కూరగాయలు కొనుక్కుని ఇంటికి తిరిగి వెళ్తున్న శివరావు మాస్టారికి సంచి బరువుగా ఏంలేదు. డబ్బులు చాలానే ఖర్చయ్యాయి గానీ సంచీలో కూరగాయలాట్టే లేవు మరి. జీవితమే బరువుగా తోచింది.

అమ్ముకునే వాళ్ళూ లబలబ లాడుతూ కొనుక్కునేవాళ్ళూ విలవిల లాడుతూ గోలపెడుతున్న రోజులివి. ఎవరు సుఖపడుతున్నట్టూ? ఎందుకిలా మారిపోయింది కాలం? మార్చినవాళ్ళెవరు?

తన ప్రశ్నలకి తనకే నవ్వొచ్చింది. ఆమార్చిన వాళ్ళల్లో తానుమాత్రం లేడా? తనపిల్లలు లేరా?

హాయిగా ఉన్న ఊళ్ళో.. సొంత ఊళ్ళో సొంత ఇంట్లో ఉండక..పట్నం అంటూ ఈ పట్నానికీ..అద్దె కొంపలోకి వొచ్చిపడ్డాడుగా. ఎందుకూ? పిల్లల పోరు పడలేక. ఉన్న ఇద్దరు కొడుకులూ స్వదేశంలో ఉద్యోగాలు చేసుకోకుండా కోరికల గుర్రాలెక్కి అమెరికా అమెరికా అంటూ పరుగులు తీశారు. అప్పుడప్పుడు వాళ్ళు స్వదేశం వొచ్చినప్పుడు పల్లెటూరు రావడానికి ఇష్టపడక .. అక్కడికి రావడానికి మాకు సమయం సరిపోదు పైగా మా పిల్లలకి ఇబ్బంది అవుతుమ్ది ఉన్న పది రోజులూ పట్నంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడే ఉండమని ఆజ్ఞలు జారీ చేశారు. తప్పలేదుమరి పిల్లల కోసం. తనలాంటి తల్లితండ్రులింకెంతమందో ఈ పట్నాల్లో.

అటు సేద్యం చేసుకునేవాళ్ళూ ట్రాక్టర్లు వొచ్చాక..పట్నాల్లో కూలీపన్లకి పడుతూ లేస్తూ ఎండమావుల వెంట పడినట్టే నలిగిపోతున్నారు. అడకత్తెర బతుకుల్లో.
ట్రాక్టర్లూ..కాంట్రాక్టర్లూ.. పెద్ద పెద్ద కంపెనీవాళ్ళూ..బడుగుజీవి బ్రతుకుల జీవన విధానారతో ఆటలాడుతూ విదేశాలకి తమ వ్యాపార సంబంధాలు విస్తరించుకుంటున్న వ్యాపారవేత్తలూ ఇదేగానేటి ప్రపంచం సగటు మనిషి స్వతంత్ర్యంగా పనిచేసుకుంటూ నిలబడగలిగే స్థలం..కనుమరుగయ్యే పరిస్థితులు సృష్టిస్తున్న వ్యక్తుల కన్నుల్లో చెమరింపు కనపడేది? కోట్లు లెక్కించుకుంటూ నిద్రలేక లెండిపోతున్నాయేమోవారికి!

ఏవిటో..? తనపిచ్చి గానీ..ఈ ప్రపంచీకరణలో ..కుటుంబాలకి కుటుంబాలే జీవకళ కోల్పోయి వెలవెల పోవట్లేదూ? ఉమ్మడి కుటుంబాల సంగతి దేవుడెరుగు..భార్యాభర్తలు కలిసి ఒకే ఊళ్ళో ఉండడమే గొప్ప విషయం ఈ ప్రపంచీకరణ రోజుల్లో.

"ఏదో పరధ్యానంలో నడుస్తున్నట్టున్నారే మాస్టారు.." అన్న పలకరింపుతో పక్కకి తిరిగి చూశాడు. తమ ఇంటి వెనకవీధిలో ఉండే రామకృష్ణయ్య. ఆయనా తనలాంటి బాధితుడే.
"పిల్లల గురించిన ఆలోచన్లా?" పక్కనే మెల్లిగా అడిగాడు.
నీరసంగా నవ్వాడు శివరావు.
"అసలు మనపిల్లలు అమెరికా పోతామన్నప్పుడే వొద్దని చెప్పి ఉండాల్సింది కదా? తెలివి తక్కువ పనిచేశాం. పోవద్దని వాళ్ళని ఒప్పించలేని మనచేతకాని తనం ఇప్పుడు మనబతుకుల్నే కాదు..అక్కడ వాళ్ళ బతుకుల్ని మనశ్శాంతి, స్తిమితం లేకుండా కుంగదీసి శాసిస్తోంది. ఏవంటారు? ఔనాకాదా?
"మీరన్నమాట ఒకవిధంగా నిజమే గానీ,..పూర్తిగా ఏకీభవించలేను..ఎందుకంటారా.. ఒప్పుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు చేజేతులారా మనమే పాడుచేస్తున్నామేమో అన్న బాథ ఒక వైపు..డబ్బు బాగా సంపాదించి ఉద్దరిస్తారన్న ఆశ మరోవైపు మనచేత సరేననిపిస్తాయి కదా! దిగితే గాని లోతు తెలియదు మరి. పర్యవసానం...జీవితానికి విలువ లేకుండా పోయింది.. బ్రతుకు పోరాటం మాత్రం నిరాశా నిట్టూర్పులతో భయంభయంగా.. మనశ్శాంతికి దూరమై సాగిస్తున్నాం.
"ఔను.. బాగా చెప్పారు. ఏరోజు కారోజు ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో అన్న భయంతో వాళ్ళూ.. ధనం ఒక్కటేనా కావల్సింది..పిల్లలు దగ్గిరున్నారన్న నిశ్చింత..ధైర్యం అక్కర్లేదా అన్న దిగులుతో మనలాంటి వాళ్ళు రోజులు గడుపుకొస్తున్నాం. కాలమే సమాధానం చెప్పాలి". భవిష్యత్తు మీద భారం వేసి చిన్నగా నిట్టూర్చాడు రామకృష్ణ.

"ఇంకేం చెప్తుందండీ కాలం? ప్రపంచీకరణలో సమిధగా మారమని అంటోంది." శివరావు స్వరంలోని మార్పు గమనించి ఆయనవైపు చూడబోయిన రామకృష్ణ ఎందుకో ఆ పని చెయ్యలేదు. తలపంకించి ఊరుకున్నాడు.
"వెళ్ళొస్తానండీ" అంటూ శివరావు తనసందు మలుపు తిరిగాడు.
ఎండలో నడిచి రావడం వల్ల ఇంట్లో అడుగుపెడుతూనే ఫ్యాన్ వేసుకోవాలనిపించింది. కరెంటుబిల్లు కళ్ళముందు కదిలి వెయ్యకుండా కుర్చీలో కూలబడ్డాడు. రాత్రిళ్ళు ఎలాగో ఫ్యాన్ వెయ్యకపోతే గాలి ఉండదు. దోమలూ పీకేస్తాయి. పగలుకూడా ఎందుకు బిల్లు పెంచుకోవడం?
అసలే ఫోన్ చేసినప్పుడల్లా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉంటారు పిల్లలు.. వాళ్ళవి అక్కడ తుమ్మితే ఊడే ముక్కు ఉద్యోగాలనీ.. చాలా జాగ్రత్తగా డబ్బుఖర్చు పెట్టమనీ హెచ్చరిస్తూనే ఉంటారు. ఒక వయసొచ్చాక కడుపున పుట్టిన పిల్లలైనా పుసుక్కున మాటేదైనా అన్నారంటే తలకొట్టేసినట్టే అనిపిస్తుంది కదా! ఓరోజు పెద్దకొడుకు ఫోన్లో అరిచాడు కరిచినట్టే"మీరు అనారోగ్యాలు తెచ్చుకుంటే
రమ్మన్నప్పుడు రావడానికి మాకు కుదరదు రాలేము. ఇక్కడ ఈ దేశంలో సంగతి తెలుసా? ఆరోగ్యం లేకపోతే అమెరికాలో బతుకేలేదు. రోజూ వాకింగ్ కి వెళ్ళండీ"
చెప్పడానికి బాగానే ఉంది..వినడానికీ బాగనే ఉంది నాయినా..
