సుజనరంజని / సారస్వతం / గగనతలం

 

గగనతలము-24   

దశమ భావము 

          ఈ భావమును సాధారణముగ కర్మస్థానము అని అంటాము. వృత్తిని తెలుసుకొనుటకు ఉపయోగించు భావముగ దీనిని గుర్తుంచుకొనవలెను. ఉత్తర భారతదేశములో చాలా స్థానములలో ఈ భావమునుండే తండ్రిని గూర్చిన వివరములను తెలుసుకుంటారు. దక్షిణభారతదేశములో తండ్రిని గూర్చి తొమ్మిదవభావమునుండి తెలుసుకుంటారన్నది మనకు తెలిసిన విషయమే.

వృత్తి మనిషి జీవితాన్ని శాసిస్తుంది. అదే మన బంధాలకు ఆయువుపట్టు. అయినవారినుండి దూరముచెయ్యాలన్నా, బంధువులను పెంచాలన్నా, ఒకరు మనలను అభిమానించాలన్నా, ఒకరు మనను ద్వేషించాలన్నా అన్నింటికీ కారణము ఈ వృత్తియే. మనము చదివిన చదువుతో ఏమాత్రము సంబంధము లేకుండ మనకు ఉత్సాహాన్ని నిరుత్సాహాన్ని కూడ ఇవ్వగలగింది వృత్తి మాత్రమే. చదివిన చదువుతో సంబంధములేని వృత్తిచేస్తున్నామని మధనపడేవారిని మనము చాలామందినే చూస్తాము. గ్రహాధీనములైన మన బతుకులు అవి శాసించిన మార్గములో అవి ఏ వృత్తి చేసుకోవాలని శాసిస్తాయో అదే వృత్తిని మనము చేయవలసి వస్తుందనే నగ్న సత్యాన్ని మనము ప్రారంభదశలో ఒప్పుకొనడానికి సిద్ధపడము. కానీ పరిస్థితులు మనలను ప్రస్తుత స్థితికి తీసుకుని వచ్చినప్పుడు మనము చింతించక ఇంక ఏమి చేయగలము?

దశమభావాన్ని బట్టి మనము ఏరకమైన ఉద్యోగము లేక పని చేసి బతుకుతాము అన్న విషయమును తెలుసుకొనవచ్చును. ఈ విషయమును కొంత ముందుగా గ్రహిస్తే మనకు చాలావరకు సంతోషాన్నిచ్చే జీవితమును జీవించగలము. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతము విద్యలో చాలా మార్పులను మనము గమనిస్తున్నాము. ప్రాచీనకాలములో జ్ఞానార్జనకై విద్యను అభ్యసించేవారు. వృత్తి మాత్రము వారికి పరంపరగ, అనగ వారి తాతముత్తాతలనుండి చేస్తూ వచ్చిన వృత్తినే వారును చేసేవారు. కావున పరిస్థితులు ఇబ్బందికరముగ ఉండేవి కావు. ప్రస్తుతము దిశ మరియు దశ తెలియని దిక్కుతోచని స్థితిలో మన మనుగడ ఉందన్నది సత్యము. మనము ఒక వృత్తిని ఆశ్రయించువరకు మనము జీవితములో ఏమి చేస్తామో మనకే తెలియని పరిస్థితి. కావున ఈ పరిస్థితులలో మనము ముందుగనే వృత్తిని తెలుసుకుని దానికి తగ్గట్లు విద్యాభ్యాసము చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది.

ఇక్కడ వ్రాసిన విషయాలను చదివినపుడు చాలా మంది మనసులో ఒక ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానమును ఇచట ఇవ్వడము సమంజసము. పరంపరగ వచ్చిన వృత్తిని వారు ఆశ్రయిస్తారు అన్నప్పుడు గ్రహబలప్రభావమును మనము శూన్యమని భావించినట్లే అయ్యింది. అంటే మొత్తము మీద జాతకముల వ్యవహారమే అటకెక్కింది. కాబట్టి ఇవన్నీ బూటకము అని భావించడము సహజము. తమ వృత్తిని ఆచరిస్తూ కాలక్రమేణ వృత్తిని నిర్వహించు విధానమును మార్చిన వారు, పాలనా పరముగ, వివిధ రంగములయందు తమ వృత్తిని విదలి లేక పాక్షికముగ తమ వృత్తిని చేసుకుంటూ మిగిలిన వ్యాసంగములయందు దృష్టిని సారించిన వారి సంఖ్య పూర్వము చాలా ఎక్కువ. అనగ ఆ పరిస్థితులలో అసమంజస స్థితికి అవకాశములు చాలా తక్కువ. గ్రహప్రభావజన్యబలముచేతనే వర్తకము చేస్తూ పరిపాలనపై, శాస్త్రాధ్యయనము చేస్తూ ప్రశాసనికపదవులపై, వ్యాపారాదులయందు రాణించలేకపోవుటచే గుమాస్తా మరియు వివిధ ప్రభుత్వ కార్యములకు మారినవారి కథలు ఒకప్పుడు సామాన్యమైతే నేడు ఉన్న ఆసరా చెడుతూనే రోడ్లు పట్టేవారిసంఖ్య ఎక్కువ అన్నదీ జగమెరిగిన సత్యము.

దశమాధిపతి దుర్బలుడయ్యి శతృక్షేత్రములందు లేక షష్ఠాష్టమవ్యయములందున్న జాతకుడు కర్మహీనుడగును. అనగ అతను ఏ పనిని చేయనివాడు లేక ఏ పనియందు ఎక్కవ కాలము నిలబడలేనివాడును అగును. వ్యర్ధముగ కాలాయాపన చేయువాడని గూడ చెప్పవచ్చును.
దశమాధిపతి రాహువుతో కలిసి యున్నచే కర్మహీనుడగును.
కానీ రాహువుతో కలిసిన దశమాధిపతి కేంద్రకోణములలో ఉన్నచో సత్కర్మలను ఆచరించువాడగును.
సూర్యాది గ్రహములకు కారకత్వములు ప్రారంభదశలలో చెప్పబడ్డాయి. వానిని ఇక్కడ ప్రయోగిస్తే వివిధరంగములయందలి వృత్తులకు సంబంధించిన ఫలములను సులభముగ చెప్పవచ్చును.
లాభ భావము 
పేరుకు అనుగుణముగానే ఈ భావముయొక్క ఫలములను తెలుసుకొనవలెను. చాలా సందర్భములలో ఎక్కవగా పరిశ్రమించిన వ్యక్తి కన్నా తక్కువగా పరిశ్రమించిన వ్యక్తి అధికముగ లాభమును పొందడాన్ని మనము చూస్తాము. అటువంటి సందర్భములలో మనము ప్రత్యేకముగా దృష్టి పెట్టవలసిన భావమే ఈ లాభభావము. దీనినుండి మనము అన్నలను మరియు అక్కలను కూడ తెలుసుకునే ప్రయత్నము చేస్తాము.

లాభములో ఏ గ్రహముఉన్నా అది జాతకునికి అనుకూలములు మరియు లాభప్రదములు అగు ఫలములను ఇవ్వగలదని అందరి ఆచార్యుల వచనములు తెలుపుతున్నాయి. కాబట్టి ఆయా గ్రహదశలలో గ్రహముల స్వభావములకు తగిన కార్యములను చేపట్టుటద్వారా జాతకులు నిశ్చయముగా లాభమును పొందగలరనుటలో సందేహము లేదు. ఈ లాభస్థానము యొక్క స్వామిని మరియ అతని బలాబలములను బట్టి అన్నలు లేక అక్కలు జాతకులకు సహకరించు విధానము మరియు వారికి జాతకులు చేయగల సహాయసహకారములు, మరియు వారిమధ్యనుండు ప్రేమాభిమానముల మోతాదును బేరీజు వేయగల అవకాశములు చాలా ఉన్నాయి.

జాతకుని చక్రములో లాభాధిపతి స్వక్షేత్రములో లేక మిత్రక్షేత్రములో వున్ననూ ధర్మ కర్మాది పతులతో కలిసివున్ననూ విశేష ధనార్జన కలిగి మంచి పనులు చేయువాడగును.
లాభ స్థానములో రవి ఉన్నచో పిత్రార్జన కలిగి వుండును, కుజుడు ఉన్నచో సోదరుల వలన,  బుధుడు ఉన్నచో వ్యాపారపరంగా, గురుడు ఉన్నచో పుత్రులవలన, శుక్రుడు ఉన్నచో స్త్రీ మూలముగా, శని ఉన్నచో సేవకులవలన ధన లాభము వుండును. 
కేంద్రకోణాధిపతుల కలయిక రాజయోగములకు అవకాశమును ఇస్తుందన్న విషయము మనమిదివరకే తెలుసుకుని యున్నాము. అదే విధముగ దశమలాభాధిపతుల కలయిక కేంద్రకోణములలో సంభవించిననూ అది రాజయోగమునకు అవకాశమును ఇస్తుంది.

గ్రహములు మన చరిత్రను వ్రాయగలిగే సత్తా కలిగి ఉన్నాయన్నది మనందరికి తెలిసిన విషయమే. కానీ అవి కూడ తమ వంతు పనిని బలమును కలిగి ఉన్నప్పుడు మాత్రమే చేయగలవు. బలము మాత్రమే సరిపోతుందా అంటే అవి ఉన్న స్థానము మరియు అవి ఆధిపత్యము వహించు స్థానము కూడ ముఖ్యమని గ్రహించాలి. ఈ విషయములన్నియూ బలాబలమును నిర్ణయించడములో భాగములే అయిననూ చాలా సందర్భములలో బలయుతములయిన గ్రహములు దుస్స్థానములయందుండుటవలన వాని వలన కలుగు మేలు కన్నా కీడే ఎక్కువగా కనిపిస్తోంది.

భాగ్యాన్ని తప్పించడము ఎవరి వలనా కాదు. ఏమి జరగాలో అదే జరుగుతుంది. చేసినది అనుభవించక తప్పదు. ఇలాంటి చాలా విషయములను మననము చేసుకున్నప్పుడు మనలో చాలా మందికి ఒక రకమైన భావన కలుగుతుంది. ఆ భావన సారాంశమేమిటంటే జరిగేది తప్పనప్పుడు మీనమేషములు లెక్కపెట్టడము అవసరమా అని. ఒకవిధంగా చూస్తే ఇది నిజమే కదా¿ మరి మనము ఇంతలా ఈ విష.యములను ఎందుకు చర్చిస్తున్నాము¿ నిజంగా మీకు కూడ అలానే అనిపిస్తోందా¿ అయితే మనము ఈ విషయాలను వచ్చే నెలలో చర్చించుకుందాము. కానీ ఈ చర్చ ఒకవైపునుండి కాకుండ రెండువైపులనుండి జరిగితే బాగుంటుంది. అప్పుడే దానిలో దాగున్న నిజాలు మనకు తెలిసే అవకాశము వస్తుంది. కాబట్టి మీకీ విషయములో ఏదైనా స్పష్టమైన ఆలోచన ఉంటే లేక దీనిపై మీకు ప్రత్యేకములైన అనుభవములు ఉంటే తప్పకుండ స్పందించండి. అది సకల జనుల శ్రేయస్సుకు దారితీయవచ్చు.
సశేషము........................

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech