వేసవిలో వాన

బయట వాన పడుతోంది. శేఖర్ కి వానంటే ఎంతో ఇష్టం. వేసవిలో కురిసే వానంటే మరీ ఇష్టం.

శనివారం మధ్యాహ్నం రిక్లైనర్ కుర్చీలో కూర్చుని వాల్ స్ట్రీట్ జర్నల్ చదువుతున్నాడు శేఖర్. భవాని లాండ్రీ రూములో వాషర్లోంచి బట్టలు తీసి డ్రైయర్లో వేస్తోంది. కొడుకు ప్రశాంత్ కంప్యూటర్లో వీడియో గేములు ఆడుకుంటున్నాడు. కూతురు అనూష టీవీలో డిస్నీ ఛానెల్లో 'దట్ సో రేవెన్ ' చూస్తోంది. ఇప్పుడే భోజనాలయ్యాయి. భోజనాలతో పాటు పేద్ద డిస్కషన్స్, వాదనలూ కూడా అయ్యాయి. సమ్మర్ లో పిల్లల్నీ ఏ ఏ కేంప్స్ లో పెట్టాలో అనీ, వెకేషన్ కి ఎక్కడికి వళ్ళాలీ అని. ఈ సమ్మర్లో కరీబియన్ వెళ్దామని పిల్లలు గొడవ పెడుతున్నారు. ఇండియా వెళ్దామని తను అన్న మాటలు ఇంకా నోట్లోనే వుండగా పిలలిద్దరూ ఒక్క సారిగా 'నో' అని ఎదురుతిరిగారు. 'అక్కడ మాకంతా బోర్ ' అని ఏకగ్రీవంగా చెప్పేసారు పిల్లలిద్దరూ.

భవాని కూడా - "ఇక్కడ మన పిల్లల సమ్మర్ హాలిడేస్ మొదలయ్యేసరికి అక్కడ హైదరాబాద్ లో మన వాళ్ళ వేసవి సెలవలు ఇంచు మించు అయిపోతాయి. వాళ్ళకి నిజంగానే బోర్ కొడుతుంది శేఖర్!" అని అంది.

శేఖర్ కి ఇంక ఏమీ చెప్పడానికి మనస్కరించలేదు. ఇండియాకి వెళ్ళడానికి ఉత్సాహం చూపించని పిల్లలకి అక్కడ వున్న మామ్మ, అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్యా, పెదనాన్నగారూ, పిన్నీ, దొడ్డమ్మా, మామయ్యలని కలవాలనీ, వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలనీ, వాళ్ళతో కలిసి పెరగాలనీ తేటతెల్లంగా ఎలా చెప్పాలో తెలియలేదు. భవానీ కి కూడా ఇండియా వెళ్ళడం ఎందుకో అంత ఇష్టంలేదని శేఖర్ కి అనుమానం. ఆ సంగతి బయటకి అంటే గొడవలయిపోతాయని అనడు.

చికాగుగా వున్న మనసుని చల్లబరచడం కోసమా అన్నట్టు ఇప్పుడీ వాన.. బయట వాన చప్పుడు సంగీతంలా వినిపిస్తుంటే మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * *

వేసవి కాలం అనగానే, శేఖర్ కి ఎన్నో ఙాపకాలు .. చిన్నప్పుడు కాకినాడలో తమ ఇంటి పెరట్లో వున్న వేప చెట్టు కింద రాలే వేప పళ్ళన్ని ఙాపకాలు!

పెద్ద పరీక్షలు దగ్గరికొస్తున్నాయనగానే గుండెల్లో భయం ఒక పక్కయితే , పరీక్షలు అయిన వెంటనే వేసవి సెలవులకి ఇంటికొచ్చే బంధువులందరితోటీ సరదాగా గడపవచ్చో అన్న ఆనందం ఇంకో పక్క.

ఆఖరి పరీక్ష అవడం తరువాయి, పుస్తకాలు గూట్లో ఓ మూల విసిరేసి, స్నేహితులతో ఉప్పుటేరు దగ్గర పొలాల్లోకి పారిపోయి సాయంత్రం చీకటి పడ్డాక ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. వేసంగి సెలవలకి హైదరాబాదులో వున్న రాజ్యం అత్తయ్య, బెజవాడలో వున్న కమలత్తయ్య పిల్లల్తో సహా వచ్చేవాళ్ళు. ఫలానా రోజు వస్తున్నారూ అని తెలిసిన వెంటనే ఆనందం కట్టలు తెంచుకుని వచ్చేసేది. రాజ్యం అత్తయ్య పిల్లలయితే హైదరాబాదులో నేర్చుకున్న కొత్త ఆటలూ, రాజధాని నగరం కబుర్లూ బోల్డన్ని చెప్పేవారు. అవి వినడానికి ఎంతో కొత్తగానూ వాళ్ళ భాష కూడా ఎంతో వింతగానూ వుండేది. తన స్నేహితులందరికీ పరిచయం చేసి, వాళ్ళు వీడి భాషని ఆనందిస్తుంటే గర్వంగా వుండేది.

పొద్దస్తమానూ అందరూ కలిసి పెరట్లో వున్న మామిడి చెట్టో జామ చెట్టో ఎక్కి కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. "పిందెలన్నీ కోసెయకండర్రా" అని మామ్మ కేకలేస్తున్నా వినకుండా కాగితంలో ఇంత వుప్పూ కారం పొట్లం కట్టి తీసుకెళ్ళి జేబులో పెట్టుకుని, మామిడి కాయలూ జామకాయలూతో తినే వారు. మామిడి చెట్టు కి కింద నుంచి రాళ్ళు వేసి కొట్టగా కింద పడిన కాయలు జేబులో పెట్టుకుని, జామ చెట్టెక్కి దోర కాయలు కోసుకుని అవన్నీ కలిపి వుప్పూ కారం అద్దుకుంటూ, అందులోకి కబుర్లు కొంచెం నంజుకుంటూ తినే వాళ్ళు.

పెరట్లో ఎప్పడిదో పాతకాలం నాటిది ఒక పెద్ద మెట్ల బావి వుండేది. దాంట్లో నీళ్ళెక్కడో కనిపించకుండా అడుక్కి వుండేవి. నూతి గోడల్లోంచి రావి చెట్టొకటి మొలిచి కొమ్మలు బయటకు వచ్చి వుండేది. చీకటి పడ్డాక ఆ చుట్టు పక్కలకి వెళ్ళడానికి భయం వేసేది. పగలు పూట మాత్రం దాంట్ళొ పొన్నకాయలు రాళ్ళు విసిరేవాళ్ళు. పొన్నకాయలు భలే గుండ్రంగా నున్నగా వుండేవి, బాబయ్య కొడుకు శ్రీనుగాడి గుండు లాగ.

"రోహిణీ కార్తెల్లో రోళ్ళు కూడా పగులుతాయి. అలా వూరికే ఎండలో పడి తిరక్కండర్రా వడ దెబ్బ తగిలి చస్తారు.. " అని మామ్మ కేకలేసేది. దాంతో భయపడి, అమ్మనడిగి, దబ్బాకులూ, వుప్పూ వేసిన చల్లటి మజ్జిగ కుండలోంచి తిసుకుని గ్లాసుల్లో వొంపుకుని, పెరట్లో వేప చెట్టుకింద వున్న చప్టా మీద కుర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగే వాళ్ళు. తరవాత అక్కడే అష్టా చెమ్మావో, వైకుంఠపాళీవో, చింతపిక్కలతో గుజ్జెనగూళ్ళో ఆడే వాళ్ళు. వైకుంఠపాళీలో పాము బారి పడకుండా వుండటానికి అదృష్టం కావాలి. అందుకనీ శేఖరం ఎప్పుడూ, అచ్చొచ్చిన బాడిద గింజొకటి వాడేవాడు. రాజ్యం అత్తయ్య కొడుకు శేషుది విరిగిన పసుపు పచ్చ గోళీక్కాయ. కమలత్తయ్య కొడుకు వెంకటేశం ది ఒక పక్క అరగదీసిన చింత పిక్క. అలాగ ఎవరి అదృష్టపు గింజలు వాళ్ళకి వుండేవి. పంట వేయడానికి కూడా గవ్వలు కనిపించకపోతే, అరగదీసిన చింతపిక్కలే వుపయోగించేవాళ్ళు.

శేఖరం తండ్రి సుబ్రహ్మణ్యం, తాత పరమేశ్వరం గారు. తాతయ్య మునపట్లో కరణంగా చేసేవారు. తర్వాత సుబ్రహ్మణ్యానికి వున్న వూరు కాకినాడలోనే కలెక్టరాఫీసులో ముందర గుమాస్తాగా రావడమూ, ఆ తరవాత కొన్నాళ్ళకి హెడ్డు గుమాస్తాగా పోస్టు రావడమూ జరిగాయి. దాంతో తాతల కాలం నుండీ వస్తున్న సొంతింట్లోనే అందరూ వుండే వాళ్ళు. అడవంత పెరడూ, ఆకాశం అంత చావిడీ అనేది మామ్మ. ఇంటికి పెద్ద కొడుకు కావటంతో సుబ్రహ్మణ్యం దగ్గరే వుండేవారు తల్లిదండ్రులు. పరమేశ్వరంగారి కుటుంబానికి ఆ ఇల్లు హెడ్ క్వార్టర్స్. ఆ ఇంటిలోనే ఎన్నో పెళ్ళిళ్ళూ శుభకార్యాలూ జరిగాయి. నిత్యమూ ఆ ఇంటి గుమ్మానికి పచ్చతోరణం వుండేది.

ఆ ఇంటిలో జరగాల్సిన శుభకార్యం ఇంక శ్యామలత్త పెళ్ళి. చాలా పెళ్ళి చూపులలయ్యాయి. ఎందుకో ఇంకా కుదరలేదు. పిల్ల నచ్చినా జాతకాలు నప్పలేదని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. "పిల్ల మామూలుగానే తెల్లగానే వుంటుంది. ఇదిగో ఈ ఎండలకి కాస్త చామనచాయకి వచ్చింది" అనేది మామ్మ. శేఖరమూ, శేషూ, వెంకటేశమూ అందరూ కలిసి "మామ్మా, చిన్నత్త, మామూలుగా అయితే చామన చాయా, వేసవికాలంలో అయితే శ్రీకృష్ణుడి చాయ" అని వేళాకోళం చేసేవాళ్ళు. "పోన్లెండర్రా, రంగేదయితేనేం, రుక్మిణీ దేవీ, పార్వతీ దేవీ నల్లగానే వుంటారు. కనుముక్కుతీరు బాగుంది కదా.. వంటా వార్పూ వచ్చు..చక్కగా ఎత్తరి పిల్ల .. ఆ చేసుకొనేవాడిదే అదృష్టం" అని పైకి బింకంగా చెప్పి చాటున కళ్ళొత్తుకునేది. "దీనికి పెళ్ళెప్పుడవుతుందో" అని బెంగ పడేది. నిజానికి ఏమాటకామాటే చెప్పుకోవాలి. శ్యామలత్త పేరుకు తగ్గట్టు నల్లగా వున్నా ఎంతో కళగా అందంగా వుండేది. పెద్ద పెద్ద కళ్ళూ, తిన్నని ముక్కూ, పొడుగాటి పాములాంటి వొత్తైన జడా, ఎత్తుగా ఎదిగి నిండుగా వుండేది. ఇప్పుడనిపిస్తోంది నిజమే పెళ్ళి చేసుకున్న సూర్యం మామయ్యదే "ఆ అదృష్టం" అంతా అని.

