భాగము - 2
అదృష్టము జీవితంలో చాలా సార్లు మనమేదో పొందవలసినది పొందనట్లు, ఏదో కోల్పోయినట్లు బాధపడతాము. మన జీవితమును ఇతరుల జీవితముతో పోల్చుకుని మరీ బాధ పడతాము. అదే విధముగ తిండిలేక, సదుపాయములు లేక బాధ పడేవారిని చూసి మనము కూడా బాధపడతాము. మనకన్న ఉన్నతస్థాయిలో లేక విలాసవంతమైన జీవితమును గడుపుతున్నవారిని చూసినపుడు అసూయపడతాము. మనము కూడా ఏ టాటా బిర్లా వంశములో పుడితే బాగుంటుంది అనుకుంటాము. కొందరు కుంటివారు, కొందరు గుడ్డివారు, మరికొందరు అవిటివారు, కొందరికి తిండిలేకపోతే కొందరు తిండి ఎక్కువై కొట్టుకునేవారు, కొందరు అన్యాయమును చూసి బాధపడేవారయితే కొందరు అన్యాయము చేసి ఆనందించేవారు. ఇలా నిత్యజీవితములో ఏదో ఒక సందర్భములో మనము ఏదో ఒక అనుభవమును ఎదురుచూస్తుంటాము.
ఇన్ని తేడాలు ఎందుకు? అందరూ ఒకేలా ఉండవచ్చు కదా? కానీ ఎందువలన అలా లేరు? అన్న ప్రశ్నలు కూడా సాధారణముగా మనను వేధిస్తుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానము దొరకనపుడు మనని మనము శాంతపరచుకోవడానికి ప్రయత్నిస్తాము. ఆ ప్రయత్నములోనే మనము సాధారణముగా వాడే పదము అదృష్టము.
అదృష్టమన్న పదానికి అర్థము కనిపించనిది అని అర్థము. ఆ కనిపించని దానినే భాగ్యమని కొందరు, దైవమని కొందరు విధి అని మరికొందరు అంటారు. ఈ అదృష్టము లేక భాగ్యమునకు మనకు తెలియని చరిత్ర చాలా ఉంది. అదే అదృష్టము మనకు దృష్టమయితే, అదే భాగ్యము మనకు ముందే కనిపిస్తే.......
ఈ సృష్టి చాలా విచిత్రమైనది. సమస్యలు సమాధానములు కూడా దానిలోనే దాగుని ఉన్నాయి. ఆ విధముగా దాగుని ఉన్న మార్గమును మొట్టమొదటిగా వాడడం మొదలుపెట్టారు భారతదేశములో జన్మించిన మహర్షులు. ఆ మార్గముయొక్క పేరే ఫలితజ్యోతిషము. దానికి గల శాస్త్రీయనామమే హోరాశాస్త్రము. తరతరాలుగా సాగుతున్న ఆ హోరాశాస్త్రములో విదేశీయుల 1200 సంవత్సరముల పాలన ఫలితముగా చాలా మార్పులు వచ్చాయి.
హోరాశాస్త్రము

27 నక్షత్రములు, 12 రాశులు, 9 గ్రహములు, వానియొక్క స్వరూపములు, వాటిమధ్య సంబంధములు బ్రహ్మ గారు రాసిన రాతని చదవడానికి ఉపయోగించే సాధనములు. వీని ద్వారా జరగబోయేది తెలుసుకోవచ్చును. పైన పేర్కొన్న ఆ నక్షత్రములు గ్రహములు మొదలుగునవి జరగబోయే మంచి చెడులను, వాటి స్వరూపములను, అవి జరుగబోయే తీరును, ప్రదేశములు మొదలగువానిని చెప్తాయి. మంచి చెడులనేవి అందరికీ వేరు వేరుగా ఉంటాయి. ఆ మంచి చెడులకు కారణము ప్రాణులు వివిధ జన్మలయందు చేసే మంచి చెడులే. దీనినే మనము కర్మ అంటాము. మనవారు “ నా ఖర్మ” అని మాటిమాటికీ తలచుకునేది దీనినే.
అంటే మనము ముందటి జన్మలయందు చేసిన మంచి చెడుల కారణముగా ఈ జన్మలో అనుభవించబోవు మంచి చెడులను గ్రహములు మరియు నక్షత్రముల ఆధారముగా మనకు తెలియజేయు దానికే హోరా శాస్త్రము లేక ఫలిత జ్యోతిషమని పేరన్నమాట. దీనిని గురించి వివరముగా రాబోవు సమయములో తెలుసుకుందాము.
కర్మ అంటే ఏమిటి? అది మనని ఎలా వెంటాడుతుంది?

మన జీవితం ఒక క్రెడిట్ కార్డు లాంటిది. మనం చేసే ప్రతి పనికీ కొన్ని పాయింటులు క్రెడిట్ అవుతాయి. కానీ ఇకడ ఒక చిన్న తేడా. క్రెడిట్ కార్డులో ఒకే రకమయిన రివార్డు పాయింటులు ఉంటాయి. మనం చేసే పనికి రెండురకముల పాయింటులు వస్తాయి. మనము మంచి పని చేస్తే అనుకూలమయిన పాయింటులు(పాజిటివ్ పాయింట్స్), చెడుపని చేస్తే ప్రతికూలమయిన పాయింటులు వస్తాయి. క్రెడిట్ కార్డులో రివార్డుపాయింటులను మనము వాడుకోకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ మనము చేసే పనుల ద్వారా మనము సంపాదించిన పాయింటులను మాత్రము మనము వాడుకోవాలి. ఇక్కడ వేరే దారి లేదు. అనుకూలమయిన పాయింటులు అనుభవించే సమయములో మనము సుఖపడతాము, ప్రతికూలమయిన పాయింటులు అనుభవించే సమయములో మనము కష్టపడతాము. ఇలా మనము చేసే పనికే కర్మ అనిపేరు. మనము సంపాదించిన పాయింటులను అనుభవించకుండా మనము ఈ శరీరము విడిస్తే వాటిని అనుభవించడానికి మళ్లీ జన్మించాలన్న మాట. అంటే మన ఎకౌంటులో పాయింటుల బాలన్సు ఉన్నంతవరకూ మనము జన్మిచాలన్నమాట. ఇదే అనాదిగా మనము భారతదేశములో పాటిస్తూ వస్తున్న కర్మ సిద్ధాంతము.
గ్రహములు కర్మ పరిపక్వ కాలమును సూచిస్తాయి

మనము పుట్టిన సమయమునందు రాశిచక్రమునందు గ్రహములు ఉన్న స్థానములు మన జీవితములో మనకు సుఖము మరియు దుఃఖము ఎపుడు సంభవిస్తుందో సూచిస్తాయి. అంటే అవి మనము చేసిన కర్మ యొక్క ఫలమును ఎపుడు ఎలా అనుభవిస్తామో చెబుతాయన్నమాట. ఇచట ఊహలకు అంచనాలకూ తావులేదు. మనము సాధారణముగా ఫలితము చెప్పే ఒరవడిని బట్టి అనుభవముమీద లేక స్ఫురణ వలన చెప్పుతున్నారని భావిస్తాము. కానీ అందు వర్ణింపబడిన యోగములు లేక ఫలితములు చెప్పుటకు ఆధారమైన వ్యవస్థను నిశితముగా పరిశీలిస్తే అందులో దాగున్న వైజ్ఞానికతత్త్వములెన్నిటినో మనము గ్రహించవచ్చను.
వైదికకాలమునుండి కూడ గ్రహముల కిరణములకు మనము చాలా ప్రాధాన్యమునిస్తూ వచ్చాము. దానికి కారణము మన మహర్షులకు వాని వైజ్ఞానికతపై గల పట్టు మాత్రమే. మానవునిపై గ్రహములయొక్క ప్రభావము, వాని దశాంతర్దశలు, గ్రహరత్నములు ఇవన్నియూ గ్రహముల కిరణములు, వర్ణములు మరియు వాని అమరిక పై ఆధారపడియుంటే చెప్పబడ్డ యోగములు ఆ కిరణముల ప్రసరణవిధానముపై ఆధారపడి యున్నదన్న సత్యము వారి విజ్ఞానమునకు నిదర్శణము.

సశేషము.....

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech