శీర్షికలు

పద్యం హృద్యం

 

నిర్వహణ - పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
చోరులు మంచి వారనుట చోద్యము కాదది ఎంచి చూడగన్!
(శ్రీ ఇంద్రగంటి సతీష్ కుమార్ గారు పంపినది)

గతమాసం ప్రశ్న:
రోహిణికార్తెలో చలికి లోకులు బాధలనొందురెప్పుడున్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సి

మోహన రాగమం దునను మోజుగ వేసవి లాస్యమా డగా
యూహల తేరుపై జనులు యూగిస లాడుచు సంతసిం చుచో
ఆహిమ బిందువుల్ చిలుక భానుని తేజము చల్లనౌ నటన్
రోహిణి కార్తెలో చలికి లోకులు బాధల నొందు రెప్పుడున్


వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం

ఊహకు నందనంతగను ఉష్ణము హెచ్చుగ నుండగా జనుల్
దేహము చల్లనైన నిక తీరును తాప మటంచు నెంచుచున్
ఆహ యటంచు వేయగను ఆఎసి ఎక్కువ చల్ల నైనచో
రోహిణి కార్తెలో చలికి లోకులు బాధల నొందు రెప్పుడున్


టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ

అహహ! వేసవీ! మిగుల యగ్నికణంబుల దీరుదోచగా!
దాహము దీరకన్ జనులు దారిన పానపు సేవలందుచున్;
మోహపు కూలరుల్ మరిగి మోదము మీరెడు శీతలమ్ముతో,
రోహిణి కార్తెలో చలికి లోకులు బాధల నొందురెప్పుడున్!


గండికోట విశ్వనాధం, హైదరాబాద్‌

గేహమునందు నెల్లడ బిగించిన శీతల వాయుయంత్ర సం
దోహ విముక్త వీచికలతోడ నకాలపు వానవెల్లువల్‌
దోహదమై చెలంగ , చలితో వణకించగ మేను, తద్గతిన్‌
రోహిణి కార్తెలో చలికి లోకులు బాధలనొందురెప్పుడున్‌


చావలి శివప్రసాద్, సిడ్నీ

ఆ హరివాహనుండు గతి యందును బైరిని దాటిఉత్తరా
రోహణుడై ప్రచండమున రోళ్ళను బద్దలు చేయ జేర, నో
హోహొ! హుహూ హుహూ హుహుహుహూయని వణ్కుచు యామ్య సీమలన్‌
రోహిణి కార్తెలో చలికి లోకులు బాధలనొందురెప్పుడున్‌

(హరివాహనుడు=సూర్యుడు; బైరి=మకరము; యామ్య సీమలు= దక్షిణ దేశములు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మొ.))


జంధ్యాల కుసుమ కుమారి,హైదరాబాదు

దాహము దాహమంచు పరితాపము తాళగ లేనిదెన్నడో
దేహముకంపితంబగుచు తేజ విహీనత చెందుటెందుకో
సాహస దీపమేమఱచి సాగిన నేమి ఘటిల్లునో,లలిన్,
రోహిణి కార్తెలో, చలికి, లోకులు బాధల నొందురెప్పుడున్
(లలిన్=వరుసగా)


శ్యామసుందర్ పుల్లెల, శాన్‌హోసె, కాలిఫోర్నియా

ఐహిక సౌఖ్యముల్ కొఱకు నాపని ఇంధన వాడకమ్ము చే
ఊహలకందనంతగను యుర్విన కాలము తారుమారగున్
ఆహిమకూటముల్ గరుగు, ఆగవు ఎండలు కార్తికమ్మునన్
రోహిణి కార్తెలో చలికి లోకులు బాధలనొందురెప్పుడున్

(ఇంధనకాలుష్యం మూలంగా ఋతువులు తారుమారవుతాయంటారు. ఆ దృష్టిలో పూరింపబడింది)




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)