సుజనరంజని /  శీర్షికలు   /  ఎందరో మహానుభావులు

 

ఎందరో మహానుభావులు - భూలోక చాపచుట్టి బొబ్బిలి కేశవయ్య

                - తనికెళ్ళ భరణి

 

కవులకూ, కళాకారులకూ
ధిషణాహంకారం  అలంకారం
కానీ దురహంకారం కూడదు.
ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము...
అన్న తిరుపతి వెంకట కవులే..
ప్రజ్ఞానిధులంచు పేరుగొనినారము
నీవలనన్ సరస్వతీ...అన్నారు.
అంచేత విద్యతో పాటు వినయ సంపద ఉంటేనే శోభిస్తుంది.
ఇంతెందుకు శ్రీనాథుణ్ణీ.. డిండిమ భట్టారకుణ్ణీ తీసుకోండి!!
ఎంత అహంకరించాడు డిండిమభట్టు..
ఎంత అవమానించాడు.
మిగతా విద్వాంసుల్ని..చివరికేమయిందీ!!
డొక్కా..ఢక్కా...రెండూ బద్దలయ్యాయ్!!
కవి సార్వభౌముడికి కనకాభిషేకం జరిగింది.
ధరిత్రి పులకరించింది.
చరిత్ర పన్నీరు చిలకరించింది.
డిండిమభట్టు వంటి అహంకారే బొబ్బిలి కేశవయ్య!

విజయనగరం వారు బొబ్బిలికోట ముట్టడించాక.. బొబ్బిలి వైభవ మంతా పోయాక..
రాజారాయుడప్ప కాలంలో బొబ్బిలిలో ఓ వేణుగోపాలస్వామి ఆలయం వెలిసింది.
మళ్ళీ కళలూ.. కళాకారులూ.. సంగీతం..సాహిత్యం
మొలకెత్తుతున్న దశలో కేశవయ్య బొబ్బిలి ఆస్థాన విద్వాంసుడిగా నియమింపబడ్డాడు.
చిన్న వయస్సే.. ఉన్నట్టుండి.. తల్లిగారు పోయారు.
కేశవయ్య మహా బెంగపడిపోయాడు.
కొన్నేళ్ళపాటు మళ్ళీ తంబూర ముట్టుకుంటే ఒట్టు!
కానీ రాజా వారికి కేశవయ్య అంటే వల్లమాలిన ప్రేమ
అంచేత ఆస్థానంలో ఉంటే ఇలా బెంగతోటే విద్యంతా నాశనం చేసుకుంటాడు..గనుక..
వివిధ ఆస్థానాలకి పోటీకి పంపించడం ప్రారంభించాడు.
కేశవయ్య.. ఒక్కసారి జూలు దులిపీ సింహంలా ఆస్థానాల మీద పడ్డాడు.
ఏదైనా ఆస్థానానికెళ్ళడం
నాతో పాటే చేయగల విద్వాంసుడున్నాడా అని అడగడం
సభ జరగడం. సభలో జగన్మోహనంగా పాడ్డం.
అంతా చప్పట్లు కొట్టడం..శాలువాలు కప్పడం..
సన్మానాలు చెయ్యడం.
కానీ.. దీంతో కేశవయ్య అహం చల్లారేది కాదు.
ఓడిపోయిన విద్వాంసుడి తంబురా లాగేసుకునేవాడు.
అసలు కండీషను అదీ!
నాతో ఎవరన్నా ఓడిపోతే, ఓడిపోయిన వాడు తంబురా, ఇతర బిరుదులు అప్పగించి దణ్ణం పెట్టి వెళ్ళిపోవాలి..
తంబుర ఇచ్చెయ్యడం అంటే సంగీత విద్వాంసుడికి తలకాయ నిచ్చెయ్యడమే గదూ!
అంతకన్నా అవమానం ఉందా!!
కానీ ఏం చేస్తాం.. అది కేశవయ్య షరతు!
లెక్కకుమించిన సంస్థానాలకెళ్ళి సంగీతంలో వాళ్ళని ఓడించి..వందల కొద్దీ తంబూరాలు.. పతకాలు తీసుకొచ్చి..తన ఇంట్లో పెట్టుకున్నాడు.
ఓ రాత్రి వేళ..
విజయగర్వంతో నిద్రపట్టలేదు కేశవయ్యకు.
దీపం బుడ్డితో తన మ్యూజియం కెళ్ళాడు.
చుట్టూ మౌనంగా తంబూరాలు.
తలలు వాల్చేసిన సంగీత విద్వాంసుల లాగా..
సిగ్గుతో..అవమానంతో బిగదీసుకుపోయిన మోగని, తీగలు..
కేశవయ్య వికటాట్టా హాసం చేశాడు.
అచ్చం..శ్మశానం మధ్య కాగడాతో తిరిగే కాటికాపరిలా ఉన్నాడు.
పరాయి స్త్రీల మాంగల్యాలని తెంపీ గుత్తిగా పట్టుకున్న పరమ పాపిలా ఉన్నాడు.
వేయికోయిలల మధ్య గండభేరుండంలా ఉన్నాడు.
వంద కుందేళ్ళ మధ్య గుంట నక్కలా ఉన్నాడు.
గోవుల మంద మధ్యన చిరుత పులిలా ఉన్నాడు.
అతను సంగీత విద్వాంసుళ్ళాలేడు.. మల్ల యుద్ధం చేసే పహిల్వాన్ లా ఉన్నాడు.
అతని చేతిలో తంబూరా పాతకాలపు ఫిరంగిలా ఉంది.
మళ్ళీ కరువుదీరా కసితీరా నవ్వుకున్నాడు.
నేనెవణ్ణి..బొబ్బిలి కేశవయ్యను..
వొట్టి బొబ్బిలి కేశవయ్యను కాను
గాన కేసరి కేశవయ్యను కాను
గాన కేసరి కేశవయ్యని
స్వరవీర బెబ్బులి.. బొబ్బిలి కేశవయ్యని..
ప్రళయకాల ‘ఝంఝామారుత’ ఇత్యాది బిరుదాల్ని పొందిన బొబ్బిలి కేశవయ్యని.
దేశంలోని ఎంతోమంది సంగీత విద్వాంసుల్ని జయించీ.. ‘భూలోక చాపచుట్టి’ అనే బిరుదిని సొంతం చేసుకున్న బొబ్బిలి కేశవయ్యని!!
ఒక్కసారి తుంబూరలు విషాదంగా మోగడం ఆరంభించాయ్!!
వేయితీగల నాద ఘోష!
కైపుతలకెక్కి.. నిద్రలోకి జారిపోయాడు.
జారిపోయాడు..జారిపోతున్నాడు..
జా..రి..పోతు..న్నాడు!!
సరస్వతి కచ్చపిని శృతి చేసుకుంటూ
మర్మగర్భంగా నవ్వింది!!

* * *
తంజావూర్ ని తులజాజీ మహారాజు పాలిస్తున్న కాలం.
తంజావూరులో అడుగుపెట్టాడు ‘భూలోక చాపచుట్టి.
మహారాజా వారి గుండెల్లో .. మృదంగాల మోత..
సింహనాదం చేస్తున్నాడు..
బొబ్బిలి కేశవయ్య!
మహారాజా వారు కంగారు పడిపోయారు.
గత్యంతరం లేక..వెళ్ళి
శ్యామశాస్త్రి కాళ్ళమీద పడ్డారు..!!
మీరొచ్చి పరువు కాపాడాలి.
నేను రాజాస్థానాలకు రాను.
సంస్థానం పరువు పోతుంది.
...’
ఆత్మహత్యే శరణ్యం..!
సరే పదండి..
అంతా కామాక్షీ దేవి కటాక్షం...
పోటీకి వెళ్ళేముందు తన ఆరాధ్య దైవం కామాక్షిని
‘దేవీ సమయమిదే.’ అంటూ ‘చింతామణి’ రాగంలో స్తుతించాడు. శ్యామశాస్త్రి.
పోటీ మొదలైంది.
చెలరేగి పోతున్నాడు...కేశవయ్య.
సౌమ్యంగా మందహాసం చేస్తున్నాడు శ్యామశాస్త్రి...
మధ్యాన్న మార్తాండుడిలా..కేశవయ్య.
శరత్ పూర్ణిమలా శ్యామశాస్త్రి..
ఝంఝామారుతంలా కేశవయ్య..
మలయ మారుతంలా శ్యామశాస్త్రి
ఒకటి ప్రళయ సాగరం..
రెండోది మందాకిని..
‘సింహనందన’ తాళంలో పంజా విప్పాడు బొబ్బిలి కేశవయ్య!

సభ అవాక్కైపోయింది.
శ్రోతలు అప్రతిభులై పోయారు.
రాజావారికి మతి పోయింది.
చేతులు వణికాయ్!!
ఇప్పుడు శ్యామశాస్త్రి వంతు
తల్లి కామాక్షమ్మను మనసులో స్మరించుకుని
‘శరభ నందన’ అనే నూతన తాళం మొదలుపెట్టాడు!!
స్వర పరంపర కురుస్తోంది.
బిత్తర పోయాడు కేశవయ్య..
కళ్ళు మూసుకుని గానం చేస్తున్న శ్యామశాస్త్రి ఏవో దృశ్యాలు కనబడుతున్నాయ్
అహంకార హిరణ్య కశిపుని కడుపుని గోళ్ళతో చీరేస్తున్న నారసింహ రూపం...
అజ్ఞానాన్ని తొక్కేస్తున్న నటరాజ స్వరూపం..
తర్వాత అమ్మల గన్నయమ్మ..కామాక్షీదేవి..
అప్రయత్నంగా చేతులు జోడించి...అశ్రువుల్తో
శ్యామశాస్త్రి పాదాల్ని తడిపేశాడు.
‘భూలోక చాప చుట్టి’!!!
(సంగీత త్రయం  త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్ శ్యామశాస్త్రిలలోని  శ్యామశాస్త్రే ఈయన)

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech