సుజనరంజని పాఠకులకు ప్రత్యేక కానుక!.

 "మంత్రానికి శక్తి ఉందా" అనే శీర్షికతో సుజనరంజనిలో   ప్రఖ్యా మధుబాబుగారు అందిస్తున్న రచనలకి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రసిద్ది గాంచిన వీరి  రచన మీకోసం...
PDF ఇక్కడ క్లిక్ చేయండి

                       

   ఋతంభర:2 (ది వేవ్స్ ఆఫ్ బ్యూటీ ) - ఓనామహా శివాయహా

                                                                                                 

 

 

మనకి ఏమి తెలియదో అది తెలియదని కూడా మనకి తెలియదు అన్నారో పండితులు. మన మస్తిష్కం జరిగే కొత్త విషయాలని తనకి అంతకు ముందే తెలిసిన జ్ఞానంతో అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం చేత విషయాలు ఒక్కో సారి అర్ధం కావనిపిస్తుంది. ఇది సామాన్యమైన సమస్య కాదు. మానవాళి అంతా కొన్ని శతాబ్దాలుగా విజ్ఞాన రహస్యాలను కోల్పోయేందుకు కారణమైన మానసిక సమస్య. గెలీలియో లాంటి మేధావంతులను మనం ఉపయోగించుకోలేక పోడానికి మూలమైన సమస్య. అచ్చ తెలుగులో దీన్ని మళ్ళీ చెప్పాలంటే కొత్తదనాన్ని ఆహ్వానించ లేక పోవడం. భూమి బల్ల పరుపుగా ఉందని బలంగా తమకి 'అనిపించి ', లాజికల్ గా (నే) తెలివితో నమ్మి, భూమి గుండ్రంగా ఉందని ఎవరన్నా వాళ్ళని శిక్షించేంతటి మూఢనమ్మకానికి కారణం - కేవలం కొత్త దనాన్ని అహ్వానించలేక పోవడం, విభిన్నంగా అలోచనా ప్రవాహాన్ని పోనివ్వక పోవడం కదా!?

మనం చూసిన ప్రతి పద్యాన్ని, మంత్రాన్ని మన అర్ధం పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇది సహజం. కాని అందులో నిక్షిప్తమైన రహస్యాలనో ఋతంభర జ్ఞానాన్నో కోల్పో వచ్చు. మనకి అది అర్ధం అవడం కన్నా మనమే మనమే ఆవిషయం రంగంలోకి వెళ్ళాలి అప్పుడు అవ్యక్తమైన విషయాలు గోచరించడం మొదలుపెడతాయి. ఇలాంటి రహస్యాలు ఉంచడం ప్రపంచంలో అన్ని మతాలలోనూ ఉంది. మనం వినే లలితా సహస్రనామ స్తోత్రం నించి గురు అష్టకం దాకా అన్నిటిలోనూ రహస్యాలున్నాయి. ఋతంభర తాలూకు చిహ్నాలూ నిక్షిప్తమై ఉన్నాయి.

ఋతంభర లో ఉన్న యోగుల పరిభాష కుడా చిత్రంగా ఉంటుంది. ఒక భక్తుడు తన కొడుకుని తీసుకుని భారత దేశానికి వచ్చాడుట.
"స్వామీ ! మా అబ్బాయి కి మారేజ్ చేద్దామనుకుంటున్నాను. మీ ఆశ్సీసులు కావాలి. " అందుకు ఆయన నవ్వి " మారేజ్ మిరాజ్ " అని వెళ్ళిపోయారు.ఇది ఏమిటి ఇలా అన్నారు అన్నుకున్నారుట ఆ తండ్రి. కొన్నాళ్ళ కి ఆ అబ్బాయి ఉద్యోగ నిమ్మిత్తం కొరియా వెళ్ళాడు. అక్కడ "మిరాజ్" అనే కొరియన్ అమ్మాయి పరిచయం అయి వాళ్ళిద్దరు పెళ్ళి చెసుకున్నారుట. అప్పుడు ఆ భక్తుడికి స్పష్టం గా అర్ధమైందిట గురువుగారేమన్నారో.

ఇలాంటిదే సంఘటన నాడీ గ్రంధం విషయంలో జరిగిందొకసారి. ఒకాయనకి ఆపరేషన్ చేయాల్సి వస్తే నాడీ గ్రంధం చూపించారుట. అందులో "శస్త్ర చికిత్సేన జీవతి" అని చదివారు. అంటే శస్త్ర చికిత్స చేస్తే బతుకుతారు అని అర్ధం. కానీ విధి వక్రించి ఆపరేషన్ సక్సెస్ కాలేదుట. అప్పుడు మళ్ళీ నాడీ గ్రంధంలో వెతికితే చదివే ఆయన చెప్పారుట. "నన్ను క్షమించండి నేను చదవడం తప్పు" అని. అక్కడ ఏముందంటే "శస్త్ర చికిత్సే నజీవతి" అని. ఆ "న" అన్న అక్షరం ముందు పదంతో ఉంటే ఒక అర్ధం తరువాతి పదంతో ఉంటే పూర్తి వ్యతిరేకార్ధం వస్తాయి. అలాగే సృష్టిలో రహస్యాలని మనం తెలుసుకో గలిగినా కూడా వాటిని వినియోగించుకోడానికి యోగం, అదృష్టం కావాలంటారు.

అన్నిటిలోనూ వ్యాపార దృక్పధం వచ్చేసి అసలైన నాడీ గ్రంధాలు, రుద్రాక్షలు కూడా దొరకడం లేదు. పురాతన గ్రంధాలను కూడా తయారు చేయగల సామర్ధ్యం జనాలకి తయారైంది. అసలు శాస్త్రంలో ఏముండేదో మనం మర్చిపోవడానికి ఇవే కారణమేమో అనిపిస్తుంది. ఇంకో నాడీ గ్రంధం తాలూకు మంచి సంఘటనలో పూర్వపు యోగులు ఏ విధంగా భవిష్యత్ సృష్టి సంఘటనలని దర్శించగలిగేవారో అర్ధమౌతుంది.

ఒక అబ్బాయికి ఒక చిత్రమైన నేత్ర వ్యాధి వచ్చిందిట. డిమినిషింగ్ విజన్ అనే ఈ వ్యాధి వల్ల క్రమ క్రమం గా అతని చూపు సన్నగిల్లుతుంటే వాళ్ళ నాన్న గారు ఒక మంచి నాడీ జ్యోతిష్కుడి వద్ద పత్రం చదివించుకున్నారుట. అందులో వచ్చింది "రెండు వారాలపాటు ఇతనికి అరటి ఆకులో భోజనం పెట్టండి చూపు వస్తుంది అని". ఇలా ఎలా సాధ్యం అరటి ఆకులో భోజనం పెడితే చాలా ? అని అనుకున్నారుట. సరే వాళ్ళ పెరటిలో అరటి చెట్లు లేవు కనుక దగ్గరలో ఉన్న ఒక హోటల్ లో పురమాయించారుట. రోజూ వచ్చి రెండు అరటి ఆకులు తీసుకెళ్తాం అని. అలా కొన్ని రోజులవగానే ఒక రోజు వెళ్ళే సరికి ఆ హోటల్ వాళ్ళు చెప్పరుట, "సారీ సార్ ఈరోజు ఎవరో పెళ్ళి వాళ్ళ బస్ వచ్చింది అరటి ఆకులన్నీ భోజనాలకి వాడేశాము. రేపు కావాలంటే ఎక్కువ ఆకులిస్తాము. చూడండి ఆయన కూడా మీలాగే రోజూ అరటి ఆకులు పట్టికెడతారు" అని అక్కడికొచ్చిన ఒకాయన్ని చూపించారుట. ఆయన వీళ్ళతో అన్నారు, "అవునండి నేనూ రోజూ అరటి ఆకులు పట్టుకేడతాను. నాడీ గ్రంధంలో వాళ్ళు నన్ను అరటి ఆకులో ఈ వారం భోజనం చెయ్యమన్నారు" అని. "అవునా మేమూ నాడీ గ్రంధంలో వినే అరటి ఆకులు పట్టుకెడుతున్నాం" అని వీళ్ళు అన్నారుట. "మీరు ఏం చెప్పించుకున్నారు మీ జాతకమా" అని ఆయన అడిగారుట. "కాదు మా అబ్బాయికి కంటికి ఒక జబ్బు చేసింది. చాలా మంది మాములు దాక్టర్లకి చూపించాం. సరే నాడీ గ్రంధంలో కూడా చూపిద్దాం అని వెళ్ళాం." అని చెప్పరుట. అవతలాయన, " కంటి జబ్బా, నేను ఒక పేరెన్నిక గన్న కంటి వైద్యుడిని. అమెరికాలో ఉంటాను. మీవాడిని నాకు చూపించండి" అన్నారుట. అప్పడే ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళడం, ఆయన ఇది ఒక ప్రత్యేకమైన కేసు అని భావించి వారిని అమెరికా ఆహ్వానించడం ఆ అబ్బాయి నేత్ర రోగాన్ని అతి తక్కువ ఖర్చుతో నయం చేయడం జరిగాయిట. అలా తాటాకుల్లో చదివిన అరటాకులు జీవితాన్నే మార్చాయిట. ఇదెలా సాధ్యం? అంటే నాడీ గ్రంధం రాసిన యోగులు ముందే లెక్క వేసారా, ఇలా ఒక వైద్యుడు కలుస్తాడని? లేక ప్రకృతే వాళ్ళ వాక్సిధ్ధిని పూర్తి చేయడానికి ఇలాంటి ఘటనలని సృష్టిస్తుందా?

సృష్టి ఒక్కోసారి తన సంకేతాలని నిగూఢంగా అందిస్తుంది. రానున్న ప్రకృతి మార్పులని జంతువులు పసిగట్టినంతగా మేధావంతుడైన మనిషికూడా గ్రహించలేడు. దేవతల భాషని వినాలంటే మనసు పరిపక్వత చెంది ఉండాలి. అర్ధం కావాలంటే సాధన పరిపక్వత చెంది ఉండాలి. ఒక సాధకుడు అమ్మవారి అనుగ్రహం కావాలని తపస్సు మొదలుపెట్టాడుట. అతనికో దివ్యశక్తి ని పొందాలని ఉంది. రోజూ రెండు వేలు పైన జపం, పూజ అన్నీ చేసేవాడు. కొద్ది రోజులకి దుర్గా దేవి కలలో కనిపించి చెప్పిందిట (యదార్ధ సంఘటనని కొద్ది మార్పు చేయడం జరిగింది):

"ఓయ్ నీకు తెలిసిన భవనం ఎంతో కోరుకుని బంగారు కోటకి దణ్ణం పెట్టుకో "
వెంటనే మెలకువ వచ్చింది. ఏమిటి ఈ మాటలకి అర్ధం అని ఆలోచించడం మొదలు పెట్టాడు. కొంపతీసి అమ్మవారు ఎదైనా బిల్డింగ్ కొనమంటోందా? అయి ఉండదు అనుకున్నాడు. భవనం అంటే శరీరం, లక్ష్మి అంటే జ్ఞానం ఇలా ఏమేటిటో ఆలోచనలు వచ్చాక ఒక రోజు తోచింది. ఇందులో ఏదో అంతరార్ధం ఉంది అని. ఇది మంత్రం ఎందుకు కాకూడదు అని. అప్పుడు తనకి తెలిసిన కొద్దిపాటి మంత్ర శాస్త్ర పరిజ్ఞానంతో ఒక్కో పదానికి అది సూచించే బీజాక్షరాన్ని రాసుకుంటూ వెళ్ళాడు.


ఓయ్ నీకు= ఓం
తెలిసిన = ఆఐం
భవనం = భువనేశ్వరి బీజం= హ్రీం
ఎంతో = ఖరీదు అంటే లక్ష్మి బీజం = శ్రీం
కోరుకుని = కామ బీజం = క్లీం
బంగారు కోటకి = కనక దుర్గాయై
దణ్ణం పెట్టుకో = నమః

అంతా కలిపితే మంత్రం తయారైంది.
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కనక దుర్గాయై నమః

దీన్ని సాధన చేసి అనుగ్రహాన్ని, సిద్ధిని పొందాడుట. అన్ని వేళల మనం కోరుకునే విషయాలు అరటి పండు ఒలిచిపెట్టినట్టు మన చేతికి వచ్చేయవుట. ఋతంభర ద్వారా ప్రయాణించి మనని చేరి నిక్షిప్త రహస్యాలుగా ఈ మంత్రాలో, సూచనలో ఉండొచ్చును.


సౌందర్యలహరి ఉదాహరణగా తీసుకుంటే అందులో మచ్చుకి ఒక శ్లోకంలో ఏ విధంగా శ్రీ ఆదిశంకరులు దివ్యార్ధాలని ఇమిడ్చారో తెలుస్తుంది. కొద్ది జ్యోతిశ్శాస్త్ర జ్ఞానాన్ని అందులో ఉపయోగిస్తే ఇంకా రహస్యాలు బోధపడతాయి. 47 వ శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుందాము.

భ్రువౌ భుగ్నే కించిత్ భువన-భయ-భంగ-వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర-రుచిభ్యాం ధృత-గుణం
ధనుర్మన్యే సవ్యేతర-కర-గృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే

సామాన్య అర్ధం: ఓ ఉమా! సృష్టినుండి భయాన్ని పోగొట్టే తల్లీ, నీ వంగిన కనుబొమ్మలు మన్మధుని ధనస్సు వలే ఉన్నవి. మన్మధుడు తన తన ఎడమచేత పట్టుకొనగా మోచేయి ఆ భృగు మధ్యాన్ని దాచినట్టుంది.

భృవౌ - కనుబొమ్మలు
భుగ్నే కించిత్ - కొంచెం వంగిన
భువన భయ భంగవ్యసనని - ప్రపంచ భయాన్ని పోగెట్టే అలవాటున్న
త్వదీయే - నీయొక్క
నేత్రాభ్యాం - కనుల
మధుకర రుచిభ్యాం - (సీతాకోకచిలుకలు) తేనెటీగల వంటి అందమైన
ధృత గుణం ధనుః - జ్యా (తాడు) బిగించిన ధనస్సు వంటి (ఎక్కుపెట్టబడిన)
మన్యే - అనుకుంటున్నాను
సవ్యేతర కర గృహీతం - వామ హస్తంతో చేపట్టి
రతి పతే - రతీ దేవి భర్త అయిన మన్మధుడు
ప్రకోష్ఠే ముష్టౌచ - మోచేయి, పిడికిలి
స్థగయతి - దాచబడిన
నిగూఢాంతరం - దాచబడిన (కనుబొమ్మల) మధ్య (భృగు మధ్యం)
ఉమే - ఓ ఉమా !

ఋతంభర విశ్లేషణ: 47 వ శ్లోకమనగా 12 రాసుల చుట్టూ 3 ఆవృతాలతో 36 పూర్తయి 11 వ ఇంటికి జ్యోతిశ్శాస్త్ర ప్రకారం వెళ్ళాలి. అంటే కుంభ రాశి అన్నమాట. కుంభ రాసి కుండలినికి కేంద్రం కదా. కుంభానికి ఎదురుగా 7 వ ఇంట ఉన్న రాసి సిమ్హం. సిమ్హానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు దృష్టి కారకుడు. అందుకనే ఈ శ్లోకంలో కన్నుల ప్రసక్తి వచ్చింది. అంటే ఈ శ్లోకం కుండలిని ఆధారభూతమైన దృష్టిని గురించి చెపుతుందన్న మాట. అంటే ఋతంభర అని అర్ధం.
ఈ శ్లోకాన్ని చివరి పాదం నించి మొదటికి అర్ధం చేసుకుందాం - వ్యతిరేక దిశలో. ఇది చేయడానికి ఇంకో కారణం సంఖ్యా శాస్త్రంలో ఉంది. సంఖ్యా శాస్త్ర పరంగా చూస్తే


1 - సూర్యుడు
2 - చంద్రుడు
3 - గురుడు
4 - రాహువు
5 - బుధుడు
6 - శుక్రుడు
7 - కేతువు
8 - శని
9 - కుజుడు
(మీ పుట్టిన రోజు 3 వ తేది అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ కి గురుడు అధిపతి అన్న మాట. దాన్ని బాట్టి మీకు 3, 12, 21, 30 అదృష్ట కరమైన రోజులు అని చెపుతారు సంఖ్యా శాస్త్రంలో. అలాగే మిగిలిన రోజుల వారుకూడా అన్వైంచుకోవచ్చును. ఇంకా ఆసక్తి కలవారు షీరో న్యూమరాలజీ అధ్యయనం చేయవచ్చును.)
47 లో, 4 రాహువు - 7 కేతువు కనుక , ఇవి మామూలు గ్రహాలకి వ్యతిరేక దిశలో చలిస్తాయి కనుక కూడా మనం చివరి పాదం నించి అర్ధం చేసుకోవడం మొదలు పెట్టాం.
ఈ శ్లోకంలో ఉన్న నిగూఢ అర్ధం అమృతత్వ సిధ్ధిని గురించి. దీన్ని మధు విద్య అని కూడా పిలిచేవారు. సహస్రార చక్రం నుండి ఖేచరి సాధించిన యోగులకి బిందువులు గా పడుతూ అమృతత్వాన్ని ప్రసాదించే శక్తి గూర్చిన విషయం ఇందులో ఉంది. ఇందుకు ఆజ్ఞా చక్రాన్ని దాటుకుని ఋతంభర శక్తి జోడించుకుని పైకి వెళ్ళడం ఎంతో అవసరం. మనం ఇందాక అనుకున్న (ఈ శ్లొకపు) మూల క్షేత్రం కుంభం. కుంభమే అమృత భాండం. కుంభమునే 'కుండ ' అంటున్నాము. అది కుండలిని శక్తి సంకేతం.క్షీర సాగరమధనంలో వాసుకుని ఉంచి మధించినది కూడా ఆ భాండం కోసమే. అప్పుడే రాహు, కేతువుల ప్రసక్తి కూడా వస్తుంది. ప్రతి వారి జీవితంలో జరిగే మధనానికి ఇది చిహ్నం అని వేరే చెప్పనక్కర్లేదు కదా. (వీటి వివరాలు జూలై, 2008 సుజనరంజని లో, మంత్రానికి శక్తి ఉందా ఆర్టికిల్ లో ఉన్నాయి, చూడ గలరు).


ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే

4 వ చరణం చూస్తే, ఈ చరణం చివరి పదం 'ఉమే '. ఉమ అంటే పార్వతి కదా. శంకరాచార్యుల వారు ఇక్కడ ఉమా అని ఎందుకు వాడారు? ఇందుకు నిర్వచనం ఉమా సహస్రంలో శ్రీ కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని ఇచ్చారు. 'ఉ ' అంటే శివుడని ' శివస్య మాన శక్తి మా ' అంటే కొలవదగిన శివ శక్తి ఆ ఉమ అని చెప్పారు. ఉమ అంటే ఏ శక్తి అయితే మనని అహం నించి సోహం అనిపించి శివమయం చేసి 'హంసః శివః సోహం ' అని తెలియజేస్తుందో ఆ శక్తి అన్నమాట. ఆమే మనని పరిమితమైన పరిధినించి అనంతానికి తీసుకెడుతుంది. అదే కుంభానికి చిహ్నం. ఎక్కువ జ్యోతిశ్శాస్త్ర వివరాలలోకి వెళ్ళకుండా, ఈ శ్లోకం చెప్తున్న సంకేతం మనం అనంతత్వాన్ని చేరాలని.
మరి ఆత్మ అనంతత్వాన్ని చేరకుండా ఆపుతున్నదేది? ఈ శ్లోకంలోనే జవాబు కూడా ఉంది. 'నిగూఢ ' అంటే రహస్యంగా ఉంచడమే కదా. అంటే శంకరులవారు చెపుతున్నారు - ఇక్కడొక రహస్యం ఉంది అని. రహస్యం ఏది ? రహస్యాన్ని దాస్తున్నది ఏది? రహస్యంగా దాయబడుతున్నది కనుబొమ్మల మధ్య ప్రదేశం. దాన్నే భృగు మధ్యం అనీ ఆజ్ఞా చక్రం అనీ అంటున్నాము. దీన్నే మూడో కన్ను అంటున్నాము. ఆ చక్రమే కనుక దాయ బడకుండా ఉంటే అన్నీ గోచరమువుతాయి. ఋతంభర వ్యక్తమవుతుంది. మరి దాస్తున్నది ఏది? ప్రకోష్టే ముష్టాచ అన్నది జవాబు. అంటే మోచేయి అన్న మాట.

శంకరుల వారు కునుబొమ్మల గురించి ఎందుకు ఈ శ్లొకంలో చెపుతున్నారంటే అది మూడో కన్ను కనుక. అది తెరుచుకుంటే జీవితం, విశ్వము అర్ధమవుతాయి కనుక. దాన్ని జయిస్తే (శివ ధనస్సు, రామాయణంలో) అతీంద్రియ ప్రజ్ఞ ను చేరగలడు కనుక.

మరి మన్మధుని పిడికిలి , మోచేయి (ముష్టి, ప్రకోష్టే) కనుబొమ్మల మధ్య ప్రాంతాన్ని కప్పివేస్తున్నాయి అన్నారెందుకు శంకరాచార్యుల వారు? ఇది చిత్రంగా లేదూ? రతి పతి అంటే మన్మధుడు. రతి అంటే కోర్కెలకు ప్రతీక. ఇవి కావాలి, అవి కావాలి అని లెక్కలేనన్ని కోరుకునే మానవ సహజ నైజానికి అది ప్రతీక. మన్మధుడు ఈ కోర్కెలు తీరేందుకు చేసే ప్రయత్నాలు (కర్మలు) ధనస్సు పట్టుకుని ఉండడానికి ప్రతీక (గుర్తుందా శివుడు తన మూడో కంటితో మన్మధుడ్ని భస్మం చేశాడు - అంటే మూడో నేత్రం దగ్గర ఉన్న ఆజ్ఞా చక్రాన్ని చేరిన యోగి కామాన్ని దహించగలడు, అలా దహించిన వాడే శివుడు కాగలడు అని అర్ధంట).

మరి చెయ్యి, మోచెయ్యి ఇవన్నీ ఆ జ్ఞాన్ నేత్రమైన భ్రుగు మధ్యాన్ని కప్పి వేయడం అంటే ఏమిటి? దీని అర్ధం మనుషులు చేసే "కర్మలు" (కర్మ అనేది కరము అనే మాటలోంచి జనించింది - కరములతో అంటే చేతులతో చేసే చేతలు కనుక వాటిని కర్మలు అనడం జరిగింది) అంటే అన్ని విధాలాఇన ఆశలతో కూడి ఉన్నప్పుడు అవి మన కళ్ళు మూసుకుపోయేలా చేస్తాయి, జ్ఞాన నేత్రం తెరుచుకోనివ్వవు అని అర్ధం. ప్రతి సాధకునిలో వైరాగ్య భావన అవసరం అన్న మాట. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని ఎక్కువ తలుస్తాం !
కరములు కర్మలను చేసే పరికరాలు కనుక ఆ కర్మలే అతీంద్రియ ఋతంభర జ్ఞానం కలక్కుండా ఆపుతాయి అని ఇంకో అర్ధం. మరి కర్మలు చేయకుండా ఆగడం ఎలా? అది కుదరదు కానీ కర్మ ఫల త్యాగియై ఆ కర్మలకతీతమైన తలం లో నిష్పాక్షికంగా పనిచేయగల శక్తి యోగికి ప్రసాదించబడినప్పుడు బుద్ధి గాయత్రి మంత్రంలో చెప్పినట్టు దేవతా ప్రచోదనమై, మనస్సు ఇంద్రియంగా పని చేసి, మూడో కన్ను తెరుచుకుని దివ్య జ్ఞాన ప్రవాహం తనలో ప్రవేసించి మనిషి మహాయోగి కాగలడు. మానవుడు మానవుడిగా నివశించగలిగినప్పుదు మానవాతీత శక్తులే లేవు. అన్నీ మానవ సహజ శక్తులే. తన కర్మలతో తనని తాను ఆపుకోకుండా ఉంటే చాలు.

అంతే కాదు అరచేతులు (పిడికిలి) జ్ఞాననేత్రాన్ని బ్లాక్ చేయడం అంటే ఇంకో శాస్త్రంకూడా చూడాలి. అదే హస్త సాముద్రికం. చేతులో రేఖలు కర్మలని, ఫలితాన్ని సూచిస్తాయి. ఇక్కడ మన్మధుడి ఎడమచెయ్యి అంటే 'లెఫ్ట్ ' హాండ్ అన్నమాట, అంటే త్యాజ్యమైన కర్మలు. అంటే ఏ కర్మలైతే వదల దగినవో అవి పట్టుకుని వేళ్ళాడ్డం అవే చేస్తూ ఉండడం మనం మరింత పైకి పోకుండా ఆపుతున్నాయన్న మాట.

ఈ శ్లోకంలో ఇంకో చిత్రం ఉంది కొంచెం శ్రద్ధగా గమనిస్తే. అమ్మవారి కనుబొమ్మలు మన్మధుడి ధనస్సులా ఉన్నాయి. మనసులో ఊహించుకోండి - (కొంచెం గ్రాఫిక్స్) మన్మధుడు ఆ ధనస్సుని ఎక్కుపెట్టి మనవైపు వేస్తున్నట్టు. ఇది 3-డైమెన్షనల్ ఇమేజ్. అప్పుడు ఆయన ధనస్సు పట్టుకున్న పిడికిలి, మోచెయ్యి అమ్మవారి మూడవ నేత్రాన్ని కప్పి వేస్తాయి. అంటే శంకరాచార్యుల వారు ఈ శ్లోకం చెప్పినప్పుడు 3-డీ ప్లేన్ లో ఆలోచిస్తున్నారన్నమాట.


ధనుర్మన్యే సవ్యేతర-కర-గృహీతం రతిపతేః

ఇక మూడో చరనంలో చూస్తే, మన్మధుడు తన ఎడమ చేత్తో విల్లుని పట్టుకున్నాడని ఉంది. ఎడమ వైపుని 'వామం ' అని కూడా అంటారు. అది వామ దేవుడిని సూచిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది వదిలివేయదగిన కర్మలని సూచిస్తున్నాయి. ఆ విధంగా కర్మలని విభేధించి మంచి చెడుల విచక్షణతో పరమ హంసయైన ఊర్ధ్వ రేతస్కునికి ఆ పరమోన్నత పదం దొరుకుతుందని ఇంకో అర్ధం. ఉన్నత లక్ష్యాన్ని కావాల్సిన ధనస్సు ఇదే మన మనస్సు. ఆ మానస్సు నియంత్రించే శక్తి మంత్రం. ప్రక్రియ మననం. అడ్డుపెట్టే చిత్తన్ని దాని వృత్తులని నిరోధించే ప్రక్రియ యోగం. వీటి ఇంజనీరింగ్ తంత్రం, శక్తిని హార్నెస్ చేయగల లే అవుట్ పేరు యంత్రం అన్న మాట. తెరుచుకోని జ్ఞాన నేత్రంతో ప్రపంచాన్ని కేవలం 'లాజికల్ ' గా, యాంత్రికంగా దర్శిస్తే భగవత్ స్పర్శని కోల్పోతాం.

త్వదీయే నేత్రాభ్యాం మధుకర-రుచిభ్యాం ధృత-గుణం

ఇక రెండో చరణంలో మధుకర అనేది మధుమతి అనే ప్రజ్ఞ ని గురించి చెపుతోంది. దీన్ని గురించి పతంజలి యోగ సూత్రాలలో విశేషంగా చెప్పడం జరిగింది. ముందు సంచికల్లో ఈ విద్య రహస్యాలని పరికిద్దాం. మధు అంటే పరమానందానికి, కారణాతీత సంతోషానికి చిహ్నం - ఇదే మోక్షం. ఏడు జ్ఞాన భూకల్లో ఉన్నతమైనది, ధ్యానం కన్నా ఎంతో పైకి వెళ్ళిన యోగులకి ఈ 'మధుమతి ' స్థితి అందుతుందిట. ఇదే అమృతత్వ స్థితి ట.

భ్రువౌ భుగ్నే కించిత్ భువన-భయ-భంగ-వ్యసనిని

క మొదటి చరణంలో చూస్తే ఆది శంకరుల మూల లక్ష్యం కనిపిస్తుంది. ప్రతి యోగి తన జీవితంలో ఏమి చేయాలో, యోగ శక్తులు వచ్చాక ఏమి చేయాలో కూడా ఇక్కడ చెప్పారు. ఇక్కడ "భ " అనే అక్షరాన్ని 5 సార్లు వాడారు. అన్ని యోగ శక్తులు వచ్చేందుకు మూలం "భ" అంటే జ్ఞానము, భగవత్ తత్వము. అది సాధించాక కూడా యోగుల్లో ఇంకా 'వ్యసనము ' (ఎంత బలమైన మాట) ఉండొచ్చుట. తను భగవాన్ అయ్యాక ఇంకే వ్యసన్ ఉంటుంది? భువనానికి అంటే ఈ ప్రపంచానికి శాంతిని చేకూర్చే వ్యసనం (ఎడిక్షన్) ఉంటుందిట. ఎంత మంచి వ్యసనం - అందరూ బాగుండాలను కోవడం! మనకీ అదే కలగాలని కోరుకుందాం.

శ్రీ గురుభ్యో నమః
 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech