కృష్ణసంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజస్వామికి సంగీత చరిత్రలోనే ప్రత్యేక స్థానముంది. ఆ ప్రత్యేకత వారి ప్రతి ఒక్క కృతిలోనూ కనబడుతుంది. వాగ్గేయకారులు కృతులన్నింటిలోనూ భక్తి ప్రధాన వస్తువు. దాన్ని ఆవిష్కరిమ్చడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిని అవలంబిస్తారు. త్యాగరాజకృతులను ద్రాక్షాపాకంగా అభివర్ణిస్తారు. ద్రాక్ష పండు రసంతో నిండి, తినడానికి తేలికగా ఉంటుంది. త్యాగరాజకృతులు కూడా అలాగే భక్తి రసం చిప్పిల్లుతూ ఉంటాయి. ఆ భక్తిని వారు ఎన్ని రకాల భావాలతో ఆవిష్కరించారో వారి కృతులు భాషా సంపద, భావ సంపదతో ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. మహూన్నత భావాలను తేలిక పదాలతో కూర్చి చక్కని కృతులు రచించారు. వీరి కృతులలోని భావాలలో కనబడే వైవిధ్యం ఇతరుల రచనలలో కనబడదనడం అతిశయోక్తి కాదు. అందుకే ఆ కృతులు జగత్ప్రసిధ్దాలు.

’నగుమోము గనలేని’ ఈ కృతి తెలియని సంగీత ప్రియులుండరు. ఈ కృతినే పరిశీలిస్తే, ఇందులో సాహిత్యం ఎంత అందంగా ఉంటుంది. ’నగుమోము గనలేని నా జాలి తెలిసి ‘ నను బ్రోవరాదా శ్రీ రఘువర’
ఎంత తేలిగ్గా ఉంది. ఈ కృతిలోని భావం తీసుకుంటె..
అనిపల్లవిలో నగరాజధర! నీదు పరివారమెల్ల
ఒగివోధన చేసేవారలు కారే అంటులుందురే’
అంటారు. ’నన్ను రక్షింపుమని నీదు చెప్పేవారు నీ వాళ్ళెవరూ లేరా! ఎందుకు జాగుచేస్తున్నావని ప్రశ్నించడం.
చరణంలో అద్భుతమైన ఒక చమత్కారం చేశారు.
’ఖగరాజు నీ ఆనతి వినివేగ చనలేదో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో’
’నీ వాహనమైన గరుత్మంతుడు నావద్దకు నిన్ను తీసుకురావడానికి ఆకాశానికి, భువికి దూరమెక్కువ. అంతదురం నేను రాలేనన్నాడా? అన్నారు. ఇంత చిత్రమైన అమోఘమైన భావం వేరెవరు ఊహించగలరు?

బంటురీతి కొలువీయవయ్య రామ’ అనే మరో ప్రసిద్ధ కృతి.
ఇందులో తాము ఒక బంటునని చెప్తూ, అనుపల్లవిలో తుంటవింటి వాని - మొదలైన మదాదుల
బట్టినేల కూల జేయు నిజ ""బంటురీతి”
కామక్రోధాధులను అణచి వేసే శక్తి నీయమని ప్రార్ధిస్తున్నారు. కామక్రోధాదులు అనడానికి వీరు వాడిన కొత్త ప్రయోగం
’తుంట వింటివాని మొదలైన మదాదులు’
తుంట వింతి వాడంటే కాముడు - కామం మొదలైనవి అంటే అరిషడ్వర్గాలని. ఇంత కొత్త ప్రయోగం మరెక్కడా లేదు.

చరణంలోఒక గొప్ప భావముంది.
’రోమాంచమనే ఘన కంచుకము
రామభక్తయనే ముద్ర బిళ్ళయును
రామనామమనే వరఖడ్గమివి’

యుద్ధంలో రక్షణకు వాడే కంచుకము ఏమిటంటే శ్రీరాముని తలచుకుంటే కలిగే పులకింత, అదే శరీరం రోమాంచమవడం. ఎంత గొప్ప భావమిది. రామభక్తి ముద్రబిళ్ళ అన్నారు. తాను(బంటు) రామ బంటునని ధృవీకరించే యోగ్యతా పత్రమన్నమాట. ఇక రామనామం శత్రువును సంహరించగల ఖడ్గం. రాముని యందుగల భక్తివిశ్వాసాలను ఇలా ఆవిష్కరిమ్చడం అనూహ్యం.

శ్రీరాముడనగానే గుర్తొచ్చేది
’ద్విశ్శరం నాభి సంధత్తే - రామోద్విర్నాభి భాషతే
రాముడు రెండవమాట మాట్లాడడు - రెండవ బాణమెరుగడు.
అలాగే రాముడు ఏకపత్నీ వ్రతుడు.
ఈ భావాన్ని
ఒక మాట ఒక బాణము
ఒక పత్నీ వ్రతుడే మనసా
అనే కృతిలో పొందుపరచారు.
ఇందులో భాషా సౌందర్యమేమిటంటే..
పల్లవిలో ఒకమాట ఒకబాణము ఒక పత్నీ వ్రతుడే అన్నారు కదా.
అనుపల్లవిలో ఒక చిత్తము కలవాడే - ఒకనాడును మరువకవే అన్నారు. పల్లవికి తగ్గ అనుపల్లవిది.
స్థిరచిత్తుడైన రాముని ఏనాడూ మరువద్దు అనేది పల్లవికనుగుణమైన మాటలలో చెప్పారు.

’రామనీసమానమెవరు - అనే కృతిలో రాముడు సాటిలేనివాడని ప్రారంభించి, చూడగానే రాముని గుణగణాలు ఈ కృతిలో వర్ణింపబడ్డాయేమో అనుకునేలోగా మరొక విధంగా రాముని ప్రశంసిస్తారు.

భామ! మరువంపు మొలక - భక్తలు పంజరపు చిలుక
ఇది సీతమ్మ వర్ణన. అటువంటి భార్య కలిగిన నీకు సమానమెవరు?
చరణంలో ’పలుకు పలుకులకు తేనియలొలుకు
మాటలాడు సోదరులు గల’
తీయగా మాట్లాడే సోదరులు గల నీకు సమానమెవరు?
అంటూ రాముడు గొప్ప పరివారం గలవాడనీ - ఈ విధంగా చెప్పారు.
’సరస సామదానభేద దండ చతురా’ అనే కీర్తనలో రాముడు సామ దాన భేద దండోపాయాలు చతురతతో ప్రయోగించగలడు అని రాముని సామదాన భేద దండ చతురా! అని సంబోధిస్తారు. ఈ కీర్తన చరణంలో ఆ సంబోధనకి వివరం ఉందని, చరణం నాలుగు పాదాలు చతురోపాయలకు సంబంధించినవని చాలా మందికి తెలియదు.

చరణం మొదటి పాదం ’హితవు మాటలెంతో బాగ బల్కితివి’
ఇది సామోపాయం. ముందు రాముడు హితవు చెప్పి చూశాడు. "సతముగానయొధ్యనిచ్చెనంటివి" అవసరమైతే అయోధ్యనిస్తానన్నాడు. ఇది దానం.
నత సహోదరుని రాజుచేసి’
నత సహొదరుడని విభీషణుని పేర్కొన్నాడు. అంటే నమస్కరించిన సోదరుడు విభీషణుడు.
విభీషణునికి పట్టాభిషేకం చేయడం భేదోపాయం.
చివరి పాదం ’రాకా హతము చేసితివి త్యాగరాజనుత’ రాక్షస సంహారం చేయడం దండోపాయం.
ఈ నాలుగు పాదాల చరణాన్ని ఉద్దేశించి పల్లవి ’సరస సామదాన భేద దండ చతుర’ అన్నారు. ఇది ఎంతటి గొప్ప సమన్వయమో. ఎంత గొప్ప శిల్పమో.
"సందేహమును దీర్పుమయ్య సాకేస నిలయా రామయ్య"
ఈ కీర్తనలో ఇంకొక చిత్రమైన భావముంది.
త్యాగయ్య రాముని తన సందేహం తీర్పుమని అడుగుతున్నాడు.
"నందార్చితా పదయుగములు మేలో
నాగరికమగు పాదుకా యుగంబు మేలో" ఇది అనుపల్లవి నందుడనే ఒక వైకుంఠ పారిషదుడు.
ఆయన అర్చించిన నీ పాదాలు గొప్పా? లేక అయోధ్యలో నీవు లేనప్పుడు నీ స్థానంలో ఉన్న నీ పాదుకలు గొప్పా? అని సందేహం.
ప్రశ్నిస్తూనే, సమాధానం మనకి చరణంలో సూచించారు. చరణంలో అంటారు నీపాదాలు స్పరించిన మునులకు నీపదమిచ్చావు అంటే నీదర్శన భాగ్యమిచ్చావు.
నీ పాదుకలను నిరంతరం కొలిచిన భరతునికి నిన్నే ఇచ్చివేశావు. అంటె తాను భరతుని స్వంతమైపోయాడు.
పాదుకలు ఎంతో మహిమాన్వితమైనవి అని తెలియజేయడానికి ఇలా ఒక సందేహాన్ని సృష్టించి, పాదాలు అర్చిస్తే పాదుకలు అర్చిస్తే పొందిన ఫలితాలు తెలియజేసి, పాదుకలు ఎంత మహాత్య్మం కలిగినవో తెలియజేశారు. ఈ కల్పన ఎంత సున్నితంగా ఉందో కదా.
భాషని ఎంత అందంగా ప్రయొగిస్తారంటే ’దరిని తెలుసుకొంటి’ కీర్తనలో
దరిని తెలుసుకొంటి త్రిఫర సుం
దరిని తెలుసుకొంటి
మొదటిది ’దరి’ అంటే గమ్యం
తరువాత ’దరి’కి ’సుం’ చేరితే సుందరి - త్రిపుర సుందరీ దేవిని అనుపల్లవిలో కూడా
"మరుని జనకుడైన మా దశరధకు
మారుని సోదరి దయాపరి-మోక్ష"
మరుడు అంటే మన్మధుడు
మన్మధ జనకుడు మహావిష్ణువు.
దుర్గాదేవిని విష్ణు సహోదరి అంటారు కదా.
అందుకని "మా దశరధ కుమారుని సోదరి" అని చమత్కరించారు. మరుడు-కుమారుడు ప్రయొగం కూడా అందంగా ఉంది.
’వరలీలగాలలోల’ అనే సంస్కృత కీర్తన అనుప్రాసలతో కర్ణపేయంగా ఉంటుంది.
పల్లవి : వరలీలా గానలోల సురపాల సుగుణజాల
భరిత - నీల గళ హృదలయా శృతిమూల సు
కరుణాల వాల పాలయాశుమాం.
ఇక్కడ ’ల’ అనే అక్షరం అన్ని పదాలలో ఎన్ని రకాలుగా ఆవృత్తి చెందిందో, వినడానికి ఎంత బావుంటుందో.
ఈ కృతి యొక్క ప్రతి చరణంలో ఒక్కొక్క అక్షరం ఇలా ప్రయొగించబడింది. ఇలాంటి కృతులలో త్యాగయ్య గారి భాషా పటుత్వం కనబడుతుంది.
ఒకసారి త్యాగయ్యగారి తిరుపతి వేంకటేశ్వరుని సేవించుటకు వెళ్ళగా అర్చకులు తెరవేసినందువల్ల స్వామి దర్శనం కాలేదు. అప్పుడు వేంకటేశ్వరుని వేడుకుంటు "తెరతీయగ రాదా" అనే కృతి పాడారు.
భౌతికంగా స్వామి దర్శనానికి అడ్డుపడిన తెర తొలగించమంటూ మరోపక్క "తెరతీయగరాదా. లోని
తిరుపతి వేంకట రమణ మత్సరమను"
మనలోపల ఉండే మాత్సర్యం మోక్షానికి అడ్డుపడుతుంది. ఆ తెరని తొలగించమంటూ ప్రార్ధించారు.
తెర అడ్డగించడం ఎలా ఉందో పోల్చారు.
ఆకలిగొని భజించుట ప్రారంభిస్తే మొదటి యుద్దంలో ఈగ పడినట్లున్నది అంటారు. "ప్రథమ కబళే మక్షికా పాతః" అనే సంస్కృత లోకోక్తిని వాడారిక్కడ.
దగ్గరలో దీపం ఉన్నా దానికేదో అడ్డుపడినట్లుంది.
గింజలు తినడానికి వచ్చిన లేడు వలలో చిక్కుకున్నట్లుంది.
ఇలా వివిధమైన పోలికలతో ఆ తెర పడిన వైనాన్ని పోలుస్తూ మాలో మదమాత్సర్యాలనే తెరలని తొలగించు స్వామీ అంటూ దర్శనానికి అడ్దుపదిన ఆ తెరని కుడా తొలగించమని ప్రార్ధించారు. వెంటనే తెరతొలగి స్వామి దర్శనం కలిగిందని త్యాగరాజస్వామి చరిత్రలో ఉంది.

ఇలా త్యాగరాజ కృతులు ఏవి తీసుకున్నా భాషా భావ సౌందర్యాలతో నిండి ఉంటాయి. మొత్తం రామాయణమంతా రకరకాలుగా ఈ కీర్తనలలో ప్రోది చేయబడి ఉంది.
ఎన్ని కీర్తనలు ఉదహరించుకున్నా మనకు తనివి తీరదు. ఏ కృతికి అదే సాటి.
అందుకే త్యాగరాజు సంగీత ప్రపంచానికి రారాజు. త్యాగరాజు కృతులన్నీ క్షుణ్ణంగా నేర్చుకుంటే జ్ణాన సంపద ఎంతగానో అభివృద్ధి చెందుతుంది.

 

 
  శ్రీమతి సరోజా జనార్ధన్ :

ఎమ్మెస్సీ అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "మాస్టర్ ఆఫ్ మ్యూజిక్" పట్టా అందుకున్న శ్రీమతి సరోజా జనార్ధన్ సంగీతం ముఖ్యాంశంగా పద్మావతీ యూనివర్సిటీ (తిరుపతి) యందు పి .హెచ్. డి. చేస్తున్నారు. సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి శిష్యురాలైన వీరు ఎన్నో సంగీత కచేరీలు నిర్వహించడమే కాక సంగీతాన్ని భోధిస్తున్నారు కూడా.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech