"సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు అక్టోబర్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. 

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

 

ఈ  మాసం సమస్యలు (కృష్ణ అక్కులుగారు ఇచ్చిన సమస్యలు)

 

కం.|| పలువురు తండ్రుల తనయడు భక్తితొ మ్రొక్కెన్!

.వె|| కంది పప్పు లేక కందిపోయె ముఖము!

 

 

క్రితమాసం సమస్యలు

తే.గీ.|| జోకు రాని తెలుగు వాడు జోకరేను

కం.|| శూన్యమె ఆనందమయ్యి శోభి లు భువిలో!

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ -  వేదుల బాలకృష్ణమూర్తి, శ్రీకాకుళం

తే.గీ.||    జోకురాని తెలుగువాడు జోకరేను

జోకరు పలుకు, రూపము, చూపు నడక

నవ్వు పుట్టించు జోకులనవవిధముల

ఇంక జోకులతో పని ఏమికలదు

 

కం.||     అన్యులకు మేలు కూర్చిన

ధన్యత్వము చెందు జీవితమ్ము జనులకున్

అన్యుల పీడించు క్రియా

సూన్యమె ఆనందమగు చు శోభిల్లు  భువిన్

రెండవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,

                    తే.గీ. ||   తెలుగువాడు ఎపుడు జూపు టెక్కు మిగుల

                             భాష మరచినట్లు పలుకు పరుల భాష

                             కన్య శుల్కమనగ కాకి కబురులనెడి

                             జోకురాని తెలుగువాడె జోకరేను        

 

కం. ||    అన్యములెరుగని సిధ్ధులు

                             శూన్యమునను జూచిరంత సుందరరూపున్

                             ధన్యులు జూపిన మార్గమె

                             శూన్యము ఆనందమయ్యి శోభిలు భువిలొ

       

మూడవ పూరణ -   యం.వి. సుమలత

తే.గీ. ||   చీకు చింత మరచి హాయి చెంద తలచి

టెక్కు పడుచు హాస్య టెల్గు టీవి చూడ

డొక్క త్రిప్పి నాకు మిగుల డోకు వచ్చె

జోకు రాని తెలుగు వాడు జోకరేను

 

కం. ||    శూన్యమె అనంత మూలము

శూన్యమె ఆద్యంత మనెడి సూక్ష్మము తెలియన్

శూన్యమె ఆ యోగ ఫలము

శూన్యమె ఆనందమయ్యి శోభిల్లు భువిలో 

 

నాల్గవ పూరణ -  మణి శాస్త్రి, టెక్సాస్

తే.గీ.||  ఆలి వేసినా జోకేనయా  అది మరి
                       
తల్లిదీ చెల్లిదీ బిడ్డదైన జోకె
                       
రాదు నవ్వు సరి ఎటుల రాదు జోకు
                       
జోకు రాని తెలుగు వాడు జోకరేను.

 

కం ||  మాన్యపు తన ప్రేమను సా
                       
మాన్యపు నరజాతి మంచి మదినెంచి అసా
                       
మాన్యపు త్యాగము రాధకు
                       
శూన్యమె ఆనందమయ్యి శోభిలు భువిలో

 

ఐదవ పూరణ- జగన్నాథ రావ్  కె.ఎల్

తే.గీ.|| అందె వేసిన చెయ్యిగ హాస్యమాడ
           
జోకు పేలును బాగుగ శోభ మీర
           
తియ్యనగు జోకు నీ  సొమ్ము తెలుగులోను
           
జోకు రాని తెలుగువాడు జోకరేను

తే.గీ.|| గొప్ప జోకు వినగ చెవి కోసుకొనుచు,
           
ఎట్టి జోకులనెరుగక ఇష్టమొచ్చి
           
నట్టు పలుకరు ఇప్పుడీ ఆంధ్ర జనులు
           
జోకు రాని తెలుగువాడు జోకరేను

 

కం.||   మాన్యులనైనా అతి సా
           
మాన్యులనైనా మరువని మరణ మృదంగం
           
గున్యా స్వైన్ ఫ్లూ వ్యాధుల
           
శూన్యమె ఆనందమయ్యి శోభిలు భువిలో!

 

ఆరవ పూరణ - కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి, టెక్సాస్

తే.గీ.|| హాస్య రచనల నెన్నియో ఆకళించి
తలచి కడుపుబ్బ నవ్వుట తధ్యమౌను
ఇంచుకైనను నవ్వుపుట్టించు నట్టి
జోకురాని తెలుగువాడు జోకరేను

కం.||   మాన్యులు సుద్దులు చెప్పగ
ధన్యులు  శ్రోతలట వారి తలపులె యెపుడున్
దైన్యము హీనపు భావము
శూన్యమె ఆనందమయ్యి శోభిలు భువిలో

ఏడవ పూరణ- గండికోట విశ్వనాధం, హైదరాబాద్

                        తే.గీ. |   పేక  పీకిన జోకరు  రాక  పైక
                                   
మెల్ల  పోగొట్టి లేటుగా యిల్లు  చేరి
                                   
సరస  బాసల భార్యకు సాకు చెప్ప
                                   
జోకు రాని తెలుగు వాడు  జోకరేను.
              
            
సరస= రస యుక్తంగా అనగా శృంగార, కరుణ, వీర, రౌద్ర రస జనితంగా
                      
బాసల= వివిధ  భాషల్లో, ఒట్టు  పెట్టి

ఎనిమిదవ పూరణ- రావు తల్లాప్రగడ, శాన్ హోసే

తే.గీ.||    హాస్యమన్నసహ్యము నాకు యనుచు నసిగి

తిరుగువాడెవడూ కాడు తెలుగు వాడు!

జోకులేని తెలుగువాడు జోకరేను

సెట్టు కొక్కడు అటులనె పుట్టు గాదె!

 

కం.||     శూన్యమె జ్ఞానము అందము

అన్యతా శర్మమేది? ఆనందమిదే

ధన్యుడ సత్యము యిదియే

శూన్యమె ఆనందమయ్యి శోభిల్లు భువిన్ !

 

పాఠకులనుడి అందిన మరొక మంచి పద్యం(పంపిన వారు జగన్నాథ రావ్)

పురస్కారం 

కం|| ఇరుసుకి కందెన రాయక

     పరమగురుని బండియైన _ పరిగెట్టదుగా

     తరుణమున చేతికందెన,

     విరిసెను నోబెలున శాంతి _ వేగు ! ఒబామా !

విశ్లేషణ:

చేతికందెన: ఒక అర్ధం = చేతికి + అందెనా? = షష్టీ విభక్తి

రెండవ అర్ధం = చేతి కందెన = greasing the palms 

నోబెలున శాంతి:

ఒక అర్ధం  = నోబెలునన్ + శాంతి = నోబెలునందు శాంతి = సప్తమీ విభక్తి

రెండవ అర్ధం = నోబెలు + అశాంతి = ప్రధమా విభక్తి

వేగు = dawn

పై పద్యం పద్య చమత్కారం కోసమే గానీ పెర్సనల్ తిరస్కారం కోసం కాదు. నోబెల్ పురస్కారం పుచ్చుకోవడం ప్రతిష్ఠాకరమే కదా.

 

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech