బహుపాత్రల ప్రజ్ఞాశాలి........ యేలేశ్వరపు శ్రీనివాసులు గారు

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన శ్రీ యేలేశ్వరపు శ్రీనివాసులు గారు తమ ఏడవ యేటనే కూచిపూడి నాట్యములో ఓనామాలు దిద్దుకుని దేశవిదేశాల్లో ఎంతో కీర్తిని సంపాదించుకొన్నారు. ఏదయిన ఒక కళను నేర్చుకోవటం ఎంతో కష్టంతో కూడుకున్న పని, ఆ నేర్చుకున్న కళతో అందరినీ మెప్పిచటం ఇంకా కష్ట సాధ్యమయిన పని. ఆ అసాధ్యమయిన పనిని సుసాధ్యం చేసుకుని ఇప్పటికి సుమారు 1000కి పైగా ప్రదర్శనలిచ్చి, మరెన్నో సత్కారాలను పొంది అంతర్జాతీయ ఖ్యాతిని గడించుకున్నారు. తన ఏడవ యేటనే కూచిపూడికి చెందిన ప్రముఖ నాట్యాచార్యులు, సినీ నృత్య దర్శకులు డా.వెంపటి పెదసత్యం గారి దగ్గర కూచిపూడి నాట్యకళలోకి కాలు మోపి, నృత్యములో ఓనమాలు దిద్దుకొని, డా.వెంపటి చినసత్యం మాస్టారు గారి పర్యవేక్షణలో ఎన్నో ఏక పాత్ర కేళికలు, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారి వద్ద మరెన్నో స్త్రీ పాత్రలు, శ్రీ వేదాంతం రాధేశ్యాం గారి వద్ద సోలోస్, శ్రీ మహంకాళి శ్రీరాములు శర్మ గరి వద్ద ఇంకా ఎన్నో ఉషా పాత్రల మెళకువలను నేర్చుకున్నారు.

కళాకారుల కుటుంబములో పుట్టడంతో తన తల్లితండ్రులవద్ద నుంచి ఈ నాట్య కళను అభ్యసించడానికి ఎంతో ప్రోత్సాహం లభించిందన్నారు. శ్రీనివాసులు గారి తండ్రిగారి పేరు యెలేశ్వరపు వేణుగోపాల శర్మ గారు. ఇందుగలడందులేడని పదిమందిని మెప్పించిన శ్రీనివాసులు గారు యక్షగాన రూపకాలయిన భామాకలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుని పాత్రలు, ఉషాపరిణయంలో ఉషగా, చిత్రలేఖ, అనిరుద్ద, బాణాసురుడు, శివుడిగా, భక్తప్రహ్లాదలో లీలావతి, హిరణ్యకశిపుడు, నరసిం హ స్వామిగా, విప్రనారాయణలో మధురవాణిగా, శశిరేఖాపరిణయంలో అభిమన్యుడుగా, పార్వతీ కళ్యాణములో శివుడు, మన్మధుడిగా పాత్రలను పోషించతమే కాకుండా, నృత్యనాటకాలయిన శ్రీనివాస కళ్యాణం లో బ్రహ్మగా, హరవిలాసంలో మన్మధుడు, బ్రహ్మ, నారదుడిగా, క్షీరసాగర మధనంలో ఇంద్రుడు, శివుడిగా, కిరాతార్జునీయంలో శివుడిగా, అర్ధనారీశ్వరంలో శివుడు, బ్రహ్మగా, శాకుంతలంలో కన్వమహర్షిగా, గోపికాకృష్ణలో ఇంద్రుడు, అగ్నిగా, రామాయణంలో జనకరాజు, గౌతముడిగా, నర్తనశాలలో బ్రహ్మ, అర్జునుడిగా, యశోదా కృష్ణలో విష్ణువుగా, గజాననీయంలో శివుడిగా, రుక్మిణీకళ్యాణంలో శిశుపాలుడిగా, మహిషాసుర మర్ధినిలో మహిషాసురినిగా, శ్రీకృష్ణవిజయంలో విష్ణుమూర్తి వంటి పాత్రలకు తన ప్రతిభతో శ్రీనివాసులుగారు జీవం పోసారు. వీరికి ఒకే నృత్య రూపకంలో రకరకాల పాత్రలను అవలీలగా పోషించటంలోనూ, ముఖ్యంగా స్త్రీ పాత్రలను పోషించటంలోనూ బాగా ప్రజ్ఞ ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే శ్రీనివాసులుగారు ఎన్నో అష్టపదులు, పదములు, జావళీలు, కీర్తనలు, తరంగాలు, శబ్దములు, జతిస్వరములు తమ సోలో ప్రదర్శనలతో ప్రజలను మెప్పించారు.

ఘనాపాటి యేలేశ్వరపు 1984లో కూచిపూడి శ్రీ బాలాత్రిపుర సుందరి ఆలయంలో సాంప్రదాయ బద్దంగా లీలావతి స్త్రీ పాత్రలో రంగప్రవేశం చేసి, తమ తొలి ప్రదర్శనలోనే అందరి మన్ననలందుకున్నారు. అదే యేడాది ప్రెసిడెంట్ స్కౌట్ క్యాంపులో పాత గోవాలో కూచిపూడి నాట్య ప్రదర్శన ఇచ్చారు. గురువు వెంపటి చినసత్యం మాస్టారు గారి ఆధ్వర్యములో 1994, 1998, 2000 సంవత్సరాలలో ఒక్క అమెరికాలోనే 180కు పైగా ప్రదర్శనలిచ్చారు. 1994 లో కెనడాలో, 2001 లో ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలతో పాటు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా తన ప్రదర్శనలతో ప్రేక్షకులను రంజింప చేసారు. డా.వేదాంతం సత్యనారాయణ శర్మ నేతృత్వంలో హర్యానా, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ, గుజరాత్ వంటి పలు రాష్ట్రాలలో తన ప్రతిభను చాటుకొని పలు సత్కారాలందుకొన్నారు. 2004 లో గవర్నర్ బర్నాలా గారి సత్కారాన్ని కూడా ఈయన పొందారు.

నాగార్జునా యూనివర్సిటిలో బి.ఎస్.సి.ని పూర్తి చేయటమే కాకుండా, కూచిపూడి నాట్యములో డిప్లొమా, యక్షగానం-నాట్యములో ఎం.ఏ. పట్టాను కూడా పొందారు. గత పదేళ్ళుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి సిద్దేంద్ర యోగి కళా పీఠంలో నృత్య అధ్యాపకునిగా పని చేస్తున్నారు. కూచిపూడి నృత్యములో పి.హెచ్.డి. చేయాలన్నదే తన అభిలాషగా, సంకల్పంగా ఆయన తెలిపారు. తనకు శాశ్వత ప్రాతిపదికన విశ్వవిద్యాలయంలో ఉద్యోగం లభిస్తే నేర్చుకున్న కళకు సార్ధకత లభింస్తుందన్నారు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)