సిలికానాంధ్ర, "సర్వధారి" యుగాది వేడుకలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రస్తుతపఱచబడిన కవిత ఇది.ఓ చల్లటి సాయంవేళ

ఆవపెట్టిన పనసపొట్టు
బావ పంపిన మాగాయ
ఆవునేతి పాలకోవా
ఆవురావురన భోంచేసి
బ్రేవుమని త్రేన్చుతూ
ఆవులిస్తూ కూర్చుంటే..
రావు గారి పిలుపు...

కొత్త ఉగాది వచ్చేస్తోందోయ్ అంటూ
మెత్తగా వచ్చిన ఆదేశం!
చెత్త విషయాల జోలికి పోక,
అత్త మీదో దుత్తమీదో ఓ మంచిమాట చెప్పమని.

వందల మంది ఆలోచనలు
అందాల ఊహలవైపు మళ్ళించేందుకు
అందివచ్చిన అవకాశమని
మందస్మితంతో మాటిచ్చేశా.

ఉగాది అనగానే,
కోయిలలూ - కొమ్మచాటు పిందెలు
వసంతుడూ - వనమంత శోభలూ
రాయల వైభవాలు
రాయంచల సొబగులు
కళ్ళెదుట గిర్రున తిరిగాయి
కానీ -
పాత వాసన కొడుతున్నాయి
ప్రతీ ఉగాదికీ
కవికోయిలల పాటల్లో అరిగిపోతున్నాయి.

అరవయ్యేళ్ళకొకసారి
ఆత్మీయంగా కలిసి నడిచే
ప్రతీ వత్సరమూ
కాల చక్రపు ఓ వూచ.

రవిగాంచని రేపుని
కవిగా కలిసొచ్చేందుకు
కాలచక్రాన్ని గిర్రున ముందుకు తిప్పా
ముందు యుగాల సర్వధారి ఉగాదికి
ముఖ్య అతిధినయ్యా!

హైటెక్కు మనుషులు
లోగుట్టు కప్పే టెక్కులు
అంగారకుడిపై అధ్యక్షుడు -
శుక్రుడిపై శ్రోతలు -
దివ్యలోకాలకు తెలుగు చేరిందని
దిలాసాగా కూర్చున్నా.

కవిత వ్రాద్దామని కలమొక్కటి చేపడితే
తెలిసిన పదాలు సిగ్గుతో దాగున్నాయ్
దిద్దిన అక్షరాలు దొరకము పొమ్మన్నాయ్!

ఎంత యత్నించినా,
బలవంతాన బరికినా
చేతికందిన అక్షరాలు ఇరవై ఆరే!
చెప్పదగ్గ తెలుగు పదాలు అత్యల్పమే!
నిస్సందేహంగా నాకా తెలుగు రాదు.

కొత్త దారెంట పొయెట్రీ చెప్పి
అందరికీ ఎంజాయ్‌మెంట్ ఇచ్చి
"హోల్‌వేరర్" ఉగాడికి
"ఇన్విటేషన్" పాడేశా!

ఆధునిక అక్షర క్రాంతిని
అచ్చెరువున కాంచిన నాకు
విందులోనూ ఎన్నో చమక్కులు -

పనస పొట్టు పేరుమార్చుకుంది -
"జాక్‌ఫ్రూట్ డస్ట్ కర్రీ"లా
మాగాయి మారింది -
"మారినేటెడ్ మాంగో"లా
పాలకోవా రూపొందొంది -
"రోస్టెడ్ మిల్క్ స్మూతీ"లా

అయోమయాన ఉన్న నన్ను
ఓ ఆత్మీయ హస్తం ఆప్యాయంగా తడిమింది -
"కన్‌ఫ్యూజ్ అయ్యావా ఫ్రెండ్
నీవు నేర్పిన విద్యేనోయ్ నీరజాక్ష -
ర, ఱ, ఋ, ౠ లు అన్ని ఎందుకోయ్?
చ,శ,ష,స లు ఇన్ని ఎందుకోయ్
చక్కగా ఒక్కటి చాలు కదా?
కిడ్స్ కన్‌ఫ్యూజ్ అవకుండా?
ఇంటర్నెట్‌లోనూ ఇంటర్నేషనల్‌గానూ
కంప్లీట్ గా కంపాటిబులిటీకి
తీశేశాం ఆల్ఫాబెట్స్
తోచీతోచనివాడు పెట్టిన బర్డెన్స్!
ఛందస్సంటావా - వాట్ ఓల్డ్ మేన్
అక్కర్లేని వాటిని అడ్డంగా నరికేశాం!
ఇక తిండి అంటావా..
మనవి కాని అక్షరాలు కట్ చేయచ్చు కానీ
మనవైన టేస్ట్ బడ్స్ కట్ చేయలేం కదోయ్!"

ఉత్సాహంగా కాలచక్రాన్ని తిప్పినా
ఉధృతంగా తిరిగింది నా తలే.
ఉన్నపళాన నేటికి వచ్చి
ఉపద్రవాన్ని వారించే మర్గాన్నే శోధించా.

అరవై ఊచల మహా చక్రం కింద
అలవోగ్గా పడి నలిగిన
అక్షరాలని అందుకుని
ఆత్మీయంగా అనునయించా.

చక్రాలు పెద్దవని
చోదకుడు భయపడుతూ కూర్చుంటే
విమానమెప్పటికీ విడిది వీడదులే!

చట్రాలు గట్టివని
కమ్మరి బెంబేలెత్తి విరగ్గొడితే
ఆకారమెప్పటికీ వికారమేలే!

అందుకే,
మహా కాల చక్రాన్ని
మనదారిలో నడిపిద్దాం.
ఛందో చట్రాలకు సొబగులద్ది
చిక్కని అందాలు చూపెడదాం.

అయినా...
కాల చక్రాన్ని కట్టడి చేయాలంటే
ఎంతో ఎత్తులకెదగక్కర్లేదు,
ఎన్నో యత్నాలు చేయక్కరలేదు.
కాల చక్రాన్ని కట్టడి చేయాలంటే
పసివాళ్ళమై పరుగులిడితే చాలు
అలుపెరుగక అందుకుంటే చాలు
మనచేతిలో బండి చక్రమై ఒదిగిపోతుంది.

కొత్తగా -
అక్షరాలు ఆవిష్కరించుదాం -
ఎందుకు తృంచకూడదో తెలుస్తుంది.
ఛందో పధ్ధతులూ చేరుద్దాం -
కట్టడిలో కనికట్టు తెలుస్తుంది.

వాదాల రంగుకళ్ళజోళ్ళు విరగ్గొట్టి
వివాదపు వర్గాల నడ్డివిరిచి
ఛందోబధ్ధమైనా - కాకున్నా
సమదృష్టిన సమీకరించి
కవితా గుబాళింపులు పంచుదాం.

ఆస్తులను పెంచే చేతులతో
అక్షరాలు తృంచే చేతలు మాని
పదసంపదతో పునీతమవుదాం.
ఒట్టి మాటల కట్టిపెట్టి
గట్టిమేల్ తలపెడదాం!

ఈ యుగాది నాడు
యాభై ఆరు పువ్వుల లతను
ఎరువేసి కాపాడాలని
ఎదలోతుల నుండీ ప్రతిన చేద్దాం.


ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఫర్వాలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)