జగమంత కుటుంబం

తరాలు - అంతరాలు - శ్రీ నందుల విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం

 

- నందుల వెంకటేశ్వర్రావు

నా మెదఢు ఒక కర్మాగారం. అది సమ్మెట దెబ్బలకి ఓర్చి జీవధారకి అవసరం అయిన చైతన్యాన్ని అందిస్తుంది"
ఈ విలువైన సందేశం మా నాన్నగారి విషయములో కూడా వర్తిస్తుంది. ఆయనే శ్రీ నందుల విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు. వృత్తి రీత్యా ఆయన సీనియర్ సూపెర్నెంట్ ఆఫ్ పొస్ట్ ఆఫీసెస్. రచయితగా ఆయన కలం పేరు "శ్రీ నందుల"

జీవితానికి ఒక లక్ష్యం ఉందని భావించిన కష్ట జీవి ఆయన. దానికి తగిన విధంగా క్రమశిక్షణ అలవరచుకున్నారు. జీవితంలో ఎట్టి పరిస్థితులకు తల వంచని ధృఢ వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇంటికి పెద్ద కొడుకు ఆయన.

సమాజానికి హితవు పలికే పురోహితులుగా బ్రాహ్మణులు అనేక గౌరవాలు, సన్మానాలు అందుకున్నారు. జీవన పోరాటం ఇంత కష్టంగా లేని రోజుల్లో అగ్రహారాలు మొదలైన వాటితొ సన్మానించబడి గురువులుగా, కవులుగా ప్రసిద్ధి చెందారు. మా తాత గారి ముందు తరాలకు భూములు, అగ్రహారాలు వుండేవి. బీరపాదు తంతు సంతానం ఉండేది. నీడ పట్టున కూర్చుని పాలు, నేతులతొ సుష్టుగా భోజనం చేసి ఆస్తుల్ని కరిగించేసారు మా పెద్దలు.

మా నాన్నగారి తండ్రి సత్య జగన్నాధం గారు. కన్నది ఏడుగురు మగ పిల్లల్ని ఒక ఆడ పిల్లని. ఆ రొజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. విచిత్రమేమిటంటే మా బామ్మగారి చెల్లెలికి కూడా దగ్గర దగ్గర పద్దెనిమిదిమంది సంతానం. ఇంటికి పెద్ద పిల్లవాడు సంసార బాధ్యత వహించడం పురాతన కుటుంబాల కట్టుబాటు. ఇహానికి, పరానికి కూడ బాధ్యత పెద్ద కొడుక్కి అప్పగించి ఇంటి పెద్ద నిశ్చింతగా కూర్చోడం ఆనాటి సంప్రదాయం. తండ్రి తర్వాత తండ్రిగా ఇంటికి పెద్దన్న గార్ని పరిగణించడం ఒక యోగ్యత.

మా తాత గారు తరతరాలనుంచి వస్తున్న వైదిక వృత్తినుంచి వైదొలిగారు. వెనకాల భూములేమి లేవు. ఐనా కష్టపడి సంపాదించినా వంశంలో ఒక కులదీపకుడు పుడతాడు. వాడు మొత్తము పూర్తి చేస్తే తర్వాత తరం మళ్ళీ మొదలు పెడుతుంది. ఇది చరిత్ర చర్విత చరణం. ఇంత మంది పిల్లలు, వాళ్ళతో తల చెడిన ఇద్దరు చెల్లెళ్ళు ఈ సంసారాన్ని ఈదడానికి ఆలోచించి మా తాత గారు కొణితివాడ అనే పల్లెటూరు నుంచి భీమవరం మకాం మార్చి బ్రతుకు తెరువుకు ఒక స్కూల్ పెట్టారు.

చదువు అంటే భయంకరమైన శిక్షణ అనే ఉద్దేశ్యం కల ఆ రోజుల్లో మా నాన్న గార్ని కూడా జుట్టుకి తాడు వ్రేలాడదీసి పైన కట్టేవారు. కొద్దిగా తూగు వచ్చినా తాడు బిగుసుకుని తల మంట పుట్టేది. ఎనిమిదో తరగతి పాసైన మా నాన్న గార్ని ఆర్ధిక పరిస్థితుల మూలంగా టీచర్ ట్రైనింగ్ కి వెళ్ళమన్నారు మా తాత గారు. ఆ రొజులో ఎస్.ఎస్.ఎల్.సి. డిగ్రీ చదవడము అంటే పెద్ద గొప్ప. మా నాన్న గారి అమ్మమ్మ తాను సహయం చేస్తాను చదివించమని హామీ ఇచ్చింది. ఆవిడ నోటి మాటగా చెప్పి ఏమి ఆదుకోకపోయినా మా నాన్న గారి చదువు నడిచింది. స్కూల్ ఫైనల్లో ఆయన స్కూల్ ఫస్ట్ అంతకు ముందు రికార్డులన్నీ తిరగరాసింది. స్కూల్ ఫైనల్ ప్యాసయి ఇంటికి వస్తున్న మా నాన్న గార్ని ఎవరో ఎంక్వయిరి చేసారు పెళ్ళయిందా అని. ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పిన మా నాన్న గారికి మా తాత గారు చెఫ్ఫారు ఆయనికి ఆరో ఏటే పెళ్ళి అయింది అని. పెళ్ళి నాటికి మా అమ్మ గారి వయస్సు మూడు సంవత్సరాలు అని.

పదిహేనో ఏట స్కూల్ ఫైనల్ పాసయ్యి మా తాత గారి స్కూల్లో జాయిన్ ఐన మా నాన్న గారి దగ్గరకి మా అమ్మ కాపురానికి వచ్చింది. మా అమ్మకి ఇద్దరు సంతానం కలిగినా మా తాత గారికి ఇంకా సంతానం కలుగుతునే వుంది. మా పెద్దక్క మా మేనత్త మధ్య తేడా ఆరు నెలలైతే, మా ఆరో బాబాయి అన్నయ్యల మధ్య తేడా నాలుగు నెలలు, ఆదీ మా అన్నే పెద్ద.

పద్ధెనిమిదేళ్ళు నిండగానే మా నాన్న గారు రెవెన్యూ డిపార్ట్మెంటు లో చేరారు.ఆ రోజుల్లో ప్రభుత్వ వుద్యోగాలకి చాలా క్రేఙ్. మానాన్న గారు ముక్కు సూటిగా పోయే మనిషి. ఆ రోజుల్లో లంచం తీసుకోవడం ఒక హోదా. ఎవర్ని అడిగినా జీతం ఎంత వస్తుంది అని కాక పైన ఎంత వస్తుంది అని అడిగేవారు. మా నాన్న గారు లంచం తీసుకోకుండా తన వాటా వసూలు చెయ్యలేదేమని అడిగిన తాసిల్దారుని కొట్టడానికి రూళ్ళ కర్ర తీసుకు బయల్దేరారు. లోక రీతి తెలియని ఈ మనిషికి ఈ ఉద్యోగం తగదని ఆయన్ని మళ్ళి పొస్టల్ డిపార్ట్మెంటు లో చేర్చారు. రెవెన్యూ డిపార్ట్ మెంటు లో జీతం ముప్పై రూపాయలు, పొస్టల్ డిపార్ట్మెంటులొ ముప్పై ఐదు.

ఒకటొ తారీఖున వచ్చి మా తాత గారు మా నాన్న గారి కుటుంబానికి పన్నెండు రూపాయలు వుంచి ఇరవై మూడు రూపాయలు పట్టుకుపొయేవారు. ఎందుకు చెబుతున్నానంటే అదే ఈ రోజుల్లొ జరిగితే నీకెందుకు ఇవ్వాలి? కాన్వెంటులో చదివించావా, నేను కష్టపడి చదువుకున్నాను కాబట్టే ఈ ఉద్యోగం వచ్చింది అని మా ఆవిడ చెప్పమంది, నీకు మాకు ఏ సంబంధం లేదు అని చెబుతారు. అంతే కాదు ఏమీ లేకపోయినా సాటి వారిలొ గొప్పలు పోవడానికి మా తాత గారి ఇంట్లో బారసాల, నామకరణం ఏదైనా ఓ పసుపు కొమ్ము తెచ్చి మా అమ్మకిచ్చి ఆవిడ మంగళసూత్రాలు పట్టుకుపొయేవారు. మా నాన్న గారు ఏమి మాట్లడడానికి వీల్లేదు.

మా ఆరో బాబాయి పుట్టిన ఏడాది లోపు మా తాత గారు తన నలభై ఎనిమిదో ఏట షుగరు మూలంగా వీపు మీద పుండు ఏర్పడి పోయారు. పోయేటప్పుడు మా నాన్న గార్ని పిలిచి సంసారాన్నంతా చూపించి కళ్ళతో సౌంఙ్న చేసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. మా నాన్న గారు ఆయన చేతిలో చెయ్యి వేసి భరొసా ఇచ్చారు.

పోస్టల్లో గుమాస్తా ఉద్యోగం. ఓ చదువైన తమ్ముడు తన ఉద్యోగం కోసం సుదూరం వెళ్ళాడు. అయిదుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లి, తల్లి, మళ్ళి మేము నలుగురం, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. మా అమ్మ గారికి అనారరోగ్యం. నేను నాలుగోవాణ్ణి. .నాకే నడక తిన్నగా రాలేదు. నా తర్వాత ఐదుగురు పిల్లలు పుట్టి, పెరిగి, పోయారు. రెండు కుటుంబాలు. సమస్యలు. ఇవన్నీ పరిష్కరించుకుంటూ, మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా జీవనయానం సాగించారు. మా నాన్న తమ్ముళ్ళ ఉద్యోగాలు చూసారు. వాళ్ళందరు పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు.

మా నాన్న గారిలో అంతర్మధనం మొదలైంది. అమ్మ ఆయనకి నిజమైన స్నేహితురాలు. పిల్లలని ఎలా పైకి తీసికొని రావాలి. ఓ తరం ఎంత కష్టపడినా తర్వాతి తరాన్ని తన కంటె మంచి స్థానంలో ఉంచాలి ఇది మా నాన్న గారి ఆలోచన. అందుకే పంతొమ్మిది వందల ఏభైల్లో ఆయన వేసెక్టమి ఆపరేషన్ చేయించుకున్నారు. నిజంగా అదొక తిరుగుబాటు. మందుల్లేవు. బంధు వర్గం అంతా వచ్చి మీద పడిపోయారు, భ్రూణ హత్య చేస్తావా అని, ఐనా జంకలేదు మా నాన్న.

కష్టాలు మనిషిలో ధ్రుఢత్వాన్ని పెంచుతాయి. బలమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఎట్టి పరిస్థితిల్లోను మానసికస్థైరయాన్ని కోల్పోడు.

ఈ ఆటుపొట్లుకి ఆయన కనిపెట్టిన మందు ఒక్కటే. ప్రమోషన్ టెస్ట్ ఆలిండియా పోస్టల్ సర్వీసు సెలెక్షన్ డిపార్ట్మెంటలొ మద్రాస్ జోనుకి రెండెవ వాడుగా వచ్చారు. తర్వాత ఇనస్పెక్టర్, సూపర్నెంట్, సీనియర్ సూపర్నెంట్, ఐ.పి.స్. కేడర్.

పెరిగే తామర తంపరలాంటి సంతానం కోసం ఆయన మా పెద్దక్కకి ఎనిమిదో ఏటే పెళ్ళి చేసారు. మా రెండో అక్కకు పద్నాలుగో ఏట. మా బావలిద్దరు ఒకరు పోస్టల్, ఇంకొకళ్ళు రైల్వేస్. మా అన్నదమ్ములిద్దర్ని ఒకళ్ళని డాక్టర్ మరొకళ్ళని ఇంజనీర్ చేద్దామనుకున్నారు. మా అన్న వెటర్నెరీ డాక్టర్ రెండేళ్ళు చదివాడు. నేను మాత్రం డిగ్రీ. ఇద్దరం స్టేటుబ్యాంక్ లో జాయినై ఆఫీసర్లుగా రిటైరయ్యాం.

మమ్మల్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు చేసిన త్యాగం అనితర సాధ్యం. మా అమ్మ ఏనాడు ఆ రొజుల్లో పది రూపాయలు మించిన చీర కట్టలేదు. మా నాన్న కూడా చాలా నిరాడంబరంగా ఉండేవారు.

మా నాన్న గారు ఎంతో సరదాగా ఉండేవారు. కాని వ్యవహారంలో చాలా సీరియసుగా ఉండేవారు. ఉద్యోగ విషయంలో ఎవరి సిఫార్సులూ బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఒప్పుకునేవారు కాదు. ఐదు దాటితే ఆఫీసులో ఉండేవారు కాదు. మూడు జిల్లాలను కంట్రోల్ చేసినా రాత్రి ఎనిమిది దాటగానే సుఖంగా నిద్రపోయే వారు.

ఒకసారి నేను ఏదో విషయంలో ఒక పని చెయ్యనన్నాను. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఇలాంటి బలహీనత, చెయ్యలేను అన్న పదం నా కడుపున పుట్టిన వాళ్ళ దగ్గర్నుంచి ఆశించను అని కటువుగా అన్నారు. ఆ తర్వాత నేను ఆ విషయాన్ని పట్టుదలతో సాధించాను. నలభై ముడేళ్ళ వయస్సులో 1969లో మా అమ్మగారు పోతే మేము ఎవరం రమ్మని అడిగినా ఆయన రాలేదు. సర్వీసులో అంతా సొంతంగా వండుకు తిన్నారు. రాజమండ్రి ట్రాన్సఫర్ కావాలని అడిగితే చాలా పెద్ద డివిజన్ అని పైవాళ్ళు అన్నారని, మీ రిమార్కులు నన్ను చాలా గాయపరిచాయి రిటైర్ చెయ్యమని మినిస్ట్రీకి అప్ప్లై చేసిన మొండి మనిషి ఆయన. చివరకు రాజమండ్రికి ట్రాన్సఫర్ ఇచ్చారు. డబ్బుల విషయంలో కొడుకులతోనైనా నిక్కచ్చిగా ఉండేవారాయన. ఒక పైసా తనకి రావల్సినా వసూలు చేసేవారు. తను ఇవ్వాల్సి వస్తే మార్చి ఇచ్చేవారు. అలాగని ఏదైనా జబ్బు పడినా చేసినా తనే దగ్గరుండి వచ్చి సేవ చేసి స్వంత డబ్బులు లక్షలైనా ఖర్చు పెట్టేవారు. ఇవ్వబోతే పుచ్చుకునేవారు కాదు.

నాకు 1969లొ ఆంధ్రప్రభలొ ప్రచురింపబడ్డ కధ 'విరిగిన అలలు 'కు అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణపతకం వచ్చింది. అది ఆయనను ఉత్తేజపరిచింది. నన్నుత్సాహపరుస్తూనే ఆయన కధలు రాయడం మొదలు పెట్టారు. 1985లో ఆయన పోయె దాకా ఆయన ఒంటరి జీవితానికి ఉత్సాహపరిచిన ఈ వ్యాసంగంలో ఏభై ఎనిమిది కధలు, నాలుగు నవలలు, ఎనిమిది నాటకాలు, నాటికలు చాలా పేరు తెచ్చుకున్నాయి. ఈ కధలకి ఆయన కలం పేరు శ్రీ నందుల.

1972లో రిటైరైన మా నాన్నగారు అప్పటికే డెబ్భై రెండేళ్ళ ముసలి తల్లితొ రాజమండ్రిలొ సెటిల్ అయ్యారు, ఒక వంట మనిషిని వంటకి పెట్టుకుని. సమాజ సేవ మీద ఆయనకు ఆసక్తి మెండు. ఒక వృధ్ధాశ్రమం పెడదామన్న ఆలోచన చేసారు కానీ తన తదనంతరం దాని బాధ్యతను ఎవరు వహిస్తారన్న ఆలోచనతో దాన్ని విరమించుకుని తన పెన్షన్లో ప్రతి నెలా పన్నెండు మంది వృధ్ధులకు నెలా నెలా డబ్బు పంపేవారు. అలాగే మహర్షి మహేష్ యోగి ట్రాన్సిడెంటల్ మెడిటేషన్లో టీచర్ ట్రైనింగ్ పొంది ఎందరికో ఆ మంత్రం ధ్యానం ఇచ్చారు.

తనకంటూ ఏమీ దాచుకొకుండా పిల్లల ఆప్యాయతానురాగాలమీద ఆధారపడి అదే పెన్నిధిగా భావించే హిందూ ధర్మంలో నమ్మకం పునాది. మా నాన్న గారి జీవితం ప్రకారం పూర్వం ఉమ్మడి కుటుంబాలకు పెద్ద కొడుకు పునాది. అతణ్ణి చూసుకుని ఇంటి యజమాని నిశ్చింతగా ఉండేవాడు. మరి అపనమ్మకం పునాదిగా ఉన్న విదేశీ సంస్కృతికి అలవాటు పడిన ఈ తరం వారు బాధ్యత నెత్తిన వెసుకోకుండా తప్పుకుంటున్నారు. అలాగే మన అనే సాంప్రదాయం పోయి నాది అన్న సంప్రదాయం ఎరువు తెచ్చుకుంటున్నారు. అది చెప్పడానికే ఈ వ్యక్తిత్వపు నిజ జీవితం గూర్చిన వ్యధ.

మా నాన్న గారి కోరిక ప్రకారం మా అమ్మ పేరు పెట్టిన మా అమ్మాయికి, మా నాన్న పేరు పెట్టుకున్న మా పెద్ద బావ గారి రెండో కుమారుడికి మా ఇంట్లో మొదటిసారిగా మేనరికం వివాహం చేసాము. మా నాన్న గారు చెప్పినట్లు, వాళ్ళ దాంపత్యంలొ నిజమైన స్నేహితులుగా నడిచిన వాళ్ళ దాంపత్యంలాగే ఈ చిన్నారులు చాలా ఆనందంగా ఉన్నారు.



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)