‘భావగీతాల రారాజు బసవరాజు’

 

 వేదాద్రి శిఖరాన వెలిగున్న జ్యోతి
మినుకుమని కాసేపు కునికిపోయింది
దేవలోకమునుండి దిగినట్టి గంగ
వచ్చిన్నదారినే పట్టి మళ్లింది
కాపురమ్మొచ్చిన కన్నిపాపాయి
ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయాడు

పాడుకోవడానికి అనువైన ఈ గీతం చదివేకొద్దీ విషాదంలోని గాఢత అనుభవంలోకి వస్తుంది. జీవించింది ముప్ఫైమూడు సంవత్సరాలే అయినా భావకవుల్లో మిన్నగా వాసికెక్కిన కవి ఈయన. దేవులపల్లి కృష్ణశాస్త్రి మాటల్లో చెప్పాలంటే ఈయనే మొట్టమొదటి భావకవి! ఇంకెవరు బసవరాజు అప్పారావు! దువ్వూరి సాంబమూర్తి మాటల్లో చెప్పాలంటే- ''కీట్స్ అండ్ షెల్లీ రోల్డ్ ఇన్‌టు వన్''! నిజమే. ఆయన ఆంధ్రా కీట్స్... ఆంధ్రా షెల్లీ!

''నవ్య కవిత్వానికి గురజాడ వేగుచుక్క అయితే, భావకవితా జగత్తులో బసవరాజు పగటి చుక్క. దేవులపల్లి రేచుక్క.''-అంటారు పరిశోధకులు. అందుకే కాబోలు బసవరాజు మిట్టమధ్యాహ్నమే అర్ధాంతరంగా ఈ లోకంలో పని ముగించుకొని వెళ్లిపోయారు. 1894 డిసెంబరు 13న జన్మించిన బసవరాజు బాల్యమంతా విజయవాడ పటమటలోనే గడచింది. 1912 నాటికి ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేశారు. ఆ కాలానికి తగినట్లే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల్లో ఉన్నత చదువు పూర్తిచేశారు. 1916 నాటికి బి.ఎ. పూర్తిచేశారు. బి.ఎ. చదువుతున్నప్పుడే మేనమామ కుమార్తె రాజ్యలక్ష్మమ్మతో వివాహమైంది. ఆమె కూడా కవయిత్రిగా పేరుపొందడం విశేషం. ''సౌదామిని'' పేరుతో కవితలు రాసిన కవయిత్రి ఆమే.

బి.ఎ. పట్టా పొందిన తర్వాత బసవరాజు అప్పారావు ఉద్యోగవేటలో పడ్డారు. ఆనాటి ప్రసిద్ధ పత్రికలు 'భారతి', 'ఆంధ్రపత్రిక'- యాజమాన్యం బసవరాజుకు ఉద్యోగమిచ్చింది. కవి కుమారుడికి నెలవు దొరికింది. అప్పటి మద్రాసు మహానగరం తెలుగు కవులు, కళాకారులకు నిలయం. అందువల్ల బసవరాజుకి క్రమేణా తెలుగు కవులందరితో పరిచయాలు పెరగడమే కాదు, ఆయనిల్లు 'కవులకు' కూడలిగా మారింది. రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, నండూరి, అబ్బూరి ఇలా ఎంతోమంది ఆయనకు మిత్రులయ్యారు. మరోవైపు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, తదితరులు మద్రాసుకొచ్చినప్పుడు బసవరాజు ఇంటనే బసచేయడం విశేషం. బసవరాజు సున్నిత హృదయులు. ప్రతి అనుభూతిని ఆయన పాటగా పాడారు. తన ఆనందాన్నీ, విషాదాన్నీ పాటలుగా వినిపించారు. తన కుమార్తె 'మంగళప్రద' చనిపోతే-
 కోయిలా కోయిలా కూయబోకే
గుండెలూ బద్దలూ చేయబోకే
తీయని రాగాలు తీయబోకే
తీపితో నా మనసు కోయబోకే
చిట్టినీ జ్ఞాపకం చేయబోకే
చింతలో ప్రాణాలు తీయబోకే

     ఇలా బావురుమని ఏడ్చారు.

తన మిత్రుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణిస్తే-
ఏలా పాడేనింక యమునా కల్యాణి! నే
లీలా మానవుడు గోపాలుడు లేడాయె
బంగారు గనులలో చెంగలించే వేళ
పిడుగుబోలిన వార్త వినిపించినారయ్య

అని 'ఎలిజీ' రాశారు. బసవరాజు అప్పారావు ప్రేరణ వల్లే నండూరి ఎంకి పాటలు రాశారు. ఆ విధంగా బసవరాజు నండూరి, దేవులపల్లి, రాయప్రోలు కన్నా కూడా ముందే పాటలల్లారు. ఆయనది ఆత్మాశ్రయ ధోరణిలోనేకాక అన్యవిషయ వివరణలోనూ అందెవేసిన చేయి. అందుకు 'యశోధరా విలాపం' వంటి గీతాలు సాక్ష్యం!
 ''లేపనైనా లేపలేదే
మోము
చూపనైనా చూపలేదే
కోపకారణమేమొ
ఏ పాపమెరుగనే...''

 ఏ వివరణా అవసరం లేకుండానే హాయిగా అర్థమవుతాయి బసవరాజు గేయాలు. బాలకృష్ణుని కొంటె చేష్టల్ని వివరిస్తూ-  

''పన్నెండేళ్ల చిన్నాడే
పైట కొల్లగొన్నాడే
అడుగవమ్మ! అడుగవమ్మ
అమ్మ! యశోదమ్మా!
 

చీకటైన కాలేదే
రాకపోక లాగలేదె
లోకానికి జడవొద్దా
పోకిళ్లకి అదుపొద్దా
 

ఇలా బసవరావు అప్పారావు శ్రీకృష్ణుని చిలిపి సరాగాల్ని ఎన్నో గీతాల్లో వివరించారు. 'దొంగకృష్ణుడు' గీతంలో ఆయన
'
'నల్లవాడే! గొల్లపిల్లవాడే! చెలియ
కల్లగాదే! వాని వల్లో చిక్కితేనే...''
 

ఈ పల్లవిని పోలిన పల్లవులు తదనంతర కాలంలో ఎన్నో వచ్చాయనడంలో సందేహంలేదు. అవి సినిమాల్లో మారుమోగాయి. మరి బసవరాజు అప్పారావు సినిమాలకు గేయాలు రాయలేదా? అంటే రాశారు. ''రైతుబిడ్డ'' చిత్రంలో వినిపించే గీతం ఆయనదే-  

'ఆ మబ్బు యీ మబ్బు ఆకాశ మధ్యాన
అద్దుకున్నట్లు మనమైక్యమౌదామె''
 

ఈ యుగళగీతం అప్పట్లో ఎంతో ఆదరణ పొందిందంటారు ఆనాటి విమర్శకులు. జానపద సరళిలో కూడా బసవరాజు గేయాలు రాసి మెప్పించారు. ఎంతో ప్రజాదరణ పొందిన ''వెర్రిపిల్ల'' గేయం ఇలా సాగుతుంది.
 
'గుత్తొంకాయ కూరోయ్ బావా
కోరి వండినానోయ్ బావా
కూర లోపల నా వలపంతా
కూరిపెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా...''

 ఆ పల్లె పడతి ఆ గీతంలో ఎన్నెన్నో వంటకాల ప్రస్తావన తెచ్చి తన బావ కోసం ఎంత శ్రమపడిందీ వివరిస్తుంది. ప్రేమ అనెడి పాలు, కన్నెవలపనే వెన్న... ఇలా అన్నీ కలిపి బావ కోసం ఎదురుచూస్తుంది. ఆ కాలానికి తగినట్లు జాతీయ భావాలతో కూడా ఎన్నో గీతాలు రాశారు బసవరాజు.
 ''పతాకోత్సవము చేయండి
స్వతంత్ర భారత జాతి చిహ్నమౌ''

ఇలా సాగే గీతంలో జాతీయ పతాకం గురించి వర్ణిస్తారు. అలాగే మహాత్మాగాంధీజీ మీద కూడా ఎన్నో గేయాలు రాశారు.
కొల్లాయిగట్టితేనేమీ?
మా గాంధీ
కోమటై పుట్టినేతేమీ?

కుల ప్రస్తావన వల్ల ఈ గేయం హుందాతనం తగ్గిందికానీ ఇతరత్రా ఎంతో విలువైన గేయమిది.
వెన్నపూసా మనసు-కన్నతల్లీ ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు
 

ఎంతో లయాత్మకంగా సాగిన ఈ గేయం ఆ రోజుల్లో జాతి జనుల నీరాజనాలందుకొంది. ఆయన 'చంద్రగ్రహణం' వంటి డ్రై సబ్జెక్టు మీద కూడా కమ్మని గీతం రాశారు- ''రాబోకు రాబోకురా చందమామ, రాహుపొంచున్నాడురా తోవలోన'' అంటూ. అలాగే తాజమహల్, భూదేవి, ప్రేమ, వంటి అనేక విషయాల మీద కమ్మని పాటలున్నాయి. ఆయన గీతాల్లో వేదాంతం కూడా కనిపిస్తుంది- ''దీపము చుట్టును మిడుత వోలెనే/ తిరుగుచుంటినో దేవా!''. అలాగే ఆయనకు భావావేశం కూడా ఎక్కువని కొన్ని గేయాలు నిరూపిస్తున్నాయి.
 ''నన్నెవ్వరాపలేరీ వేళా
నా ధాటికోపలేరీ వేళా
నోట పలికేదంత పాటగా మోగేను
కోటి వరహాకెత్తు- కెత్తుగా తూగేను''

బసవరాజు అప్పారావుని దేవులపల్లి తొలినాళ్లలో మార్గదర్శకంగా ఎంచుకొన్నారన్న విషయంలో ఏమాత్రం సందేహంలేదు. తనకన్నా ముందు రాసిన వ్యక్తి ప్రభావం పడడం సహజమే. అయితే దేవులపల్లి దాన్ని అధిగమించి విస్తరించడం విశేషం. బసవరాజు అప్పారావు రవీంద్రనాథ్ టాగూర్ నుంచి కూడా ప్రేరణ పొందారు.

పాట పాడుతుండగ నా
ప్రాణి దాటి యెగేనా?
ప్రాణి దాటి యేగుచుండ
పాట నోట మ్రోగేనా?
 

అంటూనే ముప్ఫై మూడు సంవత్సరాలకి కన్ను మూశారు. ఆయన కనీసం అరవై ఏళ్లు జీవించి ఉన్నా ఎంతోమందిని అధిగమించి ఉండేవారు. ఆయన్ని కోల్పోవడం... తెలుగుజాతి దురదృష్టం.
 


 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech