గమనిక - ఈ శీర్షికలో పాఠకులందరూ పాల్గొనాలని మా ఆకాంక్ష . ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రభావం ఎంతో వుంటుంది . అలా ప్రభావితులమైన మనమందరం ఆ మధుర క్షణాలనూ , ఆ తీపి అనుభూతులనూ , ఆ మహనీయుడందించిన బోధనలనూ , విశ్లేషణా పరిజ్ఞానాన్నీ అందరితో పంచుకోవడం మీ తండ్రులకు మీరిచ్చే గౌరవ సూచకమేకాదు , అవి మిగితావారికి కూడా ఒక సందేశాన్నిచ్చి వారిని కూడా ప్రభావితం చేస్తాయి . ఆ నాడు నెహ్రూ తన కుమార్తెకు వ్రాసిన లేఖలు అమితభారతానికీ ఒక స్పూర్తినందిస్తోంది అంటే ఏమీ ఆశ్చర్యపడాలసిన విషయం కానేకాదు. మీరుకూడా మీ తండ్రిగారిదగ్గిర నేర్చుకున్న విషయాలను , పంచుకున్న ఆ ఆత్మీయతనూ అందరితో పంచుకోండి , సుజనరంజని ద్వారా వారికి నివాళులర్పించండి.

మీ రచనలను sujanaranjani@siliconandhra.org కు పంపండి . మీకు రచనలు చేయటం అంత అలవాటు లేకపోయినా భయపడకండి . ఈ శీర్షికలో వృత్తాంశం ముఖ్యము . మీరు వ్రాసి పంపితే మా సంపాదక వర్గము మీ రచనకు
సహకరిస్తుంది.   
        

                                                                                                        - సంపాదకవర్గం    

 
 

 
 

నా పేరు యాసాల రాజు. ఉద్యోగరీత్య కాలోఫోర్నియా రాష్ట్రంలోని, శాన్‌హోసె నగరంలో వుంటున్నాను. "సుజనరంజిని" ద్వారా మా నాన్నగారి గురించి నాలుగు మాటలు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. 

పెయింటింగు, చిత్రలేఖనం పట్ల ఆసక్తి వున్న వారికి మానాన్న గారి గురించి తెలిసి వుండే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా బాతిక్ కళ కోసం నాన్నగారు ఏంతో కృషి చేశారు. నాన్నగారు గీచిన బొమ్మలు స్వదేశీయులే కాకుండ విదేశీయులు కూడ బాగా ముచ్చటపడి కొంటారు. అటువంటి బొమ్మల బ్రహ్మయైన మా జనకుల పేరు యాసాల బాలయ్య గారు. 

మా నాన్నగారి తల్లిదండ్రులపేర్లు యాసాల దుర్గయ్య, విశాలాక్షమ్మ గార్లు. నాన్నగారు సిద్దిపేటకు పది కి.మీ దూరంలో వున్న ఇబ్రహీంపూర్ అనే గ్రామంలో జన్మించారు. నాన్నగారికి ఒక సోదరి, ముగ్గురు సొదరులు. నాన్న రెండవ వాడు. ఆ రోజుల్లో స్కూల్‌కు వారు 10కి.మీ నడుచుకొని లేదా ఎడ్ల బండిమీద సిద్దిపేటకు వెళ్ళెవారట.

నాన్నగారు చిన్నపట్టినుండి బొమ్మలు గీయడం పైన చాలా ఆసక్తి చూపించేవారట. మా నాన్నమ్మ కట్టెల పోయ్యి మీద వంట చేయడం వల్ల, వంటయింటిలో ఒకవైపు గోడ నల్లగా తయారయ్యేదట.

నాన్నగారు (బాతిక్ బాలయ్యగారు)

నాన్న ఒక కర్ర పుచ్చుకొని ఆ నల్లటి గోడపైన బొమ్మలు గీసెవారట. అది చూసి నాన్నమ్మ "ఈ నల్ల గోడమీద తెల్లగా పిచ్చి గీతలేమిటిరా" అని అరిచేవారట. కాని అక్కడ నల్ల గోడ పైన మొదలైన గీతలు, తరువాత అందమైన ఇంతుల బొమ్మలుగా రూపు దిద్దుకొని, ప్రపంచంలో ఎన్నో అందమైన భవుంతులలో ఖరీదైన గోడలమీద అలంకరిపబడతాయని మా నాన్నమ్మ ఉహించివుండదు.       

"కాదేది కవితకు అనర్హం" అని శ్రీశ్రీ గారనట్లు, మా నాన్నగారు "కాదేది పిచ్చి గీత, పత్రి గీతతో చక్కని నాతిని గీయవచ్చు" యని భావిస్తారు. నాన్న తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు,బొమ్మలు గీచి సరదాగా అంధ్ర సచిత్ర వార పత్రికకు పంపించారట. ఆ బొమ్మలు ప్రచురింపబడడం మరియు కొంత డబ్బులు రావడంతో చాలా ధైర్యాన్ని,నూతన ప్రొత్సాహాన్ని ఇచ్చాయట.  

తరువాత నాన్నగారు B.A చదివి సిద్దిపేటలో టీచరుగా చేరారు. ఆ రోజుల్లో 70 రూపాయలు జీతం వచ్చేది. బ్రతకలేక బడిపంతులన్నట్లు జీతం చాలి చాలనట్లుండేది. అందువలన డబ్బుల కోసమె కాకుండ జీవితంలో ఏదైనా చెయ్యాలని ఆలోచించి చివరకు తనకు నచ్చిన చిత్రలెఖనమునే ఎంచుకొని, ఆ సమయంలో జానపద చిత్రకారుడిగ పేరుగాంచిన కావు రాజయ్యగారి వద్ద శిష్యుడిగా చేరి, చిత్రలేఖనంలో ఎన్నో మెలుకువలు నేర్చుకొని, వారి సలహాలు తీసుకొని డ్రాయింగులో, లోయరు మరియు హైయరు పరీక్షలు పాసయ్యారు.  

అటు పిమ్మట బొమ్మలు గీయడంపైన మరింత ఆసక్తి పెరిగి, హైదరబాదుకెళ్ళి కె.లక్ష్మాగౌడ్ అనె వారివద్ద బాతిక్ నేర్చుకొన్నారు. బాతిక్ చిత్రాలు చాలా ప్రసిద్ధి గాంచిన హ్యండిక్రాప్ట్ చిత్రాలు. తేనెతెట్టుల మైనమును కరిగించి అందులో ఒక స్పెషల్ పెన్నును ముంచి దాని ద్వారా బొమ్మలు గీస్తారు. పెన్ను నుండి చుక్కలు చుక్కలు కారుతూ వుంటుంది.అందువలన దీన్ని ఇంగ్లీషులో batik అనియు తెలుగులో బాతికనియు అందురు.     

పెన్ను నుండి చుక్కలు దారాళంగా కారుతుండడం వలన ఈ చిత్రలేఖనం చాలా కష్టముతో కూడుకొన్న పని. చిత్రలేఖుడికి కళతోపాటు చక్కని నేర్పు,ఓర్పు కూడ అవసరం.నాన్నగారు బాతిక్ కళలో సాధించిన కృషిని గుర్తించి, చాలా ఆర్టికల్స్‌లో, పేపర్లలో యాసాల బాలయ్యకు బదులు, "భాతిక్ బాలయ్య" యని వ్రాసి అభినందించేవారు.       

నాన్నగారు పుట్టిన పెరిగిన తెలంగాణ గ్రామీణ జీవన విధానం,స్థితిగతులను బొమ్మల రూపంలో చాలా అద్భుతంగా విశిదపరిచేవారు. ఈ బొమ్మలను ఫారినర్స్ చాలా ఇష్టపడి కొనెవారు. ఆ విధంగా నాన్నగారు చేతి ద్వారా సృష్టింపబడిన బాతిక్ మరియు ఇతర చిత్రాలను బెంగళూరులోని కావేరి,మన రాష్ట్రంలోని  లేపాక్షి,అలాగే చెన్నైలో పేరుమోసిన ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శనకు వుంచేవారు. ఇవన్నీ కూడ స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ట్ గ్యాలరీస్. విదేశీయులు ఎక్కువగా గవర్నమెంట్ ఆర్ట్ గ్యాలరీలకెళ్ళి బొమ్మలు కొంటారు.     

ఈ ఆర్ట్‌గ్యాలరిస్ వారు నాన్నగారి బొమ్మలు అమ్ముడు పోయిన తరువాత,వారి ఖర్చులు పట్టుకొని మిగిలిన డబ్బులు నాన్నకు చెక్కు రుపేణా పంపేవారు. కొన్నిసార్లు డబ్బులు త్వరగానె వచ్చినా, ఒక్కొక్కొక సారి ఏడాదైన ఏమి వచ్చేవి కావు. అయితే కొంచెంకూడ నాన్నగారు  నిరుత్సహాపడకుండా ఎప్పటిలాగే తన కళను కొనసాగించేవారు.  

నాన్నగారికి మేము నలుగురు మగపిల్లలం, ఒక అమ్మాయి. మేము ఇంటర్,డిగ్రీ చదివే రొజులలో నాన్నగారు ఎన్నో ఆర్ట్ ఏగ్జిబిషన్స్ నిర్వహించారు. ఈ ఏగ్జిబిషన్స్ నిర్వహణలో పిల్లలనందరిని పాల్గొనేటట్లు చేసెవారు. ఈ ఎగ్జిబిషన్స్ ఒక్కొక్కొకసారి ఎక్కడో ఊరి బయట జరిగేవి. అక్కడకి కావల్సిన వస్తువులను పెయింటింగ్సును తీసుకెళ్ళడానికి సరియైన ట్రాన్సుపోర్ట్ లేక, పిల్లలం చాలా టెన్షన్ పడేవాళ్ళాం. అయితే నాన్నగారు చాలా కూల్‌గా వుండేవారు. వీటి ద్వారా మేము ప్రతిదానికి కంగారు పడకూడనేది నేర్చుకొన్నాము.  

ఎగ్జిబిషన్స్‌కి వచ్చేవాళ్ళు నాన్నగారిని కలిసి,"బాలయ్య గారంటే మీరేనా సార్. మీ బొమ్మలు చాలా అద్భుతంగా వుంటాయి. మిమ్మలిని కలుసుకోవడం చాలా ఆనందంగావుందని" చాలా అభిమానంగా పలకరించేవారు. అయితే ఈ ఎగ్జిబిషన్స్ వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చేవి. కొన్నిసార్లు చాలా చిత్రాలు అమ్ముడుపోయెవి. మరికొన్ని సార్లు పెయింటింగ్సు బాగున్నాయని అనేవారేగాని కొనేవారు కాదు. అటువంటి సందర్భాలలో ఖర్చులు కూడ రాకపోవడంతో,మేము బాధపడి ఈ ఎగ్జిబిషన్స్ అంత అవసరమా అని నిరుత్సాహాంగా మాట్లడేవాళ్ళం.  

అయితే నాన్నగారు ఏ మాత్రం కంగారు పడకుండా,"ప్రతి పని వల్ల ఒక ఉపయోగముంటుంది. ప్రతిసారి మన చిత్రాలు అమ్ముడు పోతాయనుకోవడం అత్యాశే అవుతుంది. చాలా మంది మన చిత్రాలు చూసి ఆనందిస్తారు. ఆదే విషయం నలుగురితో చెబుతారు. అలాగే కొంతమంది ఈ సారి కాకపోతే ఇంకొక సారి కొనేందుకు ప్రయత్నిస్తారు. కావున మనం మొత్తం  వ్యాపారత్మకంగానే కాకుండ కళాపరంగా కూడ చూడాలి. నలుగురు మన కళను చూసి ఆనందిస్తే అదే మనకు పెద్ద సంపదగా భావించాలి. సమయమొచ్చినపుడు ఆ కళామతల్లి మనల్ని తప్పకుండ ఆదుకొంటుందని ధీమాగా" చేప్పెవారు.     

నాన్నగారి నమ్మకం వమ్ము కాకుండ,ఆ కళామతల్లి కూడా తన బిడ్డని అంటే నాన్నగారిని, కన్న తల్లిలాగే ఎన్నోసార్లు ఆదుకొన్నది. మా అక్క పెళ్ళి కుదిరి,డబ్బులెలా సర్దాలని మధనపడుతున్న సమయంలో,నాన్నగారి బొమ్మలు అమ్ముడు పోయాయని చెప్పి,ఆర్ట్‌గ్యాలరీ వాళ్ళనుండి చెక్కులు వచ్చాయి. మేము కాలేజి చేరే సందర్భాలలో కూడ అలాగే జరిగింది. డబ్బులకు కొద్దిగా ఇబ్భంది ఏర్పడుతుంది అనె సమయంలో ఏదొక చోటునుండి చెక్కు వచ్చేది. 

 అందుకేనేమో నాన్నకు ఆ కళపైన అంత తీవ్రమైన అభిమానం. ఈ మధ్య అమ్మ నాన్న అమెరికాకు వచ్చినపుడు చాలా ప్రదేశాలు చూపించాల్ని తపన పడేవాణ్ణి. అయితే నాన్నగారు నిద్ర లేచింది మొదలు పెన్ను పేపర్లు తీసుకొని గీయడం మొదలు పెట్టెవాడు. అందువల్ల ఇండియా కెళ్ళె చివరి రోజుల్లో పేపర్లు, పెన్నులు కనబడనీయకుండా దాచేసి బయట ప్రదేశాలు చూపించాను. అయితే ఇండియా కెళ్ళే రోజున కొంతమది మిత్రులు ఏలా వుంది మీ అమెరికా ట్రిప్పు అని అడిగితే, అంతా బాగుంది. అయితే గత కొన్ని రోజులుగ నన్ను బొమ్మలు వేసుకొనే అవకాశంలేకుండ చేశారు అది నన్ను చాలా కలచివేసింది అన్నారు. ఆ కళ తన జీవితంలో అంతగలీనమైపోయింది. రోజులో నాలుగైదు గంటలు బొమ్మలు గీయకపోతే ఆరోజు తన జీవితంలో వృధా అయినట్లు బాధపడుతారు.

గౌరవనీయులైన పెద్దలచే సత్కరింప బడుతున్న నాన్నగారు

మా నాన్నగారు పనిచేసిన స్కూల్లొనే నేను చదువుకున్నాను. ప్రతియేడు సరస్వతీ పూజ సమయంలో నేను,నా ఫెండ్సు బోర్డు క్లీన్ చేసి పెడితే, నాన్నగారు వచ్చి చక్క గా సరస్వతీ దేవి బొమ్మా గీసి అందంగా రంగులు వేసెవారు. ఆ తరువాత పూజ జరిగేది. ఒక్కొకొక్క రోజు ఒక్కొకొక్క క్లాసులో పుజా జరిగేది. ఆ పెయింటింగ్సు చూసి,నాకు తమ్ముడికి కూడ చిత్ర లేఖనం పైన చాలా ఇంట్రెస్టు పెరిగింది. నేను ఆరవ తరగతి చదివే సమయంలో సిద్దిపేటలో కళాభవన్ అనే గవర్నమెంట్ ఆర్ట్ గ్యాలరి వారు ఆర్ట్ కాంపిటిషన్ నిర్వహించారు. ఆ పోటి కొరకు నేను ఒక గణపతి బొమ్మను గీశాను మరియు చెక్కతో ఒక ఏనుగు ప్రతిమను కూడ చేశాను. నేను చేసిన ప్రతిమకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆ బహుమతిని ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేస్తూన్న శంకర్‌దయాళ్ శర్మ గారి చేతులమీదుగా ఆ బహూమతి అందుకొన్నాను.

 నాన్నగారు చిత్రలేఖనంతో పాటు,టీచరు వృత్తిలోకూడా చాలా ఎదిగారు. M.A చదివి D.E వరకు ఎదిగారు. టీచరుగా సొషియల్,ఇంగ్లీషు,మ్యాథమ్యటిక్స్ బోధించేవారు. అయితే ఎదైన క్లాసుకు టీచరు రాకపోతే నాన్నగారు వాలంటీరుగ వెళ్ళి,స్టూడెంట్స్‌తో సరదాగ మాట్లాడి,బోర్డుపైన ఒక బొమ్మ గీసి దాన్ని గీయమని చెప్పేవారు. దానివల్ల వారికి ఏకాగ్రత పెరుగుతుందని మరియు చేతివ్రాత చక్కగా వస్తుందని చెప్పి వారిద్వారా బొమ్మ గీయించేవాడు.    

 సాధరణంగా బాతిక్ బొమ్మ గీయడానికి దాదాపు నెల నుండి రెండు నెలలు పడుతుంది. అదే మాములు పెయింటింగు వార్మ్ రోజుల్లో పూర్తిచేయవచ్చు. అంత కష్టపడి బాతిక్ బొమ్మలు గీచినా వాటి ధర మామూలు పెయింటింగ్ ధర కన్నా చాలా తక్కువ. బాతిక్ బొమ్మలకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. అయితే బాతిక్ చాలా పురాతన భారతీయ కళ. అది మన జాతి సంపద. ఆ కళను ఆదరించకపోతే మరుగున పడి పోయే ప్రమాదం ఎక్కువ. అందువలన ఆ కళను బ్రతికించాలనే భావంతో లాభం తక్కువైనా ఆ కళకె ఎక్కువ సేవ చేశారు.

 

చాల మందికి ఉచితంగా ఈ కళను నేర్పించారు. అలాగే guest lecturer గా హైదరబాదులోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజిలోను మరియు చాలా ఆర్కిటెక్చర్ కాలేజిలకు వెళ్ళి బాతిక్ గురించి బోధించెవారు.

ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్రపతి గారిచే సత్కారం 

ఉత్తమ విలువలతో టీచరుగా పనిచేస్తూ,extracurricular activity గా నాన్న బాతిక్ కళకు చేసిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి ఉత్తమ ఉపాధ్యయుడుగా సత్కరించారు. అ సమయంలో శంకరదయాళ్ శర్మగారు రాష్ట్రపతిగా పనిచేసెవారు. వారి చేతులమీదుగా Best Teacher Award అందుకొన్నారు. నేను,నాన్నగారు శర్మగారి ద్వారా సత్కరింపబడడం యాధృచ్చికమైనా ఎందుకో మాకు సంతోషమేసింది.   

పిల్లలైన మాకు, క్రమశిక్షణ కష్టపడేగుణం, మాటలద్వారా కాకుండ చేతల ద్వారా తెలియజేసేవారు. ఊదహారణకి ఉదయం లేస్తూనే దాదాపు గంట గంటన్నర ఇంటి వెనక వున్న స్థలంలో గార్డనింగ్ చేసేవారు. అది చూసి మేము పిల్లలందరం వెళ్ళి, మట్టి తీయడం, ఎరువులు వేయడం, మొక్కలకి నీరు పెట్టడం చేసెవాళ్ళం. మొదటల్లో అదంతా పిచ్చి పనిగా తోచేది. అయితే కొంత కాలం తరువాత అ ప్రాంతమంతా పచ్చగా మొక్కలు పెరిగి, రంగు రంగుల పూవులను,కూరగాయాలను అందించినపుడు మాకెంతో సంబరంగా వుండేది. ఆ విధముగా మాతో పాటే పెరిగిన మొక్కలు పెద్ద చెట్లయి జామా, ఉసిరి, మేడి పండ్లను, కొబ్బరిబొండాల నిచ్చినపుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేము. స్కూలునుండి రావడమె ఆ చెట్లెక్కి ఏ కాయ పండిందని చూసేవాళ్ళం. ముఖ్యంగా చిలక కొరికిన జామకాయల కోసం వెతికే వాళ్ళం. మరియు ప్రతి కాయకు ఇది అన్నది,తమ్ముడిది, అక్కది అని పేర్లు పెట్టేవాళ్ళం. అవన్నీ కూడ మధురమైన తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.      

మేము హైస్కూలు చదివే రోజుల్లో మమ్మలిని ఉదయం నాలుగు గంటలకు నిద్రలేపి చదువుకోమని చెప్పి నాన్నగారు పడుకొనేవారు. నాన్నగారు పడుకొగానె మేము పడుకొనేవాళ్ళము. అందువలన ఒకరోజు "మీ మేలు గురించి, మీ చక్కని భవిషత్తు ఇవ్వాలని తలచి,ప్రతి రోజు నిద్ర లేపుతున్నాను. అయితే మీరు మరల పడుకొంటున్నారు. కావున రేపటి నుండి నేను మిమ్మలిని నిద్ర లేపను. పిల్లలు ప్రేమతో,శ్రద్ధతో చదువుకోవాలి గాని భయంతో చదువకూడదని" చెప్పి ఆ రోజునుండి నిద్రలేపడం మానేశారు. దాంతో మాకే ఒక విధమైన భయం కలిగి చక్కగ చదువుకున్నాము. దాని ఫలితంగా ఈ రోజు మా పెద్దన్న ఆర్కిటెక్టుగాను, చిన్నన్న లాయరుగాను, తమ్ముడు animator గాను నేను సాప్టువేరు ఇంజీనీరు గాను స్థిరపడ్డాము.

నాన్నగారి 70వ జన్మదినమున జరిగిన హోమ పూజ సందర్భంగా నాన్న అమ్మ చుట్టుచేరిన కుటుంబ సభ్యులు. రాఘవ(మనవడు), ప్రకాష్(కొడుకు), దైవిక్(మనవడు), రాజు(నేను), వెంకట్(కొడుకు) శ్రీనివాస్ (కొడుకు), రోహన్ (మనవడు),వేంకటేశం(అల్లుడుగారు), బాలయ్య , లక్ష్మీ (నాన్న అమ్మ), విజయ(కుమార్తె), లలిత, కవిత, జ్యోతి, మమత (కోడళ్ళు), అనన్యు(మనవడు), మనవరాళ్ళు; అన్విత, రాఘవి, సబిత, రోషిని, సౌమ్య...

నా మ్యారెజ్ విషయంలో కూడ నాన్నగారు చాలా ప్రాక్టిగల్ వ్యవహారించారు. పెళ్ళికి ముందు ప్రతి ఒక్కరు ఏ రాకుమారొ వస్తుందని కలలు కనడం సహజమే. అందువలన కొందరు అబ్బాయిలు ఎన్ని సంబంధాలు చూసిన ఇంకా అందమైన అమ్మాయి వస్తూందేమోనని ఒక నిర్ణయానికి రాకుండ సంబంధాలు చూస్తూనేవుంటారు. నా విషయంలో అలా జరగ కూడదని భావించి నాన్నగారు నాకు వచ్చిన అలయన్సులలో ఐదు సెలక్ట్ చేసి, "వీటిలో ఎదొక సంబంధం మనం ఖాయం చేసుకోవాలి", అని చెప్పి PhoTos ను reverse order లో చూపించారు. అంటే మొదట ఐదవ అలయన్సు, తరువాత నాల్గవ అలయన్సు,అలా చూపిస్తూ చివరికి మొదటి అలయన్సు ఫొటొను లేదా best photoను చూపించారు. ఆ విధంగా కలకు జీవితానికి తేడా ఏమిటొ తెలియజేశారు.                 

ఇక్కడ నాన్నగారి ఏకాగ్రత గురించి కొంత చెప్పాలి. నాన్నగారు స్కూలు నుంచి వచ్చి కొంత సేపు రిలాక్సైన తరువాత,వీధి వైపున్న ముందర గదిలో కూర్చొని డ్రాయింగు వేయడం మొదలెట్టేవారు. ఒకసారి డ్రాయింగు వేయడానికి ఉపక్రమించిన తరువాత నాన్న ఈ లోకాన్ని మరచిపోతాడనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. అమ్మగాని, మేము గాని, చాయ్ అక్కడ పెట్టి త్రాగమంటే, సరే అనేవారు. కాని గంట రెండుగంటలైనా తాకేవారు కాదు. అలాగే వీధీలో వేళ్ళే ఆవులు, మేకలు ఒక్కొకొక్క సారి నాన్నగారి ముందే హాల్లోనుండి వంటగది వరకు వచ్చేవి. అయితే ఇవ్వేవి నాన్నగారి ఏకాగ్రతకు భంగం కలిగించేవి కావు. అవిధంగా  గీచె బొమ్మలోకి లీనమై పోతారు. అందుకే ఆ బొమ్మలకి జీవకళ వస్తూందేమో.  

మా నాన్నగారి ద్వారా ముఖ్యంగా నేర్చుకొన్నది ఏ విషయంలోనైన తొందరపడకపోవడం. ఒక్కోకోక్క సారి నాన్నగారికి తెలిసిన బంధువులు లేదా మిత్రులు నాన్న గురించి చెడ్డగా వేరేవారితో మాట్లాడినట్లు తెలిసేది. ఆ సమయంలో మాకందరికి అలా చెప్పిన వారినెళ్ళి తన్నాలనిపించేది. అయితే నాన్నగారి ఆలోచన మరో విధంగా వుండేది. ఒకరు మన గురించి చెడుగా చెప్పారంటే మన లోపమైనుండాలి,లేదా అవతలివారికి మనలిని అర్థంచేసుకొనే శక్తైన లేకుండా వుండాలి. కావున మనలో తప్పులుంటే సరిద్ధిదుకొందాము లేదా వారిలో అవగహన లోపముంటే వారు మనలిని అర్థం చేసుకొనెట్లు మరింత ప్రేమిద్దామని,వారితో మరింతా సన్నిహితంగా మెలిగి,అలా తప్పులు మాట్లడిన వారి పరివర్తనలో తెచ్చేవారు.

 

ఈ మంచిగుణం మా అందరి మనసులో తెలియకుండానె బాగా నాటుకొంది. మరియు  ఈ గుణం నాకు చాలా సందర్భాలలో ఉపయోగపడింది. నేను ఇంతవరకు పనిచేసిన ఆఫీసుల్లో కొంతమంది మేనేజర్లు చాలా కఠినంగా వుండేవారు. టీములో పదిమందివుంటే తొమ్మిదిమందికి మేనేజరుతో ఏదొక గొడవవుండేది. అయితే నేను మాత్రం చాలా ప్రశాంతంగా పనిచేసుకొని వెళ్ళేవాడిని. అలాగే చిన్నప్పుడు మేము గొడవపడి ఇంటికొస్తే నాన్నగారు మమ్మలినే తప్పుపట్టేవారు. అవతలివారు తప్పుచేసి వుండవచ్చు. మీరు దాన్ని ignore చేసి వుంటే సమస్య ఇంత అయ్యేది కాదు అనేవారు. ఇదికూడ మామనసులో బాగ నాటుకు పోయింది. చాలా సమయాలలో వీలైనంతవరకు  గొడవ రాకుండ ignore చేయడం అలవడింది. ఇంట్లో అమ్మనాన్న క్రమశిక్షణ ప్రంగా అరచినా బయట లేదా ఇతరులతో మా గురించి చెప్పేటప్పుడు ఇద్దరు గొప్పగా చేప్పేవారు.     

నేను(రాజు), నాన్నగారు, అమ్మగారు, నా సతీమణి, నా కుమారుడు

అలాగే నేను మొదటి తరగతి చదివేటప్పుడు,ఒకరోజు  భగవధ్గీత శ్లోకాలు కొన్ని చూడకూండ చెప్పాను. అది విని నాన్నగారు పొందిన ఆనందమును మాటల్లో వర్ణించలేము. ఆ రోజున ఈ రాజు ఎరోజు నాన్నను బాధపెట్టకుండా,జీవితంలో మరెన్నో సాధించి నాన్నకెపుడు అటువంటి ఆనందాన్ని అందించాలని అనుకొన్నాను. 

          

ఇలా ఎన్నో విధములుగా మమ్మలని తీర్చిద్దిన నాన్నగురించి ఎంత చెప్పినా తరగదు. ఈ అవకాశమిచ్చిన "సుజనరంజని" ధన్యవాదములు తెలుపుతున్నాను. నాన్నగారి గురించి మరింత తెలుసుకోవాలనుకున్న వారు ఈ క్రింది లింకులో చదవచ్చు.

www.yasalaartgallery.com

Acrylic and Batik paintings from veteran Indian artist - Yasala Balaiah

పేరు                             : రాజు

చదువు                         : ఇంజీనీరింగు

వృత్తి                              : సాప్టువేరు ఇంజీనీరు

ప్రవృత్తి                           : పెయింటింగు, ఆర్ట్

నివాసం                         : సాన్‌హోసె, కాలిఫోర్నియా   

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech