పూర్వజన్మలనించి కర్మని సంపాదించుకుని ఈ ప్రపంచంలో జన్మిస్తున్నామని శాస్త్రాలు చెపుతున్నాయి. "పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం" అంటే ఇదే కదా. అందుకే హస్తసాముద్రిక శాస్త్రవేత్తలు అంటారు - "మన భవిష్యత్తు మన చేతుల్లోనే వుంది - చేతలుగా! రేఖలుగా!" పుట్టిన పాప చేతుల్లో కూడా రేఖలున్నాయి, జన్మ జన్మల కర్మల ఫలితంగా, మంచి చెడులుగా కనిపిస్తూ. కానీ ఈ రేఖలు మారుతున్నాయి క్రమంగా. జాగ్రత్తగా బూతద్దంతో చూస్తే ప్రతి నిమిషానికి సూక్ష్మ రేఖలు మారుతూ కనిపిస్తాయి. ప్రతి ఏడు నెలల్లోనూ కొన్ని పెద్ద రేఖలు, ఏడు సంవత్సరాలకు ముఖ్య రేఖలు మారతాయని హస్త సాముద్రికం చెపుతోంది. అంటే మన జీవితం, విధి 100% విధించబడలేదు. భగవంతుడు మన జీవితాన్ని మనం మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు, ఇస్తూనే వున్నాడు. అంటే మన చేతల వల్ల న్యూటన్ మూడో సూత్రంలా మంచి చెడులు మనకే కలుగుతున్నాయి. ఇవికలిగేందుకు గ్రహాల ప్రభావాలు కారణం అని జ్యోతిశ్శాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది.

గ్రహాలలో రాహుకేతువుల ప్రభావాన్ని ఒక మహానుభావుడు చక్కగా వివరించాడు. మంత్ర కారకుడు రాహువు, మంత్రసిద్ధి కారకుడు కేతువు అని చెపుతున్నారు. జాతకంలో వీరి స్థితి బాగున్నప్పుడే ఇవి కలుగుతాయిట. బాగులేని కొన్ని ఉదాహరణలు చూద్దాం.

ఇంటినిండా దేవుళ్ళ ఫొటోలు చూడగానే మహాభక్తులని ఎవరైనా ఇట్టే గ్రహించగలుగుతారు. అనేక క్షేత్రాలు దర్శించి అక్కడి విశేషాలు అందరికి వివరిస్తూ వుంటారు. ఆ విధంగా పుణ్యక్షేత్రాలు చూసి తరించే అవకాశం కలగనందుకు కొందరు బాధపడుతుంటారు. మంత్రతంత్రాలను వేదవేదాంగాలను గురించి, మహా భారతంలో అంశాలను గురించి రకరకాలుగా పక్క వాళ్ళకి వివరిస్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కానీ వీళ్ళలో కొందరికి పిసినారితనం అధికంగా వుంటుంది. దానగుణం వుండదు. కొందరికి పాపం పిల్లలు కూడా వుండరు. జ్ణాన సంపద మాత్రం అధికంగా వుంటుంది. అన్ని లక్షణాలున్నా దానం చెయ్యరు. జాతకంలో ఇదొకరకమైన ప్రారబ్ద కర్మట. ఆకాస్త దానం, ధర్మ చేస్తే పూజా సాఫల్యం కలుగుతుంది కదా అనిపిస్తుంది. కొంతమంది అద్భుత మంత్రపఠనంతో దేవతలను ఆహ్వానించి సుదీర్ఘమైన పూజా కార్యక్రమాన్ని చేస్తారు. అంతా చేసి చివరికి మహానివేదన మాత్రం పెట్టరుట. షోడసోపచారార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షింతలు చల్లి పంచదార నైవేద్యం పెడతారు. మంత్ర పూజా సాఫల్యానికి కేతువు విఘ్నం కలిగిస్తున్నాడని వీళ్ళు తెలుసుకోలేరుట.

దేవాలయాలలో వేలాదిరూపాయలు విరాళాలు ఇచ్చి అపరదానకర్ణులుగా అనిపించుకొనేవారుకొందరున్నారు. వీళ్ళు అతిధులుగాని, బంధువులు గాని, స్నేహితులుగాని వస్తే అన్నం మాత్రం పెట్టరు. కేతులక్షణాలు బలంగా వుంటే అతిధి అభ్యాగతులను తరిమి కొట్టడంలో భర్యభర్తలిద్దరూ పోటీ పడుతుంటారుట.

జ్యోతిశ్శాస్త్ర పరిజ్ణానంతో భవిషత్ దర్శనం చేయవచ్చును. రానున్న సంఘటనలను తెలుసుకొని అవి రాకుండా మంచివి, అనుకూలమైన ఫలితాలను సాధించ వచ్చును. అందుకు జాతకం చెప్పే వారికే కాక చెప్పించుకునే వారికి కూడా కొంత బాధ్యత వుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. ఏదైనా శుభకార్యమునకు, శుభ లగ్నము పరిశీలించునపుడు, పృచకునకు జాతకం చెప్పేటప్పుడు జ్యోతిష్కుడు మంత్ర సాధకుడు అవడమే కాక కొన్ని నియమ నిబంధనలను పాటించుట అవసరం. భోజనానంతరం సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి జాతక పరిశీలన తగదు. ఉపవాసం వుంటే తప్ప సూర్యాస్తమయం తర్వాత జాతకం చెప్పరాదని అంటారు.

ఏకాగ్రతతో ఇష్టదేవతా ప్రార్ధన చేసి ఈ జాతకమందు విశేషాలు ఖచ్చితంగా తెలియజేసే శక్తిని ప్రసాదించమని ప్రార్ధించిన పిమ్మట జాతక విశేషాలు తెలియచేయవలెను అని ఈ రంగంలో గురువులందరు చెపుతున్నారు. మంచి జ్యోతిష పటిమకోసం సూర్య మంత్రాన్ని ఉపాసించ వచ్చును. రానున్న భవిష్యత్లో కొన్ని బాధాకరమైన విషయాలు కనిపిస్తే వాటికి శాంతి, తరుణోపాయము తప్పకుండా చెప్పవలసి వుంది. లేకపోతే వచ్చిన వారిని మానసికంగా బాధపెట్టడమే అవుతుంది. భయపెట్టడం ఏ శాస్త్రానికి లక్ష్యంకాదు. తరునోపాయమే అతి ముఖ్యం. నిస్వార్ధంగా, సేవాతత్పరతతో, ఒక విద్యగా దీన్ని స్వీకరించే వారు ఎందరో వున్నారు. వారిని తగిన రీతిగా గౌరవించి ఈ విద్యలని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యతకూడా మనకి వుంది.

హస్త సాముద్రిక రంగంలో అత్యున్నతమైన, విశేషమైన రహస్యాలని అందించిన వారు శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గారు. చెయ్యి చూసి మనిషి జన్మ తేది, పుట్టిన సమయమే కాక ఎన్నో సూక్ష్మ విషయాలని కూడా చెప్పేవారు. ఒకసారి మారు వేషంలో వున్న వ్యక్తులని కూడా గుర్తించేవారు. ఆయన మొదటిసారిగా "పంచాగుళీ సాధన" గురించి అందరికి తెలిపారు. ఈ సాధన సిద్ధించడం వల్ల చెయ్యి చూసిన వెంటనే ఆ వ్యక్తికి చెందిన అనేక విషయాలు, సంఘటనలు దృశ్యాలుగా గోచరిస్తాయిట.

చాలా ఏళ్ళ నించీ ఒక అమోఘ విద్య ఆంధ్ర దేశంలో వుంది, ఇప్పటికి అక్కడక్కడ కొందరు సాధకులు వినియోగిస్తున్నారు. గోరుకైన లేక కోడిగుడ్డు కైన మసిపూసి చిన్నపిల్లలని చూసి చెప్పమంటారు - ఏం కనిపిస్తొందో! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనంచూస్తే ఏం కనిపిస్తుందో తెలియదు కాని వాళ్ళకి మాత్రం జరిగిన జరగబోతున్న సంఘటనలు కనిపిస్తాయిట. అందుకే అనిపిస్తుంది నిర్మలమైన మనసుకి సర్వం నిర్మలంగా కనిపిస్తుంది - అగోచర శక్తికూడా సాక్షాత్కరిస్తుంది అని.

మరి ఇటువంటి విద్యలు నేర్పే గురువులు ఎక్కడ దొరుకుతారు? అటువంటి జగత్ గురువుల అనుగ్రహం పొందాలి అంటే గురు మంత్రాన్ని ముందు సిద్ధింప చేసుకోవాలి అని చెపుతున్నారు. ఓం హ్రీం గురో ప్రసీద హ్రీం ఓం

ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుందిట. అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందిట. దుస్వప్నాలని కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రం తో విబూది పెడితే పీడ కలలు రావంటారు.

ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా
ఇంకా వివరాలని వచ్చే సంచికలో చూద్దాం.

శ్రీ గురుభ్యో నమః

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఫర్వాలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)