సిలికానాంధ్ర, "సర్వధారి" యుగాది వేడుకలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రస్తుతపఱచబడిన కవిత ఇది.బామ్మగారి అమెరికా కబుర్లు
గురు స్మరణ: కవిత్వం చెప్పేముందు చదువు నేర్పిన గురువులను స్మరించడం మన భారతీయుల ఆనవాయితి.

కం// దుంపలబడిలో గురువులు
చెంపలు వాయించి అపుడు చెప్పిన చదువే
పంపెను కదరా మనలను
గుంపులుగా చేరి ఇచట గోష్ఠులు చేయన్


అమ్మీ, ఇక్కడకు క్షేమంగా చేరి ఇంచుమించుగా నెల్లాళ్ళయింది. అమెరికా వచ్చిన తరువాత నీకు ఉత్తరం రాస్తానన్నాను కదా. ఇవిగో ఇక్కడి విశేషాలు.

వచ్చిన క్రొత్తలొ అన్నియు
చచ్చెడి తికమకగ ఉండు, చాలాకాలం
స్విచ్చి పనితీరు తెలియదు,
వచ్చు పగలు నిద్ర, రాత్రి వచ్చును జెట్లాగ్!!


దూరము నిక్కడ మనుజులు
కారులొ పయనించ పట్టు ఘడియల కొలుతుర్
ఊరుకి ఊరుకి దూరము
ఆరున్నర గంట లెటుల నడగకె భామా!!


నిక్కరును షార్టు అందురు,
గెక్కో అగునిచట బల్లి, గేసగు పెట్రోల్,
ట్రక్కనెదరు లారీ నిట,
చెక్కని బిల్లుని పిలుతురు, చెప్పెద వినుమా!!


బెండకాయ మరియు వంకాయ తోడుగ
దొండకాయ కూడ దొరకునికడ,
చక్కగ అవి ఉండ సాలడు పేరుతొ
ఆకులను తినెదరు మేక లాగ!!


పచ్చడి లేకున్న జిహ్వ
చచ్చునులే తినగ ఇచటి చప్పటి కూరల్,
నచ్చదు వీరికి కారం,
వచ్చునె రుచి మిరప లేక వంటల కెపుడున్!!


వీకెండులొ ఇల్లువదలి
పోకుండా ఉండలేరు, బుర్రకు బోరింగ్
కాకుండా హైకింగని
ఏ కొండో ఎక్కివత్తురిచ్చటి మనుజుల్!!


తూకం చూసుకు బాబోయ్
హౌకం నేనింతబరువు అయినా ననుచున్
వాకింగ్ చేసెదరాపై
బైకింగే పగలు రాత్రి, బరువది తగ్గన్!!


బామ్మ ఎప్పుడూ వంకలే ఎంచుతుందనుకోకు. ఇక్కడ కొన్ని బాగున్న విషయాలివిగో.

ఎవ్వరినెవ్వరు చూచిన
రువ్వెదరొక చిన్న నవ్వు, రూలది, ఏమీ
యవ్వారమనుచు తలపక
నవ్వగవలె నీవుకూడ, నాకది నచ్చెన్!!


పుచ్చులు ఉండవు కూరలొ
వచ్చునులే వేడి నీళ్ళు పంపులొ ఎపుడున్
బొచ్చున్న కుక్కలధికము
మచ్చుకకు కాన రావు మశకము లిచటన్!!


చెప్పాలంటే ఇంకా చాలా విషయాలున్నాయి. మిగిలిన విశేషాలు తరువాత ఉత్తరంలో రాస్తాను.

దీవెనలతో,

నీ బామ్మ

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఫర్వాలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)