ఈ ట్రాఫిక్ ని తప్పించుకుంటూ వెళ్ళి కూరలూ సరుకులూ తెచ్చుకునే టప్పటికి అమ్మయ్య ఈ రోజుకి ఏ యాక్సిడెంట్ అవకుండా ప్రాణం దక్కిందని అనుకోవల్సి వస్తోంది. ఇంక వాకింగ్ కూడానా? ఈ వాహనాలూ ఆ వాహనాలూ తప్పించుకుంటూ
ఎక్కడో ఉన్న పార్కుకో మైదానానికో వెళ్ళేటప్పటికి తన తాత ముత్తాతలు దిగిరావల్సిందే. వాహనాల రద్దీ మొదలవక ముందే తెల్లవారుఝామున వెళ్తే దొంగలభయం. పక్కింటావిడ గొలుసు
తెంపుకుపోయారు. డబ్బూ నగలూ ఏవీ దొరక్కపోతే తోసిపడేసి పారిపోతారు. అదృష్టం బావుంటె దెబ్బలతో గాయాలతో బయటపడి ప్రాణం దక్కుతుంది. తెల్లవారుఝామున దొంగలు
తెల్లారాక వాహనాలు..ఈ రెండిటి మధ్యా బతుకు తెల్లారిపోవల్సిందే..
గ్లాసుతో మంచినీళ్ళు భర్తకి అందించి కూరగాయాల సంచీ చేతులోకి తీసుకుని చూసింది సత్యవతి. అప్రయత్నంగా నిట్టూర్చింది. ధరలు మండిపోతున్న విషయం ఆవిడకీ తెలుసుగా!!
ఆందుకె ఆ నిట్టుర్పు. సొంత ఊరు పల్లెటూరైనా..పల్లెటూరు కాబట్టేలే ప్రశాంతంగా గడిచేవి రోజులు. పెరట్లో ఎన్ని కూరలు కాసేవి. ఇరుగు పొరుగు వాళ్ళక్కూడా ఇచ్చేది కదాతను.అక్కడ తిన్నస్వేఛ్చ ఇక్కడ లేదు. పళ్ళు కూరలూ ఛూసుకుని
చూసుకు చూసుకుని తినాలి పట్నంలో.. ఆ గడచిన కాలమే మెరుగు..మళ్ళీ ఆ రోజులొస్తే ఎంత బావుండును. విద్య నేర్పే గురువుకి పిల్లలెంత మర్యాదా మన్ననా ఇచ్చేవారు.. ఆ పిల్లల్ని భావి భారత పౌరులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నట్టుగా శ్రమించేవారు, ప్రాణం పెట్టేవారు ఆ గురువులు కూడా. కలమహిమ అనుకోవలో ఏమో గానీ..పట్నాల్లోఈ రోజుల్లో విభిన్నంగానే
కనిపిస్తోంది కదా విద్యావ్యవస్థ. సంస్కారాన్ని తుడిచిపెట్టేసి..మానవత్వాన్ని మట్టుపెట్టేసి..ఒక్క విద్యకే ప్రాధాన్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారే ఈ పిల్లలు గురువులు కూడా.సంస్కారం
లేకపోయినా చదువు మాత్రం ఉండి లాభం ఏమిటి?
ఉండబట్టలేక ఆ మాటే భర్తని అడిగింది.
నవ్వాడు శివరావు " అమాయకురాల్లా ఉన్నావు. సంస్కారం మానవత్వం ఆ పదాలే మరుగున పడిపోయే రోజులొచ్చినప్పుడు వాటి అర్ధం తెల్సిన వాళ్ల
సంఖ్య తగ్గిపోదూ? ఇప్పుడంతా కంప్యూటర్..ఇంటర్నెట్..వెబ్ సైట్ ప్రపంచీకరణ..ఈ పదాలకే చోటుంది. తల్లితండ్రులూ పిల్లలూ వీరిద్దరి గురి విదేశాలవైపే ఉంది. నువ్వనుకునే
మాటల అర్ధాలు పిల్లలకి తెలియజెప్పే ఆసక్తి తల్లిదండ్రులకి లేదు..తెలుసుకునేంత తీరుబడి, సమయం పిల్లలకి లేదు.
"మనపిల్లల్ని విదేశం వెళ్ళమని మనం అనలేదు. వెళ్తారని అనుకోనూలేదు. నిజమే మనకి దాన్ని గురించిన అవగాహన లేదు..
అందుకే వెళ్ళద్దని అనలేదు. వెళ్ళమని మనంతట మనం కోరలేదు. స్నేహితుల ద్వారా ఒకరినించి ఒకరు వివరాలు సేకరించుకుని మేము వెళ్తామంటూ వాళ్ళ
ప్రయత్నాలు వాళ్ళు చేసుకుని నిర్ణయం మనకి చెప్పేశారు. మనం నిమిత్త మాత్రులమయ్యాం.
చిన్నగా తల ఊపి మౌనంగా ఉండి పోయింది సత్యవతి.

* * *
సింగన్నకి గుండె రగిలిపోతోంది తన బతుకు తల్చుకుని ఆ పేటలో ఇళ్ళూ పడుతున్నాయని తెలియగానే అక్కడ కొట్టుపెట్టుకున్నాడు.
చిన్నవస్తువు మొదలు బియ్యం వరకూ అన్ని నిత్యావసర వస్తువులూ అమ్మేవాడు. పేటలో వాళ్ళంతా ఏం కొనుక్కోవాలన్నా అతని కొట్టుకే వొచ్చేవారు.
అందరితోను మంచిగా ఉండేవాడు. లాభాలెక్కువ తీసుకుని మోసాలు చేసేవాడు కాదు. అందరికీ ఆత్మీయుడయ్యాడు. ఒక దుకాణదారుడిలా కాకుండా
ప్రతి ఒక్కరికీ అన్నయ్యో తమ్ముడో అనిపించుకునేలా మసులుకునే వాడు. తిండికి లోటు లేకుండా ఇల్లుగడిచిపోయేది. పిల్లలిద్దర్నీ బడికి పంపేవాడు.
చూస్తుండగానే..ఓ పెద్ద కంపెనో వాళ్ళ హైటెక్ సూపర్ మార్కెట్ వెలసింది ఎదురుగా. బేరాలు పోయాయి. తన పొట్ట కొట్టడానికే వెలసిందని కుంగిపోయాడు.
వాళ్ళు చేసుకునే పెట్రోలు వ్యాపారం.. సెల్ ఫోన్ల వ్యాపారం చాలకనా తనలాంటివాళ్ళ పొట్టలు కొట్టడం? మనిషన్నాక కాస్తో కూస్తో న్యాయం ఉండాలికదా?
అవి కొంటే ఇది ఉచితం, ఇవి కొంటే అది ఉచితం అంటూ ఆకర్షణలు గుప్పించేస్తూ ఉచితం అని చెప్పేవాటి ధర కూడా అసలు సరుకులో తెలివిగా పొందుపరుస్తూ
విస్తరించుకుపోయిన వ్యాపారంతో తనలాంటి వాళ్ళ బతుకులు కుంచించుకుపోవూ? కొట్టుమూతపడింది. ఇల్లు గడిచేదెలా? చేసిన అప్పులు తీరేదెలా?ఇంక పిల్లల చదువుమాటే లేదు కదా? బడిమానిపించేశాడు ఇద్దరినీ. భార్యనీ
కూతుర్నీ ఇళ్ళల్లో పాచిపన్లకి పొమ్మన్నాడు. ఒక వడ్రంగి దగ్గర..సుత్తులూ మేకులూ రంపాలూ అందిస్తూ టీలూ నీళ్ళూ తెచ్చిపెట్టే చేతికింద పని కుర్రాడిలా కొడుకుని పెట్టేశాడు. వాడికి
చదువుమీద కాస్తో కూస్తో ఆసక్తి ఉంది. ఏదో నాలుగక్షరమ్ముక్కలు అబ్బుతున్నాయి. అలాంటి వాడికి ఇలాంటి పరిస్థితి వొచ్చేసరికి తట్టుకోలేక పోయిందా
లేత మనసు. దాంతో తండ్రి మీద కోపం పెంచుకున్నాడు. చదువెలాగో పోయింది. డబ్బు బాగా సంపాయించేద్దామన్న కోరిక అడ్డుదారులు తొక్కేలా
చేసింది. చెడు అలవాట్లకి బానిసనీ చేసింది ఆ చిన్న వయసులోనే. కొడుకుని బడి మాన్పించి తానెంత పెద్ద తప్పు చేశాడో అర్ధమైంది సింగన్నకి.
ఆరోజు నాగయ్య దగ్గరకి పరిగెత్తాడు.
"నాగయ్య మావా..నేను చెప్పిన సంగతేంచేశావు? నీకు తెల్సిన ఆ దుబాయ్ ఏజెంటుతో నా గురించి చెప్పావా? అక్కడికి పోయి బాగా డబ్బు సంపాయిస్తాను"
"ఇంక నువ్వా ఆలోచన మానుకొడం మంచిది సింగన్నా" "అలా అనకు మావా.. బతుకు తెరువు పోగొట్టుకుని నష్టాల్లో అప్పుల్లో ఉన్నవాడిని.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాయించుకోవాలని ఆశపడటంలో తప్పుందా?
"తప్పే సింగన్నా..ఇక్కడ చిన్నదెబ్బకే తట్టుకోలేక అల్లాడుతున్న వాడివి... అక్కడ దేశం కాని దేశంలో పెద్ద పెద్ద దెబ్బలు తట్టుకోగలవా?
"ఏమిటి మావా.నువ్వనేది? అర్ధం కాలేదు సింగన్నకి. "ఔనురా..ఆ మధ్య అక్కడికెళ్ళినవాళ్ళు గగ్గోలు పెడుతున్నారిప్పుడు. మమ్మల్ని మా దేశం పంపించెయ్యమంటూ మొత్తుకుంటున్నారు. నానా కష్టాలూ పడుతున్నారట.
అలా జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను"
"ఎందుకు జరగవూ? ఏవైనా జరుగుతుంటాయి. డబ్బురంథిలో ముందూ వెనకా చుసుకోకుండా పడిపోయేవాళ్ళకి. ఎలాంటి కష్టం వొచ్చినా నీదేశంలో నువ్వంటే కనీసం నీ ఊపిరి
నువ్వు తీసుకొవచ్చు. లేకపోతే అది కూడా బిగపట్టుకుని ఆసరాకోసం ఆధారం కోసం అల్లాడిపోతావు. అందుకే కదా అన్నారు దూరపు కొండలు నున్నగా ఉంటాయని."
"ఆ పాటలోవాళ్ళంతా నా కొట్లో కొంటున్న రోజుల్లో వాళ్ళకీ నాకూ మధ్య వ్యాపార బంధం కదు మావా...ఒకరకమైన ఆత్మీయత ఉండేది. ఇప్పుడో? సంపాదన ఒక్కాటె కాదు ఆపేక్షకీ మంచి మాటకీ కూడా దూరమయ్యాను.
సింగన్న కళ్ళు చెమ్మగిల్లాయి. జాలిగా చూశాడు నాగయ్య.
మాకూ కష్టం వొచ్చిపడింది సింగన్నా. ఓ పెద్ద కంపెనీ వాళ్ళు విదేశంతో చేతులు కలిపి పరిశ్రమేదో పెడుతున్నారంట. మా ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ స్థలంలో కడతారట.
"ఎంతన్యాయం మావా! వాళ్ళ వ్యాపారాలు పెంచుకుంటూ కోట్లకి కోట్లు పోగేసుకుంటూ మనలాంటి వాళ్ళకి నిలవనీడ కూడా లేకుండా చేద్దామనా?
"ఇదంతా ప్రపంచీకరణ మాయట. మొన్న ఒకాయన చెప్పాడు. ఇదివరకు పండగలకి అయ్యవార్లని ఇంటికి పిలిచి పూజలు జరిపించుకునే వారెంతోమంది.
ఇప్పుడు కేసెట్లు పెట్తి ఎవరికి వాళ్ళు పూజ చేసేసుకుంటున్నారు...ఆవృత్తిలో పాతుకుపోయిన వాళ్ళు ఆదాయం తగ్గిపోయి దిక్కులు చూడాల్సిందేగా? ఈ ప్రపంచీకరణ కాదు గానీ అన్నితి మీదాపడుతోంది దెబ్బ. అయ్యవార్లు దొరకని చోటకేసెట్లు కావాలి.
నిజమే. కానీ అలాగని అందరూ కూడా పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు ఉంటే ఎలా? నీకింకోవిషయం తెల్సా?
ఒక్కక్షణం ఆగాడు నాగయ్య.
ఏం చెప్పబోతున్నాడా అని కుతూహలంగా చూశాడు సింగన్న.
మా బావమరిది కారు డ్రైవర్ గా ఒకళ్ళింట్లో పనిచేస్తున్నాడు కదా...వాళ్ళ పిల్లాడికి పాపం అంతుబట్టని జబ్బేదో చేస్తే అమెరికా నుంచి వచ్చిన ఓ డాక్టర్ ఆపరేషన్ చేసి పోయే ప్రాణాన్ని నిలబెట్టాడు.
అక్కడ నుంచి మనదేశానికి డాక్టర్లు రావడం వైద్యం చెయ్యడం ఇది కూడా ప్రపంచీకరణే అంటాడు మా బావమరిది.
అయితే ఇదేదో తిరకాసుగానే ఉంది మావా.. నా మట్టి బుర్రకి అంతుబట్టదు” “ఏవుందీ..ఒక్కటే మనం కొరుకుంటాం..బతుకులు బాగుచెయ్యాలిగానీ బతుకులు కూలదొయ్యడం..పొట్టలుకొట్టడాం న్యాయం కాదని పోరాడతాం. ఔనాకాదా?
సింగన్న జవాబిచ్చేలోపలే పరిగెడుతూ అక్కడికొచ్చి చేరింది అతని కూతురు. “నాన్నా..నాన్నా..మరేమో..అమ్మా పనికి పోతాం చూడు సుందరయ్య గారింటికి వాళ్ళమ్మాయి..
మరేమో..వాళ్ళమ్మాయి..” చెప్తున్న ఆ పిల్ల గొంతు కొంచెం వణికింది.
’ఏవైందే? వాళ్ళమ్మాయికేవైంది? కంగారు పడ్డాడు సింగన్న.
వాళ్లమ్మాయి ఆత్మహత్యచేసుకుంది నాన్నా..”
“అయ్యో ఎంతపని జరిగింది..ఎందుకలా చేసిందో”? పద నాగయ్యమావా అసలేవయ్యిందో ఏమిటో చూసొద్దాం..” అంటూ గబగబా ఆ ఇంతి దారి పట్టాఆడు సింగన్న.
వాళ్ళు వెళ్ళే టప్పటికే పదిమంది పోగయి ఉన్నారక్కడ.
ఆ ఇంటికి ఎదురిల్లే అవడంతో శివరావు మాస్టారు సత్యవతి కూడా ఆ గుంపులో ఉన్నారు. మొత్తానికి సాయంత్రానికి అసలు కారణం...ఆత్మహత్యకి ముల కారణం తెలిసింది ఆ దంపతులకి.
“ఈ ఇంటర్నెట్టూ..వెబ్ సైట్లూ..వీడియో కెమేరాలూ..ఇవన్నీ అభివృద్ధి అనుకోవాలా? అధోగతి అనుకోవాలా? తనని తనే ప్రశ్నించుకుంటున్న భర్త వైపు విచిత్రంగా చూసింది సత్యవతి.
“ఏవిటండీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?”
తలెత్తి అయోమయావస్థలో ఉన్నట్టుగా చూశాడాయన.
ఎదురింటి వాళ్ళమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను. ఆడపిల్లల మానప్రాణాలతో ఆటలాడుకోవడం ఎంత పెద్ద తప్పు!అలాంటిది..ఆ తప్పుని సుమ్దర దృశ్యాల్లా ప్రపంచమంతా
అందరూ చూడాలని వెబ్ సైట్లో పెట్టడం...ఎంత దిగజారిపోయాడు మనిషి.నాగరికత అంటే నైతిక విలువల్ని కోల్పోవడమనుకుంటున్నాడా? ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడటానికి...
బ్లాగుల్లో ఒకరినొకరు పరోక్షంగా తిట్టుకోవడానికి ...చాటింగ్ పేరుతో అపరిచితులు సమస్యల్లో ఇరుక్కోవడానికి .. ఇందుకేగా విజ్ణానం పనికొస్తున్నది
ఇంటర్నెట్ తో ప్రపంచమే మన ఇంట్లో ఉందని మురిసిపోవాలా? మానసిక ఆరోగ్యం కోల్పోతున్నామని విచారపడాలా? అర్ధం కావట్లేదు సత్యవతీ.. ప్రపంచాన్ని చిన్నది చేసె
తాపత్రయంలో మనిషి మనసు కూడా చిన్నదైపోతోందేమో కుంచించుకుపోయి..?” గుండెపట్టినట్టయి .. గొంతుబొంగురుపోయింది శివరావుకి. తన చిన్ననాటిలా విశాలమైన ప్రపంచం కావాలనిపించిందాయనకి.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech