`బద్దకమే మన శత్రువు!'

 

మీ ఆలోచనలు మిమ్మల్ని అందలానికి ఎక్కించగలవు.లేదా అధఃపాతాళానికి తోసెయ్యగలవు"-అనే విషయాన్ని ఆర్యులు ఏనాడో చెప్పారు. అదే ఈనాడు సైకాలజీ రంగంలో ’థాట్ మేనేజ్ మెంట్’ అనే ఒక శాస్త్రంగా అభివృద్ధి చెంది, ఎందరో ఉద్యోగులకూ, వ్యాపారస్తులకూ, తమకు తాము ప్రేరణ కలిగించుకోవటానికి దోహదపడుతూంది. హార్ట్ ప్రాబ్లెమ్ కన్నా థాట్ ప్రాబ్లమ్ ప్రమాదమని అందరూ గుర్తించాలి. ప్రతి వ్యక్తీ తనను తాను ప్రేరణ కలిగించుకుంటే అద్భుతాలు చేయవచ్చు.
బిల్ గేట్స్ ఒక సాధారణ ఉద్యోగిగా వున్నప్పుడు, ఐ.బి.ఎమ్ వారు పేపర్లో ఇచ్చిన ఒక ప్రకటన చదివిన బిల్ గేట్స్, తనను తాను ప్రేరణ కలిగించుకుని తన తల్లితో తాను ఆ ప్రోగ్రాం కొనబోతున్నాడని ఆత్మ విశ్వాసంతో చెప్పేశాడు. ఆ ప్రోగ్రాం పేరే ఎమ్మెస్ డాస్. ఈ ప్రోగ్రాం నేడు ప్రతి కార్యాలయంలోనూ ఎంతో ఉపయోగకరంగా వుంది.
ఆంధోనీ రాబిన్స్ అనే వాక్యూమ్ క్లీనర్ లు అమ
్మే చిరుద్యోగి, సంపాదన సరిపోక, హోటల్లో డిష్ వాషర్ గా పని చేసేవాడు. ఎన్.ఎల్.పి.లో శిక్షణ తీసుకుని "నేనూ అనుకున్నది సాధించగలను" అనుకుని కేవలం నాలుగేళ్లలో కోట్లకు పడగలెత్తాడు. అతను, ప్రతి వ్యక్తీ తనలో దాగివున్న శక్తిని తెలుసుకుని, వాటికి పదును పెట్టే ప్రక్రియనూ, ఆలోచనలను క్రమబద్దీకరించే విధానాన్నీ నేర్పి, బద్దకాన్ని జయించే చక్కని చిట్కాలూ చెప్పాడు.
‘జాస్, జురాసిక్ పార్క్’వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన స్పీల్బర్గ్ ఒక సంధర్భంలో మాట్లాడుతూ, "పాజిటివ్ థాట్స్ ను ఆదరించి నెగెటివ్ థాట్స్ ను పక్కన పెడితే ఎవరైనా విజయం సాధించవచ్చు. కానీ చాలా మంది ప్రతికూల (నెగెటివ్) ఆలోచనలను భయంకరంగా ఊహించుకుని, విజయానికి దూరంగా వెళ్లిపోతున్నారు. అటువంటి వ్యక్తులున్న సంఘంలో ఎటువంటి అభివృద్ధీ జరగదు" అన్నారు. సినిమా రంగంలో స్పీల్ బర్గ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అతనికి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాయో మనకు తెలిసిన విషయమే.
ఈనాడు ప్రపంచంలో నంబర్ వన్ మెజీషియన్ గా పేరున్న డేవిడ్ కావర్ ఫీల్డ్ మేజిక్ రంగంలో చెయ్యని ఫీట్ లేదు. లిబర్టీ స్టాచ్యూను మాయం చెయ్యడం, గదిలో బంధిస్తే బయటికి రావడం వంటి ప్రదర్శనలు అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అతను మెదట్లో ఒక మేజిక్ వస్తువులు అమ్మే కంపెనీలో పని చేసేవాడు. ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లి సాయంకాలం ఆరుదాకా వుండేవాడు. ఒక రాత్రి బాగా అలిసిపోయి పడుకుంటూ ఉదయం ఆరు గంటలకు లేవాలని అలారం పెట్టుకున్నాడట. ఆ అలారం పదేసి నిమిషాల వ్యవధితో ఆరుసార్లు మోగింది. ఉదయం మొదటి అలారం మోగగానే ఠపీమని నొక్కేసి, ఇంకా ఐదు అలారాలు వునాయి కదా అని మళ్లీ పడుకున్నాడట. అలా ఆరుసార్లూ జరిగింది. చివరికి అతను లేచేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. ధైర్యం తెచ్చుకుని ఆఫీసుకి వెళ్లాడు. అక్కడ ఎందరో కస్టమర్లు అతని రాక కోసం ఎదురుచూస్తునారు. గబగబా అందరితోటీ మాట్లాడి వారి పనులు చేసేశాడు. సాయంకాలం ఇంటికెళ్లే సమయానికి టేబుల్ మీద, అతని బిల్లు సెటిల్ చేసిన కాగితాలు, చెక్కు, ఉద్యోగం నుంచి తీసేసిన ఉత్తరం వున్నాయి. ఆ సంఘటన అతని జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తన బద్ధకమే తన ఉద్యోగం ఊడగొట్టిందని భావించి, ఆనాటి నుంచీ మనసుకు ఎదురుతిరిగి బద్దకాన్ని జయించి స్వయం ప్రేరణ కలిగించుకుని అనేక అద్భుతాలు చేశాడు.
సైకాలజీ రంగంలో ’ప్రేరణ’ గురించి అనేక ప్రయోగాలు నిర్వహించిన మేథావులెందరో వున్నారు. ప్రతి జీవిలోనూ, తనను తాను ప్రేరణ కలిగించుకునే శక్తి వుందనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత వుందనీ తెలిపారు. ఒక సైకాలజిస్టు ఒక చింపాంజీతో చేసిన ప్రయోగం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను ఒక చింపాంజీని గదిలో రోజంతా ఆహారం పెట్టకుండా సాయంకాలం ఆ గదిలో పైనుంచి మూడు అరటిపళ్ళు వేలాడదీశాడు. ఆ చింపాంజీ ఆ పళ్లు అందుకోవాలని శతవిధాల ప్రయత్నించి, చివరికి, అలిసిపోయి పడుకుంది. బద్ధకంతో చాలాసేపు అలాగే వుండిపోయింది.కొంత సేపటికి ఏమనుకుందో ఏమో, ఆ గదిలో పడివున్న ఒక ప్యాకేజీ డబ్బాలను తెచ్చి, ఒకదాని మీద ఒకటి పేర్చి, చివరికి ఆ పళ్లు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
జంతువులు కూడా ఇలా స్వయంప్రేరణ కలిగించుకుని అనుకున్నవాటిని సాధిస్తూంటే, నేటి యువతరంలో అధికశాతం ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడటం, తమకు తల్లిదండ్రులు అవసరమైనవి సమకూర్చలేదని సాధిస్తూ, తమ గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఈ సత్యాన్ని యువత గుర్తించి మేలుకోవలసిన సమయం ఆసన్నమైంది. చివరలో చితించి లాభం లేదు.!

 

 
  బీ వీ పట్టాభి రాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బీ వీ పట్టాభిరాం రచనల సమాహారం --------- ఈ "పట్టాభిరామాయణం".


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech