ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు మే 20వ తేదీ లోగా పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య

" కం:// పలుకే బంగారమాయె పలుకుల చిలకా !"

క్రితమాసం సమస్య

" ఆ.వె:// రాతి దేవునిదది రాతి గుండె "ఈ సమస్యకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.మొదటి పూరణ - కృష్ణ ఆక్కులు, కుపర్టీనో, కాలిఫోర్నియ.

ఆ.వె.// నీతి మరచి నేటి నేతలు పాలింప
పప్పునుప్పు ధరను పసిడికాగ
బీదబిక్కి మ్రొక్క భీతితో రాతిని
రాతి దేవునిదది రాతి గుండె!


రెండవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియసీ// బహుదూరమేయైన రహదారిపైన ఆ విరహాగ్ని బడబాగ్ని వేడి తోటి,
పలుకరింతలె కోరి పడిగాపులేకాస్తు, పరవళ్ళుతొక్కుతూ తరలి వస్తె!
చిరునవ్వు లేదామె చిగురాకు పెదవుల, ఆనందమో కాదొ అతడి రాక?
పలుమార్ల అగచాట్లు పగవానికైనొద్దు! పెరుమాళ్ళ కెరుక యీ నరుడి బాధ!

అ.వె.//పలకరింతె చాలు పండుగేనంటాడు, ఒక నిమిషమె నీది, సకలమంటు!
అన్ని తెలిసె, వేల్పు అల్పుడై శిలయయ్యె! …. రాతి దేవునిదది రాతి గుండె!
సీ:// నీతోటె జీవితం నిజముగా కోరేడు, క్షణమైన ఇచ్చినా క్షంత లేదు!
ఒకనవ్వు, ఒకమాట, ఒకనిమిషమె కోరి, విడలేక అడిగేడు విన్నపమున!
విరులేమి కోరెను, సిరులేమి కోరెను, విరివిగా చిరునవ్వె కురుపమనెను!
దేవుడే జీవుని దెయ్యమై పీడిస్తె, …….. రాతి దేవునిదది రాతి గుండె!

ఆ.వె.//కల్మషమ్మెలేని కలలెన్నొ కనమంటు, కలిమిలేములేవి తలువనీక,
వెన్నుపోటుతొ తన విధిరాత రాసేడు,….. రాతి దేవునిదది రాతి గుండె!


మూడవ పూరణ - మాజేటి సుమలత, బెంగళూరుఆ.వె.// వేడుకొంటి వాని వేదన తోడను,
ఏల ఇంక నాకు ఎరుక రాదె!
కపట వేష ధారి కనికరం చూపడే,
రాతి దేవునిదది రాతి గుండె


నాల్గవ పూరణ - శ్యామసుందర్ పుల్లెల, శాన్ హోసే, కాలిఫోర్నియాఆ.వె.// బయట తిండిమాని బాక్సు లంచి తినుచు
నడ్డివిరుగునటుల గొడ్డులాగ
కష్టపడగ నేను దుష్టుడౌ టేక్సు వా
డబ్బసొమ్ములాగ డబ్బు మ్రింగె!


ఆ.వె.// వేడుకున్న నేమి వేయి దండాలతో
పూజ చేయనేమి పూలతోడ
ఉన్నడబ్బులన్ని పన్నుగా కట్టించు
రాతి దేవునిదది రాతి గుండె!


ఐదవ పూరణ - సుబ్రహ్మణ్యం బత్తల, రోచెస్టర్ హిల్ల్స్, మిచిగన్.రాతి దేవునిదది రాతి గుండె
కాదదెన్నడు నేడు కలికాలమైన
అసుర రీతి నణచి అవని భారము గావ
అవతరించును దైవమ్ము అవసరంబగునేని.


పాఠకులనుంచి మరిన్ని మంచి పద్యాలు


కృష్ణ ఆక్కులు గారు పంపినవి
కం|| పరమశివ తనయ విఘ్నే
శ్వర వేడెద మిమ్ము తలచి శరణం తండ్రీ
నిరతం మము కరుణించుం
పరమదయాళా గణేశ పావన మూర్తీ


కం|| పదవుల సరియగు తెలివియు
పెదవులు పలికెడు పలుకుకు విజ్ఞత నియవే
చదువుల రాణీ వాణీ
పదముల పడి కొలిచెద నిను పరి పరి మాతా


కం|| శంకరి శశిశేఖరి ప్రళ
యంకరి పరమేశ్వరి అభయంకరి గౌరీ
సుందరి శివాని రంజని
మంగళకారిణి భవాని మాతా కాళీ


కం|| హరహర శివశివ శంకర
కరిచర్మాంబరధర దయకర హర సర్వే
శ్వర శుభకర భయహర భవ
హర గంగాధర ప్రియకర హరశివ శంభో
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఫర్వాలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)