మూలం: స్టెఫాన్ త్సైక్

జరిగిన కథ:

వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చంపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది. విజయకేతనంతో తిరిగి వచ్చిన విరాట్ కు రాజుగారు వజ్రాలతో పొదిగిన తమ పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరిస్తూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగించబోయాడు. అయితే విరాట్, సొంత అన్ననే చేజేతులా చంపుకున్నానని, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెడు జోలికి పోని, ధర్మబద్దుడైన విరాట్ కు రాజుగారు ప్రధాన న్యాయాధికారి పదవీ బాధ్యతలను అప్పగించాడు. ధర్మకాటాతో సమంగా తూచినట్లు విరాట్ ప్రతి నేరాన్ని లోతుగా పరిశీలించి మరణశిక్ష తప్ప వేరే తగిన శిక్షలను విధిస్తూ త్వరలోనే రాజ్యంలోని ప్రజల మెప్పును పొంది గొప్ప న్యాయాధికారిగా పేరొందాడు. అయితే ఒకరోజున కొందరు కొండ జాతీయులు ఒక యువకుణ్ణి పదకొండు మంది ప్రాణాలు అపహరించాడంటూ బంధించి తీసుకువచ్చారు. అయితే ఆ యువకుడు విరాట్ ను న్యాయాన్ని చెప్పడానికి నీకేం అధికారముందంటూ, ఇతరులు చెప్పేది విని నీవేం తీర్పు చెబుతావంటూ నిగ్గదీస్తాడు. పదకొండుమందిని చంపిన ఆ కొండజాతీయ యువకుణ్ణి పదకొండు సంవత్సరాల పాటు భూగర్భంలోని చీకటి గదిలో నిర్భందించి ప్రతీ సవత్సరం పదకొండు కొరడా దెబ్బలు తినేలే తీర్పు ఇస్తాడు విరాట్. తీర్పు విన్న ఆ ఖైదీ 'నేను ఆవేశ పిశాచం ఆవహించి ఆ క్షణంలో హత్యలు చేస్తే నీవేమో ప్రశాంతంగా నీ తీర్పుతో నా జీవితాన్ను హరిస్తున్నావు ' అంటూ విరాట్ ను నిందిస్తాడు. ఆ యువకుని కన్నుల్లో తనచే చంపబడ్డ అన్న కన్నులు చూచాడు విరాట్. ఆ మాటలకు చలించి సత్యమార్గాన్ని అన్వేషించటానికి ఒక నెలరోజులు సెలవు తీసుకొంటాడు.

విరాట్ ఇంటికి వచ్చి, భార్యాపిల్లల్ని దగ్గరకు పిలిచి "ఒక నెల రోజులపాటు నేను మీకు కనిపించను. ఎందుకు? ఏమిటి? అని నన్ను ప్రశ్నించకుండా నాకు వీడ్కోలివ్వండి. నేను ఇల్లు వదిలి ఎటు వెళుతున్నానో మీకు తెలియకుండా ఉండేందుకు మీరు మీ మీ గదులకు వెళ్ళి తలుపులు వేసుకోండి. ఒక నెలరోజులు గడిచేదాకా నా ఉనికిని తెలుసుకునేందుకు ప్రయత్నించకండి" అన్నాడు.

అంతా మౌనంగా ఆయన చెప్పినట్లు చేశారు.

విరాట్ నల్లని దుస్తులు ధరించాడు. భగవంతుని ప్రార్థించాడు. ఆ తరువాత తాళపత్రాలపై ఒక పెద్దలేఖ రాశాడు. దానిని తనవద్దనే భద్రపరచుకున్నాడు. చీకటిపడగానే ఇంటినుంచి బయలుదేరాడు. పెద్దకొండ దగ్గరకు వెళ్ళాడు. ఆ కొండ అడుగునే చెరసాల ఉంది. అక్కడికి వెళ్ళి తలుపుకొట్టాడు. చెరసాల అధికారి నిద్రలేచి 'ఎవరూ?' అంటూ వచ్చాడు.

"నేను విరాట్ ని. ప్రధానన్యాయాధికారిని. నిన్న పంపిన ఖైదీని కలుసుకోవడానికి వచ్చాను."

"ప్రభూ! ఆ గది ఈ కారాగారంలో అట్టడుగున పాతాళంలో ఉన్నట్టు ఉండి. మిమ్మల్ని అక్కడకు తీసుకెళ్ళమంటారా?" అడిగాడు వినయంగా.

"వద్దు. ఆ స్థలం నాకు తెలుసు. తాళంచెవి నాకివ్వు. నువ్వెళ్ళి నిద్రపో. రేపు ఉదయం నీ ద్వారం చెంత ఈ తాళంచెవి నీకు కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నన్నిక్కడ చూసినట్లు ఎవ్వరితోను చెప్పకు."

చెరసాల అధికారి విరాట్ కు తాళంచెవి, ఒక దీపం తెచ్చి ఇచ్చాడు. విరాట్ సైగ చేయడంతో చెరసాల అధికారి వెళ్ళిపోయాడు. విరాట్ గుహద్వారం తెరిచి లోపలికి ప్రవేశించాడు.

ఒక శతాబ్దం క్రితం నుంచి రాజపుత్రరాజులు ఖైదీలను ఈ కొండగుహల్లో బంధించడం ప్రారంభించారు. ఈ బందీలు రాబోయే బందీలకోసం కొత్తగదుల్ని తొలుస్తూ ఉంటారు.

విరాట్ చివరిసారిగా ఆకాశంవైపు చూశాడు. మినుకుమినుకుమనే నక్షత్రాలు, తెల్లని మేఘాలు, నిర్మలమైన ఆకాశం కనిపించాయి. విరాట్ ముందుకు నడిచాడు. ద్వారాన్ని మూసివేశాడు. నలువైపులా గాఢాంధాకారం. ఆ చీకటిలో దీపం వెలుగు కొద్దిదూరం మాత్రం ప్రసరిస్తోంది. గాలికి చెట్లకదలికల ధ్వని, కోతుల కిచకిచలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటి గుహదాటి క్రిందికి పోగానే చెట్లకదలికలు, బయటి శబ్దాలు ఎక్కడో దూరప్రాంతాలనుంచి వినిపించినట్టుగా కొద్దిగా వినిపించాయి. మరికొంచెం క్రిందికి పోగానే అంతా నిశ్శంబ్దంగా, చల్లగా ఉంది. ఇంకొంచెం కిందికి పోగానే సముద్రపు అడుగు భాగానికి వెళ్ళినట్లనిపించింది. భయంకరమైన నిశ్శబ్దం. రాళ్ళనుంచి మాగుడు వాసన. ఇంకా కిందకు వెళ్ళుతున్న కొద్దీ ఆ నిశ్శబ్దంలో ఆయన అడుగుల చప్పుడు ఆయనకే కఠోరంగా వినిపిస్తోంది.

ఆ ఖైదీ ఉన్న గది భూమి అడుగున ఉంది. పైనుంచి పొడవాటి తాటిచెట్టుకన్నా ఇంకా లోతుగా ఉందా గది. ఆ అంధకారంలో విరాట్ దీపం పట్టుకొని గది దగ్గరకు వెళ్ళాడు. ఆ వెలుగులో గుట్టగా పడివున్న ఒక ఆకారం కనిపించింది. వెలుగుకు కదిలినట్టనిపించింది. ఆ తరువాత సంకెళ్ళ చప్పుడయ్యింది.

విరాట్ ఆ ఆకారం మీదకు వంగి "నువ్వు నన్ను గుర్తించావా?" అని ప్రశ్నించాడు.

"మర్చిపోతేగా? నిన్నేగా ప్రజలు నా జాతకనిర్ణేతను చేశారు. నా భవిష్యత్తును నీ కాళ్ళ కింద నలిపివేశావు గదా? నిన్నెట్ల మర్చిపోతాను."

"నేను ప్రభువును కాను. మహారాజుకు, న్యాయానికి సేవకుణ్ణి. న్యాయానికి సేవ చెయ్యడం కోసమే నేను ఇక్కడకు వచ్చాను."

ఖైదీ విషాదంగా విరాట్ వైపే చూస్తూ "నానుంచి ఏం కోరుకుంటున్నావ్?" అని అడిగాడు.

విరాట్ చాలాసేపు మౌనంగా ఉండి "నా తీర్పు నిన్ను బాధించింది. అలాగే నువ్వు నీ పరుషమైన మాటలతో నా హృదయాన్ని గాయపరిచావు. నా తీర్పు సరైనదో కాదో నాకు తెలియదు. కానీ, నీ మాటల్లో కూడా సత్యం ఉంది. తనకు అనుభవంకాని శిక్షను ఇతరులకు విధించకూడదు. ఆ విషయంల్లో నేను ఇంతవరకు అజ్ఞానినే. సంతోషంగా ఇప్పుడది అనుభవం ద్వారా నేర్చుకోవాలనుకొంటున్నాను. నేను కొన్ని వందలమందికి ఈ అంధకార శిక్ష విధించి ఉండవచ్చు. ఈ శిక్షలో ఉన్న బాధ ఏమిటో నాకు తెలియకుండా నేను చాలామందికి ఈ శిక్ష విధించాను. ఇప్పుడు తెలుసుకోవాలనుకొంటున్నాను. తెలుసుకోగలనని నా ఆశ. దాని ద్వారా నా పాపము నుంచి నేను విముక్తిని పొందుతాను" అన్నాడు.

ఖైదీ ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోయాడు. అతని సంకెళ్ళ ధ్వని తప్ప మరేమీ వినిపించలేదు.

"నిన్ను శిక్షించాలని ఇక్కడికి పంపాను. ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కొరడా దెబ్బ ఎంత బాధ కలిగిస్తుందో తెలుసుకోవడం కోసం నేనే స్వయంగా కొరడా దెబ్బలు తినాలనుకుంటున్నాను. చెరసాల జీవితం ఎలా ఉంటుందో నేను స్వయంగా అనుభవించాలనుకుంటున్నాను.

ఒక నెలరోజులు నీకు బదులుగా నేను ఇక్కడ ఉంటాను. అప్పుడే నా తీర్పుల ద్వారా ఇతరులకు నేను ఎంత బాధ కలిగించానొ అర్థం చేసుకోగలను. ఆ తరువాత మాత్రమే నేను న్యాయపీఠం ఎక్కి మళ్ళీ తీర్పులిస్తాను. నా నిర్ణయంలో ఎంత బలముందో నాకప్పుడు అర్థమవుతుంది.

ఈలోగా నువ్వు స్వేచ్చగా బయటికెళ్ళు. నీకు తాళం చెవి ఇస్తాను. దాంతో నువ్వు ఈ కారాగారం నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఈ గాఢాంధాకారం నుంచి బయటపడి వెలుగును చూడొచ్చు. ఒక నెలరోజులు నేను నీకు స్వేచ్చనిస్తున్నాను. నెల తర్వాత నువ్వు తప్పక తిరిగి వస్తావని నాకు ప్రమాణం చెయ్. నువ్వు వస్తేనే నాకు ఈ పాతాళ అంధకారం నుంచి విముక్తి. నా జీవితానికి వెలుగు వస్తాయి" అన్నాడు విరాట్.

ఖైదీ నిశ్చేష్టుడై శిలాప్రతిమలా నిలబడిపోయాడు. సంకెళ్ళ శబ్దం కూడా ఇప్పుడతనికి వినిపించడంలేదు. "నువ్వు నాకు ప్రమాణం చెయ్. ఈ నెలరోజులపాటు మౌనంగా ఉంటానని, ఎలాంటి దుష్కృత్యాలకి పాల్పడనని నాకు మాటివ్వు. భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉంటాడని మర్చిపోకు.

నీకు నా దుస్తులు, తాళంచెవి ఇస్తాను. ఈ తాళంచెవిని చెరసాల అధికారి ద్వారం ఎంత వదిలి వెళ్ళు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నెలరోజులు పూర్తికాగానే ఈ ఉత్తరాన్ని మహారాజుగారికివ్వు. అప్పుడు నేను బంధవిముక్తుడనవుతాను. ఇంకా సరైన తీర్పులిస్తాను. నామాట ప్రకారం నడుచుకుంటానని నువ్వు పూజించే దేవుని పేరిట ప్రమాణం చెయ్యి " అన్నాడు విరాట్.

ఖైదీ ప్రమాణం చేశాడు. ఖైదీ గొంతు పూడుకుపోయి మాట సరిగ్గా పెగల్లేదు. అతనికంతా వింతగా ఉంది.

విరాట్ అతణ్ణి బంధ విముక్తుణ్ణి చేసి, తన దుస్తులు అతనికిచ్చి " ఈ దుస్తులు వేసుకో. నీ దుస్తులు నాకివ్వు. ముఖం కనబడనీవ్వకు. చెరసాల అధికారి నిన్ను నేననుకొటాడు. నన్ను ఎవ్వరు గుర్తించకుండా ఉండేలా నా గడ్డం, జుట్టు కత్తిరించు."

ఆ ఖైదీ వణుకుతూ, అయిష్టంగా విరాట్ చెప్పినట్టు చేశాడు. మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్టు చేశాక, ఆయన పాదాల మీద పడి పొగిలి పొగిలి ఏడ్చాడు.

"ప్రభూ! నా బదులుగా మీరు శిక్ష అనుభవించడం నేను భరించలేను. నేను హంతకుణ్ణీ. పాపం చేశాను. మీ తీర్పు సమంజసమైనదే."

"ఒక్కమాట విను. నువ్వుగాని, నేనుగాని నేరాన్ని సరితూచి శిక్షను ఖచ్చితంగా నిర్ణయించలేము. ఈ విషయంలో త్వరలోనే నాకు జ్ఞానోదయమవుతుంది. వెళ్ళు. నువ్వు చేసిన ప్రమాణం నెరవేర్చు. వచ్చే పౌర్ణమి రోజున ఈ ఉత్తరాన్ని రాజుగారికి అందించు. ఆయన నన్ను బంధ విముక్తుణ్ణి చేస్తాడు. ఈలోగా నా నిర్ణయాల్లో న్యాయాన్యాయాలను నేను గుర్తించగలుగుతాను. అప్పటినుంచి నా తీర్పులు న్యాయానికి దూరం కావు. ఇక నువ్వు బయలుదేరు."

ఖైదీ మోకరిల్లి భూమిని ముద్దాడి బయలుదేరాడు. తరువాత తలుపు మూసిన చప్పడైంది. సొరంగం గుండా దీపం వెలుగు మరొకసారి గోడలపై పడింది. మిగిలిన రాత్రి గాఢ నిశ్శబ్దంలో లీనమై పోయింది.

(సశేషం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)