Sujanaranjani
           
  శీర్షికలు  
       ఎందరో మహానుభావులు

       ఆంధ్రజయదేవ కామసముద్రం అప్పలాచార్యులు

 

 

 - రచన : తనికెళ్ళ భరణి    

 

సంగీత సాహిత్యాలకి నీరాజనాలు పట్టిన సంస్థానాల్లో గద్వాల ముఖ్యమైంది. దీన్ని విద్వద్గద్వాల అంటారు.
ఈ గద్వాల సంస్థానం కాకతీయ సామ్రాజ్యం నుంచి ఉద్భవించింది. కాకతి రుద్రాంబ - ప్రతాపరుద్రులు రాజ్యం చేసే కాలంలో రాయచూర్ - కర్నూలు ప్రాంతాలు అరణ్యాలుగా ఉండేవి. కాకతీయ సామంతులు ఈ ప్రాంతంలో అడవులన్నీ నరికివేసి నివాసయోగ్యంగా తయారు చేశారు.

1347లో బహమనీ సుల్తానులు రాయచూరు, కర్నూలు ప్రాంతాలు జయించడంతో వీళ్ళు వాళ్ళకు సామంతులయ్యారు. మళ్ళి 1489లో బీజాపూర్ సుల్తానులు జయించడంతో వాళ్ళకు సామంతులయ్యారు!

1963 ప్రాంతంలో పెద సోమభూపాలుడు రాజ్యానికి వొచ్చాడు. గద్వాలు సంస్థానాన్ని నిర్మించిన వాళ్ళలో పెదసోమభూపాలుడు ప్రముఖుడు. ఇతను బీజాపూర్ సుల్తానుకు నామమాత్రపు సామంతుడుగా ఉంటూ సర్వస్వతంత్రుడై పరిపాలించాడు. ఆ తర్వాత ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండ మొదలైన రాజ్యాలని జయించడం మొదలు పెట్టడంతో పెదసోమభూపాలుడు ఔరంగజేబుతో స్నేహం చేసుకున్నాడు. ఈయన కాలంలో గద్వాల ఒక్క వెలుగు వెలిగింది. పెదసోమ భూపాలుడు స్వయంగా కవీ పండితుడు.

ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరని ఒక సంఘటన చర్విత చరణమే అయినా మరోసారి చెప్పుకుందాం. కార్తీక మాసంలో జరిగే కవిపండిత సభకి వచ్చే పండితులు, కవులూ, సంగీతవేత్తలూ నడిచే దారిలో తెల్లటి గుడ్డ పరిచీ ఆ పాదధూళిని పోగు చేసి చూర్ణం చేసి దాన్ని బంగారు బరిణెలో భద్రం చేసి నీళ్లలో వేసుకునీ రాజ కుటుంబీకులు యావన్మందీ తీర్థంతో సేవించేవారట.

ప్రపంచ చరిత్రలోనే ఇది అరుదైన సంఘటనగా నేను భావిస్తాను. ఆ దృశ్యం తల్చుకున్నా.. చదివినా అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు తిరిగి.. గద్వాల ప్రభువుకి సాష్టాంగ పడాలనిపిస్తుంది. అలాంటి గద్వాల సంస్థానంలోని సంగీత విద్వాంసుడే కామసముద్రం అప్పలాచార్యులు.

కామసముద్రం అప్పలాచార్యులు - కౌండిన్యస గోత్రికుడు.

శ్రీనివాసాంబా - కృష్ణమాచార్యుల పుత్రుడు.. అహోబిల శ్రీనివాసుని శిష్యుడు.
సంగీత సాహిత్యాల్లో దిట్ట..
ఒకనాడు పెదసోమభూపాలుడు కొలువుదీర్చి అప్పలాచార్యుల వారిని పిలిపించీ..
కృష్ణ దిర్పకథలష్ట పదులివి తెనుగొనర్చి
సంతసము గూర్పు మప్పలాచార్యు సుకవీ.. అని కోరారు.
కోరిక మంచిదే కానీ క్లిష్టమే..

ఇది ఓ రకంగా వరం.. మరో రకంగా శాపం.
ఎంచేతనంటే! జయదేవుడి అష్టపదులకి యావద్భారత దేశంలోనూ ఖ్యాతి ఉంది. అవన్నీ సంస్కృతంలోనే ఉన్నా.. ఏ భాషకాభాష వారు ఇవి తమవేనేమో అనుకునేంతగా జనజీవితంలో మమేకమైపోయిన గీతాలు..

ప్రత్యేకంగా చెప్తే తప్ప.. ప్రళయ పయోధి జలే అన్నా చందన చర్చిత నీలకళేబర అన్నా..ఇవి తెలుగు కావుగా అని అశ్చర్యపడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు..

అంచేత అప్పలాచార్యులొక పనిచేశారు. అసలు ముందు జయదేవుడి జీవితం..ఆయన సహిత్యాన్నీ ఔపోసన పడదాం అనుకుని కృష్ణుణ్ణి మనసులో స్మరించుకునీ.. జయదేవుడు పుట్టిన ఊరు ఒరిస్సాలోని కిందుబిల్వం అనే ప్రదేశానికెళ్ళి ఆ మట్టిని చేత్తో పట్టుకుని ముద్దెట్టుకున్నాడు.
మన్నుతిన్న కన్నయ్య నోరంతా తెరిచి నవ్వాడు!!

జయదేవుడి తల్లిదండ్రులైన భోజదేవుడు.. రమాదేవి తమ పిల్లాణ్ణి ఊయలలూపిన ప్రదేశానికెళ్ళి.. ఆనందంలో ఊగిపోయాడు.
అవును మరి నేనూ లయకారుణ్ణే కాను, ఊయలకారుణ్ణి కూడా అన్నాడు గీతాకారుడు.
జయదేవుడి గీతాలకి నాట్యం చేసిన ఆయన పద్మావతి నర్తించిన మండపాల మీద కూర్చుని అరచేతుల్తో ఆ గచ్చు తుడిచాడు అప్పలాచార్యుడు.
ఆవిడ నాగినిలా ఆడగలదు..నేను కాళీయుడిపై ఆడినట్లు అన్నాడు తాండవ కృష్ణుడు.
అన్నిచోట్ల కృష్ణ దర్శనం.. కృష్ణ స్పర్శనం జరిగిపోతోంది అప్పలాచార్యులకి. మొత్తానికి జయదేవుడి గీత గోవిందం కళ్ళకద్దుకున్నాడు.
వేణునాదం వినిపించింది.
12 సర్గలూ, 24 అష్టపదులూ, 72 శ్లోకాలలో ఉన్న గీతగోవిందంలో మధుర - శృంగార భక్తిని..ఆస్వాదించి..దీన్ని తెలుగులో రాయడానికి శ్రీకారం చుట్టాడు.
పాంచజన్యం వినిపించింది. జేగంట నాదం వినిపించింది.. వస్తున్నంత సేపూ.. యమున తరంగాల మీదనుంచి తేలివస్తున్న పిల్లగాలి..
ఎక్కడో వొరిలగ బృందావనం లోంచి వినిపిస్తున్న రసకేళీ..ఇలలోనే జయదేవుని ఆత్మని ఆవిష్కరించుకునీ కొన్ని అవేరాగాలు ఉంచేసి.. కొన్ని సౌలభ్యాన్ని బట్టి రాగాల్ని మార్చీ మొత్తానికి.. శ్రీకృష్ణ లీలా తరంగిణి అనే ఆంధ్రాష్టపది తయారైంది.

 

వీటిని పరిశీలించండి:

అష్టపది

మూలరాగం

అనువాదరాగం

ప్రళయ్ పయోధిజలే

మాళవ

సౌరాష్ట్ర

లలిత లవంగ

వసంత

అసావేరి

చందనచర్చిత

నామక్రియ

బేగడ

రసే హరిమివ

ఘార్జరి

జేజేవంతి

సఖిహే

మాళవగౌడ

మోహన

రతిసుఖసారే

ఘార్జరి

కేదారగౌళ

ముగ్డేమధుమధనం

వసంత

భైరవి

ప్రవిశరాధే

వరాళి

మధ్యమావతి

క్షణమిధునా

విభాస

సురటి


అటు సంస్కృతం మీద ఇటు తెలుగుమీద అపారమైన పట్టు ఉన్న కామ సముద్రం అప్పలాచార్యుల వారిశ్రీకృష్ణ లీలాతరంగిణి.. మువ్వగోపాలుడి మొలకి మరో బంగారు మొలతాడు..

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 



సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech