సుజనరంజని / శీర్షికలు  / శ్రీ శనీశ్వర శతకం


శ్రీ శనీశ్వర శతకం

                                              - అక్కిరాజు సుందర రామకృష్ణ

 

1. శ్రీకర బ్రహ్మ రుద్రులును సింధుజ వాణి నగేంద్రకన్యయున్
నీకు గలట్టి శక్తి కడ నిల్వగ లేరని వింటిదేవరా!
మా కుల దైవమౌ హరు డుమాపతియే నిను గెల్వజాలమిన్
వ్యాకుల పాటు జెంద నొకపాటియె నేనిక - శ్రీ శనీశ్వరా?!

2. రజతగిరీశు భక్తుడను, రాజిలు నాట్య కళావిదుండ - స
ద్విజుడను, నీకు దాసుడను, తెల్గు జనాళికి ప్రీతి పాత్రుడన్!
భజన మొనర్తు నింక నిను భక్తిని శ్రద్ధను దీక్షతోడ, నన్
సుజన విభూషితున్, సుగుణ సుందరు బ్రోవర - శ్రీ శనీశ్వరా!

3. పనిగొని కుష్ఠ రోగమును బాపుకొనంగను గొప్ప నిష్ఠ - నీ
జనకుని గూర్చి నాడు కవి చంద్రులు ధీనిధు లెల్ల మెచ్చగాన్
ఘనతర రీతి నొక్క శతకంబును వ్రాసిన ఆ ‘మయూరు’ నిన్
మనమున ప్రస్తుతింతు శుభమంగళ దాయక - శ్రీ శనీశ్వరా!

4. సత్యము చెప్పుచుంటి బుధ సన్నుత; ధాత్రిని పద్య శిల్పికిన్
మృత్యువులేదు; నా పలుకు మ్రింగుడు పట్టక పోయె నవ్య సా
హిత్య జనాళి కొందఱకి దెక్కడి పాపమొ? చెప్పిచూడు, లా
లిత్యపు రీతి నీవిక; ఫలించును మోదము - శ్రీ శనీశ్వరా!

5. సన్నుత హాస్య భాషణల, సత్య పథాన చరించి నట్టి, వి
ద్వన్నుతులైన ‘రామయ’ కు భవ్యగుణాన్విత ‘అన్నపూర్ణ’కున్
చిన్ని కుమారుడన్ సుగుణ శీలుడ ‘సుందర రామకృష్ణు’డన్
మన్ననలెన్నొగన్న అసమాన యశస్కుడ - శ్రీ శనీశ్వరా!

6. ఉన్నత శీలుడున్; నెఱ నియోగి ధరామర వంశ భూషణుం
డన్న ప్రశస్తితోడ నలరారుచు కావ్యజగత్తునన్ రసా
భ్యున్నత నవ్య సృష్టి కడు పొల్పుగ సల్పిన వాడనౌట, నే
నన్నను నాకవిత్వమన అందర కిష్టము - శ్రీ శనీశ్వరా!

7. పన్నగ భూషణున్ ‘శివుని’ - ‘పార్వతి’ నిన్ నగ రాజ కన్యకన్
చెన్నుగ నాదు గుండె గుడి నిల్పిన భక్తుడ గాన, భీతి - నా
కెన్నడు లేదు సుంతయును - ఏను ధరిత్రి వినూత్న కీర్తి సం
పన్నుడ; సత్యనిష్ఠుడ; విభాకర నందన - శ్రీ శనీశ్వరా!

8 నన్నయ తిక్కనన్ పరమ నైష్ఠికు నెఱ్ఱిన, సీస పద్య సం
పన్నుని కొండవీటి కవిభాస్కరు; అందము చందమందు ఆ
క్రొన్ననవిల్తు మించు కవిలోక పురందరు రామ లింగనిన్
మన్నన జేతు భక్తి; కవి మాన్యుల నెల్లర - శ్రీ శనీశ్వరా!

9. ధీ సముపేతులై భువి నుతింగని, వాణిని పల్కురాణినిన్
బాసల తల్లినిన్ పరమ భక్తుని గొల్చిన నాటి పద్య వి
ద్యాసముపేతు లందరకు తత్పర బుద్ధి నమశ్శతంబులన్
దాసుడనౌచు నెనిడెద - తామర సాప్తజ - శ్రీ శనీశ్వరా!

10. ఎన్నగ అన్నలెందరొ అహీన యశస్కుల ఆంధ్ర మందు ‘తి
క్కన్న’లు ‘పోతన’ల్ ఘనులు ‘గౌరన’లున్నను ‘చేమకూర వేం
కన్నకు’ సాటిగా రతనిఆతడె సాటితలంప - వానికో
యన్న! నిజంబు నా హృదయ మమ్మక చెల్లదు - శ్రీ శనీశ్వరా!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech