కవిత్వంలో వ్యకిత్వ వికాసం

మహాభారతంలోని పాత్రలు - వ్యకిత్వ వికాసం

-- ద్వా. నా. శాస్త్రి

మహాభారతంలోని కధలు వ్యక్తిత్వవికాసానికి పాఠ్యగ్రంధాలవంటివి.కధలే కాదు - మహాభారతంలోని పాత్రలుకూడా వ్యక్తిత్వ వైవిధ్యాన్ని ప్రదర్శించేవే. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క స్వభావానికి ప్రతీక.జీవితంలోని విశిష్ట సంఘటలనికి నిదర్శనలు.కొన్ని పాత్రల్ని పరిశీలిద్దాం.

ధృతరాష్ట్రుడు:

పేరుకే రాజు."డమ్మీ" రాజు మాత్రమే. ఆడించేది, పెత్తనం చలాయించేది దుర్యోధనుడే. పేరొకడిది - పరిపాలన, అధికారం మరొకడిది. ధృతరాష్టుని మాటకి, సలహాకి ఏమాత్రం విలువలేదు. తిరుపతి వేంకటకవులు అన్నట్టు ధృతరాష్ట్రుని చూపు మాత్రమే గుడ్డి కాదు - అతని వాక్కు కూడా గుడ్డిదే.ఇవాళ రాజకీయాలూ ఇలానే ఉన్నాయి. భార్యను అధికారంలో ఉంచి తెరవెనుక భాగోతం నడిపించే భర్తలు మనకు తెలుసు. ప్రధాని ఎవరైనా అసలు సూత్రధారి సోనియా గాంధీయే అనటం వింటున్నాం. ధృతరాష్ట్రునికి అధికారశక్తి ఉంది, కాని వినియోగించుకోలేని అశక్తుడు.

కొడుకైన దుర్యోధనుడు చేసే పనులేవీ అతనికి ఇష్టం కాదు.కానీ వారించలేడు.దానికి కారణం "పుత్రవాత్సల్యం". అది కూడా మితిమీరిన పుత్రవాత్సల్యం. ఒకపక్క ఎందరో సముచితం కాదంటున్నా కొడుకును మందలించలేని గారాబం -పుత్రవ్యామోహం .ఏ తండ్రికై నా మితిమీరిన పుత్రవ్యామోహం కూడదు.

అదే వుంటే కొదుకులు ఎలా తయారవుతారో,వంశం ఎలాపతనమౌతుందో తెలుస్తుంది.కొడుకును ప్రేమిస్తూనే సన్మార్గంలో పెట్టలేని తండ్రి తండ్రి కాదని ఈ పాత్ర చెప్తుంది.

ధర్మరాజు:

అందరూ ఈయనను అజాతశత్రువు అంటారు. సహనం శాంతి మూర్తీభవించిన స్థితప్రఘ్నుడు అంటారు. తననూ తన సొదరుల్నీ కౌరవులు అవమానిస్తుంటే, తన అర్ధాంగికి ఘోరపరాభవం జరుగుతుంటే ధర్మరజుకి ఇష్టమా? శాంతిజపం ఎందుకు జపిస్తున్నాడు? కక్షలేదా? ఎందుకుండదు! కానీ స్వయంకృతాపరాధం! కానీ తెచ్చుకున్న విపత్తు! ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఏదొ సమయంలొ మానసిక బలహీనతకు లొంగిపొతాడు.చేయరానిది చేస్తాడు.తప్పని తెలిసినా చేస్తాడు. విస్వామిత్రుడు మేనకకు లొంగిపోయి పతనమయ్యాడు. బిల్ క్లింటన్ కూడా అంతే. మానవుని బలహీనత అదే! ధర్మరాజుకీ ఇదీ తప్పలెదు-అదే జూదవ్యసనం!అన్నీ కొల్పోయినా - భార్యను పందెం ఒడ్డటం చేశాడంటే ఎంతటి బలహీనతో ఆలోచించండి.

"To err is human" అంటారు గదా! తనే తప్పుచేసినవాడు ఎలా వ్యతిరేకించగలడు? అందుకే తలవంచుకున్నాడు ధర్మరాజు. కానీ -లోలోపల ద్వేషం లేకపొలేదు. కౌరవుల అన్యాయం తెలుసు.కానీ తనదీ తప్పువుంది.అందుకే ఊదాసీనత. మనలో తప్పున్నప్పుడు ఎవరిమీదా ఆగ్రహించటం సముచితం కాదు. తిక్కన అంతటి కవి బ్రహ్మ ధర్మరాజును ఏమన్నాడో తెలుసా? "మెత్తని పులి"! ఇది చాలా ఆలోచించి అన్నమాట!ఏంతో అర్ధవంతమైన మాట! ఇది అక్షరాక్షర సత్యమైన వ్యాఖ్యానం. నిజంగా ధర్మరాజు మెత్తనిపులి! పైకి మెత్తగా, శాంతియుతంగా కనిపిస్తాడు. కానీ - కాదు. ప్రతీకారవాంఛ వుంటుంది. కానీ సమయం,సందర్భం చూసుకోవాలి. కీలెరిగి వాత పెట్టాలి. ఆవేశంతో "కత్తికి కత్తి" అంటే అపకీర్తి తధ్యం. అందుకే సమయంకోసం ఎదురు చూశాడు.అంగబలాన్ని సమకట్టుకున్నాడు.

శత్రువుపై యుద్దం లేదా ఎదురుదాడిచేసినపుడు ఆవేశం,పరాక్రమం మాత్రమే సరిపోవు.రాజకీయ ఎత్తుగడ అవసరం.అందుకే శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపాడు. శ్రీకృష్ణుడు రాయబారం దండగ అన్నాడు! ఫలితం శూన్యం అన్నాడు! అయినా ధర్మరారజు - లోకంకోసం రాయబారం చెయ్యమన్నాడు. ఇదీ లౌక్యం అంటే! మనం చేసేపనికి పదిమంది సమర్ధన కావాలి. ప్రజల(పబ్లిక్)మద్దతు కావాలి. అందుకోసం వెళ్ళమంటాడు ధర్మరాజు. ఇది యుక్తి కాదు? పాకిస్థాన్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోంది. సాక్ష్యాలున్నాయి. అయినా మనం ఎందుకు దాడి చెయ్యటంలేదు? ప్రతిసారీ అమెరికా,రష్యా వంటి దేశాలకు "చూడండి, పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు" అని మనం చెప్పడం దేనికి? వాటిసహకారం కోసం. పాకిస్థానుపై వ్యతిరేకత వ్యాపింపజేయడం కోసం. పాపం!భారతదేశానికి ఎంత ఓర్పు- అని అగ్రరాజ్యాలు భావించడం కోసం. ఇదీ ధర్మరాజనీతి!అలా చెప్పి చెప్పిదెబ్బ కొట్టాలి.అప్పుడు ప్రజల మద్దతు లభిస్తుంది.అదీ రాజనీతి, అంతే.

ధర్మరాజు సామాన్యుడు కాడు - మహామేధావి. ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడతాడు. సహనం వహిస్తాడు. అశ్వత్థామ అనే ఏనుగు(కుంజరం) చచ్చి పోయిందని అబద్దం ఆడటానికి కూడా జంకడు. పైకి పెద్దమనిషిగా కనిపించినా, తనకీ,తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే స్వభావం ధర్మరాజుది. అందుకే తిక్కన వంటివాడు "మెత్తని పులి" అన్నాడంటే అందులో ఎంత అర్ధం వుంది? మన శత్రువును దెబ్బకొట్టాలి. కానీ ఎప్పుడు కొట్టాలి? ఎలా కొట్టాలి? అనేది ధర్మరాజు నుంచి మనం తెలుసుకోవాలి. ప్రతిదానికి ప్లానింగ్-ప్రణాళిక-అనే చెప్పే పాత్ర ధర్మరాజు!!

భీముడు:

భీముడికి బాహుబలం ఉంది. కండబలమూ ఉంది. కానీ బుద్ధిబలం లేదు. ప్రతీదానికి ఆవేశపడతాడు. 'కొట్టేస్తా' అంటూ ఉంటాడు కానీ, ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి - మన చేతికి మట్టీ అంటకుండా కొట్టాలి కదా... ఇటువంటి ఆలోచనలు ఏమీ రావు. చేతిలో గద ఉన్నంతసేపూ దురదే! కీచకుడ్ని చంపటానికి చెట్టూ పీకి సన్నద్ధమవుతాడు భీముడు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు. కీచకుడు మరణించాడంటే భీముడే చంపి వుంటాడని తెలిసిపోతుంది. అజ్ఞాతవాసం బయట పడుతుంది. మరల అరణ్యవాసం చెయ్యాల్సివస్తుంది. ఇదేమీ అలోచించడు భీముడు. ధర్మరాజు వచ్చి శాంతింపజేయాలి.

మనం భీమునిలాంటి ఆవేశపరుల్ని, సందు దొరికితే తగాదాకి వెళ్ళి సమస్యల్ని తెచ్చిపెట్టే వాళ్ళనీ చూస్తూ ఉంటాం. కేవలం పరాక్రమం, ఆవేశం మాత్రమే కాదు - ఆలోచన కూడా ఉండాలని భీముడి ద్వారా తెలుసుకుంటాం.

అర్జునుడు:

మనందరం అర్జునుడ్ని ఆదర్శంగా తీసుకోవాలి. 'నిండు కుండ తొణకదు ' అంటే ఇతనే. మహావీరుడు. అయినా ఆవేశపరుడూ కాదు. బలం ఉండని ఊరికే కయ్యానికి కాలు దువ్వడు. వాక్పారుష్యం లేదు. అన్నగారి మాట జవదాటడూ. అన్ని చెపితే 'సరి ' అమటాడు. కృష్ణుణ్ణి సంప్రదిస్తాడు. ఇదీ విశిష్ట వ్యక్తిత్వం అంటే. ఎంతటివాడికైనా 'కూల్ థింకింగ్' కావాలి. ఆప్తుల సలహా పాటించాలి. మహాభారత యుద్ధ ప్రారంభంలో "ఈ యుద్ధం చెయ్యలేను బాబూ" అంటూ చతికిలపడ్డాడు. అలా డీలా పడే సమయమా అది? మరెందుకు దిగులు చెందాడు. అదే మానవ సంబంధం అంటే. బంధుత్వం అంటే. 'తనవారి ప్రాణాలు విలువైనవా? నెత్త్రు కూడా?' - అన్న మీమాంస రావాలి. అపత్కాలంలో మనిషికి వచ్చే - రావలసిన ఆలోచనే ఇది!!

శ్రీకృష్ణుడు:

ప్రతి కుటుంబానికి లేదా ప్రతి కంపెనికి ఒక పెద్ద దిక్కు ఉండాలి.మంచో చెడోఅతని మీద బాధ్యత పెడతాం. అన్నీ అతనే చూసుకుంటాడు అని అంటాం. ఆ పెద్దమనిషి ఎవరో కాదు - శ్రీకృష్ణుడు. భారతంలో రెండు, మూడు చోట్ల తప్ప భగవంతుడు కానే కాడు. మానవుడే. మేధావి. "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడ" గలచతురుడు. చక్రంతిప్పగల సమర్ఢుడు. బమ్మిని తిమ్మి,తిమ్మిని బమ్మిచేయగలడు. ధర్మరాజుకి కోపమూ తెప్పించగలడు - భీముడి నోట శాంతవచనాలు పలికించగలడు. పాండవులందర్నీ ఒకే తాటిమీదకి తీసుకువచ్చి ఎత్తుకు పైఎత్తులు వేసి- శత్రువుల్ని రెచ్చ్హగొట్టి-శత్రువుల చేత తప్పులు చేయించగలడు.

శత్రువుపై ప్రజావ్యతిరేకతను ఒక ఆయుధంగా మలచగలడు. రాయబారానికి వెళ్ళి "జాగ్రత్త"అని హెచ్చరించగలడు. యుద్ధాన్ని ఎందుకు కోరుకున్నాడు అంటే యుద్ధం తప్పదని తెలుసు కాబట్టి. ద్రష్ట కాబట్టి. తన చెల్లెలు అవమానభారం తొలగాలంటే యుద్ధం రావాలన్న తెలివి ఉంది కాబట్టి. కౌరవుల దుర్మార్గాలకి అడ్డుకట్ట వేయాలి కాబట్టి - వారి అకృత్యాలను అలా కొనసాగించనియ్యకూడదు కాబట్టి. "కార్య నిర్వహన" - వర్క్ మేనేజిమెంట్ టైం మేనేజిమెంట్ అనేది మనం శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవాల్సిందే!

ద్రౌపది:

ద్రౌపది అందరిలాగే సుఖపడదామని పెళ్ళిచేసుకుని కాపరానికి వచ్చింది. వచ్చి సుఖపడింది లేదు. అవమానాలు,అరణ్యవాసాలు,అజ్ఞాతవాసాలు........అన్నీ కష్టాలే. ఒక భర్త జూదరి - మరొకడు అన్న చెప్తేగాని ఏ పనీ చెయ్యడు - మరొక భర్త ఆవేశపరుడు - మిగిలిన ఇద్దరూ తలకాయ ఊపేవాళ్ళే! అవమానాలనుంచి కాపాడవలసిన అన్నయ్య పరిస్థితి.అందుకే తిక్కన ద్రౌపది పాత్రను ప్రతీకారవాంచగల పాత్రగా, సూటిపోటి మాటలనే పాత్రగా మలిచాడు. తన తప్పు లేకున్నా అష్టకష్టాలు పడవలసి వచ్చింది. అందుకే "వరమున బుట్టిదిన్....."అంటూ గత వైభవాన్ని తలుస్తుంది."నా భర్తలైదుగురూ పరాక్రమవంతులేగానీ...." అని దెప్పి పొడుస్తుంది. "అంగట్లో అన్నీ వున్నా అల్లుడినోట్లో శని" అని గదా సామెత! మన పరిస్థితీ ఇలానే వుంటుంది. అన్నీ అమరినా ఏమీ చేయ్య లేక భరించవలసిన స్థితి!

ఇంత భరిస్తున్నా ద్రౌపది మనస్సు భగ్గుమంటూనే వుంటుంది. కీచకుడు వెంట పడుతూ వుంటే విరాటరాజు కొలువుకు వచ్చి రాజుకు విన్నవించుకుంటుంది. అక్కడే ఉన్నాడు కంకభట్టు రూపంలో ధర్మరాజు. ధర్మరాజు ఊరికే ఉండవచ్చు కదా! రాజేమంటాడో వినవచ్చు కదా! అనవసర జోక్యం చేసుకొని అంటాడు - "ఏమిటిది కొలువులో నాట్యం చేస్తున్నావు? గౌరవం వుండక్కర్లేదా? వెళ్ళు". ధర్మరాజు అనవసర జోక్యం ఎందుకంటే - అజ్ఞాతవాసం ఎక్కడ బయటపడుతుందో అని అతని భయం అతనిది. ద్రౌపది కోపంలో రహస్యం బయటపెడుతుందని కంగారు పడుతున్నాడు. అందుకే అలా అన్నాడు.

కానీ ద్రౌపదికి వళ్ళు మండింది. అవమాన పడేవాళ్ళ స్వభావం అదే కదా! "ఎద్దుపుండు కాకికి నొప్పా". పైగా రాజుకి చెప్పుకుంటుంటే ఇతనికెందుకు మధ్య? పోనీ తన భర్తేగదా - తనని సమర్థించటం లేదు - వెళ్ళెళ్ళు అంటున్నాడు. అటువంటి స్థితిలో మనం చిన్నా పెద్దా అని చూడం. ఎవరినైనా ఎంతటి మాటనైనా అనేస్తాం. అవమానభారం, కోపం - వీటి లక్షణమే అది. అందుకని అంటుంది - నిజమే పెద్దవారెలా వుంటే చిన్నవాళ్ళు అలానే వుంటారు. మా ఆయన డాన్స్‌మాస్టారులే అంది వెటకారంగా (బృహన్నల). గౌరవం ఉండక్కర్లేదా అని ధర్మరాజు అన్నాడు కదా! దానికి సమాధానంగా - "జూదరి యాలికి గరువతనం బెక్కడిది" అని నమ్మపలికింది. పరిస్థితుల ప్రభావం అది. భర్తని "జూదరి" అని కూడా అన్నది. "నీకే గౌరవం లేదు నాకెక్కడ ఉంటుంది?" అని ఎత్తి పొడిచింది. భర్త ప్రవర్తనను బట్టి భార్యకు గౌరవం, కీర్తి లభిస్తాయని చెప్పింది. నిజానికి స్త్రీ నోరు విప్పితే ఎలా ఉంటుందో మనం తెలుసుకొంటాం. భార్య గుట్టుగా ఉంటేనే భర్తకు గౌరవం- ఆ గుట్టును సహిస్తుందామె. అయితే తప్పని పరిస్థితిలో ఎదురుదాడి చెయ్యక తప్పదు!

దుర్యోధనుడు:

"నేనే నెంబర్ వన్"అనుకొనే స్వభావం ఇతనిది. నే చెప్పిందే వేదం అంటాడు."తా మునిగింది గంగ తావలచింది రంభ"అనే సామెతను గుర్తుకు తెస్తాడు. తల్లిదండ్రుల మాట వినడు. గురువుల మాట వినడు. భీష్మాచార్యుల వంటి తాతనూ కాదంటాడు. తన చుట్టూ ఉన్న"కోటరీ"మాటే వింటాడు. ఇవాళ రాజకీయాలలో ఉండే "కోటరీ"వంటిదే. స్వయం వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచన లేనివాడే ఇతరులపై ఆధారపడతాడు. దుర్యోధనుడు అటువంటివాడే.

తన బలగాన్ని చూసుకొని గర్వించాడు. 'కర్ణుడు వంటి వాడుండగా నాకేంటి?"అని విర్ర వీగాడు. శకుని మాటలు విన్నాడు. ఏ క్షణాన కూడా "ఇది తప్పు - ఇది చెయ్యకూడదు - ఇది సమంజసం కాదు" అనే ఆలోచనలే రాలేదు. ఘోషయాత్రకు వెళ్ళి భంగపడినా బుద్ది రాలేదు. అంటే కొందరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే - అవమానాలు, భంగపాట్లు పడినకొద్దీ ప్రతీకారం కసి ఎక్కువ అవుతాయి. ఆ కోవకు చెందినవాడు దుర్యోధనుడు. సజ్జన సాంగత్యం లేనిదే ఎలా పతనమౌతామో తెలుసుకొంటాం. అంగబలం,అర్ధబలమెల్లవేళలా కాపాడవు-అనే సందేశం ఇచ్చే పాత్ర ఇది.

కర్ణుడు:

కర్ణుడు దుర్యోధనునికి ఎటువంటి దుర్బుద్ధులు కలిగించినా ఇతని పాత్రని వేరు చేస్తే - "మిత్రుని వ్యక్తిత్వానికి ప్రతీక"గా కనిపిస్తాడు. అందరూ హేళనచేసి కించ పరుస్తున్నప్పుడు తనను అక్కున చేర్చుకుని, రాజుని చేసి గౌరవించిన దుర్యోధనుని పట్ల విధేయతగా ఉండాలి. అతని ఉప్పూకారం తిన్నాడుగా మరి! అందుకే దుర్యోధనుని భావాలకి అనుగుణంగానే మసలుకొన్నాడు. తన వాడికి ఆనందం కలిగించడం ద్వారా ఋణం తీర్చుకోవాలనుకున్నాడు. "ఫ్యాక్షనిజం"లో ఇలాగే జరుగుతాయి. నమ్మినవాడి కోసం, ఆశ్రయం ఇచ్చినవాడి కోసం ఎంతకైనా తెగిస్తారు కదా!కర్ణుడికి తన పరాక్రమం మీదా, తన విలువిద్యా నైపుణ్యం మీదా అత్యంత - అమితమైన - విశ్వాసం. అది అహంకారంగా మారడానికి దుర్యోధనాదులు ఎగదోశారు. తన శాపాలేమీ గుర్తుకు రాకుండా - "నువ్వు జగదేకవీరుడివి" అంటూ అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. కానీ వాస్తవం వేరు. చుట్టూ ఉన్నవారు పొగిడితే - మనకి కొమ్ములు రావా మరి? కర్ణుడు ఈనాటి రాజకీయనాయకుడులాగా పార్టీ ఫిరాయింపుదారుడు కాడు. శ్రీకృష్ణుడు, కుంతీదేవి ఎంతగా చెప్పినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా "పార్టీ మారను గాక మారను"అన్నాడు. మనలో ఎంతమంది అలాఉంటారు?? తనను ఇంతవాణ్ణి చేసినవాణ్ణి నట్టేట ముంచే స్వభావం కాదు,కర్ణుడిది. ఎంతటివారైనా ప్రతికూల పరిస్థితిల్లో పతనం కాక తప్పదు - అన్నీ అనుకున్నట్టుగానే జరగవు - జీవితం అంటే అదే! తనకి ఆశ్రయం కల్పించినంత మాత్రాన తనను ఆదుకున్నంత మాత్రాన గుడ్డిగా తలవూపి, రెచ్చగొట్టి చెడ్డపనులు చేస్తే - చేయిస్తే ఎప్పటికైనా పతనం తప్పదు- అపకీర్తిని మూట కట్టుకోవలసిందే.

కీచకుడు:

స్త్రీ లోలుడు. చీర కొంగు కనిపిస్తే ఆగలేడు. ద్రౌపది సైరంధ్రిగా - దాసీగా ఉంది. ఆమె మీద కన్నేసాడు. సోదరి చెప్పనే చెప్పింది - అది దాసీది,దానితో ఏమిటి? అని. కానీ కీచకుడు వినలేదు- స్త్రీ వ్యామోహం ఉన్న వాడి స్వభావమే అది. రాత్రిపూట రహస్యంగా రమ్మంది ద్రౌపది. కీచకుడు విరాటరాజు బావమరిది. గొప్పస్థాయిలో పదవిలో గౌరవంగా ఉండవలసినవాడు - రాత్రిపూట రహస్యంగా ఒక స్త్రీ కోసం అగచాట్లు పడ్డాడు. తన స్థాయికి తగని పని చేశాడు. పరస్త్రీ సంగమం కోరుకోనేవాడు ఉచ్చనీచాలు పరిగణించడు. బుద్ధి ఇతరత్రా పనిచెయ్యదు. ఇదీ కీచకుని వ్యక్తిత్వం. ఇవాళ సమాజంలో ఇటువంటి కీచకుల్ని ఎంతమందిని చూడటంలేదు?

ధర్మవ్యాధుడు:

బోయవాడు. అయినా కౌశికమునికి ధర్మ పాఠాలు చెప్పాడు. వేదాలూ,పురాణాలూ అవపోశనపట్టినవాడు నివ్వెరపోయాడు. జ్ఞానం ఒకరి సొత్తు కాదు. ఒక కులం సొత్తూకాదు. "అన్నీ నాకు తెలుసు" అనుకోవటమే అజ్ఞానం. తాడి తన్నే వాడి తల తన్నేవాడూ ఉంటాడు. ఎవరి జ్ఞానం వాళ్ళది- ఇదీ ఈపాత్ర బోధించేది.

ఇలా చెప్పుకుంటూ పోతే - మహాభారతంలో ప్రతి పాత్ర మానవ వ్యక్తిత్వానికి ప్రతీక. భారతంలో ఉంది. ధర్మరాజు,భీముడు,కీచకుడు,దుర్యోధనుడూ....కాదు మనమే ఉన్నాం. మానవ బుద్ధులే ఉన్నయి. మన అంతరంగాలే ఆ పాత్రలలో నిక్షిప్తమై ఉన్నయి. వీటిని లోతుగా పరిశీలిస్తే వ్యక్తిత్వానికి కావలసినంత "మెటీరియల్" దొరుకుతుంది.