దృక్, సూర్య సిద్ధాంత పంచాంగాలు - వాటి స్వరూపాలు, కొన్ని ముఖ్య అంశాలు

ఆది నుండి విజ్ఞానానికి నిలయం - భారతం. తర తరాలుగా వారసత్వ రూపేణ, పరంపరల ఫలస్వరూపంగానో సాంప్రదాయ బధ్ధంగానో, శృతి, లేదా విభిన్న గ్రంధాల ద్వారానో విజ్ఞాన సంపద భావి తరాలకు అందజేయబడుతున్నాయి. విద్యా శక్తి, మేధా శక్తి, ఇచ్చా, క్రియా శక్తులు కాలనుగుణంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ శక్తుల సమన్వయీకరణ, మానవాళికి ఉపయుక్త సాధనంగా మారి, జీవన గమనం సులభసాధ్యం చేస్తూ, జీవిత సాఫల్యానికి దోహదపడుతున్నాయి.

ఈ పరివ్యాప్త సంపదలలో శాస్త్ర, సిద్ధాంత, వేద, గ్రంధాదులే కాదు, సమస్త జన, వస్తువులు నిక్షిప్తమై ఉన్నాయి. భారత దేశ మేదా శక్తిని, ఔన్నత్యాన్ని చాటి, ప్రపంచానికి అందించిన, అదిస్తున్న, అనేక జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞాన విశేషాల సమ్మేళనంతో - వాటి అర్ధమే కాక, భావార్ధం, నిగూఢ, నిక్షిప్త, పరమార్ధాలను విశ్లేషించి తదనుగుణ విషయాలను సేకరించి, సమన్వయం చేసి ఈ విజ్ఞాన భారతీయం " శీర్షికలో ప్రస్తుతీకరిస్తున్నాం.

సుమారు రెండు వేల సంవత్సరాల నుండి, ఏటా భారత దేశంలో వెలువడే పంచాంగాలు - దృక్, సూర్య సిద్ధాంతాల ఆధారంగా గణించబడుతున్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇంత సుదీర్ఘ కాల వ్యవస్థలో గణిత సాధన చేసిన దాఖలాలు లేవు. ఇది భారత ఖగోళ-గణిత శాస్త్ర రంగాల నిపుణులకి, పంచాంగ నిర్మాతలకే సాధ్యమయ్యింది. నేటికి ఏటా విభిన్న సంస్థల ద్వరా, పంచాంగాలు గుణించి, ప్రకటిస్తూనే ఉన్నారు. ఖగోళ శాస్త్రం, తదనుబంధ గణిత శాస్త్రాలు, పంచాంగాల రూపేణా భారతీయ నిత్య జీవితాలలో యేలా ఇమిడిపోయి, వాడుకలో కొనసాగుతున్నాయో మనకు తెలిసిందే!

సూర్య, దృక్ గణిత సిద్ధాంత పంచాంగాలు

సూర్య సిద్ధాంతం భారతీయ ఖగోళ-గణిత శాస్త్రానికి ప్రమాణిక గ్రంధం. పదిహేడు వందల (1700) యేళ్ళకు పైగా ఇది భారత దేశ జనపదాలలో అతి విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ఖగోళ-గణిత (ఆస్ట్రో-మేథమెటికల్) శాస్త్రంగా వ్యవహారంలో ఉంది. ఇంత సుదీర్ఘ కాలం పాటు మరే ఖగోళ-గణిత శాస్త్ర గ్రంధం ప్రాచుర్యంలో లేదు. కాలానుగుణంగా - భటోట్పల (క్రీ.శ.966), దివాకర (క్రీ.శ.1606), కేశవ, విజయనంది, చిత్రభాను, శ్రీ రంగనాథ, మకరంద, నరసింహ ఇత్యాడి గణిత-ఖగోళ శాస్త్ర వైజ్ఞానికులు ప్రకటించిన సూర్య సిద్ధాంత భాష్యాలు, విభిన్న ప్రాంతాలలో వాడుకలో ఉన్నాయి. భాస్కరాచార్య, క్రీ.శ. 1150 లో రచించిన " సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో సూర్య సిద్ధాంతంలోని సంఖ్యలను ఉటంకించారు.

క్రీ.శ. 1178 లో ఖగోళ శాస్త్ర వైజ్ఞానికుడు, మల్లికార్జున సూరి రచించిన సూర్య సిద్ధాంత భాష్యం బహుళ ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ గ్రంధం అటు సంస్కృతం లోనూ, ఇటు తెలుగు లో కూడా ప్రకటించ బడ్డాయి. దాదాపు ఆరు వందల యేళ్ళ క్రితం తెలుగు లో వెలువడిన గ్రంధం ఒక ప్రాంతీయ భాషలో వెలువడిన ప్రప్రధమ ఖగోళ శాస్త్ర గ్రంధం. గణిత, ఖగోళ శాస్త్ర కోవిదులు దీన్ని ప్రామాణిక గ్రంధంగా ఉపయోగిస్తూ వచ్చారు. ఈ ఉపయుక్త గ్రంధాల ఆధారంగానే పంచాంగ గణితం చేసి, యేటా పంచాంగాలు ప్రకటిస్తున్నారు.

సూర్య సిద్ధాంతం, ఆర్యభటీయం, బ్రహ్మస్పుట సిద్ధాంతం - ఈ మూడు ప్రాధమిక శాస్త్ర గ్రంధాల ఆధారంగా - గణాంకము, గణిత సాధనా పద్ధతుల ద్వార రూపొందించడమే కాక - అరేబియా, ఇరాన్, ఇరాక్, సిరియా, తజైకిస్తాన్, ఉత్తర ఆఫ్రికా, స్పేయిన్, పిరనీస్ పర్వత ప్రాంతం, ఫ్రాన్స్, ఇటలీ ఇత్యాది దేశాలకు విభిన్న అనువాధ గ్రంధాల రూపేణా (ట్రాన్స్లేషన్స్ గా), తర్జుమా ఐన గ్రంధాలుగా, లేదా భాష్యాలతో ప్రసారమయ్యాయి.

1858 లో సూర్య సిద్ధాంత గ్రంధాన్ని రెవరెండ్ ఎబినిజెర్ బర్జెస్స్ (క్రైస్తవ మిషనరీ) ఆంగ్లం లోకి - " సూర్య సిద్ధాంత - ఏ టెక్ష్ట్ బూక్ ఆఫ్ హిందూ ఆస్ట్రానమీ " గా పండితుల సహాయ సహకారాలతో తర్జుమా చేసి పుస్తకంగా రూపొందించి ప్రకటించారు.

కోల్బ్రూక్ భారతీయ గ్రంధాలను అధ్యయనం చేసి - " హిందూ ఆల్జీబ్రా " అనే పుస్తకాన్ని ప్రకటించారు. ఇందులో - " భారతీయులు గురువులు - వాళ్ళు నేర్పే వాళ్ళే కాని నేర్చుకునే అవసరము లేదు .... " అని వర్ణించాడు. బ్రహ్మస్పుట సిద్ధంత నకలు (కాపీ) కూడా కోల్బ్రూక్ వద్ద ఉండేది. ఇదే మాట బెంట్లీ కూడా తన వివరణలో తెలిపారు. కోల్బ్రూక్ తన పుస్తకం లో 28 యోగాల గురించి వివరించాడు. ఇది శ్రీపతి " రత్నమాల " గ్రంధ ఆధారంగా చేసారని విశ్లేషణ సూచిస్తోంది.

జర్మనీ లోని బెర్లిన్ గ్రంధాలయంలో ఆర్యభట్ట రచించిన " దశగీతిక " గ్రంధం అందుబాటులో ఉంది. వృద్ధ సిద్ధాంతం, వశిష్ట సిద్ధాంతం గ్రంధాలు " మకెంజీ కలెక్షన్ " భాగంగా సౌలభ్యమవుతున్నాయి. ఈ ఉపలబ్ద ప్రమాణ గ్రణాల ఆధారంగా భారతీయ ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, విశ్వ శాస్త్రం, కాల శాస్త్ర రంగాలు ఎంత అభివృద్ధి చెంది ఉన్నాయో విశ్లేషించ కండానే తెలుస్తోంది.

బెంట్లీ వద్ద " ఆర్య సిద్ధాంతం", " లఘు ఆర్య సిద్ధాంతం " గ్రంధాల నకళ్ళు (కాపీలు) ఉన్నాయని రెవెరెండ్ బర్జెస్స్ పేర్కొన్నారు. 1799 లో బెంట్లీ సూర్య సిద్ధాంతం లో ఖగోళ పరిమాణాల గురించి వివరించారు. బెంట్లీ, తన వద్ద ఉన్న సూర్య సిద్ధాంత గ్రంధం లోని గ్రహ స్తితి గతులను బట్టి ఆ గ్రంధం సుమారు 1091 కి చెందినది అని తేల్చిచెప్పాడు.

సూర్యసిద్ధాంతంలో వివరించబడ్డ కొన్ని గణితాంశాలు - భగాన; భుక్తి; సీగ్రోచ్చ; మందోక; ప్రవాహ; ఉచ్చ; ధన; ఋణ; విక్షేప; అపక్రమ; ద్రిక్; స్ఫుటికరణ; జ్య; జ్యర్ధపిండ; ఉత్క్రమజ్యర్ధపిండ; పరమాక్రంతి; క్రాంతిజ్య; కేంద్ర; పద; భుజజ్య; కోటి; విషమ; యుగ్మ; మందకేంద్ర; సీగ్రకేంద్ర; భుజజ్య / కోటిజ్య; కారణ; అంత్య; ఉత్క్రమజ్య; చద్య; చాదక; గ్రాస; స్తితి; ప్రగ్రహ; నిమిళన; ఉన్మిళన; ఆయన వలన; ఆక్ష వలన ఇత్యాది అంశాలు;

సూర్యసిద్ధాంతంలో " లైబ్రేషన్ తీరీ " కూడా చర్చించింది. భారత ఖగోళ-గణిత శాస్త్ర ఉద్దండ మహా పండితుడు ఐన ఆర్యభట్ట - (లిమిట్స్ ఆఫ్ లైబ్రేషన్) - 240 తూర్పు / పశ్చిమ - (ఫిక్ష్డ్ పాయింట్ కి) అని వివరించాడు. ఇది అరబిక్ లోకి తర్జుమా చేసినప్పుడు, తాబీత్ ఇబిన్ కుర్రహ్ (యూరోప్ లో అర్జాచెల్ ఇతని వ్యవహార నామం) - ఇవే సంఖ్యలను పేర్కున్నాడు. తాబీత్ తర్జుమా చేసిన గ్రంధం యూరోప్ లో ప్రసిద్ధి చెంది జన బాహుల్యం వాడుకుంటూ వచ్చారు.

ఇటీవల, శ్రీ మంత్రి లక్ష్మీనారాయణ శాస్త్రులు, బ్రహ్మశ్రీ వంగివరపు వీరబ్రహ్మ దైవజ్ఞ సూర్య సిద్ధాంతం లోని గణిత పద్ధతులనూ, పంచాంగాలను యెలా నిర్మించాలో తాము రచించిన పుస్తకం లో పేర్కున్నారు.

భారత దేశంలో వివిధ ప్రాంతీయ, భాషలలో దాదాపు 30 పంచాంగాలు యేట వెలువడతాయి. వీటన్నిటికి మూలం - దృక్, సూర్య సిద్ధాంత గ్రంధాలే. విభిన్న ప్రాంతీయ ఆచారలను బట్టి ఈ గ్రంధాలు, తదనుగుణ ఉపలబ్ధ భాష్యాలు ప్రమాణంగా వాడుతున్నారు. సూర్య సిద్ధాంతం - కాల శాస్త్రానికి,ఖగోళ శాస్త్రానికి తదనుగుణ గణిత సాధనలకు ప్రమాణ గ్రంధం.

దృక్ సిద్ధాంతం - భారతంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అతి విశిష్ట పర్యవేక్షక ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత కోవిదుడు పరమేశ్వర (క్రీ.శ. 1431) - దృక్ గణిత పద్ధతి ని నెలకొల్పేడు. అప్పటిదాకా ప్రమాణంగా వాడ బడుతున్న " పరహిత " పద్ధతికి తన పర్యవేక్షక (అబ్సెర్వేష్నల్) అనుభవాలను అనుసంధానం చేసి దృక్ గణిత సిద్ధాంత పద్ధతి కి కారణ భూతులైయ్యారు.

సూర్య సిద్ధాంతం, దృక్ సిద్ధాంతాల మూల వ్యాఖ్యల మీధ గత 150 సంవత్సరాలలో అనేక భాష్య, కారణ, దర్పణ, తిక ఇత్యాది గ్రంధాలు విలువడ్డాయి. ఈ మూల గ్రంధాలో కాని, లేదా వీటి సవరణ, భాష్య గ్రంధాల ఆధారంగా పంచాంగ గణితం చేసి పంచంగాలు ప్రటిస్తున్నారు.

పంచాంగ స్వరూపం:

పంచాంగం - అంటే - ఐదు అంగాలు. అవి - తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఇవే కాక, పంచాంగాలు తదుపయుక్త విషాయలను వివరిస్తాయి. ఉదాహరణకి:
- రవ్యాది నవగ్రహముల సంచారము
- సూర్య, చంద్ర గ్రహణములు
- గ్రహముల యొక్క అస్తంగత్వ, శ్రీఘ్ర గమన, సమాన గతి, మంద గతి, వక్ర గతి, కుటిల గతి, అత్యంత శ్రీఘ్ర గతి మొదలైన అష్టవిధ గతులు.
- గ్రహణములు, చాంద్ర మాన, సౌర మాన, సావన మాన, నక్షత్ర మాన, బృహస్పత్య కాల స్వరూపాలు
- అధిక, క్షయ మాస నిర్ణయం
- యుగము, సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, అహోరాత్రి, యమ, ముహూర్త, విఘటి, ప్రాణ, తృతి వంటి కాల ప్రమాణాలు
- జ్యోతిష శాస్త్ర సిద్ధాంత భాగం వివరించ బడతాయి.

చాంద్రమాన కాల స్వరూపం - ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో; తమిళ నాడు, కేరళ లో సౌర మాన పద్ధతి అనుసరిస్తున్నారు. సవన, నక్షత్ర, బృహస్పత్య మాసములు - ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నాయి.

బృహస్పతి వర్ష - అరవై యేళ్ళ కాలచక్రం

సూర్య, చంద్రుల తరువాత, " బృహస్పతి "(గురువు) యెంతో ప్రధాన్యం సంతరించుకున్న గ్రహం. ఆంగ్లంలో దీన్ని "జోవియన్ సైకిల్ " అని వ్యవహరిస్తారు. 60 సంవత్సరముల కాలచక్రం ప్రభవతో మొదలై, అక్షయ వరకు నడుస్తుంది. తిరిగి మళ్ళీ ఇదే కాలచక్రం పునరావృతం అవుతుంది. తెలుగు నాట గత యెనిమిది వందల యేళ్ళ నుండి ఇది వాడుకలో ఉన్నట్టు ఉపలబ్ధ ప్రమాణాలు చెపుతున్నాయి.

అరవై యేళ్ళ కాలచక్రంలో ఉన్న సంవత్సరాలు - ప్రభవ (1987), విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, ఆంగిరశ, శ్రీముఖ, భావ, యువ, ధాత్రి, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది (1999), విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్దివ, వ్యయ (2006), సర్వజిత్, సర్వధారి (2008), విరోధి, వికృథి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, ధుర్ముఖ, హేలంబి, విలంబి, వికారి, సార్వరి, ప్లవ, శుభకృతు, శొభన, క్రోధి, ఇస్వవస్త, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారన, విరొధికృతు, పరీధాని, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్తి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.

అధిక మాస, క్షయ మాస నిర్ణయ విధానం:

కాల స్వరూపంలో, ఏ చాంద్ర మాసంలో రవి రాశి ప్రవేశం లేకండా వుండునో అట్టి మాసం " అధిక మాసం" గా అనబడుతుంది. అధిక మాసం వచ్చిన తరువాత, మళ్ళీ 30 మాసాల లోపు అధిక మాసం రాదు. తిరిగి 38 లేక 39 మాసం అధిక మాసంగా వస్తుంది. అధిక మాసం చైత్రం మొదలు ఆశ్వీజ మాసం వరకు 7 నెలలలో మాత్రమే వచ్చును.

క్షయ మాసం - చాంద్ర మానంలో ఒక మాసంలో సూర్యుడు రెండు రాశులలో ప్రవేశించిన " క్షయ " మాసం అనబడును. ఈ క్షయ మాసం 19 లేక 141 యేళ్ళకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ మాసం నందు శుభకార్యములు చేయకుండా ఉండటం అనాదిగా వస్తున్న ఆచారం.

వార స్వరూపం

నిత్యం వాడే వార స్వరూపాలు - సప్త గ్రహముల గ్రహ కక్షల మీద ఆధారపడి యేర్పడినవి. సూర్య సిద్ధాంత గ్రంధంలో గ్రహ కక్షల వివరణ ఆధారంగా వార స్వరూపాలు యేర్పరచారు. గ్రహ కక్షలో నాల్గవది సూర్య కక్ష.

అందువల్ల మొదటి వారం "ఆది వారం" గా ఏర్పడింది.
సూర్యునకు నాల్గవ కక్షలో చంద్రుడు ఉన్న కారనంగా " సోమ వారం ";
చంద్రునకు నాల్గవ కక్షలో బుధుడు అధారంగా " బుధ వారం ";
బుధుడి నాల్గవ కక్షలో గురువు ఆధారంగా " గురు వారం "; గురువు నాల్గవ కక్షలో శుక్రుడి ఆధారంగా " శుక్ర వారం ";
శుక్రుని నాల్గవ కక్షలో శని వలన " శని వారం " యేర్పడ్డాయి.
రాహు, కేతువులు తటస్తం గా వుంటాయి.

" నిత్య నక్షత్రే చంద్రః ":

" నిత్య నక్షత్రే చంద్రః " - అని ఋషులు సెలవిచ్చారు. యెందుకంటే నక్షత్రమంటే చంద్ర గమనం మీధ ఆధారపడి ఉంది. 360 డిగ్రీలు ఉన్న భూచక్రం లో 27 నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 360 / 27 = 13.2 డిగ్రీలు ప్రమాణం కలిగి వుంది.

నక్షత్రాల వల్ల చాంద్ర మాన మాసాలు కూడా యేర్పడ్డాయి. పౌర్ణమి రోజు ప్రాప్తించే నక్షత్రం ఆ మాస నామం అవుతుంది. ఋజు వక్రములు లేకండా చంద్రుడు సంచరించు కారణంగా, సూర్యుడి నుండి నక్షత్రములు గుర్తించలేని కారణం చేత చంద్రుడున్న నక్షత్రాన్ని గుర్తిస్తారు.

ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు. అంటే ఒక పాదం సుమారు 3.2 డిగ్రీలు ప్రమాణం కలిగి వుంటుంది.

ఒక నక్షత్ర ప్రమాణం X 9 = ఒక రాశి ప్రమాణం

యోగ స్వరూపం - రవి స్ఫుటము, మరియు చంద్ర స్ఫుటము యొక్క రాశి భాగ లిప్తలను కూడిన యోగము ఏర్పడును.

కరణం స్వరూపం - తిథిని సగ భాగం చేసిన కరణం యేర్పడును.

గ్రహాల యొక్క అష్టవిధ గతులు

ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ఖగోళశాస్త్రం, గణితశాస్త్రాలలో ఉద్దండ మహా పండితులు. ఊహకే అంతుపట్టనంత దుస్సాధ్యమైన గ్రహ గతులను పరిశీలించి తెలుసుకోవడమే కాక సూర్యుడి ప్రభావంతో విభిన్న గ్రహ గతులు యెలా ప్రభావితం అవుతాయో పరిశోధనతో అవగతం చేసుకున్నారు. గ్రహ గతులు గణించడానికి ప్రత్యేక గణిత పద్ధతులను వివరించారు.

సూర్య సిద్ధాంతంలో గ్రహాల యొక్క అష్టావిధ గతులు గురించి వివరించబడింది. అప్పటికే ఖగోళ శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో! ప్రతీ గ్రహం గతి పరిమాణ, ప్రమాణాలను విభిన్న గణిత పద్ధతులనుసరించి ఫలితాలను వెలువడించారు.
సూర్యునితో కలసి ఉన్న గ్రహము " అస్తగంత్వము " ను పొందును
సూర్యునికి రెండవ రాశిలో ఉన్న గ్రహం " శ్రీఘ్ర " గమనం పొందును
సూర్యునికి మూడవ రాశిలో ఉన్న గ్రహం " సమాన గతి " ని పొందును
సూర్యునికి నాల్గవ రాశిలో ఉన్న గ్రహం " మందగతి " ని పొందును
సూర్యునికి ఐదవ, ఆరు రాశులలో ఉన్న గ్రహం " వక్రగతులు " పొందును
సూర్యునికి ఏడు, ఎనిమిది రాశులలో ఉన్న గ్రహం " అతివక్రగతి " ని పొందును
సూర్యునికి తొమ్మిది, పది రాశులలో ఉన్న గ్రహం " కుటిల గతి" ని పొందును
సూర్యునికి పదకొండు, పన్నెండు రాశులలో ఉన్న గ్రహం " అత్యంత శ్రీఘ్ర గతి " ని పొందును

ఇలా గ్రహాల స్తితి గతులు తద్ప్రభావాలు పూస గుచ్చినట్టు ప్రాచీన భారతీయ విజ్ఞాన వేత్తలు వ్యాఖ్యానించారు. వారు యెంత మహత్తర కృషి చేసారో ఈ ఉదాహరణాలే చాటుతున్నాయి. భూ మండలం నుంచి గ్రహ మండలాన్ని యెంత నిశిత దృష్టితో పరిశీలించే వారో, ఈ వివరణలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఈ అష్టాగతులను గాణాంకాలతో సాధనం చేసిన సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, భారతీయ గణిత దిగ్గజం, ఆర్యభట్ట, "జ్య ", "కోటిజ్య " త్రికోణమితి పద్ధతులను, తదనుగుణ పిండాలను (టేబుల్స్) తయారు చేసి గ్రహ గతులు గణాంకం చేసిన అద్బుత ఖగోళ శాస్త్రవేత్త. ఈ "జ్య " (సైన్), "కోటిజ్య " (కొ-సైన్) మొత్తం గణితశాస్త్ర రంగానికి " త్రికోణమితి " (ట్రిగొనోమెట్రీ) అనే గణిత విభాగాని ప్రసాదించి. నేటి అంతరిక్ష శాస్త్రానికి అత్యంత ప్రాధమిక పద్ధతులుగా ఉపయోగపడుతోంది.

భారత జాతీయ పంచాంగ (క్యాలెండర్) స్తాపన

1952 లో, భారత ప్రభుత్వ - సీ ఎస్ ఐ ఆర్ పర్యవేక్షణలో, సుప్రసిద్ధ అస్త్రో-ఫిజిసిస్ట్, రెండు సార్లు నోబెల్ బహుమతి (భౌతిక శాస్త్రం) పొందిన మేటి ఆచార్యడు మేఘ్ నాద్ సాహా అధ్యక్షతలో, ఖగోళ శాస్త్ర నైపుణ్యం సంతరించుకున్న సుప్రసిద్ధ ఎన్ సీ లాహిరీ, కార్యదర్శకత్వంలో - " ఇండియన్ ఎఫిమరీస్ ", " నాటికల్ ఆల్మనాక్ " ప్రకటించబడ్డాయి.

1955 లో ఖగోళ శాస్త్ర, (ఆస్ట్రో ఫిసికల్ స్టడీస్) కి అంకురార్పణం చేస్తూ, భారత ప్రభుత్వం, వాతావరణ శాఖ అనుబంధ, నాటికల్ ఆల్మనాక్ యూనిట్ కి యేటా " ఇండియన్ ఎఫిమరీస్ ", " నాటికల్ ఆల్మనాక్ " ప్రకటించే భాద్యతను అప్పచెప్పింది. 1957 లో నేటి అభినవ పర్వంలోని - " భారత జాతీయ క్యాలెండర్ సిస్టం " రూపం దాల్చింది. తద్ఫలితంగా గ్రెగోరియన్ క్యాలెండర్ తో అనుసంధానం అయ్యి, భారతీయ పద్ధతులు కొనసాగించే " లునీ-సోలార్ " (చాంద్ర - సౌర మాన) పంచాంగం (క్యాలెండర్) ప్రకటించింది.

శాఖ యుగ, 1879 చైత్ర శుద్ధ పాడ్యమి, అంటే మార్చి 22, 1957 న భారత జాతీయ క్యాలెండర్ రూపం దాల్చింది.

మీ జన్మ నక్షత్రం యేమిటి?

మీ జన్మ నక్షత్రం యేమిటి? అది తెలుసుకోడం యెలా? ఇది తెలిపే ప్రక్రియ ప్రాచీన జ్యొతిష శాస్త్రలలో (బృహత్ పరాశర హొరా శాస్త్ర, సారావళి) పేర్కొన బడింది.

ఒక " దిన " నిర్ణయాన్ని ఎలా నిర్ధారిస్తారు? - సూర్యోదయం అప్పుడు, చంద్రుడు యెక్కడున్నాడో నిర్ణయిస్తారు. చంద్రుడు ఓ రాశిలో, ఏ నక్షత్రానికి అత్యంత సమీపాన ఉంటాడో, దాని ప్రకారం ఆ దిన నక్షత్రాన్ని నిర్నయిస్తారు. " మా వాడిది ఆశ్లేషా నక్షత్రం " అంటే - అతను పుట్టిన రోజు చంద్రుడు ఆశ్లేష నక్షత్రంతో ఉన్నాడు, కాబట్టి అతని జన్మ నక్షత్రం ఆశ్లేషగా పరిగణిస్తారు. ఒక్కొకొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. జన్మ సమయాని బట్టి చతుష్పాదాలలో ఏ పాదం వర్తిస్తుందో నిర్ణయిస్తారు.

పుష్కర నిర్ణయము

పుష్కరం అంటే? - తర తరాలుగా పుష్కరాలు భారతీయ జీవన విధానంలో అవిభాజ్య అంశంగా నిలచాయి. జీవిత పర్యంతంలో ఒక మారైన పుష్కరాలకు వెళ్ళక మానరు. పన్నెండేళ్ళ వ్యవధిలో వస్తుంది - " పుష్కరం ". పుష్కర సమయంలో ఆ నదీ జలలో స్నానం చేస్తే పాపం నసించి, మోక్షం లభిస్తుంది అని హిందువుల నమ్మకం. ఇంత విశిష్ట ఆపాదించుకున్న పుష్కర కాలాన్ని యెలా నిర్ణయిస్తారు అంటే - బృహస్పతి (గురు గ్రహము) ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఆ నది పుష్కరం నిర్ణయించ బడుతుంది.

ప్రాముఖ్యం చెందిన పన్నెండు నదులకు పుష్కర సమయాలు వ్యాఖ్యానించ్చబడ్డాయి. పన్నెండేళ్ళకి ఒకసారొచ్చే పుష్కరాలు ఎలా నిర్ణయం చేస్తారంటే:

గురు మేష రాశి ప్రవేశం - గంగా నది పుష్కరము
గురు వృషభ రాశి ప్రవేశం - నర్మదా నది పుష్కరము
గురు మిథున రాశి ప్రవేశం - సరస్వతీ నది పుష్కరము
గురు కర్కాటక రాశి ప్రవేశం - యమునా నది పుష్కరము
గురు సిమ్హ రాశి ప్రవేశం - గోదావరి నది పుష్కరము
గురు కన్య రాశి ప్రవేశం - కృష్ణా నది పుష్కరము
గురు తుల రాశి ప్రవేశం - కావేరి నది పుష్కరము
గురు వృశ్చిక రాశి ప్రవేశం - తామ్రపర్జీ నది పుష్కరము
గురు ధనస్సు రాశి ప్రవేశం - సింధూ నది పుష్కరము
గురు మకర రాశి ప్రవేశం - తుంగభద్ర నది పుష్కరము
గురు కుంభ రాశి ప్రవేశం - భీమా నది పుష్కరము
గురు మేష రాశి ప్రవేశం - గంగా నది పుష్కరము
గురు మీన రాశి ప్రవేశం - ప్రణీత నది పుష్కరము

ప్రపంచంలో అతి విస్తృత జన సంగమం - కుంభ మేళా - గంగా పుష్కరాలు

సమస్త భూ మండలంలో మరెక్కడా సంభవించని సంఘటన భారత దేశంలో జరుగుతూ వస్తోంది. పన్నెండేళ్ళకొకసారి వచ్చే గంగా పుష్కరాలకు భారత దేశం లో వాళ్ళే కాక ప్రపంచ నలు మూలల నుండి జనం తండోప తండాలుగా తరలి వస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ధ " మేళా " గంగా నదీ తీరన జరుగుతుంది. దాదాపు 1.2 కోట్ల మంది గంగా నదీ స్నానం చేస్తారు. భూ మండల చరిత్రలో మరెక్కడా ఇంత మంది ప్రజలు ఒక చోట కలసిన ఉదారహణలు యెక్కడా లేవు. గిన్నిస్ బూక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా తన జాబితాలో ఈ మేళా ని పేర్కుంది. జన హృదయాలలో ఇంత ప్రగాడ నమ్మకం ఈ భూమి మీధ మరెకడా కనిపించదు. అందుకనే ఇంత భారి సందోహం ఉన్నా, తలపెట్టిన యత్నం సఫలీకృతం అవుతోంది.

గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగా నది కుంభ మేళా మొదలవుతుంది. " త్రివేణి సంగమం " ఐన, ప్రయాగలో (క్రీ.శ.1575 లో అక్బర్ సందర్శనం తరువాత - ప్రయాగను అలహాబాదు గా వ్యవరిస్తున్నారు) - గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం అవుతాయి. గంగా పుష్కరాలు అనాది నుంచి జరుతున్నాయి. కనీసం 4,000 యేళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉందని ఓ విశ్లేషణ.

ఈ మహా కుంభ మేళా ప్రయాగ లో మాఘ మాసంలో, హరిద్వార్ లో ఫాల్గుణ, చైత్ర మాసాలలో - సూర్యుడు (మేష రాశి) లో ప్రవేశించినప్పుడు; చంద్రుడు (ధనస్సు)లో; గురువు (కుంభం) లో ఉన్నప్పుడు సంభవిస్తుంది; ఉజ్జైన్, నాశిక్ నగరాలలో కూడా కుంభ మేళా నిర్వహించ బడుతుంది. ఇలా కాల మానాలు, గ్రహ గతులు, వాటి పరిశీలన, తదనుగుణ గణాంకాలు, తదనుభంద గణిత పద్ధతుల వాడకం, సంఖ్యా సాధన, పంచాంగాలు జన జీవితాలలో అంతర్భగాలై పోయాయి.

ఏడవ శతాబ్ధంలో హియున్ సీంగ్ (చైనా యాత్రికుడు, తర్వాత బౌద్ధ తత్త్వవేత్తగా మారేడు) తన అనుభవాల పట్టిక (డైరీ)లో ప్రప్రధమంగా భాతీయ పంచాంగాలను ప్రస్తావించాడు.

మహభారతంలోని తిథి, నక్షత్ర ప్రస్తావనలు - కొన్ని ఉదాహరణలు

సుమారు నాలుగు వేల యేళ్ళ కిందట జరిగిన మహాభారతంలో కొన్ని తిథులు, నక్షత్రాల గురించి ప్రస్తావించ బడ్డాయి. వీటిని పరిశీలిస్తే, అప్పటికే తిథి, వార, నక్షత్ర, పక్ష, ఆయన (ఉత్తరాయణం, దక్షినాయణం) వంటి కాల మాన పద్ధతులు ఆచారణలో ఉండేవని స్పష్టమవుతోంది.

కర్ణుడి జననం - మాఘ శుద్ధ పాడ్యమి
యుధిస్టిర జననం - ప్రజోత్పత్తి అశ్విణి, శుద్ధ పంచమి, జ్యేస్ఠ నక్షత్రం, ధనస్సు లగ్నం, అభిజిత్ ముహూర్తం
భీముని జననం - ఆంగీరశ అశ్విణి, కృష్ణ పక్ష నవమి, మఘ నక్షత్రం, మిట్టమధ్యానం తరువాత
అర్జునుడి జననం - శ్రీముఖ ఫల్గుణ, పౌర్ణమి, ఉత్తరా నక్షత్రం నకుల, సహదేవుల జననం - భావ ఫల్గుణ, అమావాశ్య, మిట్టమధ్యానం, అశ్విణి నక్షత్రం
కృష్ణుడి జననం - శ్రీముఖ శ్రావణం, కృష్ణ అష్టమి, అర్ధరాత్రి తరువాత, (వృషభ) లగ్నం
పాండు రాజు అస్తమయం - సర్వధారి చైత్ర శుక్ల ద్వాదశి, ఉత్తరా నక్షత్రం
పాండవుల హస్తినాపుర ఆగమనం - సర్వధారి చైత్ర కృష్ణ పక్ష త్రయోదశి
లాక్షా గృహ దహనం - కీలక ఫల్గుణ 13 / 14 రోజు రాత్రి మూడో జాము (ఒక్క దినములో 8 ప్రహరాలు - 4 పగటి కాలం, 4 - రాత్రి పూట) పాండవులు గంగా నది దాటింది - కీలక ఫల్గుణ అమావాశ్య పొద్దున్న
జరాసంధుడు, భీముని మధ్య పోటి - సర్వజిత్ కార్తీక శుక్ల ద్వితీయ మొదలై, 14 దినములు నడచింది
రాజసూయ యాగం - సర్వధారి చైత్ర పౌర్ణమి
మహాభారత యుద్ధ ఆరంభం - మార్గశిర శుక్ల 13 / 14 తిథి, మంగళవారం, భరణీ నక్షత్రం
అభిమన్యుడి మరణం - మార్గశీర్ష కృష్ణ పక్ష దశమి; అతని వయస్సు 32 యేళ్ళు
ద్రోణుడి మరణం - మార్గశీర్ష కృష్ణ పక్ష ద్వాదశి మధ్యానం
కర్ణుడి మరణం - మార్గశీర్ష కృష్ణ పక్ష పద్నాల్గవ దినము


ఈ ప్రమాణాల ద్వరా గ్రహాల స్తితి గతులు, చాంద్ర మాన పంచాంగం మన్ననలో ఉండడం, స్పష్టంగా తెలుస్తోంది.

ఎంతో అద్భుతమైన భారతీయ విజ్ఞాన సాగరంలో ఇది ఒక బిందు ప్రమాణం మాత్రమే! ఇంకా అనేక శాస్త్రాలలో భారతీయ వెలుగులను వచ్చే సంచికలలో చూద్దాం!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)