సుజనరంజని / సారస్వతం / భట్టారక సంప్రదాయం

 

భట్టారక సంప్రదాయం

                                                              రచన : ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.

  ఈ వ్యాసం నేను గత నెలలో అమెరికాలో ఉన్నప్పుడు రాశాను. దీని నేపథ్యాన్ని కొంచెం వివరించాలి. నేను అమెరికాలో దగ్గర దగ్గర మూడు నెలలు ఉంటే అందులో రెండు నెలల పైచిలుకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని సన్నీవేల్ లోనే ఉన్నాను. అమెరికా వెళ్ళక మునుపు నేను హైదరాబాద్ లో అంతర్జాలం లో తెలుగు వాడకంపై జరిగిన ఒక సదస్సుకు హాజరయ్యాను. ఆ సందర్భంగా ఆ సదస్సుకు అధ్యక్షత వహించిన కాలిఫోర్నియా నివాసి, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారితో కొద్దిపాటి పరిచయమేర్పడింది. అంతర్జాలంలో తెలుగు భాషను మరింత ఎక్కువగా వాడకంలోకి తేవాలనే వారి తపన, అందుకు వ్యక్తిగతంగానూ, వ్యవస్థాపరంగానూ వారు చేస్తున్న అవిరళ కృషి నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. కంప్యూటర్, ఇంటర్నెట్ లపై నాకున్న పరిజ్ఞానం అంతంత మాత్రమే. అంతర్జాలంలో తెలుగు వాడకం నాకు మరీ కొత్త. కనుక వారితో కాసేపు ముచ్చటించి కొన్ని మెళుకువలు గ్రహించదలచాను. అయితే అందుకు తగిన సమయం కాదని ఎంచి, నేను అమెరికా వచ్చినపుడు కలుసుకుంటానని వారితో చెప్పాను. వారు అలాగేనని తమ విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చే ముందు తన మెయిల్ ఐ.డికి విద్యుల్లేఖా సందేశం ఇచ్చి రమ్మన్నారు. అమెరికాలో నేను ఉంటున్న ప్రదేశానికి వారి నివాస స్థలం అతి సమీపంలోనే ఉంది. అయినా అమెరికన్ సంప్రదాయం ప్రకారం ముందుగా మెయిల్ ఇవ్వడం లేదా ఫోన్ చెయ్యకుండా ఎవరూ ఎవరి దగ్గరకి వెళ్ళరు. అందుకే నేను అమెరికా వెళ్ళగానే ఒక ఈమెయిల్ ఇచ్చాను. స్పందన లేకపోతే కొన్నాళ్ళు ఆగి మరొక ఈమెయిల్ ఇచ్చాను. అందులో నా ఫోన్ నెంబరూ, చిరునామా ఇచ్చాను. ఫోన్ చేసి సందేశం కూడా ఇచ్చాను. వారి మెయిల్ ఐ.డి.నాకు తెలిసిన రోజు నుండీ చరిత్ర, తత్త్వ శాస్త్రం, వర్తమాన రాజకీయాలు, పర్యావరణం వగైరా అంశాలపై ఎప్పటికప్పుడు నేను రాసిన వ్యాసాలను నా ఇతర మిత్రులతో బాటు వారికీ మెయిల్ చేస్తూనే ఉన్నాను. (వీటిలో చాలా మేరకు వివిధ, దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమైనవే). ఈ మెయిల్స్ వేటికీ స్పందన రాకపోవడంతో ఆనంద్ గారు నాకు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ను పరిశీలించి దానిపై ఇవ్వబడిన www.siliconandhra.org వెబ్ సైట్ లోకి వెళ్ళా, వారికి సంబంధించిన ఇతర ఫోన్ నెంబర్లూ, మెయిల్ ఐ.డి.లు ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామని. అప్పటి వరకూ ఆ సైట్ లోకి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. సిలికానాంధ్ర సంస్థ విశిష్ట కృషిని అప్పుడే తెలుసుకోగలిగాను. ఆ సంస్థ తెలుగు సాంస్కృతిక వైభవ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు అప్పుడే గ్రహించాను. సిలికానాంధ్ర సంస్థను స్థాపించి పదేళ్ళు అయ్యిందనీ, ఆ సంస్థ నృత్య, సంగీత శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నదనీ తెలుసుకున్నాను. అంతేకాదు, ఆ సంస్థ ‘సుజన రంజని’ (అంతర్జాల సాహితీ పొదరిల్లు) పేరిట చక్కని ఎలక్ట్రానిక్ మాస పత్రిక కూడా నడుపుతున్నట్లు తెలుసుకుని ఆ పత్రిక గత సంచికలన్నీ కూడా ఓ మారు తిరగేశాను. ‘ఎందరో మహానుభావులు’ శీర్షికన ప్రముఖ చలనచిత్ర నటులు, రచయిత, తనికెళ్ళ భరణి గారు కొందరు ప్రముఖ సంగీత విద్వాంసులను పరిచయం చేస్తూ రాస్తున్న వ్యాసాలు , వనం జ్వాలా నరసింహరావు గారి వ్యాసాలు, పట్టాభిరామాయణం పేరిట బి.వి.పట్టాభిరాం గారు రాస్తున్న వ్యాసాలు నన్ను ఆకట్టుకున్నాయి. ‘మా నాన్నకు జేజేలు’ శీర్షికన ప్రచురితమౌతున్న వ్యాసాలు మనలోని మానవీయ విలువలను తట్టిలేపేవిగా ఉన్నాయి. తల్లాప్రగడ రావు గారి సంపాదకత్వంలో విశిష్టమైన రీతిలో ఈ ‘ఈ-పత్రిక’ నడపడమే కాక అంతర్జాలంలో తెలుగు వాడకానికి మరింత ప్రాచుర్యం కలిగించడానికి సిలికానాంధ్ర సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ లో మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు నిర్వహించనుండడం విశేషం. అదలా ఉంచి సుజనరంజనిలో ‘రచనలకు ఆహ్వానం’ పేరిట గల శీర్షిక క్రింద ‘మీలోని పరిశోధకుడు ఎవరికీ తట్టని అంశాలను అప్పుడప్పుడూ అయినా విప్పి చెబుతున్నాడా? అయితే ఇంకేం? ఇక మీరు కలం చేపట్టాల్సిందే! మీలాంటి వారి కోసం మీ రచనల కోసం ‘సుజనరంజని’ పలుకుతున్న ఆహ్వానం అంటూ ప్రతి సంచికలో ఒక ప్రకటన ఉంటుంది. అది చదివి నేనీ పత్రికకు ఏ అంశం మీద రాద్దామా అని కొంత తడవు ఆలోచించాను. గత సంచికలు తిరగేస్తుంటే వాటిలో వ్యాసాలు రాసిన కూచిభొట్ల శాంతి, కాశీభట్ల ప్రవీణ్ గారల పేర్లు కనిపించాయి. ఇక సిలికానాంధ్ర వ్యవస్థాపకులు, స్ఫూర్తి ప్రదాత కూచిభొట్ల ఆనంద్ గారి పేరు సరేసరి. అసలీ భట్ల, భొట్ల, భట్టు శబ్దాల వ్యుత్పత్తికి మూలమైన ‘భట్టారక సంప్రదాయం’ పైనే ఓ వ్యాసమెందుకు రాయకూడదు? అని ఆలోచించి వెంటనే కలానికి పదును పెట్టాను. కాలిఫోర్నియా లో ఉండగానే వ్యాసం చిత్తు ప్రతి పూర్తి చేసినా, ఆ తరువాత వెంటనే న్యూయార్క్, బోస్టన్, కనెక్టికట్ వగైరా ప్రాంతాలలో బంధు మిత్రులను బంధు మిత్రులను కలుసుకోవడానికి వెళ్ళడం కారణంగా దీన్ని గురించి ధ్యాసే పెట్టలేదు. ఇక ఇండియా వచ్చాక ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, నా రోజువారీ పనులు, ఇతర వ్యాసంగాలే సరిపోయాయి. ఇప్పుడు కొన్ని ఉటంకింపులూ, ఆకారాలు జతచేసి నా వ్యాసానికి తుదిరూపమిచ్చాను. అదీ ఈ వ్యాసం రాసిన నేపథ్యం.

నాందీ ప్రస్తావన:

తెలుగు వైదిక బ్రాహ్మణుల ఇండ్ల పేర్లలో ‘భట్ట’, ‘భట్ల’, ‘భొట్ల’ శబ్దాలు మనకు తరచుగా వినిపిస్తాయి. కూచిభొట్ల అనే ఇంటి పేరు వినగానే నాకు ముందుగా గుర్తొచ్చేవి కొన్నేళ్ళపాటు నాతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన తెలాని ఆర్.టి.సి. ఉద్యోగి కూచిభొట్ల లక్ష్మీపతి శాస్త్రి (కే.యల్.పి.శాస్త్రి) గారే. వారిది కృష్ణా జిల్లా పిచ్చికలగుడిపాడు. ప్రముఖ చలన చిత్ర హాస్య నటులు డాక్టర్ శివరామయ్య గారి ఇంటిపేరు కూడా కూచిభొట్ల అనీ, వారిది తెనాలితాలూకా చినపులివర్రు అగ్రహారమనీ ఎవరో చెప్పగా విన్నాను. యుద్ధానికి సన్నాహకంగా ‘కూచి’ చేస్తారు. కూచి అంటే ఒక వాద్య విశేషం. అయితే ఈ ఇంటి పేరులోని ఆ కూచి కాకపోవచ్చు. పెదపూడి, పెనుమంచి పేరుగల గ్రామాలకు సమీపంలోనే కూచిపూడి, కూచిమంచి వగైరా గ్రామాలు ఉండడాన్ని బట్టి ‘కూచి’ అనే శబ్దం కూసు (చిన్నtrifling) శబ్దానికి రూపాంతరమని గ్రహించవచ్చు. ప్రముఖ అభ్యుదయ రచయిత, కమ్యూనిస్ట్ మేథావి రాంభట్ల కృష్ణమూర్తి గారు ప్రసిద్ధులు. రేపల్లె తాలూకాలో రాంభొట్లవారిపాలెం అనే ఊరుంది. ప్రకాశం జిల్లాలో భొట్ల గూడూరు అనే ఊరు కూడా ఉంది. దీన్నిబట్టి ‘భొట్ల’ శబ్దం ‘భట్ల’ శబ్దానికి రూపాంతరమని గ్రహించగలం. తెనాలిలోని విష్ణుభట్ల వారిలో కొందరు తమ ఇంటిపేరును విష్ణుభొట్ల అని చెప్పుకుంటారు. వైష్ణవ సూచకాలైన విష్ణుభొట్ల, కేశవభట్ల, రాంభట్ల వగైరా ఇండ్లపేర్ల వలెనే త్రిపురారి (శివ) భట్ల, శంకరభట్ల వగైరా శైవ సూచకాలైన ఇండ్ల పేర్లనూ మనం చూడొచ్చు. సర్వదేవ భట్ల వారూ ఉన్నారు. సూర్యారాధనా సూచకమైన భాస్కరభట్ల వారూ ఉన్నారు. భవిష్యత్తు చెప్పే వృత్తిని సూచించే జోస్య భట్ల వారూ ఉన్నారు. కాశీభట్ల వారున్నట్లే కంచిభొట్ల వారు, పెద్దిభొట్ల వారున్నట్లే కూచిభొట్ల వారూ ఉన్నారు. ఆదిభట్ల వారూ ఉన్నారు. హరికథా పితామహుడు నారాయణ దాసు గారు ఆదిభట్ల వారే.

బ్రాహ్మణులలోని వైదికులలో `భట్ట’, ‘భట్ల’, ‘భొట్ల’ శబ్దాలు ఉన్నట్లే వైఖానసుల పేర్లలో ‘భట్టర్’ ‘భాట్టాచార్య’, ‘భట్టారాచార్య’ శబ్దాలూ, వారి ఇండ్ల పేర్లలో ‘భట్టర్’, ‘శేషభట్టర్’ వగైరా శబ్దాలూ కనిపిస్తాయి. తెనాలి రామకృష్ణ కై యొక్క వైఖానస గురువు ‘భట్టర్ చిక్కాచార్యులు’ అనే విషయం కవే స్వయంగా పేర్కొన్నాడు. రామకృష్ణ కవి చేత ‘శ్రీ ఘటికాచల మహాత్య్మము’ కావ్యంలో ‘వసుధామరాగ్ర్యులు’ (బ్రాహ్మణులలో శ్రేష్ఠులు) అని పేర్కొనబడిన ఈ వైఖానసులు మొదట ఉత్తర భారత దేశ నివాసులు. ముందుగా తమిళనాడు లోని షోలింగర్ సమీపంలోని ‘ఘటికాచలం’ (కడిగై)కి చేరుకున్న వీరు అక్కడి నుండి విష్ణువు ఆనతి మేరకు విష్ణువును అర్చించడం వృత్తిగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారని రామకృష్ణ కవి పేర్కొన్నాడు. వైఖానసులు రామానుజుని మరణం (క్రీ.శ.1137) తరువాత కొద్ది కాలానికి తెలుగు నేలకు వచ్చి స్థిరపడిన వారు కాగా ఆ తరువాత కొన్ని శతాబ్దాలకు దక్షిణ భారత దేశాన్నుంచి తెలుగు నేలకు వలస వచ్చిన శ్రీ వైష్ణవుల పేర్లూ, ఇండ్ల పేర్ల లోనూ ఇలాంటి భట్టర్ శబ్దాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణలుగా రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, మహిళా హక్కుల ఉద్యమకారిణి ఇలా భట్, రచయిత ఓంప్రకాష్ భట్, హిందీ చిత్ర దర్శక నిర్మాత మహేష్ భట్, చలనచిత్ర నటి పూజాభట్, విఖ్యాత శాస్త్రజ్ఞుడు శాంతి స్వరూప్ భట్నగర్ వగైరాలను చెప్పుకోవచ్చు. ఉత్తర భారత దేశాన్నుంచి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చిన వైదిక బ్రాహ్మణుల పేర్ల చివర ఉండిన ద్వివేదుల, చతుర్వేదుల, వాజపేయ యాజుల, జోస్యుల అని పేరుకు ముందు ఇండ్ల పేర్లుగా స్థిరపడినట్లే, ఉత్తరాది ‘భట్’ శబ్దమే తెలుగు ఇంటిపేర్లలోని ‘భట్ల’ గా రూపొందింది. కొన్ని తావులలో భట్ల శబ్దమే భొట్లగా రూపాంతరం చెందింది.

భట్ట శబ్ద వ్యుత్పత్తి:

అసలీ ‘భట్టు’, ‘భట్టారకుడు’ శబ్దాలకు మూలమేమిటో చూద్దాం. ఈ శబ్దాలకు మూలం సంస్కృత శబ్దమైన ‘భట్టా’, ‘విద్వాన్ కవయో భట్టా’ అని ఈ పదానికి నిర్వచనం. విద్వాంసుడు కవి కూడా అయితే అతడు ‘భట్ట’ లేక ‘భట్టు’ లేక ‘భట్టారకుడు’ అనబడతాడన్నమాట. కేవలం పాండిత్యమే కాక చక్కగా కవిత్వం చెప్పగలిగే భావనా చాతుర్యం కలవాడు భట్టు. ఒకప్పుడు రాజులు పాండిత్యం గల కవులకు ప్రత్యేకంగా భూరి మాన్యాలిచ్చి వారికి ఎటువంటి లోటూ రాకుండా పోషించేవారు. వారికి ప్రత్యేకమైన గౌరవ ప్రతిపత్తి కల్పించేవారు. ఇలా గొప్ప పాండిత్యం కల కవులను ప్రత్యేకంగా ఆదరించి పోషించే విధానాన్నే భట్టారక సంప్రదాయం అంటారు. రాచరిక యుగంలో ఈ సంప్రదాయం కొన్ని శతాబ్దాల పాటు నిరాటంకంగా సాగింది. పాండిత్యం గల కవులు, కవనం చేయగల పండితులూ ప్రత్యేక గుర్తింపుకూ గౌరవానికీ నోచుకున్నారు. కేవలం పండితులు లేక కేవలం కవులు అయినవారు రాజసభలలో సన్మానాలు, సత్కారాలు, సంభావనలూ పొందితే భట్టారకులు రాజుల నుంచి మాన్యాలూ, గ్రామాలూ, నల్లిండ్లూ (అగ్రహారాలు) పొందేవారు. అంతేకాదు; చక్కటి కవన చాతుర్యం కలవారికి పాండిత్యం గరపడానికీ, గొప్ప పండితులకు కవితారీతులు నేర్పడానికీ ప్రత్యేక ఏర్పాట్లు చేయబడేవి. ఇందుకోసం ప్ర్తత్యేకించి కొన్ని గ్రామాలను కేటాయించేవారు. ఘటికా స్థానాల వంటి శిక్షణా కేంద్రాలు ఉండేవి.

కొందరు ప్రసిద్ధ భట్టారకులు:
తెలుగు ఆదికవి నన్నయ్యను నన్నయ భట్టారకుడు, నన్నయ భట్టు అని వ్యవహరించడం మనమెరిగినదే. నన్నయ భట్టు తెలుగులో ఆదికవే కాదు. గొప్ప వ్యాకరణ పండితుడు కూడాను. ‘వాగనుశాసనుడు’ అనేది అతడి బిరుదు. తెలుగు వ్యాకరణంపై నన్నయ్య రాసిన సంక్షిప్త గ్రంథాన్ని వల్లె వేసేవారేమో. అలా వల్లె వేయడాన్ని ‘భట్టీయం వేయడం’ అనడం వాడుకైంది. ఆ పదమే ఇప్పుడు రూపాంతరం చెంది బట్టీ పట్టడం (Learning by rote) అయింది.

- సశేషం
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech