పేగుబంధం తెగి భూమ్మీద పడినప్పుడు

బతకాలన్న ఆశతో 'కేర్ 'మని అరిచిన నాకు

మొదటి అడుగు తడబడి పడిలేచి

ముందుకెళ్ళాలనే ఆశతో

వడిగా మరో రెండడుగులు వేసిన నాకు

 

ఎందుకో నాకు పక్కనున్న వాడిపై

ఎప్పుడూ విరిగిపోని ఆకాశమంత నమ్మకం

సఖుడని, హితుడని, సన్నిహితుడని

మన మిత్రుడని, శ్రేయోభిలాషని

కరిగిపోని, వీగిపోని అపార విశ్వాసం

 

నా మనసెందుకో పదే పదే చెబుతోంది

వాడొట్టి అమాయకుడని

అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాడని

కళ్ళకు గంతలు కట్టబడి

గమ్యం తెలియక గాడిచుట్టూ తిరుగుచున్నాడని

 

త్వరలో వాడు పట్టిన ఏ.కే. తుపాకులను వదిలేస్తాడని

ఆ హస్తాలతోనే పూలమాలలు పట్టుకొస్తాడని

వాడి మనసుకు పట్టిన మతం చిలుము వదిలి

విశ్వశాంతి క్రాంతిని ఆశిస్తాడని, ఆహ్వానిస్తాడని

నా మనసెందుకో అదేపనిగా విశ్వసిస్తోంది

 

నాకెందుకో అదేపపనిగా మంచి తలపులొస్తున్నాయ్

వాడు కుబుసంలా పట్టిన సంకుచితత్వాన్ని విడిచివేస్తాడని

భీతాహం సృష్టించే బాంబులను బావిలో పడేస్తాడని

అర్థంలేని ఆవేశాల్ని నిరశిస్తాడని, అరాచకత్వానికి తిలోదకాలిస్తాడని

మనసు విప్పి మాట్లాడుతాడని, వసుధైక కుటుంబాన్ని ఆచరిద్దాం అంటాడని

 

ఎందుకంటే వాడూ నాలాగే

పురుడు పోసుకొని గర్భంలో నవమాసాలూ వేచి ఉన్నవాడే

ఒళ్ళో పడుకొని తల్లిముఖారవిందాన్ని చూస్తూ

చనుబాలు చప్పరించినవాడే

బోసినవ్వులతో కేరింతంలు కొడుతూ ఇల్లంతా పాకినవాడే

 

ఈనాడు నా గుండెందుకో అదే పనిగా చెబుతోంది

వాడు తప్పక నా ఇంటి తలుపు తడతాడని

పాత జీవితాన్ని పాతరేసి, కొత్త దుస్తులు ధరిస్తాడని

ఉత్సాహంతో నూతన శకానికి సోపానం వేద్దాం అంటాడని

చేతిలో చేయి కలిపి సరికొత్త యుగాదికి నాంది పలుకుతాడని

ఈవేళ నాకెందుకో అన్నీ శుభశకునాలే కానవస్తున్నాయ్


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం