కవితా స్రవంతి

మనం
 

-  -కె.గీత     


 

(వీక్షణం సాహితీ ప్రథమ వార్షిక సమావేశంలో చదివిన కవిత)

మనందరమూ కలిసి
కబుర్లు చెప్పుకోగలమని తెలుసు
మనందరమూ కలిసి
మన ఆలోచనలని పంచుకోగలమని తెలుసు
మనందరమూ కలిసి
మన పరిధిని విస్తృతం చేసుకోగలమని తెలుసు
కానీ మనందరమూ కలిసి
అద్భుతాలు సృష్టించగలమని ఇప్పుడే చూస్తున్నా
వెదజల్లిన విత్తనాలమై ఉండే మనం
అక్కడక్కడో పువ్వు పూసిన పూల చెట్ట్లై ఉండే మనం
కవన వనమై
నెలకొక వీక్షణమై
సముద్ర తీరపు సాహితీ గవాక్షమై
ఇచట కురిసిన హిమ సమూహాలై
అద్భుతాలు సృష్టించగలమని తెలీదు
మీకందరకూ ఏం అనిపిస్తూందో తెలీదు కానీ
నా వరకు నాకు
ఇక్కడ ప్రతీ సారీ
జీవితాన్ని సుసంపన్నం చేయగల
ఒక గొప్ప వాక్యం దొరుకుతుంది
ఉత్సాహోత్తేజాల్నిచ్చే
ఒక గొప్ప స్ఫూర్తి కలుగుతుంది
సమావేశపు ఆహ్వానం నుంచి
సభ పూర్తయ్యే వరకు
ఆకాశం లోని నక్షత్రాలన్నీ
నా కోసమే పూసిన
జాజిమల్లెలై అడుగడుగునా
సాహితీ సౌరభాల్ని వెదజల్లుతాయి
వాన ముంగిట లాంతర్లై
వేలాడే ఇంద్ర ధనుస్సులన్నీ
సమావేశం లో ప్రత్యక్షమైనట్లు
మిరుమిట్లు గొలిపే కవిత్వం
అద్భుతాశ్చర్యానందాల్లో ముంచెత్తుతుంది
అడుగు మోపిన చోటల్లా
పాద ముద్రలు జ్ఞాపికలై వెంటాడే
స్థలమిదొక్కటేనేమో
అభినందనలు మిత్రులారా!
మన:పూర్వక శుభాభినందనలు
సంవత్సర కాలంగా
కలిసి కట్టుగా  కొత్త ఒరవడిగా  ప్రవహిస్తూన్నందుకు
నెలనెలా  అడుగు మోపే స్థలమిచ్చి
కొమ్మల భారమంతా భుజానికెత్తుకున్నందుకు
మనందరం
తలా ఒక కిరణమై
ఏ మూలో ఆకు సందుల్లో
ఏకాంతంగా మెరుస్తూన్న వాళ్లం
ఎగిసి పడే ఉప్పెన జీవితాల వెనుక
ఆకాశాన్ని తాకే అలల్ని కలలుకన్న వాళ్లం
క్షణమై జారిపోయే వర్తమానం లోనూ
వీక్షణమై ప్రత్యక్షమవుతూన్నందుకు
మనమనే మనో సంకల్పానికి
మనమే ఆదర్శమవుతున్నందుకు
అభినందనలు మిత్రులారా! శుభాభినందనలు
 

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)