నడకలోనే పద్యం నడక

తెలుగు పద్యానికి ప్రపంచసాహిత్యంలోనే ప్రత్యేకస్థానం ఉంది.ఆ ప్రత్యేకతలో సగభాగం దాని నడకలోనే ఉంది. ఆ నడక అందంగా ఉండాలంటే కవి పద్యనిర్మాణం పట్ల శ్రధ్ధ వహించాలి.అటువంటి శ్రధ్ధాయుతమైన పద్యనిర్మాణం ఎలా ఉంటుందో పోతనగారి భాగవతంలోని "వామన చరిత్ర" ఘట్టంలో చూద్దాం. బుజ్జి వామనుడు బలిచక్రవర్తి సభామండపంలోనికి ప్రవేశించాడు. కొందరు ఆశ్చర్యంగా, కొందరు ఆనందంగా, ఇంకోందరు అసూయగా చూస్తూ ఉండగా ఆ బాలుడు అడుగులోఅడుగు వేసుకుంటూ నడిచి వస్తున్నాడు.ఆ నడకల్ని పోతన ఎంత శాస్త్రీయంగా,మనోవిశ్లేషణాత్మంగా వర్ణించాడో చూడండి

"వెడ వెడ నడకలు నడుచుచు
నెడ నెడ నడుగులకు నడరి యిల దిగబడగా
బుది బుడి నొడువులు నొడువుచు
జడిముడి తడబడగ వడుగు చేరెన్ రాజున్"

వామనుడు పసిబాలుదు. కాబట్టి తప్పటడుగులు వేయడం సహజం. అందుకే "వెడ వెడ నడకలు" అనే ప్రయోగం.నడుస్తూ ఉంటే పడిపోతానేమో అనే భయంతో నడవడం బాలుని నైజం.ఇక్కడ కొంచెం దూరంగా ఉన్న తల్లి దగ్గరకు చేరుకొనే పసిబాలుని నడకను మనం ఊహించుకోవాలి.తల్లి పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు కొంచం దూరంగా నిలబడి దగ్గరకు రమ్మని పిల్లవాణ్ణి ప్రోత్సహిస్తూ ఉంటుంది.అతడు దగ్గరకు వస్తున్న కొద్దీ తాను కొంచం దూరం జరుగుతూ పిల్లవాణ్ణి మళ్ళీ మళ్ళీ రమ్మని పిలుస్తూ వాడు పడిపొబోతుంటే తాను దగ్గరకు వెళ్ళి పట్టుకోబొత్తున్న భద్రతా భావాన్ని కల్పిస్తూ చివరికి దగ్గరకు వచ్చే సమయానికి తనచేత్తో అందుకోబోతున్నట్లు నటిస్తూ నడకలో గొప్ప శిక్షణనిస్తుంది. ఈ వాతవరణమంతా ఈ చిన్న పద్యంలో ఇమిడించాడు పోతన్న.

"యెడ నెడ నడుగులు" అటూ ఇటూ వేసే తప్పటడుగులన్నమాట. అడరి యిల దిగబడగా అంటే "ఆ బాలుడు భూమిమీదా జారిపోతున్నాడేమో అనీ చెప్పుకోవచ్చు.ఆ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి ఆయన అడుగుల భారానికి భూమి దిగబడి పొయేలా ఉందని చెప్పుకోవచ్చు."ఇలా" అనే శబ్దం తరువాత ద్రుతం లొపించినదనుకుంటే ఈ రెండు అర్ధాలూ చక్కగా సరిపొతాయి.

ఇది ఇంచుమించుగా సర్వలఘకందం.తప్పనిసరి కాబట్టి రెండవ,నాల్గవ పాదాల చివర గురువుంది.కాని వాటితోబాటు నాల్గవ పాదం చివరలో చేరెన్ రాజున్ అంటూ నాలుగు గురువులు వేసాడు.అన్నీ లఘువులే వెసిన పద్యంలో చివరలో అకస్మాత్తుగా నాల్గవ గురువెందుకు?తల్లిని చేరుకోవడానికి ప్రయత్నించే బాలుడు నెమ్మది నెమ్మదిగా నడుస్తూ తల్లి దగ్గరయ్యేసరికి అమ్మ దొరికేసిందన్న ఆనందంలో ఒక్కసారిగా వేగం పెంచి ఆమె వడిలోకి దూకేస్తాడు. ఇక్కడ వామనుడు కుడా అంతవరకు నెమ్మదిగ నదుస్తూ అందరిని పలకరిస్తూ ఉన్నవాడు బుడి బుడి నొడువులు నొడువుచు ఒక్కసారిగా బలిచక్రవర్తి దగ్గరయ్యేసరికి లక్ష్యానికి చేరుకొన్నానన్న ఆనందంలో గబగబా నడుస్తాడు.ఆ వేగమె ఈ నాలుగు గురువుల ప్రయోగానికి కారణం.ఇదీ ఆయన మనస్తత్వం పరిశీలన. పాత్రోచిత రచన సందర్భోచితశయ్య. పద్యనిర్మాణంలోనే బాలుని నడకను అందులో రకరకాల దశలను చిట్టచివరి వేగాన్ని చూపించగలిగిన ఈశక్తి తెలుగు పద్యానికే ఉందేమో!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)