అగ్రగణ్య ఆర్ధిక శాస్త్రవేత్త, భారతీయ రిజర్వు బ్యాంక్ అధినాధుడు

 డాక్టర్ దువ్వూరి సుబ్బారావు
 

- ఈరంకి వెంకట కామేశ్వర్

                                                               

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతలనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కొన్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

ప్రపంచమంతా ఆర్ధిక మాంధ్యం దెబ్బ నుంచి తేరుకోవడానికి మార్గాలు వెదుక్కుంటున్న కాలం లో భారత దేశానికి ఎదురు దెబ్బ లేకుండా ఎంతో చాక చక్యంతో, నిశ్చితమైన ప్రణాళికతో ఆర్ధికాభివృద్ధి పదంలో తీసుకువెళ్ళిన ఆర్ధిక వ్యవస్థ నిపుణుడూ, ఐ ఏ ఎస్ అధికారి, భారత దేశ రిజర్వు బ్యాంక్ అధినాధుడు (గవర్నర్) డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు.

ప్రపంచీకరణ ఉపద్రవాల నుండి సంరక్షణ కల్పించడానికి కీలక పాత్ర పోషించారు.
ముప్పై యేళ్ళకు పైగా జిల్లా, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలలో పనిచేసి, తన సుధీర్ఘ వృత్తి నిర్వహణలో భారత దేశ ఆర్ధిక వ్యవస్థ మాన్యుడిగా, ఆర్ బి ఐ అధినాధుడిగా పనిచేస్తున్నారు.

వీరి ఆధ్వర్యంలో భారత దేశ 2008 ఆర్ధికాభివృద్ధి సగటున తొమ్మిది శాతం గా ఉండి, ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఈ విషయంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే అవి ఆర్ధిక సంక్షోభం లో ఉండి సగటున ఒకటి, రెండు శాతం వృద్ధి కూడా సాధించ లేకపోతున్నాయి. భారత దేశం ఇంకా మంచి అభివృద్ధి పథంలో నడవడానికి మరింత కృషి చేస్తూ, ఆర్ధిక పటిష్ఠానికి ఇంకా కృషి చేస్తున్నారు శ్రీ సుబ్బారావు గారు.

శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు, ఆగస్ట్ 11, 1949 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, ఏలూరు పట్టణం లో జన్మించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదివి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్ పూర్ (1969) నుండి బి ఎస్ సీ (భౌతిక శాస్త్రం) పట్టా సాదించారు; బంగారు పతకం అందుకున్నారు. అటుపైన ఐ ఐ టీ కాన్ పూర్ నుంచి ఎం ఎస్ సీ (భౌతిక శాస్త్రం) లో పట్టభద్రులైనారు.

తరువాత అమెరికాలోని ఒహాయో రాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఎం ఎస్ (ఆర్ధిక శాస్త్రం) లో ఉత్తీర్ణులై, మసాచుసట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హంఫ్రీ ఫెల్లో గా ఉన్నారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలం నుండి ఆర్ధిక శాస్త్రం లో డాక్టరేట్ పట్ట సాధించారు. సుబ్బారావు గారి భార్య ఉర్మిళ. వీరికి ఇద్దరు కుమారులు.

1972 లో ఐ ఏ ఎస్ పరీక్షలలో ప్రధమ స్థానం లో ఉత్తీర్ణులై ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోకి కేటాయించబడ్డారు.
1988 నుండి 1993 వరకు, భారత దేశ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ, (ఆర్ధిక వ్యహారాల) ఉప కార్యదర్శిగా వ్యవహరించారు. తరువాత 1998 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శిగా ఉన్నారు. కొంత కాలం ప్రపంచ బ్యాంక్ అగ్రగణ్య ఆర్ధిక శాస్త్రవేత్తగా పనిచేశారు. 2005 నుండి 2007 వరకు భారత ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా సంఘం సభ్యుడిగా ఉన్నారు.
2007 లో భారత దేశ అత్యంత కీలకమైన భారత దేశ ఆర్ధిక కార్యదర్శిగా పనిచేశారు.

సెప్టెంబర్ 5, 2008 లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎరవై రెండవ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి, అత్యంత కీలక సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థ సంరక్షకుడిగా, ముఖ్య అధికారిగా తన అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మరొక విషయం చెప్పచ్చు. అది ఏమిటంటే ఇరవై ఒకటవ గవర్నర్ కూడ మరొక తెలుగు వాడు - శ్రీ వై వేణుగోపాల రెడ్డి గారు. ఇలా ఇద్దరు తెలుగు వారు దేశ ఆర్ధిక వ్యవస్థ ముఖ్య అధికారులుగా వ్యవహరించడం అరుదైన విషయం.

ప్రపంచ ద్రవ్యోల్భణం అత్యంత జటిలమైన సమస్యగా ఉన్న తరుణం లో, స్థితి గతులను పరిశీలించి సమతుల్యం గా తీసుకు వెళుతున్నారు.

డెబ్బై ఐదేళ్ళ చరిత్ర లో రిజర్వు బ్యాంక్ అత్యంత బాధ్యతాయుత సంస్థగా, బాధ్యత గల ప్రజా (ద్రవ్య) విధాన సంస్థగా ఏర్పడింది.

భారత దేశం నేడు ప్రపంచం లో నాల్గవ అతి పెద్ధ ఆర్ధిక వ్యవస్థ. అభివృద్ధి దిశ లో ప్రపంచంలో రెండవ స్థానం ఆక్రమించుకుంది. గత శతాబ్ధం లోని అత్యంత సంక్లిష్ట ఆర్ధిక సమస్యలు నెలకొన్న పరిస్థితులలో, భారత అగ్రగణ్య బ్యాంక్ అధినేత గా వ్యవహరిస్తూ అభివృద్ధి పథం లో తీసుకు వెళుతూ, ప్రపంచంలో ఆర్ధికాభివృద్ధి క్షేత్రంలో రెండవ స్థానం లోకి నడిపించి తీసుకు వెళ్ళటం ప్రతీ భారతీయుడు గర్వించ తగ్గ విషయం. ఇది భారత దేశం అదృష్టం అన్నా అతిశయోక్తి కాదు.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech