తెలుగు సాహిత్య ద్రష్ట, " కవిచూడామణి " శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి

ప్రాచీన గ్రంధ పరిష్కరణలో ఓ ప్రత్యేక ఒరవడి నెలకొల్పి - " మనుచరిత్ర, కాటమరాజు కధలు, బసవపురాణం, క్రీడాభిరామం, ఉత్తర హరివంశము, హరవిలాసము, రంగనాధ రమాయణం " మొదలైన గ్రంధాలను పరిష్కరించి తెలుగు సాహిత్యలోకాని అంధించడమేకాక, కనుమరుగైపోయిన అన్నమాచార్య సంకీర్తనలు పరిశోధించి కృతులను మనకు అందించారు. తెలుగులో ప్రప్రధమ తెలుగు కవయిత్రి, తాళ్ళపాక అన్నమాచార్య సతీమణి, తిమ్మక్క రచించిన " సుభద్రా కళ్యాణం " పరిష్కరించి వెలుగులోకి తెచ్చినదీ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారే. అపారమైన ఆయన భాషా పటిమ, గ్రంధ పరిశోధనా పరిష్కారణా నైపుణ్యాలతో మహత్తర గ్రంధాలను పరిచయం చేశారు శ్రీ వేటూరి గారు.

ప్రముఖ రచయిత డాక్టర్ తిరుమల రామచంద్ర, ప్రభాకర శాస్త్రి గారిని ఉద్దేశించి ఇలా అన్నారు - " యోగంతో చిత్తాన్ని, పదశాస్త్రంతో తెలుగు భాషను, వైద్యశాస్త్రంతో దేహాన్ని పరిపూతం చేసిన పతంజలి వంటి మహనీయులు ప్రభాకరులు". పండితులు కనక, డాక్టర్ తిరుమల సంక్షిప్త పదాలలో ఓ మహమనిషి జీవిత సర్వాన్ని చెప్ప గలిగేరు. ఆయన చెప్పినది అక్షర సత్యం.

శాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వతంత్ర దృక్పథంతో భాషా పరిశోధనా రంగంలో ప్రవేశించారు. అనేక ఘన విజయాలు సాధించారు. చరిత్ర, శాసనాల పరిశోధన ఆయన ప్రత్యేకతలు.

అన్నమాచార్య కీర్తనల అన్వేషణలో ఓ దృక్పధం ఏర్పరచుకుని, తదనుగుణంగా ఆధారాలను సేకరించి, విశ్లేషించి, అన్వేషించి ఆ పత్రాలను వెలుగులోకి తెచ్చి, వాటిని పరిష్కరించి, లోకానికి పంచిన మహా వ్యక్తి. ఆయన దీక్ష దక్షతలు, నిరంతర పరిశ్రమ యెటువంటిందో ఈ కార్యక్రమాలలో విదితమవుతోంది.

చెళ్ళపిళ్ళ వారి వద్ద అష్టావధాన, శతావధాన కళలు నేర్చిన మహా పండితులు - వెంగమాంబ సాహిత్యంలో నిష్ణాతుడు, అభ్యుదయశీలి, సాహిత్య ద్రష్ట, స్తితప్రజ్ఞుడు శ్రీ వేటూరి గారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు తెలుగులోనే సాగాలని ప్రబోధించారు. దేశం నలుమూలలా తిరిగి మంచి కధలు, సామెతలు, పాటలు సేకరించి భావి తరాలకు అందించారు. ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంధాలయంలో పండిత పదవి అలంకరించారు. వైష్ణవాంధ్ర సాహిత్యానికి ప్రభాకరుల సేవ గుణాత్మక మైనది.

"శతాబ్దాల తరబడి నిర్లక్షం చేయబడ్డ మన సాహిత్యం గురించి పరిజ్ఞానం కలిగించడానికి, ఉద్ధరించిన అన్నమాచార్య పదాలు ఎంతో ఉపయుక్తం" అని అభివర్ణించారు, అప్పటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాజమన్నారు.

"కవిచూడామణి" బిరుదు వచ్చినా ఎప్పుడూ పెట్టుకోలేదు. స్వతహాగా వారు వీటికి విముఖులు. వీరి పర్ణితి చెందిన వ్యక్తిత్వం ఎలాటిదో పరిచయం చేయడానికి ఈ ఉదాహరణ చాలు. ప్రభాకర శాస్త్రి గారి ప్రియ శిష్యుడు శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు ఇలా అన్నారు - " శాస్త్రి గారు మహామనిషీ, మనవతావాది, స్తితప్రజ్ఞుడు ". మరెందరో కవులు, రచయితలు - త్రిపురాన వేంకట సూర్య ప్రసాద రావు, కొత్త రామకోటయ్య ప్రభాకర శాస్త్రి గారి సేవను కొనియాడేరు. " వేటూరి గారు - మరో చాటు పద్య నిపుణుడు " అని అభివర్ణించారు - దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు.

దేశంలో విభిన్న ప్రాంతాలను గాలించి, కనుమరుగౌతున్న బాల సాహిత్యానికి సంభందించిన విషయాలను, పద్యాలను వెలుగు చూపేరు. నేడు లబించే - "చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ", " తారంగం తారంగం " - వంటి పిల్లల పాటలు చలమణీలో ఉన్నాయంటే దానికి శాస్త్రి గారి కృషే కారణం.

సౌజన్యశీలత, నిమిత్తమాత్ర, నిరహంకార దోరణి ప్రభాకర శాస్త్రి గారిది. మాస్టర్ సి వి వి శిష్యులు ఐనప్పటి నుంచి అంతర్ముఖ సమారాధ్యతతో యోగచిత్తుడై, దేనిమీదా వ్యామోహం లేకపోవడంతో ఇహలోక బంధాలేవి భాదించ లేదు.

"తెలుగులో నేను కొంత తంటాలు పడ్డాననుట తధ్యము. ఆంధ్ర వాజ్మయ సౌధ నిర్మణకారులలో ఒకడ నగుదు నని, కొన్నాళ్ళు కూలీ పని చేసి మట్టి ముద్దలు మోసితిని. చేతులు కడుక్కునే దశలో నిప్పుడున్నాను" అని చెప్పేరు శాస్త్రి గారు తన స్వీయ చరిత్ర - " ప్రభాకరస్మారిక " లో.

పుట్టు పూర్వోత్తరాలు - బాల్యం - తెలుగు సాహిత్య లోక ప్రవేశం:

శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 7-2-1888, సర్వజిత్ నామ సంవత్సర, మాఘ బహుళ ఎకాదశీ మంగళ వారం, మధ్యాన్నం 12:20 గంటలకు, (ఉదయం 10 ఘడియలకు) జ్యేష్ట నాలుగో పాదం లో ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని పెద్దకళ్ళేపల్లి గ్రామం లో వేటూరి సుందర శాస్త్రి, శేషమ్మ దంపతులకు రెండవ పుత్రులుగా జన్మించారు.

వారి స్వగ్రామంలో మద్దూరి రామావధానుల వద్ద సంస్కృతం నేర్చినారు. అద్దేపల్లి సోమనాధ శాస్త్రిగారి వద్ద " లఘు కౌముది, తర్క శాస్త్రం, పతంజలి యోగ సూత్రాలు, కావ్యనాటక - అలంకారాది సాహిత్య గ్రంధాలు " చదువుకున్నారు. ఈ సమయంలోనే అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి, పీసపాటి వెంకట్రామ శాస్త్రి వీరి సహాధ్యాయులు.

పెద్దకళ్ళేపల్లి లో తంగిరాల వేంకటావధానులు, శిష్ట్ల చయనులు, యడవల్లి అప్పావధానులు, బుద్దు భూషయ్య శాస్త్రి మున్నగు మహా పండితులు సాయంత్రాలు గుడి మండపంలో జరిపే సాహిత్య గోష్ఠిలు, ప్రసంగాలు బాల ప్రభాకరుల వ్యక్తిత్వ వికాసానికి, సంస్కార అభ్యున్నతికి ఉపకరణ సాధన మయ్యాయి.

1904 లో తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి శిష్యరికం చేసారు. అక్కడే రామకృస్ణ కవులలో ఒకరైన ఓలేటి వెంకట్రామ శాస్త్రి గారు చదువుతూ ఉండేవారు. చెళ్ళపిళ్ళ వారి సన్నిధిలో జరిగే అవధాన ధారణలు, పద్యరచనలు, ఉపన్యాసాలు, కవితాగోష్టిలు, వాద ప్రతివాదములు ప్రభకార విద్యా (గ్రహణ) పరిణితి కారణ హేతువులైయ్యాయి. వేంకట కవుల ఒజ్జరికంలో అష్టావధాన, శతావధాన కళలు నేర్చినారు. కాలానుగుణంగా వీటికి స్వస్తి చెప్పి కవితా, పరిశోధనా రంగాలలో స్థిరపడి మహోన్నత శిఖరాలను అదిరోహించారు. ఒలేటి వెంకట్రామ శాస్త్రిగారు వీరి సహాధ్యాయులు. చిన్నతనం నుండి స్వతంత్ర ప్రవృత్తి కలవారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు. రామావధానుల వద్ద శబ్దపరిచయము, కాళిదాసాత్రయము పూర్తిచేసారు.

1906 లో జీవికకై మద్రాసు (చెన్నై) చేరుకున్నారు. వెస్లీ మిషను స్కూల్లో తెలుగు పండితుడిగా చేరారు. శ్రేయోభిలాషి వల్లూరి సూర్యనారాయణ రావు గారి సలహా మేరకు తరచు ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీకి వెళ్ళి అపూర్వగ్రంధాలను చదువుతూ వుండేవారు. అలుపులేని శ్రమ వీరిధి.

జయంతి కామేశం, పనప్పాకం అనంతాచార్యులు, గురజాడ అప్పారావు, వారి ద్వరా గిడుగు రామమూర్తి, కొమ్మరాజు లక్ష్మణ రావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేలూరి శివరామశాస్త్రి, తాతా సుబ్బరాయ శాస్త్రి ప్రభుతులతో మంచి స్నేహం యేర్పడింది. మద్రాసు ఓరియంటల్ గ్రంధశాలలో (లైబ్రరీలో) వేటూరి గారి సాహిత్య యాత్ర మూడు దశాబ్దాలపాటు సాగింది.

1910 లో ఇదే గ్రంధాలయంలో "కాపీయిస్టు" గా చేరారు. తరువాత పదోన్నతి చెంది పండితులైనారు. శాస్త్రి గారికి పిసపాటి జగన్నాధం గారి కుమార్తె మహాలక్ష్మి తో వివాహం జరిగింది.

1948 లో మద్రాసు ప్రభుత్వం విభిన్న భాషలలోని ప్రాచీన గ్రంధాలను ప్రచురణకు రాతప్రతులను సంపాదించేందుకు ఏర్పాటుచేసిన కార్య నిర్వాహణా సంఘంలో సభ్యుడిగా ఉన్నారు.
వేటూరి వారిలో మరో ప్రత్యేకత ఏమిటంటే, వారు మాస్టర్ సి వీ వీ శిష్యరికంలో పయనించిన యోగమార్గం. అది ఆయనను సంపూర్ణ వ్యక్తిగా నిలబెట్టింది.

ప్రాచీన గ్రంధాల పరిష్కరణ - తదితర విశిష్ట సేవలు

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ముప్పదియేడు ప్రాచీన గ్రంధాలు పరిష్కరించారు; యేడు నాటకాలు; మూడు చిత్ర గ్రంధాలు రూపధారణకు కారణమైయ్యారు. ఇంత విస్తృతమైన సాహిత్య పోషణకు కారణాలు చెళ్ళపిళ్ళ వారి శిష్యరికం, ప్రాచీన గ్రంధాల పట్ల ఆసక్తి, శ్రద్ధ, తపన ఇత్యాదివి. పెద్దలతో పరిచయం: - పనప్పాకం అనంతాచార్యులు, డాక్టర్ ఆచంట లక్ష్మీపతి, కాశినాధుని నాగేశ్వర రావు పంతులు, పిఠాపురం మహారాజ శ్రీరావు వేంకట కుమార మహీపతి సూర్యా రావు, వేదం వెంకటరాయ శాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, వేటూరి ప్రభకర శాస్త్రి, చీమకుర్తి శేషగిరి రావు శబ్ద చర్చలు చెసేవారు.

చెళ్ళపిళ్ళ వారి శిష్యగణం - విశ్వనాధ సత్యనారాయణ, కాటూరి వెంకటేశ్వర రావు, పింగళి లక్ష్మీకాంతం, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి - వీరంతా తెలుగు భాషలో ఉద్దండ మహా పండితులుగా ఆవిర్భవించారు. శ్రీ తిరుపతి శాస్త్రి గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కవిరాజులు విశ్వనాధ గార్లతో వేటూరి వారి పరిచయాలు ప్రగాఢమైనవి. పరస్పర గౌరవ భావంతో ఉండేవి.

పండిత త్రయం - సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, ఈ ముగ్గురినీ " అన్నమచార్య పండిత త్రయం " అని వ్యవహరించేవారు. వీరు అన్నమాచర్య సంకీర్తనలను లోకానికి అందించారు. వేటూరి గారు 14,000 సంకీర్తనలని వెలుగులోకి తెచ్చారు. టి టి డి వీటిని 39 సంపుటాలలో ప్రచురించింది. ఈ మధ్య కాలం లో దాదాపు తొమ్మిది యేళ్ళపాటు పరిశోధన చేసి జి బి శంకర రావు గారు, 288 సంకీర్తనలను గ్రంధపత్రాల నుండి వెలుగులోకి తెచ్చారు. వీటిలో 180 సంకీర్తనలు ఇప్పటి దాకా వెలుగులోకి రానివి.

మౌలిక సదుపాయాలు లేని కుగ్రామాలలో ఉండి, పలు గ్రంధాలను వెలికి తీసారు ప్రభాకర శాస్త్రి గారు. శాస్త్రి గారి సంచారంలో - శిష్యులు - శింగరాజు సచ్చిదానంధం, ఏ వి శ్రీనివాసాచార్యులు, దీనదయాళ నాయుడు. ఒక్కొక్కసారి ఆయన పెద్దకుమారుడు డాక్టర్ సుందరమూర్తి ఉండేవారు.

ప్రభాకర శాస్త్రి గారు చేసిన పరిష్కరణలు - అప్పన చారుచర్య, ఉద్బటారాధ్య చరిత్ర, భగవదజ్ఞకము, మనుచరిత్ర, బసవపురాణం, బసవోదాహరణము, నీతిద్విష్టిక, క్రీడాభిరామం, బాలభాష, ఉత్తర హరివంశము, సుగ్రీవ విజయము (యక్షగానం), హరవిలాసము, గ్రంధ వివరణికలు (19 సంపుటాలు), రంగనాధ రామాయణం, వేంకటేశ్వర వచనములు, అన్నమాచర్య సంకీర్తనలు, అన్నమాచర్య జీవిత చరిత్రము, ధనువిద్యా విలాసము, ఆంధ్రకామకరందము, కాటమరాజు కధలు, సుభద్రా కల్యణము, సారసంగ్రహగణితము ఇత్యాది గ్రంధాలు.

తిరుపతి ప్రాచ్య కళాశాల (ఓరియెంటల్ కాలేజీ) లో పనిచేస్తూ ఉండగా తాళ్ళపాక వారి రచనలు వెలుగులోకి తీసుకొచ్చారు. యక్షులు (జుక్కులు) గుంటూరు పరిసర ప్రాంతాల వారని తేల్చి చెప్పారు. యక్షులు పాడిన పద్యాల రాగలు, తాళాలను నేటి లోకానికి అందజేశారు.

పావులూరి మల్లన్న సారసంగ్రహ గణితము - ప్రభాకర శాస్త్రి గారి పరిష్కరించిన గ్రంధాలలో ఇది చిట్ట చివరిది. 1912 లో వారీ గ్రంధం గుర్తించి, మహావీరాచర్యుని "గణితసార సంగ్రహ" గ్రంధాన్ని తెలిగింప పూనినారు. మల్లన్న గ్రంధాన్ని బెంజమిన్ అనే ఈఅస్ట్ ఇండియా కంపెనీ యేజెంటు (సామర్లకోట) ఆంగ్లంలోనికి తర్జుమా చేసాడు. శాస్త్రి గారు వీటిలోని సాంకేతిక పదాలు, తదర్ధాలు, వివరణలు ఇవ్వడంతో కొలమానాలు మూలంలో మగధ సాంప్రదాయంలో ఉంటే, ఆంధ్రీకర్త తెలుగు సాంప్రదాయానికి మార్చి నట్టు కనుగొన్నారు. ఇంతటి విశ్లేషణ, అవగాహన, తదనుగుణ వివరణా శక్తి శాస్త్రి గారి నైపుణ్యానికి అద్దంపడతాయి.

వేటూరి వారి రచనలు, పరిష్కరణలు, కృతులు

వేటూరి గారి సాహిత్య ప్రస్థానంలో అనేక రచనలు, గ్రంధ పరిష్కరణలు చోటు చేసుకున్నాయి. శాస్త్రి గారు చేసినన్ని గ్రంధ పరిష్కరణలు తెలుగు నాట మరెవరు చేయలేదు. వీరు రచినచిన, పరిష్కరించిన గ్రంధాలలోని కొన్ని ముఖ్య అంశాలు:

సుభధ్రా కల్యాణము - తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క కృతిని కాళహస్తి సంస్థాన భండాగారం నుంచి వెలికి తీసి ప్రచురించారు శాస్త్రి గారు. తిమ్మక్క అన్నమయ్య భార్య. ఈ రచన మంజరీ " ద్విపద " లో ఉంది. ఇందులోని పెక్కు పలుకుబడులు చేమకూర వేంకట కవి " విజయవిలాసం " లో ఉన్నట్టు ప్రభాకర శాస్త్రి గారు తెలిపారు. ఇది వారి పాండిత్యానికి ఓ మచ్చుతునక.

అన్నమాచార్య జీవితచరిత్రము - సంకీర్తనాచార్యులు తాళ్ళపాక అన్నమాచార్య గారి జీవిత చరిత్రను, ఆయన మనుమడు చిన తిరువేంగళనాధుడు (చిన్నన్న) ద్విపదలో రచించినాడు. ఈ పీఠికలో అన్నమయ్య, తత్సంతతి చరిత్ర, వడ్డికాసులవాని వైభవము, ఆంధ్ర సంకీర్తన విశిష్టత, సంగీత శాస్త్ర విషయాలు, నాటి భాషా కవితా రీతులు, మత, సాంఘిక చరిత్రలు వివరింపబడినవి.

సంకలనములు - చాటుపద్య మణిమంజరి, ప్రభంద రత్నావళి, లక్షణోద్ధరము, శ్రీవేంకటేశ్వర లఘుకృతులు, శాసన సంకలము

వ్యాఖ్యానములు - మనుచరిత్ర, ఉత్తర హరివంశము, నన్నెచోడ కుమారసంభవము, నైషద పారిజాతీయము

కధలు - కామధేనువు కధ, కరుణాకము, కలికి-చిలుక, తక్రానందస్వామి, పుణ్యవతి-భాగ్యవతి, కాకిపగ

చరిత్రలు - తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర, శృంగార శ్రీనాధము, అన్నమాచార్య జీవిత చరిత్రము, ఆంధ్రదేశీయ సంస్కృత కవుల చరిత్ర

అనువాద నాటకాలు - ప్రతిమ, కర్ణభారము, మధ్యమ వ్యోగము, భగవదజ్ఞకము, మత్తవిలాసము, నాగానందము, గౌరీ కల్యాణం

వచన కృతులు - నీతినిధి (1926), తెలుగు మెరుగులు, ప్రజ్ఞా ప్రభాకరము, మీగడ తరకలు, సింహావలోకనము

కవితా రచనలు - ఎడ్వర్డు పట్టాభిషేక శ్లోకములు, ఒథెల్లో నాటకంలో పద్యాలు, పార్ధసారధి, శ్రీ వేంకటేశ్వర స్వామి, నూతన వర్షము, ఐదవజార్జి పట్టాభిషేకము, శ్రీనివాస నిర్యాణము, తంజావూరి ఆంధ్రరాజుల పీఠిక, చల్లపల్లి జమిందారు అంకినీడు స్మృతి, మూన్నాళ్ళ ముచ్చట, రాజ రాజ నరేంద్ర ప్రశంస, వేణీపంచకము, సమస్యాపూరణలు, అలవాటు, దివ్యదర్శనము, కృతార్ధుడు, కాళహస్తి-శివరాత్రి, సప్తపదులు, స్వాగతము, ఆశాంసనము, కడుపు తీపి, కపోత కధ, గోవర్ధన సప్తశతి

ఇతర రచనలు - బసవ పురాణం, ఉద్భటారాధ్య చరిత్రం, హరవిలాసం, క్రీడాభిరామం గ్రంధ పరిష్కర్త; శృంగార శ్రీనాధము (శ్రీనాధుని సమగ్ర చరిత్ర); చాటు పద్య మణిమంజరి; తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర;

ధనుర్విద్యావిలాసము - యుద్ధ తంత్రాన్ని తెలిపే కృతి ఇది. నలభై ఐదు అధ్యాయాలు ఉన్న ఈ గ్రధం ధనుర్విద్యా కారిక (కారకం)

శృంగారామరుకము - ఇది సంస్కృతంలోని "అమరుక" శతకానికి తెనుగుశేత. ఆంధ్రీకర్త, అన్నమయ్య ముని మనుమడు తాళ్ళపాక తిరువేంగళప్ప. తన పరిశోధనా పద్దతిలో యెప్పటిదో ఒక వ్రాత ప్రతి దొరికితే ఈ కృతిని పరిష్కరించారు.

ఆధ్రకామదకము - ఇది రాజనీతిని తెలిపే గ్రంధం. జక్కరాజు వేంకట కవి రచించాడు.

కాటమరాజు కధలు - దొరికిన తొమ్మిది తాళపత్ర ప్రతులను పరిశీలించి ఒక శుద్ధ ప్రతిని ముద్రణకై పరిష్కరించారు. శ్రీనాధుని రచనమును అనుసరించి పినమల్లయ్య దీనిని రచించినట్లు ప్రభాకర శాస్త్రి గారి ఉవాచ.

అచార్య నడిమింటి రామచంద్ర శాస్త్రి గారు, " సర్వమంగళ సార్వస్వము " లో ప్రభాకర శాస్త్రి గారు మంగళేశ్వర శాస్త్రి (1759-1839) చేసిన పనిని సమీక్షించారు.

శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు - "శ్రీ వేంకటేశ్వర వర్ణన రత్నమాల" సంకలనాన్ని సంధానించారు.

బాల సాహిత్యం - బాల భాష - గోరు ముద్ద; గుజ్జు ముద్ద; ముగ్ధ మధుర వాజ్మయం. తెలుగు నాట బాల బాలికలు పాడే పాటలు, పలికే మాటలు, చెప్పుకునే కధలు కొన్నింటిని సేకరించి " భారతి " (1930) లో " బాల భాష " అనే పేరుతో ప్రచురించారు.

వీరి పీఠిక - ఉత్తరహరివంశ వ్యాఖ్యానం వాసికెక్కిన రచనలు.

చాటు పద్య మణి మంజరి సృష్టికర్త.

శ్రీ శాస్త్రి గారు రచించిన " ప్రజ్ఞా ప్రభాకరం " లో మాస్టర్ సి వీ వీ గురించి వివరణలు ఇచ్చారు

ప్రభాకర శాస్త్రి గారి భాషా పటిమ ఎంతటిదో, వారికున్న జ్ఞాన సంపద ఎటువంటిదో ఈ విశ్లేషణల ద్వరా, వివరణల ద్వరా తెలుస్తుంది. ఇంతగా తెనుగు భాష ఎరిగినవారు, ప్రాచీన కవులు వారి కృతులు, తదర్ధాలు, నాటి భాషా కవితా రీతులు, మత, సాంఘిక చరిత్రలు తెలిసిన వారు తెలుగు నాట యవ్వరూ లేరు. ఈ ఘనత శాస్త్రి గారికే దక్కింది.

ప్రభాకర పరిశోధక మండలి వారు బాల భాష గేయాలను మొదటిసారిగా 1956 లో పుస్తకరూపంలో ప్రచురించారు. ఆంధ్ర భారతి వారు కొంచం సాహసమే చేసి వారి కుమారులను సంప్రదించి, అమూల్య గ్రంధాలు తెచ్చి సాహితీ ప్రియులకు అందుబాటులోకి - వెలుగులోకి తెచ్చారు. వీటిలో "చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ", "తారంగం తారంగం" వంటి పాటలు ఉన్నాయి.

ప్రభాకర శాస్త్రి గారి అముద్రిత పరిష్కృత కృతులు - లక్షణోద్ధరము, కాశీఖండము, శివ తత్వ సారము, కవిలోక చింతామణి, నైషధ పారిజాతీయము, నన్నెచోడ కుమారసంభవము, బేతాళ పంచవింశతి, భీమఖండము, నీలగిరి యత్రా చరిత్రము, కేవూరబాహు చరిత్రము.

శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మీధ విలువడిన రచనలు:- వేటూరి వారి సారస్వత వరివస్య - డాక్టర్ పోచిరాజు శేషగిరి రావు

- " మా శాస్త్రి గారు " - కొత్త రామకోటయ్య (3 సంపుటాలు)

- రూపక మంజరి

- ప్రభాకర స్మారిక (4 భాగాలు)

- వ్యాసప్రభాకరము

వీరి ప్రియ శిష్యులు డాక్టర్ పోచిరాజు శేషగిరి రావు గారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి "జీవిత చరిత్ర " (బయోగ్రఫీ), రచించి, ప్రచురించారు (1999).

సంగ్రహాలయం (మ్యూజియం) వస్తువుల సేకరణలో నిమగ్నమై, ఆరోగ్యం దెబ్బతిని 29.8.1950 మధ్యాన్నం భౌతికం వీడి నారు. తన జీవితం చివరి క్షణం వరకూ తెలుగు సంస్కృతి పోషణకు పరిశోధనకు అంకితమైన కర్మజీవులు, యోగవేత్తలు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు.

ఆయన అందించిన సారస్వత జ్యోతులు సూర్య ప్రభలు వెరజిమ్ముతూనే ఉంటాయి. అవి చిన్నారులకోసం వెలుగులోకి తెచ్చిన " తారంగం, తారంగం ", "చెమ్మ చెక్క చారెడేసి ముగ్గ " పాటలో లేక నేడు ప్రాభావంలో ఉన్న అన్నమాచర్య సంకీర్తన కృతులే కావచ్చు. తన వంతు కృషి చేసి, ఫలాలను భావి తరాలకు అందించి, సిద్ధి పొంది తెలుగు సాహిత్యంలో ఒక దీపశిఖలా నిలచిపోయేరు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఫర్వాలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)