అమెరికాలో తెలుగు సినిమానా? మజాకా?

ప్రశాంతమైన మనస్సుతో 'హాయీహాయిగా...' అని అదేదో పాటలో అన్నట్టు ఆఫీసులో కూర్చుని పనిచేసుకొంటున్నాను నేను. ఇంతలో చొక్కాజేబులో ఏదో బరబరా కదిలినట్టయింది. తడిమి చూద్దును కదా, అది నా సెల్ ఫోను. కాల్ నెంబరు చూద్దును కదా, అది ఓ స్నేహితుని దగ్గరనుండి. కాల్ ఆక్సెప్ట్ చేసి చూద్దును కదా, ఇంతలో అటునుండి డిస్ కనెక్ట్ అయ్యింది. ఎందుకు ఫోను చేసాడోనని కాల్ చేద్దును కదా, ఫోను ఎత్తలేదు గురుడు. రింగు టోనుకు బదులు 'ఒ కైకే పాన్ బనారస్ వాలా...' అన్న పాట వినిపించింది. మొన్నెప్పుడో ఫోను చేస్తే 'చిటపట చినుకులు పడుతూ వుంటే...' అన్న పాట పెట్టాడు. ఇలా ఇతను పాతకాలం నాటి 'వివిధభారతి, మీరుకోరిన పాటలు ', 'బినాకా' ప్రోగ్రాముల్లా రోజుకో కొత్త పాటకు రింగ్ టోను మారుస్తుంటాడు. ఎంతైనా బ్రహ్మచారి, సిసలైన తెలుగు సినిమాప్రియుడు. 'ఓ లమ్మీ తిక్క రేగిందా...' అనే పాట పెట్టనంత వరకు ఎన్ని వేషాలైనా వెయ్యొచ్చు.

పాట ఓ చరణం వినిపించి, అప్పుడూ లైన్లోకి వచ్చాడు. 'వేయిటింగ్ చేయించినందుకు సారీ. ఫోనుకాల్లతో యమ బిజీ అనుకో' అన్నాడు. తొందరలో ఉన్నట్టున్నాడు. మళ్ళీ అతనే అందుకొంటూ 'నేనేందుకు ఫోను చేసానంటే... వచ్చే బుధవారం సాయంత్రం మనందరం తెలుగు సినిమాకి వెళ్ళుతున్నాం. నేను మన గ్రూపుకు ఓ ఇరవై టికట్లు బ్లాక్ చేస్తున్నాను. నువ్వు వస్తావు కదూ?' అడిగాడు.

తలాతోకా లేకుండా ఒక్కసారిగా అడుగుతుంటే 'ఏ సినిమా? ఏవిటీ గ్రూప్ హడావుడి?' అంటూ అడిగాను.

మేము ఓ పాతికమంది తెలుగువాళ్ళం ఈమధ్య ఓ ఫిట్ నెస్ సెంటర్లో ఒకరికొకరు పరిచయం అయ్యాం. అలా పరిచయాలు పెంచుకొని ఫోను నెంబర్లు మార్చుకునే వరకు వచ్చాం.

నా ప్రశ్నలకు కంగు తిన్నట్టున్నాడు ఆ మనిషి. 'ఇది చాలా టూమచ్. నీకు నిజంగా నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో తెలియదా?' సీరియస్ గా అడిగాడు. లేదన్నాను.

'అదేంటి. ఈ సినిమా విడుదలతో ప్రపంచమంతా అట్టుడికి పోతుంటేను. ప్రభంజనంలా దద్దరిల్లి పోతుంటేను. సిలికన్ వేలీ సునామీ వచ్చినట్టు అట్టుడికిపోతుంటేను. తెలుగువాడివై ఉండి నీకు ఈ సినిమా గురించి తెలియకపోవడం చాలా అన్యాయం.' అంటూ వాపోయాడు.

ఇవన్నీ మాట్లాడుతున్నాడు గాని సినిమా పేరు మాత్రం చెప్పటం లేదు. అదే అడిగాను, 'ఇంతకీ ఏ సినిమా? దాని పేరేంటీ?'

'స్టుపిడ్ ఫెల్లో'

'సినిమా పేరడిగితే చొరవ తీసుకొని తిడుతున్నాడేంటీ?' నేను కంగు తిన్నను.

అవతలినుండి తేరుకున్నట్టున్నాడు గురుడు, 'సారీ! నీవేం అనుకోవద్దు. అదే సినిమా పేరు, స్టుపిడ్ ఫెల్లో' అన్నాడు.

'అది సరేగాని, మరీ వారం మధ్యలో సినిమాకెళ్ళడమా? వీకెండ్ అయితే బాగుంటుందేమో?' అన్నాను.

'ఇండియాలో ఈ సినిమా గురువారం ఉదయం నాలుగు గంటలకు విడుదల అవుతున్నది. అంటే మనకు బుధవారం రాత్రి. అలాగే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. చాలా డబ్బులు పెట్టి తీశారు. చాలా బాగొచ్చిందట. పాటలు బాగున్నాయట. హీరో చాలా బాగా డాన్సులు చేశాడట...' అంటూ 'ట 'ల పర్వం చెప్పుకొచ్చాడు.

చాలా డబ్బులు పెట్టి తీస్తే, చాలా బాగా డాన్సులు చేస్తే, సినిమా చాలా బాగా ఉంటుందా? నాదో పెద్ద అనుమానం.

అయినా చెప్పొద్దు కానీ, మొన్నో సినిమా వీడియో పెట్టుకొని చూసాను. సినిమా మొదలయ్యి అర నిమిషం కాలేదు. మూడు మాటలు మాట్లాడలేదు. అంతలో హాటు హాటుగా ఓ ఐటెం సాంగ్ వచ్చింది.

సరేలే, ఈ గొడవంతా ఎందుకు అనుకుంటూ 'ఓకే! నాకో టికట్టు బుక్ చెయ్యి ' అన్నాను. 'థాంక్స్ ' అంటూ ఫోను పెట్టేసాడు.

****************

సినిమా చూసే రోజు రానే వచ్చింది. థియేటర్ దగ్గరకు వెళ్ళితే ఇసుక వేస్తే రాలనంత జనం. అక్కడ భూమి మనుషులను ఈనిందా అన్నట్టుంది. కొందరు ఆ సినిమా హీరో అభిమానులు నెత్తికి రుమాళ్ళు చుట్టుకొని, డప్పులు చేతబుచ్చుకొని అదరగొడుతూ వాయిస్తున్నారు. ఎంట్రన్స్ డోర్ ఇంకా తెరవలేదు. టిక్కట్లు ఇవ్వటం లేదు. జనంలో అసహనం మొదలయ్యింది.

అక్కడ అతికించిన పొస్టర్లు చూస్తుంటే తెలిసింది, ఆ సినిమా పేరు 'స్టుపిడ్ ఫెల్లో' కింద ఇంకో లైను రాసుంది 'వీడికి వళ్ళాతా తెలివే' అని. ఆ రాతను 'ట్యాగ్ లైన్ ' అంటారని నాకు ఈ మధ్యనే తెలిసింది.

కొద్దిసేపట్లో థియేటర్ మేనేజర్ బయటికొచ్చాడు. 'మీరు వారం మధ్యలో వీలు కల్పించుకొని సినమాకు రావటం మా అదృష్టం. అయితే ఆలస్యానికి కారణం ఏమిటంటే, సినిమా డబ్బాలు రావటం ఆలస్యమయింది. డబ్బాలను న్యూయార్క్ లో ఎక్కించాల్సిన ఫ్లయిట్ మిస్సయింది. నెక్స్ట్ ఫ్లయిట్లో వచ్చాయి. ఇంకో ముప్పయి నిమిషాల్లొ సినిమా మొదలెడతాం' అని విన్నవించుకొన్నాడు.

'మనకా టికట్ల దొరకవన్న బాధేం లేదు. ఎందుకంటే ముందుగానే రిజర్వ్ చేసుకొన్నా కదా!' ధీమాగా మాట్లాడాడు గురుడు.

నెమ్మదిగా మా గ్రూపు వాళ్ళాందరూ ఒక్కొక్కరు వచ్చారు. ఇంతలో ఒకతను కూర్చొని ఉంటే అతని చుట్టూ కొందరు గుమి అయ్యారు. దేనిలోకో తొంగి తొంగి చూస్తున్నారు. మేము అక్కడకు వెళ్ళాము. కూర్చున్న మనిషి చేతిలో లాప్ టాప్ ఉంది. అతను చాటింగ్ చేస్తున్నాడు. ఆరా తీస్తే తెలిసింది అతని బ్రదర్ సింగపూర్లో ఉంటాడట. సింగపూర్ కాలమాన ప్రకారం బే ఏరియా కంటే కొన్ని గంటలు ముందు ఉంది కనుక ఆ సదరు బ్రదరు సినిమా చూసి ఇప్పుడే థియేటర్లో నుండి బయటకు వచ్చి ఈ సదరు సహోదరునికి సినిమా రివ్యూ ఛాటింగులో ఇస్తున్నాడు.

'ఆహా! ఎంత వైభవం వచ్చింది తెలుగు సినిమాకి ' అని మనసులో అనుకున్నాను.

లేటవుతుంటే నాకు వర్రీ ఎక్కువకాసాగింది. సినిమా అయిపొయ్యేసరికి రాత్రి ఏ రెండో అవుతుంది. మళ్ళీ పొద్దున్నే ఏడింటినుంచి ఆఫీసు మీటింగులు.

యజమాని అన్న అరగంట గడిచింది. టిక్కట్లిచ్చే ఆనవాలు ఏ కోశానా అగుపించటం లేదు. ఇంతలో అతనే మళ్ళీ బయటికొచ్చాడు. చేతిలో ఒక కాగితాల కట్ట ఉంది.

'మీరు మీ అభిమాన హీరో సినిమా చూడటానికి ఎంతో ఓపికతో ఎదురు చూస్తుం న్నందుకు ఎంతో ధన్యవాదాలు. (అతని అసలు ఉద్ధేశం, కృతజ్ఞతలు). ఈ సందర్భంగా మీకో న్యూస్. మీకు దం బిర్యాని రెస్టారెంట్ వారు ఒక డిస్కౌంట్ కూపన్ ఇస్తున్నారు. దాన్ని తీసుకొని మీరు వారంలోగా రెస్టారెంట్ కు వెళితే చికెన్ బిర్యానీ ఆర్డర్లో పదిహేను శాతం కౌంట్ ఇస్తారు.' అనగానే అందరూ 'ఆహా'కారాలు చేశారు.

'దం బిర్యానీ రెస్త్టారెంట్ లో చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది తెలుసా? ఎప్పుడన్న తిన్నావా?' అడిగాడు గురుడు లొట్టలేస్తూ.

'లేదు.' బదులిచ్చాను.

ఇంతలో యజమాని మళ్ళీ మాట్లాడుతూ 'అంతే కాదు. పదిహేను శాతం డిస్కౌంటే కాకుండా చికెన్ బిర్యానీలో ఓ ఎక్స్ ట్రా లెగ్ పీస్ కూడా ఉచితంగా వేస్తారు ' అన్నాడు.

ఇప్పుడు 'ఓహో'కారాలు వినిపించాయి. అప్పుడు చాలామంది నోళ్ళలో లాలాజలం ఊరటం కూడా కనిపించింది.

'తింటే ఇక్కడే బిర్యానీ తినాలి. ఈ బే ఏరియా చికెన్ బిర్యానీ సికింద్రాబాదులోని అల్ఫా హోటెల్ ని మరిపిస్తోంది తెలుసా?' మళ్ళీ అడిగాడు.

'ఏమో' అన్నాను.

ఆ డిస్కౌంట్ కూపన్లను అందరూ ఎంతో పదిలంగా దాచుకొన్నారు.

ఏమైంతేనేం బుకింగ్ మొదలయ్యింది. కానీ ఇరవై టికట్లే ఇచ్చారు. మిగతావన్ని అడ్వాన్స్ బుకింగ్ అయిపోయావన్న మాట.

హీరో అభిమానులు చాలా నిరాశ చెందారు. యజమాని మళ్ళీ బయటకొచ్చాడు.

'మీ ఉత్సాహం ఇంత వెల్లువలా ఉంటుందనుకోలేదు. రేపట్నుండి మేము ఒక ఆడిటోరియం రెంట్ కు తీసుకొని సినిమా వేద్దామనుముంటున్నాము. కనీసం వేయిమంది ఒక్కసారే చూడొచ్చు. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.' అంటూ తన బాధ వెల్లడించాడు.

ఏదైతేనేం సినిమా మొదలయ్యింది. మొదలైనా కొద్దిసేపట్లోనే తెలిసింది, సినిమా చాలా డబ్బులు పెట్టి తీసారు కాని, మెదడు పెట్టి తీయలేదని.

ఇంటర్వెల్ అయ్యింది. యజమాని ఈసారి పెద్ద తట్టతో వచ్చాడు. అందులో లడ్డూలు ఉన్నాయి.

'ఇవి తిరుపతి నుండి వచ్చిన లడ్డూలు. హీరో, నిర్మాత, దర్శకుడు సినిమా విడుదల ముందు తిరుపతి వెళ్ళి సినిమా సక్సెస్ కావాలని వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారట. లడ్డూలు కొని ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లకు ఆ ప్రసాదాన్ని పంపిణీ చేసారు ' అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డూ ఇచ్చాడు.

అందరూ 'మహాప్రసాదం ' అనుకొంటూ కళ్ళకు అద్దుకున్నారు. లోతు తెలియకుండా నీళ్ళలోకి తర్వాత భగవంతుణ్ణి తల్చుకొన్నాట్టుంది ఈ సినిమా తీసిన వాళ్ళ పరిస్థితి.

ఏమైతేనేం సినిమా కూడా అయిపోయింది. అభిమానుల మొహాల్లో పూర్వపు ఉత్సాహం కనిపించలేదు. గురుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు.

**********

వారం రోజులు గడిచాయి. మళ్ళీ గురుడు దగ్గర్నుండి మిస్సుడ్ కాలొచ్చింది. తిరిగి కాల్ చేస్తే రింగ్ టోన్లో కొత్త పాట వచ్చింది - 'కల కానిది నిజమైనది బ్రతుకూ కన్నీటి ధారలలోనే బలి చేయకు '. గురుడు చాలా తెలివి కలవాడు. రింగ్ టొన్ పాటను బట్టి అతని మూడ్ గుర్తించొచ్చు. ఇది 'స్టుపిడ్ ఫెల్లో' ప్రభావం ఉన్నట్టుంది.

కాల్ తీసుకొని 'ఈ వీకెండ్ దం రెస్టారెంట్ కు వెళ్ళి చికెన్ బిర్యానీ తినాలనుకొంటున్నాం. మనకు డిస్కౌంట్ ఉందిగా. నువ్వు కూడా వచ్చెయ్. ' అన్నాడు.

శనివారం అందరం గుమికూడి దం రెస్టారెంట్ కు వెళ్ళాం. నోట్లో వేళ్ళు పెట్టుకొని ఎక్కడ లేని జనం. ఆరా తీస్తే తెలిసింది, బిర్యానీ వండటం లేటవుతున్నదని.

ఇంతలో బయటున్న మాకు ఓ వార్త కూడా వచ్చింది. ఈ మధ్య ఇండియానుండి బియ్యం కోత వచ్చిందని, అందుకని బియ్యం షార్టేజ్ ఏర్పడి, బిర్యాని చెయ్యటం లేటవుతున్నదని, అలాగే బిర్యాని క్వాంటిటీ కూడా తగ్గించారని, అందుకని ఎక్స్ట్రా లెగ్ పీస్ వల్ల చికెన్ ముక్కలు ఎక్కువై, బిర్యానీ రైస్ తక్కువైందని. ఇదేదో 'స్టుపిడ్ ఫెల్లో' సినిమాలోలా డబ్బులు, డాన్సులు, ఇతర మసాలాలు ఎక్కువై కథ తక్కువైనట్టు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)