me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పని చేస్తున్నారు. జ్యొతిష్య శాత్రసంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారి ని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

ఈ నెలంతయూ ఈ రాశివారలకు భార్యాపిల్లల విషయమునందు చికాకులు, క్రింది ఉద్యోగులు సరిగ పనిచేయకపోవుట, పనులు చేజారుట, భయము, అలసట, అనవసరమైన ఖర్చులు, వృథా సంచారము, అయినవారినుండి వ్యతిరేకత ఇబ్బంది పెట్టు అవకాశమున్నది. బద్ధకము, అలసత్వము కార్యసామర్థ్యమును తగ్గించు అవకాశమున్నది. వివిధ రంగములలోనున్న వ్యతిరేకత నిరుత్సాహమును ఇవ్వగలదు. కావున ఈ రాశివారు ఈ నెలను సంయమనముతో గడుపగలరు. కార్యఫలమునందు దృష్టిపెట్టక కార్యములను నెఱపగలరు

 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

ఈ మాసము వృషభరాశివారకు కొంత అనుకూలముగా నుండగలదు. మానసికముగ ఉత్సాహమును కలిగియుందురు. పనులయందు ఆశించిన ఫలితములను పొందగలరు. అభీష్టకార్యములు సిద్ధించగలవు. ప్రయత్నముచే కార్యములు పూర్తికాగలవు. వస్త్ర ధన ధాన్యములయందు లాభములు గడించు అవకాశమున్నది. స్వప్రయత్నముచేధనలాభము చేకూరును. నవమునందున్న గురుడు నూతనగృహమును కొనుగోలు చేయించు అవకాశమున్నది.

                ప్రాప్తించు లాభములకు పంచమమునందున్న శుకృడు మరింత బలమును కలుగజేయుచున్నాడు. కానీ ఆ శుకృడు మాసపు ఉత్తరార్థమునందు ప్రతికూలుడగుచున్నాడు. శని కూడా ఈ రాశివారికి ఈ నెలంతయూ వ్యతిరేకుడై యున్నాడు. కావున కార్యములు నిర్విఘ్నముగా కొనసాగుటకు శివారాధన చేయగలరు .

 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

ప్రస్తుతము గోచరము అస్తవ్యస్తముగా నున్న రాశులలో ఇది ఒకటి. శని గురు కుజులు ముగ్గురు వ్యతిరేకప్రభావమును చూపుతున్నారు. నీరసముగనుండుట, కార్యములు నెరవేరకపోవుట, దుర్జనులతో సహవాసము మరియు భయము ఈ రాశివారిని పీడించు అవకాశమున్నది.  ఉన్నతాధికారులతో  వివాదమునకు దిగరాదు. స్థిరాస్థుల లావాదేవీలు అనుకూలించు అవకాశము లేదు.

          కావున ఈ సమయమునందు తొందరపాటు పనికిరాదు. ఆవేశపడరాదు. కొత్త లావాదేవీలు చేయకుండుట మంచిది. సమయము పూర్తిగా ప్రతికూలమైనది కావున ఆలోచనలను పూర్తిగా ఆపి యథాప్రకారము కర్తవ్యపాలన జేయవలెను. అయినవారు మరియు స్నేహితులు కూడా వ్యతిరేకులుగ కనిపించు అవకాశమున్నది..

 

http://www.jagjituppal.com/images/2canc.gif

కర్కరాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

ఇప్పుడిప్పుడే ఏలినాటి శని ప్రభావమునుండి బయటపడిన ఈ రాశి ఈ నెలంతయూ కుజుని ప్రభావముచే సతమతమవుచున్నది. కుజుని ప్రభావము వలన ఉద్వేగము, ఉక్రోషము, ఒత్తిడి చాలా ఎక్కువగా నుండు అవకాశమున్నది. జ్వరములు మరి.యు వ్రణములు ఇబ్బందిపెట్టగలవు. ఆత్మీయులు మరియు అయినవారు ఇబ్బందికరముగా ప్రవర్తించు అవకాశమున్నది.

కానీ ఈ రాశివారికి అనుకూలముగా నున్న గ్రహముల సంఖ్య మరియు బలము ఎక్కువ. కావున పైన వివరించిన సమస్యలు బాధపెడుతున్ననూ వీరు అన్నిరంగములయందూ అభివృద్ధిని సాధించగలరు. వ్యాపారము, విద్యలయందు ప్రగతి మరియు చేయు ప్రయత్నములందు సఫలత వీరికి కొత్త ఉత్సాహమును ఇవ్వగలవు.

 

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

కార్యసాధనయందు ఈ రాశివారు ఈ మాసమునందు పరాక్రమమును చూపెట్టెదరు. అనగ ఈ రాశివారు ధైర్యముతో ముందుకు సాగిన  ఏ రకమయిన పనిని అయినా ఈ మాసమునందు సాధించగలరు. ఖర్చులు ఎక్కువగా పెట్టు అవకాశమున్నది.  స్వగృహమునందు మరియు బయట కూడా విరోధులు ఎక్కువగా నుండగలరు. మానసిక అశాంతి ఎక్కువ.

గ్రహముల ప్రతికూల ప్రభావము ఎక్కువగా నుండుటచే ఈ రాశివారు వారుచేయు పనియందే ఎక్కువ శ్రద్ధను కలిగి యుండవలెను. మిగిలిన విషయములందు ఓర్పు అవసరము. వారిని పీడించుచున్న సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించకుండా సాధించవలసిన కార్యములపై  శ్రద్ధ చూపెట్టడమువలన సమయములు అవలీలగా అధిగమించుటయే గాక కార్యసాఫల్యయోగము ప్రబలముగా నుండుటచే పనులను అనుకూలదిశలో సాధించుకోగలరు..

 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

ఈ రాశివారికి ఈ సమయము మిశ్రమముగానుండును.  ప్రతీపనియందు వీరు అధికముగా తిరుగుట మరియు పరిశ్రమించుట చేయుదురు. అనవసర ప్రయాణములు చేయవలసిన అవసరము రావచ్చును. విశ్రాంతి తీసుకొను అవకాశములు చాలా తక్కువ. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి క్షీణించుట, పనులు పూర్తికాకుండుట, బంధువులవలన ఇబ్బందులు వీరికి ఇబ్బంది కలిగించే కొన్ని అంశములు.

వీరికి ముఖ్యముగా ఇబ్బందులు కలిగిస్తున్న గ్రహములు శని మరియు కుజుడు. వీరు శాంతించుట వలన స్థిమితముగా ఆలోచించగలిగే పరిస్థితులు ఏర్పడగలవు. కావున ఈ రాశివారు రుద్రాభిషేకములు జరిపించుట, శివాలయములు దర్శించుట మరియు శని మంగళవారముల వ్రతముచేయుట వలన చాలా వరకూ ఊరట పొందగలరు.

 

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

ఈ రాశివారికి ప్రస్తుత మాసము  ఒక మోస్తరుగా నుండును. కొత్తగా ఏర్పడిన కొత్త సమస్యలు నిద్ర లేకుండా చేయు అవకాశములు కనబడుచున్నవి. శరీరమునందు పీడ, సమయము మించిన తరువాత భోజనము, సహాయపడని బంధుమితృలు వీరి బాధలను పెంచు అవకాశమున్నది.  ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్య ఎదురుగా నిలబడగలదు.

          ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకోవలెను. ఎక్కువగా తిరగవలసి రావచ్చును. బదిలీలు జరిగే అవకాశములెక్కువ. ఉద్యోగములు కూడా మారగలరు. ఏ గ్రహముకారణముగా కూడా అనుకూలప్రభావము కనిపించకుండుటచే ఈ రాశివారు సంయమనముతో వ్యవహరించవలెను. భగవదారాధన చాలా అవసరము. ముఖ్యముగా ఈ మాసమునందు సూర్యుని ఆరాధించవలెను. ఉదయమున స్నానముచేసి రాగిపాత్రతో సూర్యునికి అర్ఘ్యప్రదానము చేయగలరు.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

ప్రస్తుతసమయము ఈ రాశివారికి అనుకూలముగా నున్నది. కేవలము కుజుడు మాత్రము వ్యతిరేక ప్రభావమును చూపుచున్నాడు. ఆ కారణముగా ఈ రాశివారు శారీరకముగా కొద్దిగా ఇబ్బందిపడు అవకాశమున్నది. మరియు ఆ చెడు ప్రభావము కారణముగా త్రిప్పట మరియు అలసట సంభవించగలదు.

కానీ మిగిలిన అన్ని గ్రహములు అనుకూలప్రభావమును చూపుటచే ఈ రాశివారికి ఇది యోగించు కాలము. స్త్రీపుతృలవలన సుఖము, ఆరోగ్యము, ధనలాభము, అభీష్టములు నెరవేరుట  ఈ మాసమునందు సంభవించగలవు. కావున సమయమునందలి ఆనుకూలతను ఈ రాశివారు సదుపయోగపరచుకొనుటకు ప్రయత్నించగలరు.

 

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

               

లాభయుతమయిన మాసము. అష్టమకుజుడు తప్ప మిగిలిన అన్ని గ్రహములు లాభములు కలిగించెడి స్థానములందున్నవి. కావున కుజుని వలన సంభవించే శరీరజాడ్యము, అసామయిక   భోజనము, విరోధములు చాలా సామాన్యములు. కావున వీనికి సిద్ధమవుతూ ఉద్యోగమునందు, వ్యాపారమునందు మరియు విద్యయందు పై స్థానములకై ప్రయత్నించగలరు.

పై అధికారులతో, ప్రభుత్వాధికారులతో మరియు శాసనపరమైన అధికారులతో చర్చించుటకు ఇది అనువైన సమయము. వాహనాదులు నడుపునపుడు శ్రద్ధ వహించవలెను.  మాసపు పూర్వార్థమునందు పెట్టుబడులు, షేరులు మొదలగువానియందు పెట్టుబడులు లాభించగలవు. మంగళవారములు జేయుట మరియు సుబ్రహ్మణ్య స్తోత్రములు కుజుని దుష్ప్రభావమును తగ్గించగలవు.

 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

సమాజములో సమ్మానము మరియు పలుకుబడి దినదినాభివృద్ధిని పొందును. జన్మగురుడు స్థానచలనములను కలిగించు అవకాశమున్నది. అధికారులతో వివాదములు బదిలీలకు మరియు హెచ్చరికలకు దారితీయు అవకాశములున్నవి. కానీ రాబోవు కొద్ది నెలలో ఈ ప్రతికూలత తప్పును కావున సంయమనముతో ఈ రెండు నెలలు గడిపిన స్థానచలనగండము తప్పును.

          కుటుంబసభ్యులతో తరచు వివాదములు సంభవించగలవు. భార్య మరియు పిల్లలు అసంతృప్తిచెందు అవకాశమున్నది కావున వారిపై శ్రద్ధ అవసరము. రుద్రార్చన ఈ రాశివారకు గ్రహకృత దుఃఖములనుండి విముక్తిని ప్రసాదించును.

 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

ఈ రాశివారలు ఇప్పటికే గురుని అశుభస్థితి వలన మానసికముగా మరియు శారీరకముగ ఇబ్బందులననుభవించి యున్నారు. దానికి తోడు ప్రస్తుతము శని అశుభత్వమును పొంది యున్నాడు. కావున పరిస్థితిని వర్ణించవలసిన అవసరము లేదు. ప్రస్తుతము నవంబరు  మాసమునందు ఈ రాశివారకు ఊరటనిచ్చు పెద్ద అంశము వీరికి లభిస్తున్న కుజ బలము.

          కుజబలము కారణముగా ఈ రాశివారలు ఈ మాసము నందు అన్ని రంగముయందును విజయమును సాధించెదరు. ప్రస్తుతము రానున్న కాలములో ఇంత అరుదైన సమయము వీరికి లభించు అవకాశము లేదు కావున ఈ రాశివారు ఈ అవకాశమును సద్వినియోగపరచుకోగలరు.కుజబలము కారణముగా వీరు ధన ధాన్య వస్త్రలాభములను, కీర్తిని, మానసిక ఉల్లాసమును పొందగలరు..

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

ప్రస్తుతము బలమయిన రాశులలో ఇది అగ్రగామి. అష్టమములోనున్న రవి కారణముగా దుర్వార్తశ్రవణము మరియు వృథా గమనాగమములు సంభవించగలవు. అన్యగ్రహకృత బలము కారణముగా అన్ని రంగములయందు విజయము,  యశోవృద్ధి, శత్రువుల నాశనము కలుగును. ఈ సమయమునందు విరోధించువారు తక్కువగా నుండుటచే పనులను త్వరితగతిన పూర్తి చేసుకోగలరు.

          వీరి ఆనందములో శని అప్పుడప్పుడు వ్యవధానమును కలిగించు అవకాశమున్నది కావున ఈ రాశివారు శివార్చన, శివాలయములను దర్శించుట, హనుమత్ స్తుతి మొదలుగునవి చేయుట వలన కార్యభంగము జరుగక అన్ని రంగములయందును అభివృద్ధిని సాధింగలరు.

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం