ముఖపత్రం    
  వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 11

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కావ్యాలు

 సాహిత్య చారిత్రి విశేషాలు

(మూడవ భాగము)

 

                                             పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

 

శ్రీనాథాది మహాకవి పథక్షుణ్ణమైన రీతిని ఆంధ్రమహాజనుల కోసం ఆంధ్రీకరణయజ్ఞానికి ఉపక్రమించి నిరుపమానంగా నిరాక్షేపణీయంగా నిర్విఘ్నపరిసమాప్తం చేసిన విద్వత్కవయితలలో అగ్రేసరభాసమానుడు శ్రీ పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు. శ్రీనాథాది మహాకవి పథక్షుణ్ణమైన ఆ రీతిలో అవశ్యాచరణీయమైన మఱొక ఉపదేశరహస్యం కూడా ఉన్నది. అదేమంటే నవ్యసంప్రదాయానుసరణం. శ్రీనాథుడు తన కాలం నాటికి అప్పుడే అంకురించి కోరకించి కుసుమించి ఫలించి దేశమంతటా ప్రచారంలోకి వస్తున్న కావ్యపథాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ నవ్యసంప్రదాయ కల్పవృక్షాన్ని తెలుగు నాట గాటంగా నాటాలనే కుతూహలం ఉన్నవాడు. ప్రాఁతవడ్డ మాటలను పరిహరించాలనే అత్యాధునిక భావాలున్నవాడు.

        విమర్శకులు గుర్తింపలేదు కాని - ఆయన రచనలన్నీ అప్పటి భావజాలానికి ఆధునికాలే.

        ఒక్కొక్కటే చూడండి: తొలి రచన మరుత్తరాట్చరిత్రము. చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటి నాఁడు చెప్పినది. దొరకలేదు. మూలకథ ఐతరేయ బ్రాహ్మణంలో అతిసంగ్రహం గానూ, మహాభారత, మార్కండేయ పురాణములో కొంత విపులంగానూ కనుపిస్తుంది. శ్రీనాథుడు క్రీ.శ. 1375 1380 (±) ప్రాంతాల చెప్పిన కావ్యమైతే ఆ రోజులలో అప్పుడప్పుడే వెలసిన ఏదో సంస్కృత కృతికి అనువాదమై ఉంటుంది. ఏదో ఒకనాటి పురాణాలలోని కథకు అనువాదం కాదన్నమాట. అందుకే, భీమేశ్వర పురాణములోనూ నవ మరుత్తుచరిత్రంబు సరిక్రొత్తదైన మరుత్తరాట్చరిత్రము (1 18) అన్నాడు. ఇది విశేషార్థంలో - తెలిసి అన్నమాటే కాని, అలవోకగా అన్నమాట కాదని గ్రహించాలి.

        ఆ తర్వాత చెప్పినది శాలివాహన సప్తశతి. నూనూఁగు మీసాల నూత్నయౌవనంలో అంటే, సుమారు క్రీ.శ. 1385 90 (±) ప్రాంతాల చెప్పిన రచన. పెదకోమటి వేమారెడ్డి (రాజ్యకాలం: 1403 1420) అప్పటికే హాలుని గాథాసప్తశతిపై భావదీపిక వ్యాఖ్యను రచించేందుకు వ్యాసంగం మొదలుపెట్టాడని; ఆయనను మెప్పించేందుకు శ్రీనాథుడు అనువాదానికి ఉపక్రమించాడని  దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారం అది సమకాలికానువాదం. తెలుగు సాహిత్యంలో అపురూపమైన సంఘటన.

        శృంగార నైషధము ఆ తర్వాత చెప్పినది. సంస్కృతంలో శ్రీహర్షుడు క్రీ.శ. 1180 దరిదాపుల చేసిన అమూల్యరచన అది. శ్రీనాథుని రచనాకాలం క్రీ.శ. 1395 అయితే, సంస్కృత కృతి ఆంధ్రదేశానికి రావటానికి ఒకటిన్నర శతాబ్ది కాలం పట్టినదన్నమాట. ఈ నడిమి కాలంలో తెలుగు కవులెవరూ హర్షుని నైషధీయచరితమును తాకి యెఱుగరని గుర్తుంచుకోవాలి. ఆ ప్రకారం శ్రీనాథుడే శ్రీహర్షుని కృతిని ముమ్మొదటిగా తెలుగు జాతికి వినిపించినట్లయింది. అప్పటికింకా మల్లినాథసూరి జీవాతు వ్యాఖ్యను శ్రీనాథుడు చూడలేదు. 

        హరవిలాసము రచన కాలానికి శ్రీనాథుడు మల్లినాథసూరి శ్రీహర్షుని కావ్యానికి చెప్పిన జీవాతు వ్యాఖ్యను; భారవి కిరాతార్జునీయమునకు చెప్పిన ఘంటాపథ వ్యాఖ్యను చూచి ఉంటాడు. హరవిలాసము శ్రీనాథుని సంస్కృత వాఙ్మయ నిష్ణాతృతకు, కన్నడ వాఙ్మయ పరిచయానికి, వీరశైవ సంప్రదాయ పరిజ్ఞానానికి నిదర్శకమైన మహారచన. విమర్శకులు దాని మూలమును అధికరించి విశేషించి పరిశీలన చేయదగినది.

        ఇక భీమేశ్వర పురాణము, కాశీ ఖండము ఉన్నాయి. శ్రీమహాస్కాందంబు నందు గోదావరీఖండంబు శ్రీమద్దక్షారామభీమేశ్వరమాహాత్మ్యసంయుతం బగుటంజేసి భీమేశ్వరపురాణం బనం బరఁగు; నది యాంధ్రభాషాప్రబంధంబుగఁ జెప్పం దొడంగితి అని భీమేశ్వర పురాణము (1 30) లో శ్రీనాథుని వచనం. ఇప్పుడు లభిస్తున్న సంస్కృత భీమ ఖండము శ్రీనాథుని రచనకే అనువాదమని విమర్శకుల అభిప్రాయం. అయితే, మల్లినాథసూరి కొడుకు కుమారస్వామి సోమపీథి విద్యానాథుని ప్రతాపరుద్రీయమునకు వ్రాసిన రత్నాపణ వ్యాఖ్యలో ఒక భీమ ఖండము  ఉదాహృతమై ఉన్నది. అది ప్రకృతం మనకు లభిస్తున్న సంస్కృత భీమఖండములోని భాగం కాదు. దీనిని సంపాదింపగలిగితే, సంస్కృత భీమఖండము వేఱొకటి కూడా ఉన్నదని, భీమేశ్వర పురాణము తన సమీపకాలము నాటి ఆ మూలానికి శ్రీనాథుడు చేసిన అనువాదమని వెల్లడవుతుంది.

        ఇక, ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండ చెప్పిన కాశీ ఖండము క్రీ.శ. 1430 ప్రాంతాల రచనం. ఇది సంస్కృత స్కాంద పురాణము లోనిది. సంస్కృతంలోని కాశీ ఖండము అందరూ అనుకొంటున్నట్లు అత్యంత ప్రాచీనకాలికం కాదని; వ్రాతప్రతుల సంప్రదాయాన్ని బట్టి, అందులో ఉదాహరించిన దేవాలయాల స్థితిగతులను అనుసరించి క్రీ.శ. 1250 కి తర్వాతి కూర్పు అని నిర్ధారింపబడుతున్నది. 1980లో తమ బృహత్పరిశోధనగ్రంథం A Survey of Sanskrit Sources for the Study of Varanasi ని ప్రకటించిన Diana L. Eck గారు; సంస్కృత కాశీ ఖండమును హిందీ తాత్పర్య సహితంగా ప్రచురించిన కాశీ సంస్కృత సీరీస్ వారు రచనా కాలాన్ని ఆ ప్రకారమే నిశ్చయించారు. స్కాంద పురాణము లోని కాశీ ఖండము పూర్వోత్తరభాగాల రచన పూర్తయి, దేశమంతటా ప్రతులు వ్యాపించటం జరిగినది క్రీ.శ. 1300 1350 (±) ప్రాంతాల నాటికని భావిస్తే, ఆ ప్రకారం శ్రీనాథుని రచన అప్పటికి అరవై డెబ్భై ఏళ్ళ లోపుననే జరిగిన ఆధునికమైన అనువాదమే అవుతుంది.

        శ్రీనాథుడు చూపిన ఈ మార్గంలో పయనించి పినవీరన తన కాలంనాటికి సమీపాన వెలసిన కృతులనే అనువాదానికి గ్రహించాడు.

        మాఘ మాహాత్మ్యము ఆ నాటికి ఆధునికమే. పద్మ పురాణము ఉత్తర ఖండం లోని ఆకర్షణీయమైన భాగం. ఇది క్రీ.శ. 13-వ శతాబ్దికి అనంతరీయమని విద్వాంసులు నిశ్చయించారు.

        నారదీయము సంస్కృతంలోని నారదీయ ధర్మశాస్త్రమునకు అనువాదం. క్రీ.శ. 13-వ శతాబ్దికి దీని తుది రూపం ఏర్పడింది. పినవీరనకు అదే మూలం. ఆ ప్రకారం అది ఆధునికానువాదమే.

        శృంగార శాకుంతలము క్రీ.శ. 1475 - 1480 (±) నాటి రాఘవ భట్టు అర్థద్యోతనిక వెలువడిన తర్వాత ఏతత్ప్రభావంతో; ఆయన శారదాతిలక వ్యాఖ్య ప్రభావంతో వెలిసింది. శ్రీనాథుని శాలివాహన సప్తశతి వలెనే సమకాలికానువాదం.

        ఆ తర్వాత చేపట్టిన సంస్కృత జైమిని భారతము కూడా అటువంటిదే. 14-వ శతాబ్దిలో వెలసిన రచన. అందుకే, తెలుగు జైమిని భారతము అవతారిక (1 17) లో సాళువ నరసింహరాయలు

        క.    నా మది నిరతము భారత

                రామాయణ కథలఁ బ్రేమ రంజిలు; నందున్

                జైమిని భారత మనఁగా

                భూమి నపూర్వము పురాణముల గణియింపన్.

        అన్నాడు. అపూర్వము అన్న మాట పాదపూరణనిమిత్తమో, యాదృచ్ఛికమో కాదు; తెలిసి చేసిన సార్థకమైన ప్రయోగం. పురాణములలో అంతకు మునుపు లేనిది అని అర్థం. పురాణకథల ఆవిర్భావస్వరూపం తెలిసిన మహాకవి చేసిన ప్రయోగం అది. 

        జైమిని భారతము పరిశీలనాత్పూర్వం తత్కర్త జైమినిని గుఱించి నాలుగు మాటలు: 

వేదవిభాగక్రమవేళ జైమిని

        జైమిని పారాశర్య సాత్యవతేయ వేదవ్యాస మహర్షి శిష్యుడు. ఆదికాలంలో 1. అగ్నిహోత్రం, 2. దర్శపౌర్ణమాసం, 3. చాతుర్మాస్యం, 4. పశుయజ్ఞం (అశ్వమేధం), 5. సోమయజ్ఞం అని అయిదు విధాల యజ్ఞక్రియలు ప్రాకృత వైకృతభేదంచేత పది విధాలుగా విధింపబడినప్పుడు కర్మకలాపవ్యాహృతిగా శతసహస్రసమ్మితమైన వేదరాశి ఆవిర్భవించినదని; శ్వేతవరాహకల్ప ప్రథమద్వాపరంలో పద్మగర్భుడు తానే వేదవ్యాసుడై దిగివచ్చి వ్యవస్థీకరించిన వేదరాశిని ఇరవై ఏడవ ద్వాపరంలో బ్రహ్మోపదిష్టుడైన కృష్ణద్వైపాయనుడు ఛందోరూపానుసారం అందులోని విషయక్రమాన్ని నాలుగు భాగాలుగా విభజించాడని విష్ణు పురాణము తృతీయాంశంలో ఉన్నది. ఇదే మహాభారతం (ఆది: 63: 89) లోనూ వేదా నధ్యాపయామాస మహాభారతపఞ్చమాన్, సుమన్తుం జైమినిం పైలం శుకం చైవ స్వ మాత్మజమ్ అని వచ్చింది. వ్యాసమహర్షి వేదచతుష్కంలో  ఋగ్వేదానికి ఫైలుని, యజుర్వేదానికి వైశంపాయనుని, సామవేదానికి జైమినిని, అథర్వణవేదానికి సుమంతుని శ్రావకులుగా నియమించాడట.

        ఆ విధంగా జైమిని నేర్చుకొన్న పాఠానుసారం ఆయన కొడుకు సుమంతుడు, సుమంతుని కొడుకు సుకర్ముడు సామవేదాన్ని చెప్పుకొన్నారు. సుకర్ముడు సామరాశిని సాహస్రసంహితగా సంకలించి తన శిష్యులలో కోసలీయ హిరణ్యనాభునికి, పౌష్పింజునికి బోధించాడు. పౌష్పింజుని శిష్యులు పదిహేనుమంది సామవేదానికి ఔత్తరాహ పాఠాన్ని ఏర్పరించారు. వీరికి ఉదీచ్య సామగులని పేరు. హిరణ్యనాభుని శిష్యులు పదిహేనుమంది దక్షిణానికి వెళ్ళి ప్రాచ్య సామగులై మఱి పదిహేను సామశాఖలను ప్రచారంలోకి తెచ్చారు. పౌష్పింజుని ఇతరశిష్యులు లౌగాక్షి, కౌథుముడు, కౌషీతి, లాంగలి; వారి శిష్యగణాలు వీటికి శాఖాంతరాలను కల్పించారు. హిరణ్యనాభుని శిష్యులలో కృతి ఇరవైనాలుగు శాఖలను కల్పించి తన శిష్యముఖాన వ్యాపింపజేశాడు.

        ఇదంతా పురాణాలలోని ఘట్టితాంశక్రమం. కొంత చరిత్ర, కొంత ప్రాస్తావికత, కొంత పారంపరీణ కల్పన అల్లిబిల్లిగా అల్లుకొనిపోయిన కథనం.

        ఈ విధంగా విస్తరిల్లిన ఒకనాటి ఆ వేయి సామశాఖలలో ఉదీచ్యాన కౌథుమ శాఖ; నేటి ఆంధ్రదేశ - వంగదేశాలలో రాణాయనీయ శాఖ వెలసి చివఱికి ఇప్పు డీ రెండే మిగిలాయి.

        ఆంధ్రదేశంలో సామవేదము, సామవేదుల అని ఇంటిపేర్లను కలిగినవారు ఉన్నారు. విజయనగరం, కపిలేశ్వరపురం, హైదరాబాదు, తిరుపతి మొదలైన క్షేత్రాలలో ఇప్పటికీ జైమినీయ రాణాయనీయ శాఖలో సామప్రపాఠం చేస్తున్న విద్వాంసులు ఉన్నారు. మహర్షి జైమిని సంప్రదాయం ఆంధ్రదేశంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది.   

శ్రౌతసూత్రకర్తగా జైమిని

       శ్రౌతకర్మవిధులను బోధించిన మహోపదేష్టగా జైమిని మహర్షి కేర్పడిన ప్రసిద్ధి జైమిని గృహ్యప్రయోగరత్నమాల, జైమిని గృహ్యమంత్రము, జైమినీయ గృహ్యసూత్రము, జైమినీయ తలవకారము, జైమినీయ న్యాయమాలా విస్తరము, జైమినీయ ప్రయోగము, జైమినీయ బ్రాహ్మణము, జైమినీయ మీమాంసా సూత్రము, జైమినీయ శ్రౌతసూత్రము, జైమినీయ సంహిత, జైమినీయోపనిషత్తు మొదలైన మహాకృతులను బట్టి ఏర్పడింది. జైమినీయ మీమాంసా సూత్రములు శబరస్వామి వ్రాసిన గొప్ప భాష్యం శాబర భాష్యం వల్ల; కుమారిల భట్టు శ్లోకవార్తికం, ఇంకా తంత్రవార్తికం, టుప్టీక; పార్థసారథి మిశ్రుల శాస్త్రదీపికల వల్ల అందఱికీ అందుబాటులోకి వచ్చి శ్రౌతకర్మానుష్ఠాతలు నేర్చి తీరవలసిన ఉపదేశసూత్రాలుగా అధ్యయనాధ్యాపనాలలో నిలిచాయి. మాధవాచార్యుల వారు జైమినీయ న్యాయమాలా విస్తరమునకు గొప్ప వ్యాఖ్యను నిర్మించినందువల్ల అదీ విజయనగర సామ్రాజ్యోన్నతి కాలంలో అధ్యయనరూఢి కెక్కింది. బాదరాయణుడే ఈ మీమాంసా సూత్రరచనకు ఆద్యుడని ఉన్న విశ్వాసం వల్ల జైమినీయమతానికి అసామాన్యమైన ప్రామాణ్యసిద్ధి కలిగింది. జైమిని వేదాంత సూత్రకర్త బాదరాయణుని కంటె పూర్వుడని కొందరు అనుమానించటం ఉన్నది.

        ఆర్షేయ బ్రాహ్మణాన్ని అభ్యసించి వ్యాప్తిలోకి తెచ్చిన సామవేద తలవకార గాయనులు తమ శాఖను ప్రతిష్ఠించిన తర్వాత జైమిని అందులోకి అడుగుపెట్టి తగిన మార్పులు చేశాడని రెనో మొదలైన ఐరోపీయ విద్వాంసులు కొందరంటున్నారు.

        ఋగ్వేదమంత్రములు సంహితారూపము తాల్చకముందే యందలి కొన్ని మంత్రములు గానరూపము దాల్చి సామసంహితలోని పూర్వార్చికమయ్యె నేమోయని తోఁచుచున్నది.

        అని మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు కూడా సంస్కృత వాఙ్మయ చరిత్ర ప్రథమ సంపుటం (ద్వితీయముద్రణం పు.161)లో వ్రాశారు. పాశ్చాత్య విద్వాంసులు చేసిన ప్రతినిర్ణయమూ భారతీయ సంప్రదాయవిరుద్ధమని ఉలికిపడటం కంటె సంప్రదాయవాదులు ఈ విషయమై కృషిచేసి స్వతంత్రంగా పరిశోధించి ఈ నిర్ణయాల సామంజస్యాన్ని నిర్ధారించటం మంచిది.

        జైమినీయ గృహ్యసూత్రములలో కనుపించే జైమిని పై శ్రౌతవిధివిధాతలలో ఒకరవునో కాదో చెప్పటం కష్టం. విష్ణుశర్మ పంచతంత్రము (2:34)లో ఏనుగుచేత త్రొక్కివేయబడినట్లుగా వర్ణించిన జైమినిని గుఱించి ఇంకా సమాచారం సేకరింపవలసి ఉన్నది. ఛాందోగ్యానువాద కర్త జైమిని అని కుమారిల భట్టు పేర్కొన్నాడు. ఇంకా ఉపాకర్మాంగ పద్ధతిని నిర్మించిన జైమినిని గుఱించి పరిశోధింపవలసి ఉన్నది. ఈ జైమినులందరూ ఒకరవునో కాదో నిర్ధారించి చెప్పటానికి విశ్వసనీయ చారిత్రకాధారాలు లేవు. శబరస్వామి భాష్యనిర్మాణం చేసిన కాలమూ వివాదాస్పదమే అయినా, మీమాంసాసూత్రకర్త అయిన జైమిని క్రీస్తుకు పూర్వం 4-వ శతాబ్ది కంటె ఎంతో పూర్వుడని మాత్రం పాశ్చాత్యవిద్వాంసులు సైతం అంగీకరించారు.

 

మహాభారత జైమిని

        మహాభారతము ఆదిపర్వంలో వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని ప్రశంస ఉన్నది. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతు ... మహామునులు సదస్యులుగా ఉన్నారని నన్నయ్య గారు (ఆది: 2-208)లో వ్రాశారు.

        వ్యాస మహర్షి వేదరాశిని తన శిష్యులు నలుగురికి పంచటం మహాభారతంలోనూ ఉన్నది. ఆ శిష్యులే మహాభారతాన్ని లోకంలో ప్రపంచింపజేయటానికి గురువు గారి ఆదేశాన్ని పొందినట్లు శాంతిపర్వంలో వచ్చింది.

        సభాపర్వంలో ధర్మజుని రాజసూయాన్ని వీక్షించేందుకు వచ్చిన మునిగణంలోనూ; ఆనుశాసనికపర్వంలో శరతల్పగతుడైన భీష్ముని దర్శించుకోవటానికి వచ్చిన మునులలోనూ జైమిని ఉన్నాడు.

        అంతకు మించి జైమిని పాత్ర మహాభారతములో విస్తరిల్లినట్లు కనబడదు.  ఆయన తానై పూనుకొని వేఱొక భారతాన్ని వ్రాయటానికి అనువైన నేపథ్యమేదీ అందులో లేదు.         

జైమిని రచించిన రామాయణము

        సంస్కృతంలో జైమిని రచించిన రామాయణము ఒకటున్నది. లఘురచన. అరవైయేడు అధ్యాయాలున్నాయి. అచ్చుపడలేదు. మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలో ఒక మంచి ప్రతి (N. 46 18[a]) కన్నడ లిపిలో ఉన్నది. ఈ జైమిని రామాయణమునకు ఒక ఆంధ్రానువాదం కూడా వెలసింది. జైమిని రామాయణములో  సీతాకళ్యాణఘట్టం లోని దని మండ లక్ష్మీనృసింహాచార్యులు తన ఆంధ్రకౌముదిలో ఉదాహరించాడు.   

చ.   ఉవిద యొకర్తు మేనఁ దొడవుల్ దగిలించె ముదంబు మీఱఁగా

        నవనిజ కప్పు; డోర్తు వెలయన్ నొసటన్ దిలకంబు దిద్దె; నొ

        క్క వనిత దొడ్గె మేన్ ఱవికెఁ; గాటు కిడెన్ గనులం దొకర్తు; సాం

        కవమృగనాభిపంక మొక కాంత యలందె విలాస మొప్పుగన్.

        ఈ తెలుగు అనువాదం కర్త పేరు తెలియరాలేదు. పద్యరచన మనోహరంగా ఉన్నప్పటికీ ఏమంత ప్రాచీనకాలికం కాదనిపిస్తున్నది. సంస్కృతమూలం కూడా వాల్మీకీయానికి సన్నిహితంగానే ఉన్నదట. వాల్మీకీయంలో

        తతస్సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్

        సమక్ష మగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా.

                                                        బాలకాండ (అధ్యా.73-శ్లో.25) 

        అన్న శ్లోకంలోని సర్వాభరణభూషితామ్ అన్న దళానికి నేపథ్యానుసంజనగా పై పద్యం అమరినట్లున్నది.

జైమిని రచించిన భాగవతము

        సంస్కృతంలో జైమిని భాగవతము కూడా ఉన్నది. అచ్చుపడలేదు. అదీ ఏమంత ప్రాక్తనకాలికం కాదు. భాగవత సంగ్రహము వంటి లఘురచన. ఇది ఓఢ్రదేశంలో వెలసినదని విమర్శకులు విశ్వసిస్తున్నారు. మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో దీని అరుదైన వ్రాతప్రతి ఒకటి (R. 3156) ఉన్నది. దీనికి ఆంధ్రానువాదాలు వెలువడలేదు.

జైమిని జ్యోతిషం : ఉపదేశ సూత్రము

        జ్యోతిశ్శాస్త్రకర్తలలోనూ ఒక జైమిని పేరున్నది. ఈయన కృతి ఉపదేశ సూత్రము. వేదవ్యాసుని తండ్రి పరాశర మహర్షి రచించిన బృహత్పరాశరహోరలో ఇందులో ప్రస్తావితాలైన విషయాలకు, గణితస్కంధానికి ప్రాతిపదికసూత్రాలు ఉన్నందువల్ల ఇది బృహత్పరాశరహోరకు వ్యాఖ్యానప్రాయమని అంటారు. అయితే, లగ్నసాధనక్రమాధ్యాయంలో, కారకాధ్యాయంలో, కారకాంశఫలాధ్యాయంలో పరాశర మహర్షి సూత్రాలకు భిన్నమైన వ్యవస్థ ఇందులో కనబడుతుంది. మొత్తం ఉన్నవి 1031 సూత్రాలు. ఈ సూత్రాలు నాలుగు అధ్యాయాలుగానూ; ఒక్కొక్క అధ్యాయమూ మళ్ళీ నాలుగు పాదాలుగానూ విభజింపబడి ఉన్నాయి. ఈ సూత్రాలకు వివరణగా ఒక శ్లోకాత్మకమైన కారికాధ్యాయం ఉన్నది. సూత్రరూపంలో నిర్మితమైన కారణవశాన; అనర్ఘమైన విషయగౌరవం మూలాన; మహర్షి జైమిని పేరుండటం వల్ల ఆధునిక కాలంలో దీనికి అవిరళప్రచారం లభించింది. ఇప్పటికి 175 యేండ్ల మునుపటి నీలకంఠ దైవజ్ఞుని టీకతో ఇది 1874లో మొదటిసారి ముద్రితమైంది. ఆ తర్వాత వినాయక శాస్త్రి, రామయత్న ఓఝా, మాధవ దుర్గాప్రసాద ద్వివేదులు, అచ్యుతానంద ఝా మహోదయులు రచించిన టీకలు, వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవిగాక దక్షిణదేశంలోని లిఖిత పుస్తక గ్రంథాలయాలలో ఇంకా ముద్రణకు నోచుకోని కర్ణాటక టీక ఒకటి; లక్ష్మణుని జ్యోతిఃప్రదీపికా వ్యాఖ్య, బాలకృష్ణానంద సరస్వతి రచించిన బాలకృష్ణ వృత్తి, వేంకటేశ్వరుడు రచించిన భావకౌముదీ వృత్తి, ఆకుమళ్ళ నృసింహ సూరి రచించిన అర్థప్రకాశికా వ్యాఖ్య సంస్కృతంలోనూ; అముద్రితమైన జైమిని సూత్రటీక ఒకటి తెలుగులోనూ ఉన్నాయి.  ఇవన్నీ 19-వ శతాబ్ది నాటివే. 20-వ శతాబ్దిలో ఫలితజ్యోతిషానికి ఎనలేని శాస్త్రీయతను, గుణగౌరవాన్ని, ప్రామాణికతను సంతరించిపెట్టిన బి. సూర్యనారాయణరావు గారు 1932లో ప్రకటించిన Jaimini Sutras ఆంగ్లానువాదం, దానికి వారి తనయులు సుగృహీతనామధేయులు బి.వి. రామన్ గారు 1944లో ప్రకటించిన పరివర్ధిత ముద్రణం ఈ గ్రంథానికి అద్యతనకాలంలో ప్రభావశీలితను, ప్రచారాన్ని కల్పించాయి.

        అయితే, గ్రంథాలయాలలో దీని వ్రాతప్రతులు 17-వ శతాబ్ది కంటె మునుపటివి లేవు. కేవలం దక్షిణదేశంలోనే అతిపరిమితంగా ఉన్నందువల్ల, సూత్రశైలి ఏమంత పౌరాతన్యం కలది కాకపోవటం వల్ల, పూర్వులెవరూ ప్రస్తావించిన ఆధారాలు లేనందువల్ల - అంత ప్రాచీనగ్రంథం కాదని; జైమిని నామం నిమిత్తమాత్రమని ఊహింపవచ్చును.

జైమిని మహర్షి రచించిన భారతము

        ఇక మిగిలినది జైమిని మహర్షి పేరిట వెలసిన జైమిని భారతము. విష్ణు పురాణములో సామగో జైమినిః కవిః అని చెప్పబడినందువల్ల ఈయన వేదవాఙ్మయానికి చెందినవి గాక కొన్ని లౌకికరచనలు చేసి ఉంటే, వాటిలో ఈ జైమిని భారతమును గణింపవచ్చునని పెద్దలంటారు. సంస్కృతంలో దీని వ్రాతప్రతులు దేశ-విదేశాలలో అనేకం ఉన్నాయి. లండనులోని ఇండియా ఆఫీసు లైబ్రెరీలో వారి లిఖితప్రతుల వర్ణనాత్మక సూచికను బట్టి వారి సంచయంలో సంస్కృత జైమిని భారతము యొక్క ఆశ్రమవాస పర్వము; బరోడా ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్ వారి లిఖితప్రతుల వర్ణనాత్మక సూచికను బట్టి వారి సంచయంలో అభివన్యు వధ ఘట్టం ఉన్న జైమిని భారతము యొక్క ద్రోణపర్వము ఉన్నట్లు ప్రతులు కనబడుతున్నాయి. అంతమాత్రం చేత జైమిని మహాభారతాన్ని సంపూర్ణంగా చెప్పి ఉంటాడని భావించటానికి వీలులేదు. ఇవన్నీ వేర్వేఱు రచయితలు ఒకరికొకరు సంబంధం లేకుండా వేర్వేఱు ప్రాంతాలలో ఉంటూ విడివిడిగా చేసిన రచనలే కాని ఒక అంతస్సూత్రంతో ఒకే రచయిత నిర్మించిన మహాకావ్యభాగాలు కావు. జైమిని భారతానికి వీటన్నిటినీ సమన్వయించుకొన్న ప్రామాణికమైన సుపరిష్కృత ముద్రణమింకా వెలువడలేదు. నూటపాతిక యేండ్ల క్రితం బొంబాయిలో వేంకటేశ్వర ప్రెస్సు వారొక గుజిలీ ప్రతిని ప్రకటించారు. వారు దాక్షిణాత్య వంగ మహారాష్ట్రీయ ప్రతులతో ఔత్తరాహ ప్రతులను సరిపోల్చి పరిష్కరించినందువల్ల ఉన్నంతలో అదే తక్కిన ముద్రణలన్నింటికీ ఆధారమైంది. గోరఖ్ పూర్ గీతా ప్రెస్సు వారు జైమినీయాశ్వమేధపర్వమని పండిత రామాధార శుక్ల శాస్త్రి గారి హిందీ తాత్పర్యంతో అచ్చువేసిన ప్రతిలో 68 అధ్యాయాలలో సుమారు నాలుగువేల శ్లోకాలున్నాయి. ఇది కూడా ఏమంత ప్రాచీనరచనం కాదు. దేశవిదేశాలలో భద్రపఱుపబడి ఉన్న లిఖితప్రతుల సంచయాలలో క్రీ.శ. 1350 (±) కంటె మునుపటివి లేవు. క్రీ.శ. 1350 (±) నాటికి పూర్వం సాహిత్యంలో దీని ప్రసక్తి కాని, ఉదాహరణలు కాని ఎక్కడా కనుపించవు. అదొక్కటే దీని అర్వాచీనతకు నిదర్శనం.

        భారతాశ్వమేధపర్వంలోని కథ ప్రసిద్ధమై ఉండగా జైమిని భారతము అందుకు ప్రత్యామ్నాయంగా వెలసిన ప్రాంతీయరూపమైనట్లు కనబడుతుంది.

        చిత్రమేమంటే, జైమిని భారతము గ్రంథంలో ఎక్కడా జైమిని మహర్షి పేరు గాని; ఆయన గ్రంథకర్తృత్వవిషయం కాని ప్రస్తావనకు రాలేదు. ఆంధ్రానువాదం చేసిన పినవీరన గాని, ఆయనకు కొంతకాలం తర్వాత కన్నడంలోకి శ్రీరామాశ్వమేధముగా అనువదించిన లక్ష్మీశుడు గాని తమ కావ్యాలలో జైమిని రచనోదంతాన్ని ప్రస్తావింపనే లేదు.

        జైమినీయాశ్వమేధపర్వములోని 25-వ అధ్యాయం మొదలుకొని 36-వ అధ్యాయం వఱకు – (వాల్మీకి రామాయణము ఉత్తర కాండములోని) కుశలవుల వృత్తాంతం ఉన్న భాగం పద్మపురాణములోని పాతాళ ఖండములోనూ ఉన్నది. అందువల్ల సంస్కృత జైమిని భారతము అంత పురాతనం కాదని విశ్వసింపవచ్చును.         శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రుల వారు సంస్కృత వాఙ్మయ చరిత్ర ద్వితీయ భాగములో

... జైమిని భారత మట్టిది కాదు ... రామాయణము నుత్తరకాండ ముదయించిన తరువాతఁ బుట్టినదని యిందలి కుశలవ వృత్తాంతమే చెప్పుచున్నది. అందుచే నర్వాచీన కాలమున నుత్పన్నమైన యిది జైమినిపేరఁ బ్రసిద్ధి కెక్కినను భారత సంహితా సమకాలికమని తలంపరాదు. (పు. 65-66లు)

అని వ్రాశారు.    

        తమకు కొద్దికాలం ముందు వెలసి, ప్రచారానికెక్కి, పాఠకులకు అంతగా పరిచయం లేని గ్రంథాన్ని సాళువ నరసింహరాయలు వినాలనుకోవటం, పినవీరన తెలుగు చేయబూనటం సాహిత్యానికి ఉభయతారకంగా పరిణమించింది.

జైమిని భారతము : రచనా కాలం

        శృంగార శాకుంతలములో పినవీరన తన కృతులన్నింటిని పేర్కొన్నాడు కాని జైమిని భారతము ప్రసక్తి లేదు.  అందువల్ల శృంగార శాకుంతలము తర్వాత జైమిని భారతమును వ్రాశాడన్నది స్పష్టం. జైమిని భారతము రచనాకాలం నాటికి తన కృతులను గుఱించి పేరుపేరున చెప్పుకొనవలసిన అవసరం లేకపోయింది.

        సాళువ నరసింహరాయలు జైమిని భారతాన్ని వినగోరిన వెంటనే తన పేరోగలంలో ఉన్నవారిని ఉద్దేశించి 

        గీ.     ఆ పురాణంబు గనఁ దెనుఁ గయ్యెనేనిఁ

                జెప్పనేర్చిన కవియుఁ బ్రసిద్ధుఁ డేనిఁ

                దెనుఁగు నుడికారమున మించుఁగనియె నేనిఁ

                గొందనము కమ్మ వలచిన చంద మగును.  జైమిని. (1-18)

        అన్నాడట. ఆ ప్రసిద్ధి శృంగార శాకుంతలము రచన వల్ల నేల నాలుగు చెఱగులకు విస్తరించింది. అందువల్ల జైమిని భారతము రచన శృంగార శాకుంతలము తర్వాత జరిగినదని నిశ్చయింపవచ్చును. గ్రంథస్థాధారాలు కూడా అందుకు అనుకూలంగానే ఉన్నాయి.

శృంగార శాకుంతలము : పోతన గారి భాగవతం

        పోతన గారి శ్రీ మహా భాగవతము క్రీ.శ. 1575 1580 (±) నాటికి పూర్తయింది. పినవీరన ఆ మహాత్ముని రచనను చక్కగా చదువుకొన్నాడు. చిల్లర వెన్నమంత్రి సహధర్మచారిణి అన్నమాంబను వర్ణిస్తూ మాంగళ్యశృంగార మంగీకరించి వర్తించుచోఁ బార్వతీదేవి గుణము (1-57) అని; వెన్నమంత్రి అభ్యుదయానికి హేతునిరూపణగా అన్నమాంబిక కంధరాంతరంబునఁ జాల శోభిల్లు మంగళసూత్రలక్ష్మి (1-62) అని వ్రాసినది పోతన్న గారు అష్టమ స్కంధంలో సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో అన్న సువిదిత వాక్యానికి (ప. 241) అనురణనమే. భాగవతం వ్యాప్తికెక్కిన అచిరకాలంలోనే వ్రాశాడనుకొన్నా శృంగార శాకుంతలము రచనాకాలం క్రీ.శ. 1480 1485 సంవత్సరాల నడిమికాలం అవుతుంది. అంతకు మునుపు కావటానికి వీలులేదు.

        అందువల్ల పినవీరన చిల్లర వెన్నమంత్రికి శృంగార శాకుంతలమును వినిపించి, సోమరాజుపల్లె నుంచి విజయనగరానికి బయలుదేరి క్రీ.శ. 1485లో సాళువ నరసింహరాయలు కర్ణాటక రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత జైమిని భారతమును ఆయనకు అంకితం చేశాడని; ఆ కావ్యంలోని

        రాజపరమేశ్వరుండు ... భద్రాసనంబునం బేరోలగంబుండి (1-15),

        శ్రీవేంకటాద్రినాథ దయావర్ధితరాజ్య (5-1),

        విశదీభూత చక్రవర్తివిలాసా (6-272)

        మొదలైన పంక్తులు సాళువ నరసింహరాయల సేనాపతిత్వాన్ని గాక విజయనగర సామ్రాజ్యాధిపతిత్వాన్ని సూచిస్తున్నాయని విమర్శకులు భావిస్తున్నారు.

        జైమిని భారతములోని ఈ రాజపరమేశ్వరుండు అన్న ప్రయోగం ప్రత్యేకించి విజయనగర సామ్రాజ్యాధిపతులకు చెందుతుందని విమర్శకుల అభిప్రాయం. అయితే, జైమిని భారతమును శృంగార శాకుంతలము చెప్పిన కొద్దికాలానికే చెప్పినందువల్ల పెక్కు చోట్ల మునుపు దుష్యంతునికి చేసిన వర్ణనలనేకం అందులో సాళువ నరసింహరాయలకు అనువర్తించినట్లు కనబడుతుంది.

        ఒక ఉదాహరణను చూద్దాము:

        రాజపరమేశ్వరుం డొక్కనాఁడు ... సభాసౌధంబున నమూల్య రత్నకీలనజాజ్వల్యమానకల్యాణభద్రపీఠాంతరంబున నాసీనుం డై ... సుధర్మాంతరంబున నోలగం బైన దేవేంద్రుండునుం బోలె సాంద్రవైభవంబునం గొలువుకూర్చున్న యవసరంబున.                                                                                                                         శృంగార. (1-96)

        రాజపరమేశ్వరుం డొక్కనాఁడు ... సభాభవనాభినవరత్నస్తంభదర్పణప్రతిబింబితమనోహరాకారుండును నై యర్హాసనసమాసన్నరాజన్యశిరఃప్రసవవాసనాముద్రితం బైన భద్రాసనంబునం బేరోలగం బుండి ...                                                                                                                                             జైమిని. (1-15)

        దీనిని బట్టి రాజపరమేశ్వర బిరుదం కేవలం విజయనగర సామ్రాజ్యాధిపతిత్వానికి సూచకం కాదని స్పష్టపడుతున్నది.

 

జైమిని భారతము : రాజనాథ డిండిముని సాళువాభ్యుదయము

        జైమిని భారతము సంస్కృతంలో సాళువ నరసింహరాయల పేర వెలసిన ఇరవైనాలుగు సర్గల రామాభ్యుదయ బృహత్కావ్యానికీ; సాళువ నరసింహరాయల విజయవైభవాన్ని వర్ణిస్తున్న రాజనాథ డిండిముని  సాళువాభ్యుదయ కావ్యానికీ తర్వాత రచించినది. రామాభ్యుదయం అచ్చుపడలేదు కాని దీని బాగా శిథిలమైన అసంపూర్ణ తాళపత్ర ప్రతి ఒకటి (R. 1409) చెన్నపురి ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉన్నది. సాళువాభ్యుదయం కూడా అచ్చుపడలేదు. చెన్నపురి ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోనే దీనికి గ్రంథలిపిలో ఉన్న తాళపత్ర ప్రతి (D. 11819) ఒకటి; దాని కాగితం ప్రతి (D. 11818) ఒకటి ఉన్నాయి.

        ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం వారు అచ్చువేసిన వ్రాతప్రతుల పట్టిక (రెండు సంపుటాలు), వారివే, ఆ వ్రాతప్రతుల వర్ణనాత్మక సూచికలు, ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్ 1919లో ప్రకటించిన Sources of Vijayanagar History, 1946లో ఆచార్య కె.ఎ. నీలకంఠశాస్త్రి గారు ప్రకటించిన Further Sources of Vijayanagara History గ్రంథాలు నా యీ అధ్యయనానికి ముఖ్యాధారాలు.

        రాజనాథ డిండిముని సాళువాభ్యుదయంలో వర్ణింపబడిన సాళువ నరసింహరాయల విజయపరంపరను బట్టి, అందులో అతడు విజయనగర సామ్రాజ్యాధిపత్యాన్ని వహించిన ముఖ్యమైన ప్రస్తావన లేనందువల్ల - అది క్రీ.శ. 1480 (±) నాటి రచనమని History of Classical Sanskrit Literature  లో మాడభూషి కృష్ణమాచార్యుల వారు సరిగానే ఊహించారు.

        తెలుగు కావ్యాలలో మొదటిసారి చేయబడిన శృంగార శాకుంతలములోని వేట వర్ణనమంతా పినవీరన ఈ సాళువాభ్యుదయాన్ని పురస్కరించుకొని చేసినదే.

        శాకుంతలములో ఆటవిక నాయకులు వచ్చి దుష్యంతుని వేటకు ఆహ్వానించటం - సాళువాభ్యుదయంలో కుటవాచలేంద్రతటం నుంచి ఆటవికనాయకుడు వచ్చి సాళువ నరసింహరాయలను నాగమండలం (నాగర ఖండం) లోని అడవికి వేట నిమిత్తం వచ్చి విడిది తీరమని కోరటం; హస్తినాపురంలో వేటకు అవసరమైన సామగ్రి ఏర్పాట్లు - చంద్రగిరిలో వేటకు మునుపు ప్రయాణకోలాహలం; ఉభయకావ్యాలలో అటవీ వర్ణన, మృగయావినోదం అంతా సాళువాభ్యుదయంలోని షష్ఠ అష్టమ సర్గలలో అతివిపులంగా ఉన్న భాగమే పినవీరన రచనకు మూలం.

        ఇదంతా పినవీరన విజయనగర ప్రవేశానికి మునుపే అక్కడ వెలసిన సాహిత్యాన్ని శ్రద్ధగా చదువుతున్నాడని, చిల్లర వెన్నమంత్రిని సోమరాజుపల్లెలో కలుసుకొన్నది బహుశః తన్మూలకంగా విజయనగర ప్రవేశం నిరాటంకంగా జరగటానికే అని, స్వాభిమానం గల స్వతంత్రుడు కనుక అందుకు భువనభాసుర కృతినిర్మాతలైన తన తండ్రిగారు అగ్రభ్రాత పొందిన ప్రసిద్ధిపై ఆధారపడలేదని ఊహింపవచ్చును.

        రాజనాథ డిండిముని కావ్యం విజయనగర సామ్రాజ్యంలో ప్రసిద్ధికెక్కినందువల్ల జైమిని భారతము రచనావేళలో సైతం పినవీరన దానిని ఎంతో అభిమానంతో ముందుంచుకొన్నాడు. సాళువాభ్యుదయంలోని భావాలను, కల్పనలను, ఎన్నెన్నో పదబంధాలను స్వేచ్ఛగా పరిగ్రహించాడు:

        శివరాత్రిదత్తధనతృప్తమృత్యుజి, త్ప్రతిపాదితాప్రతిమహేతిచాపవత్

          ధనసంహతిం కనకశైలసన్నిభా, మవలోక్య దానవిషయేఽగ్రతః కృతామ్.”   సాళువా. (11-29)    

మ.   శివరాత్రిప్రమదావలోకనతరస్విక్షోణిభృత్కన్యకా

          ధవసేవానుగ వాలుకాగణన భక్తవ్రాతయాత్రాసము

          ద్భవభారాపగమప్రమోదభరదృప్యద్రాజతాహార్యవై

          భవలీలాపరపాకశాసన! వచఃపర్యాయపద్మాసనా!      జైమిని.(4-143)

        పై పద్యంలో పినవీరన రాజనాథ డిండిముని సాళువాభ్యుదయాన్ని ముందుంచుకొని శ్లోకం ఎత్తుగడ మొదలుకొని ఆసాంతం పదపదానుసరణతో యథాతథంగా అనుసరించాడని స్పష్టం.

        మఱొక ఉదాహరణ:

        వస్త్రాద్యఞ్చ వసన్తదానవిషయే దత్తం మహార్ఘం నృపైః, నృపః సత్వరః         సాళువా. (11-39)

        వాహ్యాధిరూఢోఽథ సమం మహీపై ర్వసన్తదానత్వరయా మనోజ్ఞాన్.   సాళువా. (12-1)

          ఇవి సాళువ నరసింహరాయల వసంతోత్సవ దానదీక్షను తెలియజేస్తున్నసరిక్రొత్త విషయాలు. ఈ విశేషం అర్థం కాకపోతే సత్కవుల త్రుప్పు డుల్చు వసంతవేళ ... అన్న జైమిని భారతము (1-45) లోని పద్యవిశేషం అర్థమయే అవకాశం లేదు. వసంతవేళ అంటే వసంతకాలంలో రాజు కావించే దానవిశేషం అన్న భావం సాళువాభ్యుదయములో వర్ణితమైన పై సంగతి తెలిసివారెవరైనా చెబితేనే కాని తెలియదు. అచ్చయితే, అందులోని చారిత్రికవివరాలు, కావ్యగౌరవం, కవి ప్రతిభాసంపద - శ్రీనాథునికి వామన భట్టబాణుని రచనల పై ఉండినట్లు పిల్లలమఱ్ఱి పినవీరభద్రునికి రాజనాథ డిండిముని రచనలపై కుదురుకొన్న విశ్వాసం మొదలైన విశేషాలన్నీ వెలుగులోకి వస్తాయి.  

 

జైమిని భారతము : ఇమ్మడి దేవరాయల మహానాటక సుధానిధి

పినవీరన జైమిని భారతము రచనాకాలానికి మునుపే క్రీ.శ. 1485 నాటికి మునుపెన్నడో ఇమ్మడి ప్రౌఢదేవరాయలు సంకలనించిన మహానాటక సుధానిధిని కూడా చదువుకొన్నాడు. అందులోని శ్లోకం ఒకటి:

        శ్రీమా నిమ్మడి దేవరాయనృపతి స్స్వర్లోకకల్లోలినీ

          కల్లోలప్రతిమల్లసూక్తివిభవో విద్వజ్జనశ్లాఘితః

          శ్రీమా నాదిమకాణ్డవస్తువిషయాన్ వ్యస్తాన్ మహానాటక

          శ్లోకాన్ వర్ణపదక్రమోజ్జ్వలతరాన్ రమ్యా నకార్షీద్విభుః.   

        దీని గుణాస్వాదం వల్ల ఆకర్షితుడై తాను కూడా                          ... భారతీతీర్థ గురుకృపా స

          మృద్ధసారస్వతుఁడు సత్కవీంద్రసఖుఁడు

          కుకవిమల్లకషోల్లసత్కులిశ(?కుశల)హస్త

          పల్లవుఁడు చెప్పె పినవీరభద్రసుకవి.”               అన్న దళాన్ని చేర్చినట్లుంది.

సాళువ నరసింహరాయల చరిత్రాదికం : కావ్యాధారాలు, శాసనాలు                                                    

క్రీ.శ. 1336లో సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇరవైయేళ్ళకు క్రీ.శ. 1356లో బుక్క రాయలు సార్వభౌమత్వాన్ని వహించిన కాలంలో వంకిదేవరాజు ఆయన కనుసన్నల్లో మెలగుతూ మండలాధిపత్యాన్ని స్థిరపఱచుకొంటూ సాళువ వంశాభ్యుదయానికి ప్రాతిపదికనిర్మాణంలో ఉన్నాడు. ఆ రోజులలో ఒకపాటి రాజుననుకొన్న శక్తిమంతులందరికీ దక్షిణ సింహాసనాధ్యక్ష పదవి; పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వరత్వం ముఖ్యాదర్శాలు. అప్పటి ప్రధాన రాజవంశాల వారందరూ చంద్రవంశీయతను ప్రకటించుకొంటుండటం వల్లనో ఏమో, సాళువ వంశీయులందరూ తామూ చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకొన్నారు. ఈ సూర్య - చంద్ర వంశీయతలు ఎవరికి వారు ఆధిక్యానికి చెప్పుకొనేవే కాని వీటి పౌరాణికమూలాలతో చారిత్రికాధారాలను అన్వేషించటం వృధాయాసమే అవుతుంది. సాళువాన్వయులు  నేటి ఉత్తర కర్ణాటకంలోని కళ్యాణి నుంచి బయలుదేరి రాయలసీమలో నిలదొక్కుకొన్న యోధవరేణ్యులు. అందరూ ప్రధానంగా శ్రీరామభక్తులు. తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపాన ఉండటం వల్ల ఆ తర్వాతి కాలంలో శ్రీ వేంకటేశ్వర స్వామియందు అచంచలమైన భక్తిభావం నెలకొన్నది.

క్రీ.శ. 1400లో వంకిరాజు కొడుకు గుండరాజు పెనుగొండకు సమీపప్రాంతాలను వశపరచుకొని బలపడుతూ ఉన్నాడు. క్రీ.శ. 1404లో విరూపాక్ష రాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన నాటినుంచి కర్ణాటరాజ్యం బలహీనం కాసాగింది. ప్రజల దృష్టిలో దేశాభివృద్ధి జరుగుతున్నట్లు బాహ్యచిహ్నాలన్నీ కానవస్తున్నా, ఏ రాజూ ఎక్కువ కాలం రాజ్యపాలన చేయగల స్థితిగతులు లోపించాయి. సామంతులు, మండలేశ్వరులు, చిన్న చిన్న దళపతులు బలపడి అధికారవిస్తరణ ప్రయత్నాలలో ఉన్నారు.

సాళువ గుండరాజుకు ఆఱుగురు కొడుకులు. గుండ బొమ్మరాజు, మాదిరాజు, గౌతయ, వీర హోబళుడు (వీర ఔబళుడు), సావిత్రి మంగి, సాళువ మంగి. సాళువ నరసింహ రాయల పేర వెలసిన సంస్కృత రామాభ్యుదయము ఈ చివరి వాడైన సాళువ మంగి క్రీ.శ. 1405లో రాజ్యానికి వచ్చిన రెండవ బుక్కరాయల కొడుకు కంప రాయలకు ఆప్తమిత్రుడని వర్ణిస్తున్నది. మొదటి బుక్కరాయలు మహమ్మదీయుల దండయాత్రలకు సామ్రాజ్యం లోనుకాకుండా మధుర సులతానుతో తలపడినప్పుడు మంగిరాజు సహాయం చేసినందువల్ల ఈ మైత్రి దినాపూర్వజనితమైన ఛాయ పోలికను మఱింత బలపడింది. 

గుండరాజు నాలుగవ కొడుకైన వీరహోబళుని కొడుకు సాళువ కంప రాయలు క్రీ.శ. 1442 1459ల నడిమికాలంలో పరిపాలకుడై ఉన్నప్పుడు ఆంధ్రమహాకవి మనుమంచిభట్టు ఆయనకు తన హయలక్షణవిలాసమును అంకితం చేశాడు. గ్రంథాన్ని బట్టి కంపరాయల పరిపాలనాక్షేత్రం, పాలన కాలం స్పష్టంగా తెలియకపోయినా ఆ రాజు శాసనాలను బట్టి కొంత, సమకాలికాధారాలను బట్టి కొంత అప్పటి చారిత్రికఘటనలను పునర్లిఖించటం సాధ్యమవుతున్నది.

సాళువ మంగిరాజుకు (రెండవ) గుండశౌరి, గౌతయ, హనుమ రాజు, మల్లినాథుడు అని నలుగురు కొడుకులని రామాభ్యుదయము అంటున్నది. రామాభ్యుదయ ప్రతిలో గౌతమ అని ఉన్నా, శాసనాధారాలను పురస్కరించుకొని నేను గౌతయ అనే పేర్కొంటున్నాను. ఈ గౌత రాజుకు (మూడవ) గుండ రాజు, సాళువ బొప్పరాజు, సాళువ తిప్పరాజు కొడుకులు. ఈ గుండరాజుకు చంద్రగిరిలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని ప్రబలుడై రాజ్యవిస్తరణ మొదలుపెట్టాడు. ఆయన భార్య మల్లాంబిక. ఆ దంపతులకు సాళువ తిమ్మయ, సాళువ నరసింహ రాయలు జన్మించారు. శ్రీకృష్ణదేవరాయల గురువైన అప్పాజీ సాళువ తిమ్మరసుతో ఈ సాళువ తిమ్మయకు ఎటువంటి సంబంధం లేదు.

ఈ సాళువ నరసింహరాయలే 15-వ శతాబ్దంలో సుప్రసిద్ధుడైన రాజకీయ చారిత్రికవ్యక్తి. పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి ఈయనకే తన జైమిని భారతమును అంకితం చేశాడు.

 1446లో మల్లికార్జున రాయలు విజయనగర సామ్రాజ్యాధిపత్యాన్ని చేపట్టినప్పుడు సాళువ నరసింహ రాయలు ఆయనకు నమ్మినబంటుగా నేటి ఉత్తర ఆర్కాడు ప్రాంతంలోని చిత్తూరు, వెల్లూరు, ఇంకా తమిళదేశంలో చెంగల్పట్టు, దక్షిణ ఆర్కాడు ప్రాంతాల దాకా తన అధికారాన్ని పెంపొందించుకొని మహామండలేశ్వరునిగా ప్రాబల్యాన్ని సంతరించుకొన్నాడు. 1465లో రెండవ విరూపాక్ష రాయలు కాలానికి మఱింత బలపడి ముఖ్యప్రధానిగా చలామణీకి వచ్చి, 1485లో ప్రౌఢదేవ రాయలు అధికారానికి వచ్చేసరికి రాజంతవాడై సాళువ బిరుదానికి తగినట్లు రెక్కలు విప్పసాగాడు. మహావిద్వాంసులు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శాసనసంచయ నివేదిక (Epigraphical Report - నాలుగవ సంపుటం) ఆధారితం గానూ, డా. వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు సంపాదకత్వం వహించిన శ్రీ విరూపాక్ష శ్రీరామ తామ్రపాత్ర శాసనసంచయమును బట్టి, ఇతర శాసనాధారాలు, కావ్యాధారాలను బట్టి ఈయన చరిత్రాదికం కొంత విపులంగానే తెలుస్తున్నది. ఈయన ధర్మపత్ని శ్రీరంగదేవమ్మ వేయించిన దానశాసనాలు తిరుమల దేవాలయంలో కొంతకాలం వఱకు ఉండి ఆగిపోయాయి. రామాభ్యుదయ - జైమిని భారతములలో ఆమె ప్రస్తావనలు లేనందువల్ల చిన్నవయసులోనే ముగ్గురు కొడుకులను కన్నాక మరణించినదని భావించాలి. కుమార నరసయ్య, చిక్క సంగముడు, పెరియ (పెద్ద) సంగముడు అని వారి పేర్లు శాసనాధారాల మూలాన తెలుస్తున్నాయి. అయితే, వీరు ముగ్గురు సాళువ నరసింహ రాయల సంతానమన్న విషయమై చారిత్రికులలో ఏకాభిప్రాయం లేదు. క్రీ.శ. 1473 నాటికే కుమార నరసయ్యకు యౌవరాజ్య పట్టాభిషేకం జరిగి ఉంటుందని సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు భావించారు. ఈ కుమార నరసయ్యనే ఇమ్మడి నరసింహ రాయలని భావించాలని; తక్కిన ఇద్దరి సంగతి సందేహాస్పదమని పెక్కుమంది విశ్వాసం. ఈ ఇమ్మడి నరసింహరాయల రాజ్యకాలంతో పరిచయం ఉన్నప్పటికీ ఎందువల్లనో జైమిని భారతము ఈ విషయంలో మూకీభావం స్వీకరించింది. ఆ విషయాన్ని ముందు ముందు చర్చిద్దాము.

క్రీ.శ. 1452లో నరసింహ రాయలకు తండ్రి నుంచి అధికారం సంక్రమించింది. సాళువ రాజకుటుంబం కర్ణాటకంలోని కళ్యాణదుర్గాన్ని విడిచి చంద్రగిరికి వచ్చి స్థిరపడుతున్న రోజులవి. వెంటనే ఆయన ప్రాభవాన్ని గుర్తించి మల్లికార్జున రాయలు మహామండలేశ్వర బిరుదంతో అర్హసత్కారం చేశాడు. సాళువ నరసింహ రాయల తొలిశాసనం క్రీ.శ. 1456లో కనుపించినందు వల్ల అప్పటి నుంచి ఆయన అధికారప్రాబల్యం మొదలైనదని ఊహింపవచ్చును. చంద్రగిరి నుంచి రాజ్యం మొదలుపెట్టి అంచెలంచెలుగా పైకెదిగి, ప్రౌఢదేవరాయల తర్వాత క్రీ.శ. 1485లో విజయనగర సామ్రాజ్య సింహాసనం అధిరోహించి క్రీ.శ. 1492 వఱకు పరిపాలించాడని కొందరు చరిత్రకారుల విశ్వాసం. అంటే, క్రీ.శ. 1456 నుంచి క్రీ.శ. 1492 వఱకు 36 సంవత్సరాల పాలన కాలం తేలింది. సుప్రసిద్ధ చరిత్రకారుడు, ప్రామాణిక శాసన పరిశోధకుడు డా. బర్నెల్ గారు సాళువ నరసింహ రాయలు క్రీ.శ. 1490లో సింహాసనం అధిష్ఠించాడని నిర్ణయించారు. బిషప్ కాల్డ్వెల్ ఈ నిర్ణయాన్ని తిరస్కరించి తమ History of Tinnelvelly (పు. 48)లో క్రీ.శ. 1487లో ఈ సామ్రాజ్యస్వీకార ఘటన జరిగిందని వ్రాశారు. రాబర్ట్ సీవెల్ పండితుడు 1883లో ప్రకటించిన Sketch of the Dynasties of South India (పు. 54)లో ఈ వివాదచరిత్రను నెమఱు వేసికొన్నా ఏ సంగతీ నిర్ధారించి చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఫెర్నాఓ న్యూనిజ్, దోమింగో పేస్‌, ఫెరిస్తా, అబ్దుర్ రజాక్‌ల యాత్రా-రచనల ఆధారంగానూ, తన సమకాలికులైన పరిశోధకుల రచనల ఆధారంగానూ, అప్పటికి సరికొత్తగా వెలువడిన శాసనాల ఆధారంగానూ నిర్మించిన A Forgotten Empire: Vijayanagar అన్న ప్రామాణికమైన గ్రంథం 56-వ పుటలో సాళువ నరసింహ రాయలు క్రీ.శ. 1454లో చంద్రగిరి రాజ్యానికి వచ్చి, క్రీ.శ. 1485లో విజయనగర సింహాసనం అధిరోహించి, క్రీ.శ. 1498 దాకా అంటే, మొత్తం 44 సంవత్సరాలు రాజ్యం చేసినట్లు - ఆయన మాటలలోనే చెప్పాలంటే, a pure guess a pure conjectureగా ఊహించారు.

ఈ విధంగా సాళువ నరసింహ రాయలు నలభై నాలుగేళ్ళు పరిపాలన కావించాడు అన్న రాబర్ట్ సీవెల్ నిర్ణయానికి ఆధారం పోర్చుగీసు ప్రయాణికుడు న్యూనిజ్ తన యాత్రాచరిత్ర A Forgotten Empire (పుట. 307) లో వ్రాసిన వాక్యమే.

శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఈ సమస్య చిక్కుముడిని విప్పటానికి ప్రయత్నించి, తమ అందుబాటులోకి వచ్చిన శాసనాలను తైపారువేసి, సాళువ నరసింహరాయలు క్రీ.శ. 1456లో రాజ్యానికి వచ్చి క్రీ.శ. 1500 వఱకు ఉన్నాడని; ఆ తర్వాత ఇమ్మడి నరసింహరాయలు క్రీ.శ. 1505 వఱకు సుమారు అయిదేండ్లు పరిపాలన చేయటం జరిగిందని విశ్వసించారు.

సాళువ నరసింహరాయలు విజయనగర సింహాసనాన్ని అధిరోహించినది క్రీ.శ. 1485 – 1486లలో అన్న విషయాన్ని చరిత్రకారులలో పెక్కుమంది అంగీకరించారు. అంతకు మునుపు ఆయన శాసనాలలో సాళువ వారికి వంశక్రమానుగతాలైన “మహామండలేశ్వర, ”“కటారి సాళువ”, మేదినీ మీసరగండ”, “ధరణీవరాహ” మొదలైన బిరుదులున్నాయి. ఆయన శాసనాలలో చెదురుమదురుగా కానుపించిన “ఉడైయార్” “మహారాయ ఉడైయార్” “మహారాజ”, “సాళువ నరసింహరాయ ఉడైయార్” మొదలైన గౌరవచిహ్నాలు కాని; క్రీ.శ. 1486లో కనుపించిన “సార్వభౌమ” అన్న విశేషణం కాని; ఆ కాలం నాటి ఇతర రాజకీయాధికారుల బిరుదాలతో పోల్చి చూస్తే – సామాన్య విశేషణాలే అని; (We are not warranted in investing him with imperial robes) ఆ సార్వభౌమ” అన్న దళాన్ని ప్రత్యేకంగా రాచఱికానికి సంకేతమని భావింపకూడదని; సాళువ నరసింహరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతులకు విధేయుడుగా ఉంటూనే, తన అధికారాన్ని క్రీ.శ. 1486కు మునుపు, ఆ తర్వాత చంద్రగిరి మండలం నుంచే కొనసాగించాడని (“… Saluva Narasimha remained, throughout his life, only a general of the Vijayanagara Empire, but the most powerful general, with an ancestral kingdom of his own to govern.”) శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వ్రాశారు. క్రీ.శ. 1489 నుంచి సాళువ నరసింహరాయలు కళింగరాజ్య విస్తరణ కార్యక్రమంలో ఉన్న కపిలేంద్ర గజపతితో ఉదయగిరి దుర్గాన్ని కాపాడుకోవటానికి తలపడవలసి వచ్చింది. పొలిమేరలలో మూడేండ్లపాటు పోరు ఘోరంగా సాగింది. నరసింహరాయలు యుద్ధంలో ఓడిపోయి బందీ అయ్యాడు. క్రీ.శ. 1491 నాటికి దుర్భేద్యమైన ఉదయగిరి దుర్గాన్ని వదులుకొని పూర్వార్జితమైన పెనుగొండ రాజ్యానికే పరిమితమై పాలనను సాగించాడు. అటునుంచి కర్ణాటక సామ్రాజ్యంలో మంగళూరు వైపున్న పడమటి రేవులపై దృష్టి సారించి, భావియుద్ధాల నిమిత్తం సైన్యాన్ని పటిష్ఠం చేసుకోవటం మొదలుపెట్టాడు. చాలా మంది దాక్షిణాత్య చరిత్రకారులు క్రీ.శ. 1465 నుంచి 1485 వఱకు రెండవ విరూపాక్ష రాయలు; 1485లో తాత్కాలికంగా కొద్ది నెలలు ప్రౌఢరాయలు; క్రీ.శ. 1485 నుంచి 1491 వఱకు సాళువ నరసింహదేవరాయలు, 1491లో కొంతకాలం తిమ్మ భూపాలుడు, ఆయన తర్వాత 1491లోనే తుళువ నరసా నాయకుడు, 1503లో వీర నరసింహరాయలు రాజ్యానికి వచ్చినట్లు; క్రీ.శ. 1509లో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధిపత్యాన్ని చేపట్టినంత దాకా రాజనామక్రమం ఇదని నిర్ణయించారు. క్రీ.శ. 1491లో ఉన్న తిమ్మ భూపాలుడు సాళువ నరసింహనాయకుని కొడుకులలో ఒకడైన పెరియ సంగముడు కావచ్చునని కొందఱు ఊహించారు. ఆ లెక్కన ఇమ్మడి నరసింహరాయలు క్రీ.శ. 1504 నాటికి నలభైయేళ్ళవాడైనా ఆశ్చర్యం ఉండదు.

తిరుమల తిరుపతి దేవస్థాన సంచయంలోని శాసనాల ఆధారంగా శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు 1) సాళువ నరసింహరాయల కొడుకులు ముగ్గురిలో చిన్నవాని వయస్సు క్రీ.శ. 1498 నాటికి కనీసం 25 సంవత్సరాలు ఉండవచ్చునని; 2) ఆ క్రమాన పెద్దవాడైన ఇమ్మడి నరసింహరాయల వయస్సు ఎంతలేదన్నా 28 నుంచి 30 సంవత్సరాలైనా ఉంటుందని; 3) ఆ విధంగా పరిశీలిస్తే, న్యూనిజ్ తన యాత్రాచరిత్రలో “సాళువ నరసింహరాయలు తన చివఱి రోజులలో మఱీ పసివారుగా ఉన్న కొడుకుల సంరక్షణభారాన్ని తుళువ నరసా నాయకునికి అప్పజెప్పా” డని వ్రాసిన మాట సత్యం కాకపోవచ్చునని – నిర్ధారించి, క్రీ.శ. 1492 నాటికి సాళువ నరసింహరాయల చిన్న కొడుకులిద్దరు హతమాఱి ఉండవచ్చునని; పెద్ద కొడుకు ఇమ్మడి నరసింహరాయలు క్రీ.శ. 1505 వరకు జీవితుడై ఉన్నాడని Tirumala Tirupati Devasthanam Epigraphical Report నాలుగవ సంపుటం (పు. 148)లో వ్రాశారు. క్రీ.శ. 1491 నుంచి 1505 వరకు విజయనగర సింహాసనాన్ని అధిరోహించిన ఇమ్మడి నరసింహరాయలు కాక సాళువ వంశీయులెవరూ విజయనగర సింహాసనాధిపత్యం చేపట్టలేదని వీరి నిర్ణయం.  

సాళువ నరసింహరాయలు: దగ్గుపల్లి దుగ్గన, నంది మల్లన - ఘంట సింగన కవిద్వయం

          దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథుని బావమఱది. కాంచీపుర మాహాత్మ్యము, నాసికేతోపాఖ్యానము ఆయన కృతులు. కాంచీపుర మాహాత్మ్యము దెందలూరి గంగయ మంత్రి కొడుకు దేవయామాత్యునికి; నాసికేతోపాఖ్యానము దెందలూరి అనంతామాత్యుని కొడుకు గంగయామాత్యునికి అంకితం చేయబడ్డాయి. గంగయ మంత్రి, అనంతామాత్యుడు అన్నదమ్ములు. దేవయామాత్యుడు, గంగయామాత్యుడు ఆ అన్నదమ్ముల బిడ్డలు. నాసికేతోపాఖ్యానమును అంకితం తీసుకొన్న గంగయామాత్యుడు క్రీ.శ. 1460 – 1500 సంవత్సరాల నడిమి కాలంలో ఉన్న బసవ భూపాలుని వద్ద మంత్రిగా ఉన్నాడు. నెల్లూరు మండలంలోని ఉదయగిరి వీరి నివాసం. ఈ బసవ భూపాలునికే దూబగుంట నారాయణకవి క్రీ.శ. 1470 ప్రాంతాల తన పంచతంత్రమును అంకితం చేశాడు. శ్రీనాథుడు క్రీ.శ. 1410 ప్రాంతాల రచించిన హరవిలాసము ప్రసిద్ధికెక్కిన తర్వాత ఆంధ్రదేశం నుంచి కాంచీపురానికి తీర్థయాత్రలకు వెళ్ళిరావటం ప్రచురమైనాక క్రీ.శ. 1460 (±) ప్రాంతాల దగ్గుపల్లి దుగ్గన కాంచీపుర మాహాత్మ్యమును దెందలూరి దేవయామాత్యునికి వినిపించి, ఆ పరిచయప్రాభవంతో గంగయామాత్యుని ప్రాపకాన్ని పొంది నాసికేతూపాఖ్యానమును క్రీ.శ. 1465 (±) ప్రాంతాల ఆయనకు అంకితంచేసి ఉంటాడు. సాళువ నరసింహరాయలు ప్రాబల్యాన్ని సంతరించుకోవటం మొదలైన కాలమది.

        ఆ సమయంలో నంది మల్లన - ఘంట సింగన కవులు యౌవన వయోవస్థలో ఉన్నారు. క్రీ.శ. 1470లో కపిలేంద్ర (కపిలేశ్వర) గజపతి అస్తమించగానే సాళువ నరసింహరాయలు ఉదయగిరిని ఆక్రమించి దుర్గాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. మఱికొంత కాలానికి క్రీ.శ. 1489లో కపిలేంద్ర గజపతి కొడుకు పురుషోత్తమ గజపతి దండెత్తి వచ్చినపుడు సాళువ నరసింహరాయలు ఆతని దక్షిణ జైత్రయాత్రను నిలువరింపలేక జీవగ్రాహంగా పట్టుబడినట్లు, ఉదయగిరి దుర్గాన్ని ఇచ్చి “బ్రతుకు జీవుడా!” అని బయటపడినట్లు –

        “జీవగ్రాహ మరిం ప్రగృహ్య సమరే కర్ణాటభూమీధవం

        దీనోక్తిప్రవణం నృసింహమనుజాధీశం పున స్త్యక్తవాన్.

        అని సరస్వతీ విలాసము అనే ధర్మశాస్త్రగ్రంథం లోనూ; పురుషోత్తమ గజపతి కొడుకు ప్రతాపరుద్ర గజపతి వేయించిన అనంతవరం శాసనంలోనూ ఉన్నది. ఆ యుద్ధంలో పురుషోత్తమ గజపతి గెలుపు వెనుక బసవ భూపాలుని మంత్రి గంగయామాత్యుని చాణక్యం ఉన్నదని సాహిత్య చరిత్రకారులు ఊహించారు. నంది మల్లన – ఘంట సింగనలు తమ ప్రబోధ చంద్రోదయములో ఆ సన్నివేశాన్నే స్మరింపజేస్తూ

        “క.    శ్రీకరవీక్షణదాన

                శ్రీకర నరసింహనృపవశీకరనయవి

                ద్యాకరణ చతుర్దశ వి

                ద్యాకరధీరంగమతి యనంతయ గంగా!”       ప్రబోధ. (2-1)

          అన్నారని శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావు గారు ఊహించి, నృసింహరాయలను జీవగ్రాహముగా బట్టించుటయే గంగమంత్రి యొక్క నయవిద్యాకరణమహత్త్వమని నిర్ణయింపవచ్చును” అని తమ విజయనగరమందలి ఆంధ్రవాఙ్మయచరిత్రములో వ్రాశారు. ఆ మాటనే శ్రీ చాగంటి శేషయ్య గారు తమ ఆంధ్రకవితరంగిణిలో ప్రమాణీకరించారు. చాగంటి శేషయ్య గారి మాటపై ప్రామాణ్యభావం వల్ల తక్కినవారందరు ఆ మాటనే అనుసరించారు.

        సాళువ నరసింహరాయల విజయగాథాపరంపరలో ఒకే ఒక అపశ్రుతిగా వీనుమిగిలిన ఈ పరాజయ జీవగ్రాహం ఉదంతాన్ని విమర్శకులందరూ విశ్వసించినా, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు మాత్రం అంగీకరింపకపోగా, ఆ సరస్వతీ విలాసములో ప్రస్తావింపబడిన నరసింహుడు సాళువ నరసింహుడు కాకపోవచ్చునని; సాళువ నరసింహుని జీవితంలో అటువంటి పరాజయ జీవగ్రాహోదంతమేదీ జరగలేదని – ఆంధ్రదేశ చారిత్రక భూగోళ సర్వస్వము (ప్రథమ సంపుటం : పుట. 211) లో వ్రాశారు.

        సోమశేఖరశర్మ గారు నంది మల్లన – ఘంట సింగన కవులు ప్రబోధచంద్రోదయములో “నరసింహనృపవశీకరనయవిద్యాకరణ” అని వ్రాసిన దళాన్ని గుఱించి ప్రస్తావింపలేదు.

        జాగ్రత్తగా ఆలోచిస్తే,నరసింహనృపవశీకరనయవిద్యాకరణ” అని జంట కవులు వ్రాసినది సాళువ నరసింహరాయలను ఉద్దేశించి కాదని సులభంగానే ఊహింపవచ్చును. “శ్రీకరవీక్షణదాన, శ్రీకర! నరసింహనృపవశీకరనయవి, ద్యాకరణ! చతుర్దశ వి, ద్యాకరధీరంగమతి! యనంతయ గంగా!” అని మాత్రమే అక్కడి పద్యాన్వయం. “నరసింహనృపవశీకర” అంటే “నరసింహరాయలను జీవగ్రాహంగా పట్టియిచ్చిన” అని టేకుమళ్ళ అచ్యుతరావు గారు ఊహించిన అర్థం రానే రాదు. “నరసింహరాయలను ఆకట్టుకొన్న నీతివిద్యాధురంధరుడు” అని మాత్రమే అక్కడి కల్పనలోని ఉద్దేశం.

        ఆ విధంగా కాకపోతే, అంత ముఖ్యమైన చారిత్రికవిజయానికి కారణమైన కృతిపతి గంగయామాత్యుని అఖండ నీతిశాస్త్రనైపుణిని, ప్రభురక్షాదీక్షను, దక్షతను మహాకవులు మితిమీఱి వేయి నోళ్ళతో పరిపరి రీతుల వర్ణింపక ఎక్కడో ఒక చిన్ని దళంలో రహస్యంగా ఇమిడ్చి చెప్పటం భావ్యమనిపించుకోదు. కృత్యాదిలో కాని, వేఱొక చోట కాని చరిత్రాత్మకమైన ఈ ఉదంతం ప్రస్తావనకు రాలేదు. అందువల్ల ఆ అన్వయం సరికాదని గ్రహించాలి. “నరసింహరాయలను ఆకట్టుకొన్న నీతివిద్యాధురంధరుడు” అన్న అర్థాన్ని మాత్రమే గ్రహించాలి.

        అంతే కాదు. జంట కవులు నంది మల్లన – ఘంట సింగన ప్రబోధచంద్రోదయమును గంగయామాత్యునికి  వినిపించిన తర్వాత విజయనగరానికి వెళ్ళి సాళువ నరసింహరాయల వద్ద దండనాయకునిగా ఉన్న తుళువ నరసానాయకునికి వరాహ పురాణమును అంకితం చేశారు. అప్పటికి సాళువ నరసింహరాయలు జీవితుడై అధికారంలో ఉన్నందువల్ల కవులు “కృతిపతికిం బతియైన సాళువ నరసింగరాజ రాజమౌళి పావనాన్వయంబు మొదల వర్ణింతము” అంటూ, వరాహ పురాణము కృత్యాది (1-21) ని ముందు నరసింహరాయల వంశవైభవాన్ని వర్ణించారు. ఒకమాఱు ఒక కావ్యంలో నరసింహరాయలను జీవగ్రాహంగా పట్టియిచ్చిన వ్యక్తిని పొగడి, ఆ తర్వాత మఱొక కావ్యంలో నరసింహరాయలను సన్నుతించటం ఆ నరసింహరాయలకు గాని, ఆ కృతిపతి నరసా నాయకునికి గాని సమ్మతిపాత్రం అవుతుందా? అని ఈ విమర్శకులలో ఒక్కరైనా ఆలోచింపకపోవటం ఆశ్చర్యకరం.

        అందువల్ల విమర్శకులు ఈ నరసింహరాయల జీవగ్రాహ ఉదంతాన్ని ఉపేక్షించటమే మేలు.  

        తిరుపతి దేవస్థానంలోని ఒక శిలాశాసనంలో (సం. 2: పుట. 99: సంఖ్య – 51) సాళువ నరసింహరాయలకు ముగ్గురు కొడుకులు ఉండిన విషయం ప్రస్తావనకు వచ్చిందని ఇంతకు ముందు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఊహను గుఱించి చర్చించాను. వారి పేర్లు కుమార నరసయ్య, చిక్క తంగమ, పెరియ తంగమ అని అందులో ఉదాహరింపబడి ఉన్నాయి. ఆ ముగ్గురు నరసింహరాయల కొడుకులన్న విషయమై చరిత్రకారులలో ఏకాభిప్రాయం కుదరలేదు. సాళువ నరసింహరాయల పెద్ద కొడుకును సాళువ తిమ్మరసు (“Salvatinea”)అన్న అతను చంపినట్లుగా న్యూనిజ్ వ్రాసినది కూడా వివాదాస్పదమైంది. ఈ కాలపు కుట్రలు, కూహకాలను గుఱించి ఫెరిస్తా, న్యూనిజ్ లు వ్రాసిన ఘటనలను అర్థంచేసుకోవటం కష్టం.

        సాళువ నరసింహరాయల పెద్దకొడుకు కుమార నరసరాయలను గుఱించి పరిశోధించిన చాగంటి శేషయ్య గారు ఆంధ్రకవి తరంగిణి (6-వ సంపుటం) లో జంట కవులు నంది మల్లయ్య ఘంట సింగయ్యల విషయమై చర్చిస్తూ చాలా వివరంగా వ్రాశారు. అయితే, కుమార నరసరాయల హత్యాకాలాన్ని ఇదమిత్థంగా నిర్ణయింపలేకపోయారు. క్రీ.శ. 1490 వఱకు నరసింహరాయల శాసనాలు; 1492 నుంచి కొడుకుల శాసనాలు కనుపించినట్లుగా వ్రాశారు. నరసింహరాయల కొడుకు “తమ్మారాయడు” అని ఉన్న శాసనాలు; “ఇమ్మడి నరసింహరాయలు” అని ఉన్న శాసనాల విషయాన్ని ప్రస్తావించి; ప్రాచ్య పాశ్చాత్య చరిత్రకారుల వ్రాతలను పరిశీలించి; నరసింహరాయల రెండవ కొడుకు, మూడవ కొడుకు హతులు కాగా మొదటి కొడుకు ఇమ్మడి నరసింహరాయలు ఒకడే క్రీ.శ. 1492 నాటికి జీవించి ఉండినట్లు నిర్ధారించారు.

        సాళువ నరసింహరాయలకు తిమ్మ భూపాలుడనే మఱొక కొడుకు ఉండినట్లు, అతను బహుగ్రంథకర్త అయినట్లు నేలటూరి వేంకట రమణయ్య గారు Further Sources of Vijayanagara History లో వ్రాశారు. ఆ విషయాన్ని గుఱించి ఇంకా నిగ్గు తేల్చవలసి ఉన్నది.

        సందిగ్ధాంశ బహుళంగా ఉన్న ఈ చరిత్రను పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి జైమిని భారతము ఆధారంగా ఒక సరిక్రొత్త కోణం నుంచి పరిష్కరించాలని ప్రయత్నం. వచ్చే సంచికలో ఆ విషయాన్ని వివరిస్తాను.

(ముగింపు వచ్చే సంచికలో)

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech