సుజనరంజని /  కబుర్లు   /  పట్టాభిరామాయణం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

థాట్ ఎటాక్

  "నేను ఓకే! మీరూ ఓకే!" ఇలా భావించేవారికి మనశ్శాంతికి కొదవ లేదు. కుటుంబంలో ఉండే అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అవసరమైతే ఒకరినొకరు క్షమించుకుని ప్రశాంతంగా జీవనం కొనసాగవచ్చు. ఎదుటివారు చేసిన తప్పుల్ని తలచుకుని ఆగ్రహావేశాలు పెంచుకునేకన్నా విశాల హృదయంతో వారిని క్షమించానని అనుకోండి. దానివల్ల ఎంత హాయి ఉంటుందో అనుభవించిన వారికి తెలుస్తుంది.  


20వ శతాబ్దంలో హార్ట్ ఎటాక్‍లు ఎక్కువయ్యాయి. హార్ట్ ట్రబుల్స్ పెరిగాయి. సైకాలజిస్టుల విశ్లేషణ ప్రకారం 21 వ శతాబ్దంలో థాట్ ఎటాక్స్ అధికంగా ఉంటాయని తేలింది. థాట్ ట్రబుల్స్, థాట్ ప్రోబ్లెమ్స్ పెరగబోతున్నాయి. అంటే మన ఆలోచనలే మనను మంచం పట్టించగలవు. మరో కొన్ని రోజుల్లో మనం ఆదుగిడబోతున్న మిలినియంలో మనశ్శాంతితో ఉండే ప్రయత్నం చేద్దాం.


ఈ ప్రపంచంలో ప్రతి భర్త, అంటే దాదాపు 95 శాతం మంది, తాను మంచివాడినని, తాను చేపట్టే ప్రతి పని వెనుకా ఒక మంచి దాగున్నదని, తన మంచితనం గురుంచి ఏదో ఒక రోజు ఇతరులు తెలుసుకుంటారని భావిస్తూంటారు. ఆ అలోచనతో తాను అనుకున్నవి చేస్తూ తన పద్దతి లోనే కుటుంబ సభ్యులు ఉండాలనుకుంటారు. కానీ కుటుంబ సభ్యులకు తమ పద్దతులు ఇష్టమో, కాదో ఆయన పట్టించుకోడు. దాని వల్ల కుటుంబంలో కలతలు, మనశ్శాంతి లోపం, పిల్లలు ఎదురు తిరగడం, చివరికి పరిస్థితి గందరగోళంగా తయారవడం జరుగుతాయి.

ఈ మధ్య మా క్లినిక్ కు ఒక పెద్ద మనిషి వచ్చాడు. తండ్రితాతలు వ్యవసాయం చేసేవారట. ఈ వ్యక్తి ఇంజనీరింగ్ చదివి, వ్యవసాయ భూములకు పనికివచ్చే పరికరాలను తయారుచేసే పరిశ్రమ పెట్టాడు. ముగ్గురు పిల్లలు, భార్య, ఇల్లు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదని వచ్చాడు.

"మనశ్శాంతి లేకపోవడం అంటే ఏ విధంగా" అని అడిగాను.

"అంటే... ఇంత కష్టపడి పైకి వచ్చాను. నన్ను మా ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోడం లేదు!" అంటూ తన మాతృ భాష అయిన హిందీలో చెప్పసాగాడు. "మా నాన్న నేనంటే చిరాకు పడతాడు. మా ఆవిడ ఒక మూర్ఖురాలు. ఎంతసేపు ఆమె తన తల్లితండ్రులకి దోచిపెట్టాలని చూస్తుంది. ఇకపోతే, మా పిల్లలు... రాక్షసులు! ఒక్కరికీ క్రమశిక్షణ లేదు. ఒక్కోసారి జీవితం మీద విరక్తి కలుగుతుంది. నాతో మా ఆవిడ పోట్లాడే పద్దతి చూస్తుంటే ఆమెని చంపి, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది.!"

"మీ కుటుంబవ్యక్తుల ప్రవర్తన మీకు నచ్చకపోతే మీలో ఏదో ఒక లోపం ఉండిఉండచ్చు కదా!"

"నాలో లోపమా?. నేనింత కష్టపడి వారికి పెడుతున్నాను. ఒకవేళ నాలో లోపం ఉన్నా, వారికి వేలెత్తి చూపే హక్కు లేదు. నా సంపాదన మీద బతుకుతూ నాకే నీతులు చెప్పడమా?"

"అంటే, వారికి స్వతంత్ర భావనలుండవా/ మీవరకూ మీరు ఓకే అనుకుంటే ఎలా? ఎంతయినా వాళ్ళూ మీ కుటుంబ సభ్యులే కదా? వారికి మీ నియంతృత్వ ధోరణి వల్ల విసుగు కలగవచ్చు కదా, వారికి కూడా జీవితం పట్ల విరక్తి కలగవచ్చు కదా, ఏమంటారు?"

"అయితే నన్నేం చెయ్యమంటారు? అందరూ కలసి గంగలో దూకి ఆత్మహత్య చేసుకోమంటారా? చెప్పండి. చేస్తాం! ఈ మధ్య అటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి.!" అన్నాడు ఆవేశంగా.

"అనవసరంగా ఎగ్జయిట్ అవకండి. మీ ఆగ్రహావేశాలు మీకు అనారోగ్యాన్ని కలిగించగలవు. శాంతంగా ఆలోచించడి. అదృష్టవశాత్తూ మీకు వ్యాపారంలో, వ్యవహారాల్లో సమస్యలు లేవు. ఎటొచ్చీ ఇంటిదగ్గర మాత్రమే అడ్జెస్ట్‌మెంట్ ప్రోబ్లమ్స్ ఉన్నాయి. అవి మీరు పరిష్కరించుకునే స్థాయిలోనే ఉన్నాయి. దానికి కొంచెం ఓపిక కావాలి. అహం, ఆవేశం తగ్గాలి. ఆగ్త్రహం పనికిరాదు. నేను చెప్పినట్లు చేస్తే ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండవచ్చు!" అన్నాను.

"ఏం చెయ్యమంటారు? వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటారా"


"ఆ అవసరం లేదు. నేను నాలుగు రకాల స్థితుల్ని వివరిస్తాను. ఇందులో ఏది బెటరో మేరే నిర్ణయించుకోండి.

1. నేను ఓకే మీరు ఓకే కాదు. (Iam OK you are not OK)
2. నేను ఓకే కాదు, మీరు ఓకే (Iam not OK you are OK)
3.నేను ఓకే కాదు, మీరు ఓకే కాదు (Iam not OK you are not OK)
4.నేను ఓకే! మీరూ ఓకే. (Iam OK you are OK)

మొదటిది - "నేను ఓకే, మీరు ఓకే కాదు". మీరు ప్రస్తుతం ఊ స్థితిలో ఉన్నారు. మీవరకూ మీరు ఓకే అనుకుంటే సరిపోదు. ఇతరులను కూడా ఓకేగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. వారి సమస్యలని సానుభూతితో అర్థం చేసుకోవాలి. దానికి మీరు అంత ప్రాధాన్యమివ్వరు.

రెండవది- "నేను ఓకే కాదు, మీరు ఓకే!". ఈ బాపతు వ్యక్తులు ఆత్మ న్యూనతా భావంతో భాధపడ్తూ ఉంటారు. తాము అందంగా లేమని, ధనిక వంశంలో పుట్టలేదని, తమ వెనుక గాడ్ ఫాదర్ ఎవరూ లేరని, తనను ఇతరులు అణిచివేస్తున్నారని, అందుచేతనే తాముపైకి ఎదగలేకపోతున్నామని బాధపడుతూ, ఎదుటివారిని అదృష్టవంతులుగా భావిస్తారు. బహుశా మీ కుటుంబ సభ్యులూ ఈ విధంగా భావిస్తూండవచ్చు.

మూడవది " నేను ఓకే కాదు, మీరూ ఓకే కాదు!" మీకు ఇప్పడు ఈ ఆలోచనలు వస్తున్నాయి. నేను సంతోషంగా లేను, ఇంట్లో వాళ్ళందరూ కూడ సంతోషంగా లేరు కాబట్టి, అందరూ కలసి గంగలో దూకుదాం అనే ఆలోచన అతిహేయమైనది. దానివల్ల ఎవరికీ లాభం లేదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు, తమ తల్లితండ్రుల విషయంలో పోట్లాడుకుని "మీ వాళ్ళింటికి నువ్వు వెళ్ళొద్దు, మా వాళ్ళింటికి నేను వెళ్ళను. వాళ్లు మన గుమ్మం తొక్కకూడదు. మనం వాళ్ళ గుమ్మం తొక్కద్దు!" అనే నీచమైన నిర్ణయాలు తీసుకుని తమ పిల్లలను తాత,అమ్మమ్మల ప్రేమకు దూరం చేస్తారు. దీని ప్రభావం వాళ్ళకు వృద్దాప్యంలో కనబడుతుంది. ఇందులో సుఖపడేది ఎవ్వరూ లేరు, వాళ్ళకి ట్రీట్ చేసే వైద్యులు తప్ప.

చివరగా"నేను ఓకే! మీరూ ఓకె!" ఇలా భావించేవారికి మనశ్శాంతికి కొదవ లేదు. కుటుంబంలో అందరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, అవసరమైతే ఒకరినొకరు క్షమించుకుని ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు. ఎదుటివారు చేసిన తప్పుల్ని తలచుకుని తలచుకుని ఆగ్రహావేశాలు పెంచుకోడం కన్నా, విశాల హృదయంతో వారిని మనసులోనే క్షమించానని అనుకోంది. దానివల్ల ఎంత హాయిగా ఉంటుందో అనుభవించినవారికి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పంది, ఈ నాలుగింటిలో ఏ పద్దతి సమంజసం అంటారు?"

"వేరే చెప్పేదేముంది?. నాలుగో పద్దతే న్యాయంగా ఉంది. అది సరే. మీరు చెప్పినట్లు నేను మారతాను. కానీ వాళ్ళు కూడా మారాలి కదా?"

" ముందు మీరు మారండి. ఆటోమేటిగ్గా వాళ్లు మారతారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. నిజానికి మారవల్సింది మీరే!" అంటూ నవ్వుతూ లేచాను.

Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech