సుజనరంజని / కథా భారతి  / కథా విహారం .


కథా విహారం 
 మనస్తత్వ వైచిత్రిని కథానికా పాత్రగతం చేసిన ‘మంజుశ్రీ’

                       
రచన : విహారి

 

డా|| అక్కిరాజు రమాపతిరావుగారు తమ ‘మంజుశ్రీ’ కలం పేరు గురించి ఇటీవల రాశారు. అడవి బాపిరాజు అంటే ఇష్టం కాబట్టి హిమబిందు నా ప్రభావ శీలమైన వయసులో చదివాను కాబట్టి, సుప్త (అవ) చేతనలో ఈ పేరు పదిలంగా ఉందేమో! తథాగతుడు కూడా మంజుశ్రీ నేనేమో! ‘హిమబిందు’ లో ‘మంజుశ్రీ’ పేరుని పెట్టుకునే ముందు 1953 డిసెంబర్ 12 `తెలుగుస్వతంత్ర’లో స్కెచ్ లాంటి చిన్నకథ ‘పతి’ అనో ‘శ్రీపతి’ అనో అచ్చయిందట. అదేమొదటికథ! 56 ఏళ్ళ రచనా ప్రస్థానంలో మంజుశ్రీ చాలా కథానికలు, నవలలు, వ్యాసాలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. 10 జీవిత చరిత్రలు వెలయించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి మీద సాధికారికమైన పరిశోధన చేసి ప్రసిద్ధి చెందారు. అనేక ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

కథానికా రచయితగా మంజుశ్రీ తమ ‘మంచుకురిసిన రాత్రి’, ‘మైథిలి’, ‘జీవిత దృశ్యాలు’, ‘నాతో పాటు నలుగురు’, ‘బహుకృత వేషం’, ‘పంచాక్షరి’ వంటి రచనలతో ప్రముఖుల ప్రశంసలు పొందారు. పాఠకుల ఆదరణా పొందారు. ‘గూడు వీడిన గోరువంక’, ‘బూటుకాళ్ళు’, ‘చివరకు మిగిలేది’ గల్పికలు కూడా తెలుగు స్వతంత్ర లోనే వచ్చాయి.

వస్తుపరంగా మనుషుల సున్నితమైన అనస్తత్వాల్లో జలతారు తెరలా అల్లల్లాడే వైరుధ్యాల్ని రసభరితంగా కథానికల్ని చేసే పదునైన కలం మంజుశ్రీ గారిది. కోరుకున్న యువతితో పెళ్ళికాకపోయిన తర్వాత కూడా ఆమె తనని కవ్విస్తూ ఉంటే ఆ యువకుని పరిస్థితి ఏమిటి? అదే ‘అగ్నిపుష్పం. శృంగార వాంఛలకీ, మనో చాంచల్యానికి వయసేం అడ్డం? పాపం. వయసు మళ్ళీన పెద్దాయన పనిమనిషిని ఆశిస్తే, ఆమె పాఠం చెప్పడం అవతలివైపు లో గమనిస్తాం. ఇలాంటి మనిషే, నిగ్రహం తప్పి అనుకున్నది తప్పి స్వైరవిహారం చేసే ఘటన ‘బహుకృత వేషం. డబ్బు డబ్బు లో ధనవ్యామోహం పర్వవసానాన్నీ, నేరాలకి పాల్పడే పరిస్థితినీ చెప్పారు.

కాగా మంజుశ్రీ గారి జీవితదృశ్యాలు కథానిక ఇటు మనస్తత్వ చిత్రణలోనూ జీవన తాత్త్వికతా స్ఫురణలోనూ ఎంతో గుణనైశిత్యంతో భాసించే కథ శివరావు వృద్ధుడు. రోగంతో మంచాన పడ్డాడు. డాక్టరు, భర్యా కొడుకూ, కోడలూ అందరూ ప్రత్యేకమైన శ్రద్ధతో చూస్తున్నారు. ఆయనకి వారి ఆదరణ, అభిమానం, కన్ సర్న్ - ఎంతో ఊరట నిస్తున్నాయి. రోగం కూడా మరి భోగమే. వేళకి అన్నీ అప్యాయతతో ఆరగింపచేసే వారుంటే! ఆ స్థితిలో ఆయనకి రకరకాల ఆలోచనలు, గతంలోని ఘటనలు దృశ్యకావ్యంలా తలపుకొచ్చాయి. జీవనవలయంలోని గతం, బాల్యం, విద్యార్ధిదశ, యౌవనం, సంసారం, భార్యాపిల్లలూ, అన్నీ స్మృతికొచ్చాయి. అన్ని నుభవాల సారం అనుభవైకవేద్యమైన ఆనందవిషాదాలు చర్వణం చేసుకున్నాడు. హఠాత్తుగా శివరావుఇ బతుకుమీద ఆశ.

బతకాల్సిందేననే సంకల్పం కలిగాయి. సంకల్పమే సగం బలం కదా. బతికాడు. ఎంతో ఆనందం.! అయితే అది ఒక చిత్రమైన పరిణామాన్ని తెచ్చింది. రోగిగా తనని అమిత ఆదరంతో, ప్రేమతో, శ్రద్ధతో చూసిన ఇంట్లో వారంతా ఇప్పుడు ఉదాసీనత ప్రదర్శించసాగేరనే భావన శివరావుని వేదనకు గురి చేయసాగింది. ఈ మనోవ్యథ ఆయన్ని కుంగదీయసాగింది. జీవితం ఏమిటీ? అనే ప్రశ్న కళ్ళముందు నిలిచింది. వాసాంచి జీర్ణాని యథా విహాయ...భగవద్గీ వొంటపట్టింది. జీవితాన్నంతా నేపథ్యంగా చూపుతూ బతుకులో ఒకవైపుని చూపిన ఆలోచనీయమైన కథానిక. అనుకున్నదానికీ అయినదానికీ మధ్యదూరం మనిషిని కుదుపుతుంది. విషాదమైనా సంతోషమైనా అంతే. మనస్సు పరిపరి ప్రకంపనలకి లోనవుతుంది. జీవితం గురించి ఆలోచించిన కొద్దీ, హేతుబద్ధమైన సరళరేఖలు కనిపించవు. సాఫీగా సాగాలనుకుంటే వంకరగా పోతూ ఉంటుంది బతుకు. ఇదీ అన్ని వ్యక్తిత్వాల్నీ అంతోయింతో గీతకి అటూ ఇటూ సంచలింపచేసే భౌతిక వాస్తవం. వీటి అద్భుదమైన వింగడింపే మంజుశ్రీగారి మంచి కథల్లోని కథనం, ఇతివృత్త పరిశీలస్నం. కథానికల్లో సంక్లిష్టపాత్రల్ని ఆవిష్కరించగలిగితేనే పద్మరాజుగారన్నట్లు ఈడొచ్చిన కథానికలు తయారవుతాయి. శివరావు, వల్లి వంటి కొన్ని అద్భుతమైన పాత్రలతో తెలుగు కథానికకి ఆ తేజోరేఖల్ని కూర్చిన గొప్ప రచయిత మంజుశ్రీగారు. 5 సంపుటల్లో ఉన్న వీరి కథానికలు ఈ తరం పాఠకులకి అవశ్యం పఠనీయం.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech