నువ్వు పరీక్షలకు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. మీ నాన్నగారి ఆరోగ్యం ఈ మధ్య ఏమీ బాగుండటం లేదు. ముఖ్యంగా తెలియజెప్పేదేమిటంటే నాలుగు రోజుల క్రితం మన గుర్రం కాలువిరిగింది. అప్పటినుండి మీనాన్న మరీ కృంగిపోయారు. జట్కా నడపడం లేదు. ఆచార్యులవారొచ్చి కట్టుకట్టారు. కానీ ఫలితం ఏమీ కనిపించడం లేదు. అది బ్రతకాలంటే కాలు పూర్తిగా తీసేయాలట.

ఒరే..కన్నా రేపెలా గడుస్తుందో అని ఇంట్లో అందరూ కుమిలిపోతున్నారు. నాకయితే దుఃఖం గుండెల్లోంచి ఉబికి వస్తుంది. రేపటి గురించి బాధ కన్నా నిన్నటి వరకు మనకు తోడుగా నిలిచిన ఆ గుర్రం కొట్టంలో తిండీ, నీరు ముట్టకుండా పడిఉంటే కడుపులో దేవేస్తుందిరా..బాబూ..ఆ జట్కా బండి ఒక్కటే మన జీవనాధారం అవటంతో దాని విలువ ఇప్పుడు మరీ తెలిసొస్తూంది.

నీవేమో ఇవేమీ మనసులో పెట్టుకోకు. బాగా చదువుకో, రెక్కలు ముక్కలు చేసుకునైనా మీ నాన్నగారు నీకు ఏ లోటూ రాకుండా డబ్బులు పంపిస్తారులే. ఉత్తరాలు రాస్తూండు. పరీక్షలు బాగా వ్రాయి.

ఆశీస్సులతో..
మీ అమ్మ.

శంకరం ఆ ఉత్తరాన్ని చదివి నిస్త్రాణంగా ఉండిపోయాదు.
అతని కళ్ళముందో నల్లని గుర్రం ఛెంగుఛెంగున దూకుతూ కనబడింది. మూడు సంవత్సరాలనుంచీ అదే తమని పోషిస్తోంది.

తమది చాలా చిన్న వూరు. తన తండ్రి బండి ఒకటే ఆ ఊళ్ళో తిరిగేది.
శంకరం బుగ్గల మిద నీటిని తుడుచుకున్నాడు. అతడి మనసంతా వికలమైపోయింది. ఆ రోజు చదువుమీద మనసు నిలవలేదు. పదిహేను రోజులు గడిచాయి. పరీక్షలు వ్రాయటం పూర్తిచేసి, శంకరం తన ఊరు వెళ్ళాడు. అక్కడ పరిస్థితి అనుకున్నంత నిరాశాజనకంగా లేదు. కరణంగారు తండ్రికి తన దగ్గరే వేయించారు. బండిని వడ్రంగి మేస్త్రికి అమ్మేస్తారు. అంతా బాగానే ఉంది. మరి గుర్రం..?

శంకరం కొట్టంలోకి వడివడిగా వెళ్ళాడు. అక్కడుంది గుర్రం. మూడు కాళ్ళూ ముడుచుకుని, ఒక కాలు మాత్రం నిటారుగా చాపుకుని ప్రక్కకు పడి ఉంది. దాని దగ్గరగా వెళ్ళి మోకాళ్ళమీద కూర్చున్నాడు.

పూర్వం అయితే అతడు రాగానే తోక ఊపుతూ చిన్న సకిలింపు ద్వారా ఆనందాన్ని ప్రకటించేది. ఇప్పుడు కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేనట్లు అలాగే పడి ఉంది. ఇంతకు ముందు అక్కడ గడ్డి ఉండేది. దాణా ఉండేది. నీళ్ళు ఉండేవి. ఇప్పుడు ఆ ఇంటి లేమి, ఆ గుర్రపుశాలలో కూడా కనబడుతూంది. ఒక్క గడ్డిపరక కూడా లేదు.

ఒక చెట్టును కొట్టేయగానే దాన్ని అల్లుకున్న లత మరో ఆధారాన్ని చూసుకుని తన బ్రతుకు నిలుపుకుంటుంది.
పడిపోయిన చెట్టు మాత్రం కృంగి కృశించుపోతోంది. ఇప్పుడు ఆ గుర్రం అలాగే పడిఉంది. కుటుంబం మాత్రం మరో జీవనాధారమ్ చూసుకుంది.

శంకరం నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు.
పట్నం రాగానే ఆ ట్రస్టు గురించి వాకబు చేశాడు. ఆ అడ్రసు పట్టుకుని అక్కడకు వెళ్ళాడు. అది ఓ భవంతి. ముందు చాలా ఖాళీ స్థలం ఉంది. శంకరం ఆ విశాలమయిన కాంపౌండులోకి ప్రవేశించాడు. ఒక మూల వడ్రంగి పని జరుగుతున్నది. మరోవైపు ఇనుపరేకుల్ని కాల్చి గుండ్రంగా రూపుదిద్దుకున్నారు.

శంకరం లోపల గదిలోకి ప్రవేశించారు. డాక్టర్ భరధ్వాజ..."నేను మీకేం చేయగలను..? అన్నట్లు చూసాడు.
ఒక కృత్రిమ కాలు కావాలి సార్ అన్నాడు శంకరం.
మేం ఉన్నదే అందుకు అన్నట్లు నవ్వాడు భరద్వాజ.
శంకరం కొద్దిగా తటపటాయించి "ఎంతవుతుంది డాక్టర్ గారూ..? అని అడిగాడు.
అది..అమర్చవలసిన కాలును బట్టి ఉంటుంది. అయిదారువేల దాకా కావచ్చు, అన్నాడు డాక్టరు.
శంకర్ అంత ధర ఊహించలేదు.
మామూలుగా అయితే ఇంక ఎక్కువ అవుతుంది గాని ఇద్ర్ చారిటబుల్ ట్రస్ట్. కేవలం అయిన ఖర్చు ఇస్తే చాలు. అన్నాడు డాక్టర్.
శంకరం మొహం వాడిపోయింది. దిగులుగా కుర్చీలోంచి లేచాడు.
నా దగ్గర అంత డబ్బు లేదు సార్, అన్నాడు.
ఎంతుంది? సానుభూతిగా అడిగాడు డాక్టర్ భరద్వాజ.
నూట డెబ్బయ్ అయిదు రూపాయలు, నాస్కాలర్ షిప్ అది
డాక్టర్ తన ఆశ్చర్యాన్ని అణచుకుంటూ, ఇంతకీ కాలు ఎవరికి అమర్చాలి?
అనడిగాడు.
మా .. గుర్రానికి"
డాక్టర్ తలమునకలయ్యేంత ఆశ్చర్యంతో "గు..ర్రా..ని...కా" అన్నాడు.
శంకరం జరిగినదంతా చెప్పాడు. చెపుతుంటే అతడి కళ్ళూ తడి అయ్యాయి. డాక్టర్ కూడా బాగా కదిలిపోయినట్టు కనిపించాడు. కుర్చీలోంచి లేచి శంకరం దగ్గరగా వచ్చి భుజం మీద చేయివేసి..నేను నీకు ఉచితంగా ఒక కృత్రిమ కాలు ఇచ్చే యేర్పాటు చేస్తాను. అన్నాదు.
శంకరం ఆనందంతో డాక్టర్ కి నమస్కారం చేసి బయటకు నడిచాడు.
గుర్రానికి కాలు ఎలా అమరుస్తామన్న తర్కం కాదిక్కడ. ఆ భావం ఆ కుర్రాడికి రావడమే ముఖ్యం అనుకున్నాడు డాక్టర్.
గోడ మీద ఉన్న ఫోటో వైపు చూశాడు.
మనుష్యులను ప్రేమించు‘దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అని వ్రాసి ఉంది.
తమ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సూక్తి అది. మనుష్యులనే కాకుండా జంతువులను ప్రేమించిన ఆ కుర్రవాడు ఆశయం తమ ట్రస్ట్ వారి ఆశయం కన్నా గొప్పది అన్నట్టుగా తోచింది అతడికా క్షణం.
శంకరం తమ పల్లెకి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదయ్యింది.
ఏమిట్రా అది? అన్నం పెడుతూ అడిగింది తల్లి, శంకరం ప్రక్కనే ఉన్న పెద్ద సంచి చూసి, మన గుర్రానికి కాలమ్మా, అన్నాడు.
ఆమే ఆశ్చర్యంగా అది అమరిస్తే మళ్ళీ పరిగెడుతుందట్రా? అడిగింది ప్రక్కనే కూర్చుంటూ.
పరిగెట్టదమ్మా..నడుస్తుంది.. అన్నాడు.
పోన్లే పాపం ఏదో ఒకటి.. అందా తల్లి సానుభూతిగా.
ఆ రాత్రి అతను నిద్రపోలేదు. ఒంటిగంట అవుతుండగా కొట్టములో కొచ్చాడు. వెన్నెల ఏటవాలుగా పడుతూంది. గుర్రం యింకా అలాగే పడుంది. అలికిడికి కళ్ళు విప్పి అతనివేపు చూసింది. శంకరం కూడా కదలకుండా ఒక క్షణం పాటు దానివైపే చూస్తూ నిలబడ్డాడు.
పక్షులు రెక్కల్ని మోసుకుంటూ చెట్లని విడిచి వలస పోతున్నాయి. పూవులు తీగెల్ని విడిచి రాలిపోతున్నాయి. వాటి కళ్ళలో విషాదం ఎవరయినా గమనించారా? స్థిరత జీవితాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఇలాంటి విషాదమే కళ్ళల్లో కదలాడుతుంది.
ఆ గుర్రం కళ్ళల్లో కూడా అదే ఉంది ప్రస్తుతం.
శంకరం నెమ్మదిగా దగ్గరకు వెళ్ళీ దాని కాలుకి తను చెచ్చిన కృత్రిమ కాలు తొడిగాదు. వీపుకి బెల్టు అమర్చి అత్గి కష్టం మీద దాన్ని లేపాడు. అది బాధగా లేచి రెండడుగులు వేసింది.
శంకరం కళ్ళూ సంతోషంతో కలువ పూలయ్యాయి. గుర్రం మెడ మీద ప్రేమగా నిమిరాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఊరిబయట కొచ్చారు.
ముందు అతడు..వెనకే అతడిని అనుసరిస్తూ గుర్రం...
ఊరికి కొద్ది దూరంలో చుట్టూ కొండలు, మధ్యలో సెలయేరు, పచ్చిక బయళ్ళూ వున్నాయి. పచ్చగడ్డిని చూడగానే గుర్రం ఆత్రంగా పరకలని తినసాగింది. శంకరం గుర్రం నడుము మీద ప్రేమగా, అప్యాయంగా రెండుసార్లు కొట్టాడు.
ఆకాశమంతా వెన్నెల పిండార బోసినట్లుంది. గుర్రం నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా కొండలవైపు సాగిపోయింది.
శంకరం ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు.
గుర్రం ఇప్పుడు స్వేచ్చాజీవి. అడవుల్లో మిగతా జంతువుల్లాగే అదీ బ్రతుకుతుంది.
కొండ మలుపులో గుర్రం అదృశ్యమవటాన్ని శంకరం చూస్తూన్నాడు.
సెలయేరు..పచ్చగడ్డి...దూరపు కొండలు...వెన్నెల, ..అన్నీ అతన్ని తమ ఆశీర్వచనాలతో అభిషిక్తుడ్ని చేస్తున్నట్లు చూస్తున్నాయి.

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech