్కారనాదం ఇలా ఉంది. తనివితీరా ఇంకా వినాలనే ఆసక్తితో అలంటి మాటలు ఇంకా కొనసాగించాలని భవాని గీర్వాణీకి ప్రేరణనిచ్చే అభినందన (బాగు, బాగు) లాగా ఉంది. వాటి కాకలీధ్వని బ్రహ్మాణికి శ్రవణానందంగా వినబడి ప్రణవనాదమై, రసోవైస: అనబడు బ్రహ్మనందానుభూతిని కలిగించింది. ఈ శ్లోక భావాన్ని ముందు చెప్ప బడిన శ్లోక భావాన్ని సమన్వయ పరిస్తే ఆ కామేశ్వరీదేవి కలకంఠమునకు తోడు, కుండలముల ఝణ ఝణ చిరుమువ్వల సవ్వడి వాద్య సహకారిణి కాగా, వీణాపాణి వశీకరింపబడీ అవాక్కవడమే కాదు, ఆమె వీణ కూడా ఆ మాధుర్యాతకు మూగపోయింది. దేవి గళరవం వీణపాలిట లాలిపాట కుందలమూ స్వనము జోకొట్టు ధ్వని ఐంది.

సరస్వతి వీణ ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి చివరి భాగంలో తెలుసుకుందాం.

(సశేషం)

సుమతి గారు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉన్న ఈవిడ అనేక వ్యసాలు వ్రాస్తూ సరికొత్త దృక్కోణాలను ఆవిష్కరిస్తున్నారు. భారతీయ సాహిత్యంలో పారమార్ధిక సంపద పైన విశేష రచనలు చేస్తున్నారు. కృష్ణశాస్త్రి గారి రచనలకు అభిమానిగా ఆయన రచనలోని శివాని ఆనందలహరులను మనకు పంచి ఇవ్వడం ఎంతో ముదావహం.