వేసవి సెలవల్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమం, ఆవకాయలు పెట్టడం. రాజ్యం అత్తయ్యా, కమలత్తయ్యా, శ్యామలత్తా, రామం బాబయ్యా, హేమలత పిన్నీ, అమ్మా, మామ్మా అందరూ కలిసి వూరగాయలు పెట్టేవాళ్ళు. నాన్నగారూ, బాబయ్యా కలిసి తోటకి వెళ్ళి సరైన కాయ గట్టిది, పుచ్చూ పురుగూ లేనిది ఏరి తెచ్చేవారు. ఆ కాయల్ని కడిగి ఎండలో పెట్టడం పిల్లల వంతు. కాయ ముక్కలు కొట్టీ ఎండలో పెట్టే వంతు నాన్నగారిది, బాబయ్యదీ. ఆ కొట్టడంలో దూరంగా ఎగిరిపడ్డ చిన్న చిన్న ముక్కలన్నీ ఏరుకుని దాచుకునే వాళ్ళు పిల్లలందరూనూ.

మాగాయకి కాయలు ఆల్చిప్పలతో తొక్క తీయడం అందరి వంతూనూ. పిల్లా పెద్దా అంతా కలిసి వసారాలో పంచ కింద వర్సగా కూర్చుని తొక్క తీసే వాళ్ళు. కొంచెం మెత్తగా అయిపోయిన కాయలేమైనా వుంటే అది మాగాయ పెట్టడానికి పనికి రాదు కాబట్టి వాటిని పప్పులో వేసుకోడానికి పక్కన పెట్టేయాలి. మధ్య మధ్యలో శ్యామలత్తయ్య అందరికీ టీలు పెట్టి తీసుకు వచ్చేది. అంత ఎండలో ఈ పెద్ద వాళ్ళు వేడి వేడి టీ ఎందుకు తాగుతారో ఎలా తాగుతారో శేఖరంకి అర్ధం అయ్యేది కాదు. పిల్లలందరూ అయితే ఏ తరవాణి నీళ్ళో, దబ్బాకు వేసిన మజ్జిగో తాగే వాళ్ళు.ఆల్చిప్పతో ఎడంచేయి బొటకన వేలు చెక్కేసుకునే వాళ్ళు పిల్లల్లో ఎవరో ఒకరు. చేతికున్న పుల్ల రసం, తొక్కలేచిపోయిన ఆ చేతికి తగిలి మరింత మండి పోయేది. శ్యామలత్త గబుక్కున లేచి పసుపు పెట్టి గుడ్డ కట్టి, నోటిలో పటిక బెల్లం పెట్టేది. ఇంకొంచెం మారాం చేస్తే అనక తేగల్లో తన వాటాకూడా పిల్లలకే ఇచ్చేసేది. "ఇంక పిల్లలంతా బయటకు వెళ్ళి ఆడుకోండి" అని మామ్మా, అత్తయ్యా పిల్లల్ని బయటకు పంపించేసేవారు.

"ఒరేయ్ సుబ్బులూ ముంజెలు తినాలనుందిరా" అని రాజ్యం అత్తయ్యో కమలత్తయ్యో అనడం తరువాయి, మర్నాడు తాటిముంజెలు అమ్మేవాడు, ఇంటి ముందరికి వస్తే నాన్నగారు వాడి దగ్గరున్న బుట్ట అంతా కొనేసే వారు. ముంజెలమ్మేవాడు మహదానందంగా బుట్టంతా గుమ్మరించేసి వెళ్ళేవాడు.

తేగలూ, బుర్ర గుంజూ, తంపడ శెనక్కాయలూ, కొబ్బరి బొండాలూ, రేగు పళ్ళూ .. అబ్బా ఆ వేసవి సెలవలు ఎంత ఆనందంగా గడిచిపోయేవో!

రాత్రిళ్ళూ ఆరుబయట ఆకాశంలో నక్షత్రాల కింద అందరూ బొంతలు వేసుకుని తలక్రింద చేయి పెట్టుకుని పడుక్కునేవాళ్ళు. తాతయ్యా నాన్నగారూ పంచ కిందా, బాబయ్యా హేమలత పిన్నీ గదిలోనూ, అమ్మా, అత్తయ్యలందరూ, లోపల పెద్ద గదిలోనూ పడుక్కునేవాళ్ళు. రెండో ఝాము దాటాక బాత్రూంకి పెరట్లోకి వెళ్ళడానికి లేచిన తాతయ్య, పిల్లలందరి మీదా దుప్పటీలు కప్పే వారు. తెలి మంచుకి జలుబు చేస్తుంది వెర్రి వెధవలకి అని అనుకుంటూ.

ఓ సారి, పెరట్లో నూతి గట్టు మీద గంతులేస్తూ ఆడిన శేషు గాడి కాలు జారి నూతిలో పడ్డాడు. కానీ అదృష్ట వశాత్తూ నూతిగోడ మీద పెరిగిన రావి చెట్టు కొమ్మ మీద పడ్డమూ, దాన్ని పట్టుకుని వాడు వేళ్ళాడుతూ కేకలు వేయడమూ జరిగింది. అప్పుడు అన్నయ్య వాణ్ణీ పట్టుకుని బయటకు లాగాడు. వాడు బయటకు వచ్చేలోపల అందరూ ఎంత తల్లడిల్లిపోయారో.. ఎన్ని దేముళ్ళకి మొక్కేసుకున్నారో..పిల్లలందరూ. బంధుప్రేమలంటే అలా వుండేవి.

వేసవి కాలం మూడు నెల్లూ ఇట్టే గడిచిపోయేవి. బావలూ, వదినలూ, అక్కలూ తమ్ముళ్ళూ .. అంతా ఒక పేద్ద కుటుంబం. గుడిలాంటి ఆ ఇంటికి మూల విరాట్టులు , పార్వతీ పరమేశ్వరుల్ల్లాంటి తాతయ్యా, మామ్మలు. కోడళ్ళనీ కూతుళ్ళనీ కొడుకులనీ అల్లుళ్ళానీ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. వాళ్ళల్లో వాళ్ళకి ఏమైయినా చిన్న చిన్న విషయాల మీద మనస్పర్ధలుండేవేమో గానీ, పిల్లలకి మాత్రమూ ఎల్లలూ హద్దులూ లేవు. అత్తయ్యలూ, పిన్నీ, పెదనాన్నా, బాబయ్యా, మామ్మా తాతయ్యా .. అదంతా మా కుటుంబం.. మన కుటుంబం, అదే కొండంత బలం అన్న భావన అందరిలోనూ వుండేది.

వేసవి కాలంలో పడే వానంటే తామందరికీ ఎంతిష్టమో.. పిల్లలందరూ కలిసి వానలో తడిసి చిన్న పిల్లలు వానా వానా వల్లప్పా అని తిరిగేవారు, కాస్త పెద్ద పిల్లలు చూరుకింద పడే ధారలో తల పెట్టి ఆకాశ గంగ స్నానాలు చేసే వారు. ఆ తరవాత, గాలి వానకి పెరట్లో రాలిన మామిడి కాయలు ఏరుకోడానికి వెళ్ళే వాళ్ళు. వానలో ఆకాశంకేసి కళ్ళార్పకుండా ఎవరు చూడగలరో అని పందాలు వేసే వాళ్ళు. ఎలాగూ వాన పడుతోంది కదా మళ్ళీ నూతిలోంచి నీళ్ళు తోడుకోనక్కరలేదని, చూరు కింద గంగాళం పెట్టేవాళ్ళం. సబ్బులు తీసుకొచ్చి స్నానాలు చేసేసే వాళ్ళు. పిల్లలందరమూ చెంబులతో చూరు కింద పట్టిన నీళ్ళు ఒకరి మీద ఒకరు ఒంపుకుంటూ ఎవరైనా బురదలో జారి పడిపోతే ఎలాగూ వానే కదా అని ఇంకొంచెం బురదలో పొర్లి మరీ లేచే వాళ్ళు. వానలో తడవడానికి బాబయ్య కూడా వచ్చేవాడు. హేమలత పిన్ని పంచ కింద నిల్చుంటే, బాబయ్య తనని పిలచి మెల్లిగా చెవిలో చెప్పేవాడు, వెనకాతలనుంచి వెళ్ళి పిన్నిని వానలోకి గబుక్కున తోసేయమని. తానలాగే చేస్తే బాబయ్య గబుక్కున పిన్నిని పట్టుకుని, ఎలాగూ తడిసిపోయావు కదా ఇప్పుడు పరవాలేదు అని ఇంకాస్త తడిపేసే వాడు.

"జలుబు చేసి ముక్కూడ కొట్టుకుంటార్రా!" అని మామ్మ ఓ పక్క నుంచి హెచ్చరిస్తున్నా వినేవాళ్ళు కాదు. అప్పుడు బాబయ్య - "పోన్లే అమ్మా! వాళ్ళనలా వానలో ఆడుకోనీ ఏం ఫరవాలేదు. జలుబు చేస్తే తలా ఒకరికి ఓ అగ్నితుండి మాత్ర ఇచ్చేస్తే అదే సర్దుకుంటుంది" అనేవాడు. బాబయ్యంటే మా అందరికీ ఎంతిష్టమో. పిల్లలతో సమానంగా ఆడేవాడు. హేమలత పిన్ని మాత్రం నిజంగా బంగారు తీగలా సుకుమారంగా ఎంతో అందంగా వుండేది.

వాన వాన ... వానంటే తనకెందుకింత ఇష్టమో ఇప్పుడు తెలిసింది శేఖర్ కి. చిన్నతనంలో ఎన్ని సార్లు తడిసాడో. ఒక్కొక్క చినుకూ ఒంటిమీద పడి, ఆవిరయిపోయి, తాపాన్ని బయటకు తీసుకెళ్ళిపోయేది. ఆ భావన ఎంత బాగుండేదో. ఆ వాన చినుకుల స్పర్శ, అనుభూతులు చర్మమ్మీద ఇంకా అలాగే ఇమిడిపోయి వున్నాయి .. చినుకు పడితే మొలకెత్తే విత్తనాల్లాగ.

వానలో తడిసినంత తడిసి, స్నానాలు చేసి లోపలికి వచ్చి తలతుడుచుకుని పొడి బట్టలు కట్టుకుని, వసారాలోనో, కిటికీ దగ్గర అందరూ అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళతో కలిసి కూర్చుని అమ్మ చేసిన వేడి వేడీ పకోడీలు తినడ ం ... హబ్బ అదొక గొప్ప అనుభూతి. అది ఆత్మీయులతో కలిసి ఆస్వాదించి, ఆనందించి తన్మయులవ్వాలి అంతే! శంకరాభరణంలో దాసు చెప్పినట్టుగా ఈ విషయంలో ఇంతకంటే నేనికేమీ చెప్పలేను..

"ఏమిటీ మీలో మీరలా ముసి ముసి నవ్వులు నవ్వేసుకుంటున్నారు?" అని భవాని భుజం మీద చెయ్యి వేసి కదపడంతో ఈ లోకంలోకి వచ్చాడు శేఖరం.

పెదవులమీద నవ్వూ, గుండెల్లో ఙాపకాలూ ఇంకా అలా తిరుగుతూనే వున్నాయి.

"ఏమిటో అంత ఆనందం మీరొక్కరే అనుభవించేస్తున్నారు. మాతో పంచుకుని కాస్త మమ్మల్నీ ఆనందపరచవచ్చును కదా. అదేదో మేమూ మిస్సయిపోతున్నాము" యధాలాపంగా అన్నా భవాని మాటల్లో ఎంతో భావం కనిపించింది శేఖరానికి.

"తప్పకుండా, భవానీ. అవును నిజమే కదా.. నా ఆనందాన్ని మన పిల్లలకి కూడా ఇవ్వాలి. వాళ్ళు ఇలాంటి అనుభూతులు ఎన్ని కోల్పోతున్నారో కదా!"

దేని గురించి మాట్లాడుతున్నారు..అన్నట్టు అయోమయంగా చూసిన భవాని చెయ్యి పట్టుకుని, . "ముందర ఒక మంచి టీ పెట్టు" అన్నీ వివరంగా చెబుతాను అన్నాడు.

ఆ తరవాత సోఫాలో కూర్చుని టీ తాగుతూ అంతా చెప్పాడు...

కాకినాడలో, మామ్మా, తాతయ్యా, అత్తయ్యలూ, పిన్నులూ, బాబయ్యలూ, వాళ్ళందరి పిల్లలూ, ఆటలూ, అల్లర్లూ, పెళ్ళిళ్ళూ పేరంటాలూ, తేగలూ, తాటిముంజెలూ, అరిసెలూ ఆవకాయలూ, ఆవకాయ ముక్కతో చద్దన్నాలూ, వేపచెట్టుకింద వెన్నెల్లో వేడి పాలు, పొన్నకాయలూ, బొగడి పూలూ, పెరట్లో పారిజాతాలూ, నూతి దగ్గిర ఆకు సంపెంగా, నందివర్ధనమూ, నాగలింగం పూల చెట్టూ. హేమలత పిన్నిలాంటి విష్ణువర్ధనం పూలూ, శ్యామలత్తయ్యలాంటి ముద్దమబంతిపూలూ.. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా గుండెలోని ఙాపకాలు గోదారి ఒడ్డున వున్న చలమల్లో నీళ్ళలా తవ్వినకొద్దీ వూరుతూనే వున్నాయి... ఆగకుండా.. అనంతంగా.. ఆకాశగంగలా..అమ్మప్రేమలా..

"భవానీ మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకంటూ ఇలాంటి ఙాపకాలుంటాయంటావా?"

"వాళ్ళొక్కళ్ళూ లింగూ లిటుకూ అంటూ ఏకాకుల్లా దేశంకాని దేశంలో పెరుగుతున్నారు. మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళూ వాళ్ళ పిల్లలూ కానీ, మీ అన్నదమ్ములూ అక్కచెల్లెల్లూ కాని .. ఎవ్వరికీ దగ్గరకాకుండ.. ఎక్కడెక్కడో విసిరేసినట్టుగా ఎవరికి వారయిపోయాము. మన పిల్లలకి వాళ్ళ కజిన్స్ పూర్తి పేర్లు కూడా తెలియదు. పెద్దయ్యాక మన పిల్లలు చాలా వంటరి తనంతో బతుకుతారనిపిస్తోంది భవానీ. పెద్దయ్యాక వాళ్ళకంటూ ఒక బంధు బలగమూ, చిన్ననాటి ఙాపకాలూ ఏం ఇస్తున్నాము? "

అంతా శ్రధ్ధగా విని భవానీ అంది: "అవును నిజమే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాము.. పోయిన కాలాన్ని యధాతధంగా వెనక్కి తీసుకురాలేము..మనకున్న పరిధిలో మనం చెయ్యగలిగినది చేద్దాము.. "

ఏమిటీ అన్నట్టు చూడ్డం శేఖర్ వంతయ్యింది. అప్పుడు భవాని అంది నవ్వుతూ "ప్రస్తుతానికి.. ఇంకా వాన పడుతోంది... పిల్లలిద్దరినీ తీసుకుని వానలోకి వెళ్ళండి.. చూరుకింద నీళ్ళు కారుతున్నాయి, పెరట్లో నీరు నిలిచిపోయి బోల్డంత బురద వుంది.. నేనీ లోపల వేడి వేడిగా పకోడీలు వేస్తూ వుంటాను..."

వేసవిలో వాన పడుతూంటే వేడి పకోడీలు తినడం .. అబ్బ .. అమ్మ హత్తుకున్నంత హాయి!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)