అనియానతిచ్చె

అనియానతిచ్చె కృష్ణుడర్జునితో
విని యాతని భజించు వివేకమా||

"భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల
దీమసాననే మోచేటి దేవుడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడ నేను||

దీపనాగ్నినై జీవదేహముల యన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
యేపున నిందరిలోని హృదయములోన నుందు
దీపింతు తలపు మరపై దేవుడ నేను||

వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచేత
అది నే నెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితోగూడి శ్రీ వేంకటేద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను||


భగవద్గీతలొ శ్రీకృష్ణుడు అర్జునునకు ఇచ్చిన ఉపదేశాన్ని మన అన్నమయ్య అచ్చ తెలుగులో అందంగా ఈ పాటలో అందించాడు! శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు. "నేను భూమిలో ప్రవేశించి చైతన్య శక్తితో సకల ప్రాణులను ధరించు దేవుడను! చంద్రుని రూపంలో నెలవై రసములు నింపి ఓషధులను వృద్ధి చేసి పండించు దేవుడను! సకల జీవుల దేహాలలో జఠరాగ్నినై ఆహారాన్ని జీర్ణం చేసే దేవుడను! సకల జీవుల దేహాలలో జఠరాగ్నినై ఆహారాన్ని జీర్ణం చేసే దేవుడను! అందరి హృదయాలలో సర్వాంతర్యామిగా కొలువైన దేవుడను నేను! మరపు (మాయ), జ్ణాపకము(తెలివి) రూపంలో ఉన్న దేవుడను నేను! సకల వేదాల చేత, వేదాంత వేత్తల చేత మొదట తెలియదగిన దేవుడను నేను! అట్టి నేను కలియుగంలో శ్రీ మహాలక్ష్మి తో కూడి శ్రీ వేంకటాద్రిపై స్థిర నివాసమేర్పరచుకున్నాను. ఇప్పుడు అన్నమయ్య మన బుద్ధికి జ్ణానభోధ చేస్తున్నాడిలా, ఓ వివేకమా! ఇది విని ఆ దేవుని కీర్త్గించుము. మరి అన్నమయ్య పాటతోనే ఆ వేంకటేశ్వరుడిని కీర్తించుదామా!

భజించు = కీర్తించు,
దీమసాన = ధైర్యముతో, ఓజోబలముతో,
దీపనాగ్ని = జఠరాగ్ని(వైశ్వానరము),
ఆది = మొదలు
పాదైన = నెలకొన్న

అన్నిటా భాగ్యవంతుడ

అన్నిటా భాగ్యవంతుడ వవుదువయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకునిపుడు||

పడతి మోహరసము పన్నీటి మజ్జనము
కడలేని యాపె సిగ్గు కప్పురకాపు
నిడుదకన్ను చూపులు నించిన తట్టుపునుగు
తొడిబడ సులభాన దొరకె నీ కిపుడు||

కామిని కెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోముకళలు ఆభరణాలు
దోమటి మాటలవిందు ధూపదీప నైవేద్యాలు
కామించినటువలెనె కలిగె నీ కిపుడు||

అలమేలుమంగనవ్వులు అంగపు పువ్వుదండలు
కలసి పురాన నీకే కట్టిన తాళి
చలపట్టి యీకె రతి సకలసంపదలు
యిలనబ్బె శ్రీ వేంకటేశ నీకి నిపుడు||

పరిశుద్ధ జీవత్మకు ప్రతీక అలమేల్మంగ! ఈ పాటలో అన్నమయ్య అలమేల్మంగ పక్షాన నిలబడి స్వామి వారిని కీర్తిస్తున్నాడు! అలమేలుమంగ వంటి భామ నీ భార్య యైనందుకు నువ్వు అన్ని రకాలుగా భాగ్యవంతుడనైనావు! ఆమెకు నీపై గల ప్రేమయే పన్నీటి స్నానం! నీ దగ్గర ఆమె చూపుతున్న సిగ్గు నీకు కర్ఫురహారతి! ఆ కలికి యొక్క అందమైన కనుచూపులు నీమేన అలదిన తట్టుపునుగు! ఆ భామామణి పెదవుల సొబగుల నీకు చంద్రకాని వలువలు! అలమేల్మంగ అందమైన వదన కళలు నీకు తరగని ఆభరణాలు! చెలియ చిలుకపలుకులు నీకు ధూప దీప నైవేద్యాలు! అలమేలు మంగ చిరుదరహాసములు నీకు పూలదండలు! బంగారు ప్రతిమయైన అమ్మ నీ వక్షస్థలమున కట్టిన తాళికి ప్రతిరూపం! ఇక ఆ పరిశుద్ధ జీవాత్మ నీతో సంయోగం చెందినపుడు కలిగే ఆనందం సకల సంపదలకు ప్రతిబింబం! అంటూ అన్నమయ్య అలమేల్మంగను పరోక్షంగానూ, శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రత్యక్షంగానూ వర్ణించాడు.

కప్పురకాపు = కర్పుర ధూపాన్ని శరీరానికి అద్దటం
నిడుద = దీర్ఘమైన
తొడిబడు = తొడిన్ + పడు = చలించు / చెదరు / తొట్రుపడు
 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech