మా టెల్గూ టల్లికి
 

 

తెలుగువాళ్ళ గుండెలు తాటాకుల్లా మండుతున్నాయి. తెలుగు మాట్లాడినందుకు క్షమించమంటూ పిల్లవాడి మెడలో పలకకట్టిన మైదుకూరు బడిదొరల మీదా..’ఐడోంట్ టాక్ తెలుగు" అని ౩౦౦ సార్లు బాలానగర్ బాలుడికి ఇంపోజిషన్ శిక్ష వేసిన ఇంగ్లీషు రాని ఇంగ్లీషు పంతులమ్మ మీదా తెలుగుతల్లి ముద్దుబిడ్డలెందరో సీమటపాకాయల్లా ఎగిరిపడుతున్నాయి. బరి తెగించిన రెండు స్కూళ్ళకూ గుర్తింపు రద్దు చెయ్యాలనీ, మళ్ళీ ఇలాంటి దారుణాలు ఇంకెక్కడా జరక్కుండా చూడాలని తెలుగు యోథులెందరో ఎలుగెత్తి ఘోషిస్తున్నారు. తాము తెలుగువాళ్ళమనే స్ప్రుహ మిగిలిన తెలుగువాళ్ళు ఏ ఇద్దరు ఎక్కడ కలిసినా ఇదే చర్చ. ఎక్కడ చూసినా ఇదే రచ్చ. మంచిదే. మడిసన్నాక ఆ మాత్రం భాషాభిమానం ఉండాల్సిందే. ఇంతకీ ఆ పంతుళ్ళు చేసిన మహా పాపమేమిటి?

* * *
ఇక తెలుగులో మాట్లాడను అని బోర్డు రాసి కుర్రాడి మెడలో కట్టినందుకు మనమందరం అగ్గిమీద గుగ్గిలమవడం బాగానే ఉంది. కాని ఎవరూ కట్టకుండానే తమకు తామే అలాంటి బోర్డులు మెడకు కట్టుకుని తిరుగుతున్న మహానుభావులు తెలుగు సమాజంలో ఎందరు లేరు? మొన్నీమధ్య తెలుగు రాజధానిలో ఏర్పాటైన ఒకానొక సభలో పరాయి రాష్త్రానికి చెందిన కేంద్రమంత్రి కష్టపడి తెలుగులో మాట్లాడితే..తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగే మాతృభాషగా చెప్పుకునే తెలుగుమంత్రులు ఇంగ్లీషులో స్పీకారని పత్రికల్లో చదవలేదా? తెలుగు భాషకు ఉత్తమ
గతులు కల్పించడానికే ప్రత్యేకంగా అవతారమెత్తిన తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలోనూ తెలుగురాని అతిథిలు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయగా పుట్టుకతో తెలుగు వారైన పెద్దలు ఆంగ్లంలో శ్రోతలను చావగొట్టిన కబురూ తెలుగు తల్లి కడుపు చల్లగా విన్నాము కదా. బూతులు తిట్టుకోవడం లాంటి ప్రశస్తమైన సందర్భాలలో తప్ప అచ్చతెనుగు ముక్క సాధారణంగా వినబడితే ఒట్టుకదా? తెలుగు భాషకు సంబంధించిన తీర్మానాలు కూడా శుభ్రమైన ఆంగ్లభాషలోనే కదా రూపుదిద్దుకునేది? సమాజానికి దారి చూపాల్సిన ఇందరిందరు అతిరధులే తెలుగు మాట్లాడడం నామోషీగా భావించేటప్పుడు వారి ఆదర్శాన్నే పుణికి పుచ్చుకున్న పంతుళ్ళు ఊళ్ళో పిల్లలకు ’బుద్ధి’ చెపితే వారినెందుకు ఆడిపోసుకోవడం?

మిషనరీ స్కూళ్ళలోనో, ఖరీదైన మరో ప్రైవేట్ స్కూల్లోనో తెలుగు మాట్లాడటాన్ని నేరంగా పరిగణించి, పనికిమాలిన పనిష్మెంత్లు ఇస్తున్నది తెలుగుమీద కక్షతో కాదు. వాళ్ళు చేసేది చదువుల వ్యాపారం. మార్కెట్ డిమాండ్ ను బట్టి పోవడమే వారి పని. చదువుల దుకాణాల్లోఇంగ్లీషునే ఎందుకు నేర్పిస్తున్నారంటే దానికే డిమాండ్ ఉన్నది కనుక. తమ పిల్లలకు అదే కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కనుక. మా స్కూల్లోతెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తాం పనిష్మెంట్ ఇస్తాం అని చాలా స్కూళ్లలోపిల్లల్ని చేర్చుకునేముందే చెబుతారు. ’బాగుంది బాగుంది అలాగే చెయ్యండి’ అని చాలామంది అమ్మానాన్నలు సంతోషంగా ఒప్పేసుకుంటారు. మా వాడు హైస్కూల్ కొచ్చినా తెలుగు రాయలేడు, చదవలేడు అని చెప్పుకోవడం చాలా మంది తల్లిదండ్రులకు గొప్ప. వాళ్ళూ ఇలాంటి సంకర చదువులతో వంకరలు తిరిగిన వారే కనుక వంటింట్లోనూ ఇంగ్లేషులోనే మాట్లాడుకుంటారు. ’అన్నం’ మానేసి ’వైట్ రైస్ ’ నే తింటుంటారు. ఎప్పుడు అఘాయిత్యమేదో మొదటిసారి వింటున్నట్లు తెగ షాకైపోతున్నామన్న మమ్మీడాడీల్లో ఎంతమంది తమ చిరంజీవులను తెలుగు మాట్లాడనివ్వని స్కూళ్ళకు వెళ్ళి దెబ్బలాడుతారో మనకు తెలీదా?

ఎక్కడో ఊళ్ళోని ఏదో బళ్ళో తెలుగులో మాట్లాడినందుకు శిక్షించారని చెవిన పడగానే ఘనత వహించిన సర్కారు వారు చప్పున కదిలి, దర్యాప్తునకు పురమాయించడం ఏడ్చినట్టే ఉంది. తెలుగు గడ్డమీద తెలుగు విద్యార్ధి తెలుగు అక్షరం ముక్క నేర్వాల్సిన అవసరం లేకుండానే కె.జి నుంచి పి.జి దాకా మొత్తం చదువునూ లాగించేందుకు అనువుగా విద్యా విధానాన్ని కష్టపడి రూపొందించిన ప్రభువులు తెలుగును చులకన చేసే స్కూళ్ళ మిద ఏమొగం పెట్టుకుని చర్య తీసుకుంటారు. పొరుగున కర్ణాటక,. తమిళనాడు , మహారాష్ట్రల్లో స్థానిక భాషను అది మాతృభాష కాని విద్యార్ధులు కూడా విధిగా నేర్వాలన్న నిర్భంధం ఉండగా..మన తెలుగు గడ్డన తెలుగు విద్యార్ధులకు కూడా ఒక లాంగ్వేజీగా తెలుగు కంపల్సరీ కాదు. తెలుగుకు బదులు అరబిక్ నో, ఫ్రెంచ్ భాషనో నేర్చుకున్నా ఏలినవారికి అభ్యంతరం లేదు. రాష్ట్రంలోని సుమారు పదివేల తెలుగు మీడియం గవర్నమెంటు హైస్కూళ్ళలోనే మూడింట రెండు వంతులను తెలుగుకు దూరంచేసి ఇంగ్లీషు మోజును రెచ్చగొట్టి తెలుగు బోధనను శాయశక్తులా నిరుత్సాహపరిచి, ’సక్సెస్’ పేరిట తెలుగుకు గొయ్యతీసి బొంద పెట్టినపుడు ప్రైవేట్ స్కూళ్ళలో తెలుగు నిరాదరణ గురించి నోరెత్తే నైతిక హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? తెలుగుమీద వల్లమాలిన ప్రేమ వొలకబోసే సర్కారువారు తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరయి ఎట్టకేలకు ప్రకటించి నేటికి సంవత్సరం అయినా అందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా చేయాల్సిన దానిమీద చిటికెన వేలును కదిలించిన పాపాన పోలేదు. బోధన, పరిపాలన తెలుగులో సజావుగా జరిగేట్టు చుడడానికి నలభై మూడేళ్ళ కింద సృష్టించిన అధికార భాషా సంఘానికి ఖాళీ అయిన అధ్యక్ష పదవిని భర్తీచేసేందుకే ఏలినవారికి తీరికి లేనప్పుడు తెలుగుభాషకు ప్రైవేట్ స్కూళ్ళలో చిన్నచూపు గురించి గింజుకోవటం దండగ. అడ్డగోలు విధానాలతో, అర్ధం లేని నిర్ణయాలతో పనిగట్టుకుని తెలుగుభాషను భ్రష్టు పట్టించిన ప్రభువులు తెలుగుకు పట్టిన తెగులుకు పాఠశాలల్లో ’ మా తెలుగుతల్లి’ని పాడించడమే పరిష్కారమని చిట్కా వైద్యం కనిపెట్టడం తెలుగుతల్లిపై పరాచికం. దేశంలోమొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన అర్ధ శతాబ్దం తరవాతైనా తెలుగుతల్లికి బడిబడిలో మల్లెపూదండ వేయిస్తామంటే మెచ్చుకోవలసిందే. ఆ శుభసంకల్పాన్ని కేవలం సంకల్పంగానే మిగిల్చి, ఉత్తర్వు ఏదీ ఇవ్వకుండా కేవలం డి.ఇ.ఓ.లకి నోటిమాటగా చెబితే సరిపోతుందా? డి.ఇ.ఓలు పోయి ప్రతి బడిలో పాటను పాడిస్తారా? పాడించడము పొమ్మనే వారిపై కేవలం మంత్రిమాటను ఉటంకించే చర్య తీసుకుంటారా? ఐనా తెలుగులో మాట్లాడటమే నిషిద్దమైన పాఠశాలల్లో, తెలుగు పాటను పాడించేందుకు పంతుళ్ళుఎక్కడ దొరొకుతారు? మా టెల్గు టల్లికీ మళెపూడాండ’ అని ఇంగ్లీషు పంతులమ్మలచేతే స్టయిలిష్ గా నేర్పిస్తారా?


 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech