మాట్లాడడం అంటే మాటలు కాదు.

 

నిజానికి అరవై నాలుగు కళల్లో ఇది ఒకటి.ఇది నిజమో కాదో తెలియకపోయినా ఇలాంటి స్టేట్మెంట్లని అలవోకగా, ఘంటాపధంగా ఇవ్వగల కళలో ఆరితేరినవరే గట్టి వక్తలుగా పేరు తెచ్చుకోగలుగుతారు. పెళ్ళిళ్ళల్లో -పబ్బాల్లో నలుగుర్ని చేరదీసి- అంతకు ముందు అందరూ చదివేసిన పేపర్లలోని వార్తలూ, విశేషాలూ అన్నీ తనకే ముందు తెలిసినట్టుగా రంగులద్ది చెప్పడం ఇంకో కళ. దీన్నే సంభాషణా చాతుర్యం అని కూడా అందురు. ఐతే, ఈ కళ ద్వారా ఆకట్టుకోగల శ్రోతల సంఖ్య పరిమితం. రాగల పేరూ, ప్రఖ్యాతలు కూడా ఆ పాళ్ళలోనే వుంటాయి. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచగల స్ఠాయికి ఎదగగలిగితే అభిమానుల సంగతి అటుంచి ఎదో కొంత గిట్టుబాటుగా కూడా వుంటుంది. సభా నిర్వాహకులు సయితం తమ తమ విభవాన్నిబట్టి చదివించుకుంటూ వుంటారు. సాధారణంగా అవార్డులూ-సత్కారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రకం వక్తలకు కొంత గిరాకీ వుంటుంది. పొగడడం మినహా మరో అంశానికి ప్రాధాన్యం వుండదు కాబట్టి మాట్లాడడం కూడా అంత శ్రమ అనిపించదు. అవార్దులు తీసుకునేవారూ, ప్రేక్షకులూ ప్రతిసారి మారిపోతుంటారు కావున ప్రసంగాల్లో పునరుక్తి దోషాలు ఎన్ని దొర్లినా ఎలాంటి ఇబ్బంది ఇసుమంత కూడా వుండదు. అతిశయోక్తులు దట్టించి ఎలా పొగడాలో తెలుసుకోవడానికి ప్రత్యేక శిక్షణా తరగతుల అవసరమే లేదు. ప్రోగ్రాం కంపీర్ అనో, వ్యాఖ్యాత అనో ఎదో ఒక పేరుతో మైకు ముందు నిలబడే శాల్తీ- సభకు వచ్చిన అతిధుల్నీ, అభ్యాగతుల్నీ(శ్రోతల్నీ) అదే పనిగా ఎలా పొగుడుతున్నారో కొద్దిగా గమనిస్తే చాలు సరిపోతుంది.

ఈ మధ్య ఒక సభకు వెళ్ళాను. బయట బాగా ఎండగా వుండడం వల్ల, సభా మందిరం ఏసీ హాలు కావడం వల్లా లోపల జనం నిండుగానే వున్నారు. భజంత్రీల్లో ఎవరో రాకపోవడంతో నన్ను మాట్లాడమన్నారు. ససేమిరా అన్నాను. ఒక్కసారి స్టేజి ఎక్కి మాట్లాడడం మొదలు పెడితే ఆ మత్తులో పడిపోతానేమోనని భయం. పైగా మొగమాటాలకు పోయి అనేక సభలకి హాజరైన అనుభవం వుంది. వేదికమీద వున్న, సారీ- వేదికను అలంకరించిన- ఇంకో సారి సారీ- (రంగురంగుల పూలతో, కాగితాలతో వేదికను అలంకరించినవారని అర్థం కాదు) పదిమందో, పదహారు మందో- ఒక్కొక్కరుగా లేచి తమ ప్రసంగం ప్రారంభించినప్పుడల్లా - వేదిక మీద వున్న మిగిలినవారిని పేరు పేరునా స్మరించడం-పనిలో పనిగా పొగుడుకోవడం గమనిస్తే చిర్రెత్తుకొస్తుంది. ఈ పరస్పర కుచమర్ధనాలకే సగం సమయం గడిచిపోతుంది. దండలు, పుష్పగుచ్చాలు, శాలువలు అందించేవారి పేర్లూ, అందుకుంటున్నవారి పేర్లూ - ఎలా సహస్రనామార్చన కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో వీలైనంతమందికి వీలు కల్పించడంవల్ల సభ హాజరుకి మినిమం గ్యారంటీ వుంటుంది. ఈలోగా ప్రధమ తాంబూలం, లేదా ప్రధాన సత్కారం అందుకోవడానికి అన్నిరకాలుగా అన్నీ సమర్పించుకున్న శాల్తీ వేదిక మీదనే విలవిలలాడిపోతుంటాడు. కవర్ చేయడానికి వచ్చిన స్థానిక విలేకరులు తన సన్మాన కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే మరో "గిఫ్టుబాటు" కార్యక్రమానికి వెళ్ళిపోతారేమోనని విలేకరుల గ్యాలరీ వైపు పిచ్చి చూపులు చూస్తూ దొంగ దండాలు పెడుతుంటాడు. ఎద్దు పుండు కాకికి రుచి అన్న సామెత మాదిరిగా నిర్వాహకులకు మాత్రం ఇదేమీ పట్టదు. అతిధులు, విశిష్ట అతిధులు, పరమ విశిష్ట అతిధులతో పాటు అతిధి ఆఫ్ ది డే - అతిధి ఆఫ్ ది ఇయర్తోటే వారికి గడిచిపోతుంటుంది. తెచ్చిన శాలువాలు, కప్పాల్సిన భుజాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. వక్తలు కూడా ఎవరికి వారు తమ ప్రసంగం పూర్తి కాగానే ఒకరి వెంట మరొకరు - కారణం చెప్పో చెప్పకుండానో వేదిక మీద నుంచి నిష్క్రమిస్తుంటారు. రైలుకో, బస్సుకో పోదామని బయలుదేరి మధ్యలో దొరికిన టైములో కాలక్షేపం కొసం శ్రోతల అవతారాలెత్తినవాళ్ళు కూడా ఆవులించుకుంటూ లేచి నిలబడి చేతి వాచీలవైపు, నిర్గమన ద్వారాల వైపు చూస్తుంటారు. ఇవన్నీ చూస్తూ నిర్వాహకులు - ఆనాటి "వ్యయ ప్రదాత"ను పిలిచి, తమకు జరిగిన ఈ అపూర్వ సన్మానానికి ముక్తసరిగా మూడు ముక్కల్లో ఉచిత రీతిన ధన్యవాదాలు తెలపాల్సిందిగా మనవి చేసుకుంటారు.
ఇదొక్కటే మొత్తం కాంట్రాక్టులో ఉచితంగా దొరికిన అవకాశంగా పరిగణించిన సదరు శాల్తీ - అలవాటులేని ప్రసంగాన్ని అధాటుగా ప్రారంభించి మధ్యలో దారితప్పి -అవాకులు, చవాకులతో శ్రోతల సహనాన్ని పరీక్షించే సమయంలో- సభా నిర్వహణ విధి విధానాలను "స్కాచి" వడబోసిన నిర్వాహకులు సత్కార కార్యక్రమాన్ని హడావిడిగా ముగించి సభకి మంగళం పాడతారు. కరిగిన సొమ్ముకూ, జరిగిన సన్మానానికీ బేరీజు వేసుకుంటూ బేజారైన గుండెతో సత్కార గ్రహీత ఇంటిదారి పడతాడు. నిర్వాహకులు విందు చేసుకుంటూ మరో "బఖరా" వేటలో పడతారు.

కాయ"గోరా"లు
*బెజవాడలొ "ఆంధ్రజ్యోతి"లో పనిచేస్తున్న రోజుల్లో-
బందరు రోడ్డులోని రాఘవయ్య పార్కులో గోరాగారు ఒక వినూత్న కార్యక్రమం తలపెట్టారు. నాటి వ్యవసాయశాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డిగారు ముఖ్య అతిధి.
"పూలమొక్కలు వద్దు- కూరగాయలు పెంచండి" అన్నది గోరాగారి నినాదం.
కార్యక్రమంలో ప్రధాన అతిధులందరికీ పూలదండలకు బదులుగా కూరగాయలతో తయారు చేసిన హారాలు వేశారు.
పూలమొక్కలు వేసే చోట కూరగాయల తోటలు పెంచితే జనాలకు ఆహార కొరత కొంతలో కొంతవరకైనా తీరగలదని గోరాగారి విశ్వాసం.
కానీ,మంత్రి సుబ్బారెడ్డిగారిది నిర్మొహమాటంగావుండే స్వభావం. ఏదయినా నచ్చకపోతే -ఆ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మొహమ్మీదే అనేసే నైజం.
ఆయనగారికి గోరాగారి కూరగాయల వ్యవహారం నచ్చినట్టులేదు.
అందుకే కాబోలు-
"పూలమొక్కలు,ఉద్యానవనాలు మనసుకి ఆహ్లాదం కలిగిస్తాయి.కేవలం తినడం, నిద్రోడం మాత్రమే జీవితానికి పరమార్థం కాదు.కూరగాయల్ని పెంచడానికి పార్కుల్లోవున్న పూలమొక్కల్ని పెరికేయడం ఎందుకు? ఏలూరు, బందరు కాల్వల పక్కనే ఖాలీగా వున్న గట్లమీద పెంచితే కాదన్నదెవరు?" అంటూ తన ఉపన్యాసంలో దులిపేశారు.
ప్రచారానికి కాకపోతే, ఈ హంగామా అంతా ఎందుకన్న శ్లేషకూడా సుబ్బారెడ్డిగారి మాటల్లో తొంగిచూడడంతో నిర్వాహకులు నిశ్చేష్టులయ్యారు.
పోతే-
ఆంధ్రజ్యోతిలో అనుదినం ఎడిట్ పేజీలో ప్రచురితమయ్యే నా "వాక్టూన్" శీర్షికలో ,మర్నాడు-
"కూరగాయలు పెంచండని శ్రీ గోరా
చెప్పిన మాటని విని శ్రీవారా
రోజంతా పట్టుకుని పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే
రాత్రికి వొళ్ళు కాపేది నేనా? వారా?"
అంటూ రాసేశాను.
గోరా అంతటి పెద్దమనిషిని పట్టుకుని ఇలా చిన్నబుచ్చినట్టు రాయడం బాగా లేదని శ్రీ లవణం ప్రభ్రుతులు ఎడిటర్ గారితో చెప్పుకున్నారు. "ఎవరినీ నొప్పించని స్వభావం" సహజసిద్దంగా కలిగిన నండూరి వారు , నన్నేమీ అనకుండా వాళ్ళకి సర్దిచెప్పి పంపేశారు.

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech