ప్రతిరోజూ లాగే ఆరోజు కూడా అందమైన సూర్యోదయాన్ని చూడటానికి కర్టెన్ పక్కకి లాగి కిటికీ తీశాడు ప్రకాష్.రోజుకో కొత్త అందం సంతరించుకుని ప్రతిరోజు ఉదయించే బాలభానుని లేలేత కిరణాలు పుడమితల్లి ఒడిని చేరేలోపు ఎన్ని రంగులు సంతరించుకుంటాయో, ఎంత అందాన్ని సృష్టిస్తాయో అది ఒక్క కళాకారుడి మస్తిష్కానికి మాత్రమే తోచే అనుభూతి.అలాంటి కళాకారుడికి ప్రతీ సూర్యోదయం ఒక అందమైన అనుభవం.ఎదురుకుండా ఖాళీ ప్రదేశం, దానికి చాలా దూరంగా సరిహద్దు గోడలా అన్నట్లు కోటగోడల్లా కొండలు, అడవి కన్య కురులారబోసుకున్నట్లు పచ్చని ఎత్తైన చెట్లు, వాటి మధ్యలోంచి దోబూచులాడుతూ బాలభానుని ఆగమనం. ఓహో! ఎంత అందం.గగనాన ఉదయించిన బాలుడు కొండల్ని తాకుతూ చెట్లమాటుగా, ఆకుల చాటుగా మెల్లగా పారాడుతూ, తల్లి ఒడినిచేరి అలసి వేడెక్కి పచ్చికబయళ్ళ మీద సేదతీరి, ధరణి తల్లి ఒడిలో పెరిగి పెద్దవాడై అరుణోదయ కాంతుల్ని వెదచల్లుతూ సృష్టికే మూల పురుషుడై, నిరంతర కాలచక్రవాహినిలో పయనిస్తూ, జనజీవనానికి హేతువై, జనావళి మనుగడకి కారణభూతుడై అలసిసొలసి సంధ్యకాంతుల్ని చిందిస్తూ సాగరకన్య ఒడిలో ప్రశాంతంగా నిదురించే దినకరుడి దినచర్య కళాకారుడి కళాహృదయానికి మాత్రమే తెలుసు.అలాంటి కళాకారుడి "ఆలోచనలు" అనే "కుంచె"కి రంగులు కలిపి రూపం కల్పిస్తే అవి ఎన్ని సూర్యోదయాలౌతాయో! అలాంటి చిత్రపటాల్ని ఇంతకాలం తను ఎన్ని సృష్టంచాడో! ఎన్ని సూర్యోదయాల్ని చూశాడో అన్ని అపురూపమైన అందమైన చిత్రపటాలు ఉదయింపబడ్డాయి ప్రకాష్ కుంచె నుంచి.

ఇన్నేళ్ళుగా ఎదురుగా ఖాళీస్థలం, అదే భాస్కరుడి పుట్టిల్లు అయినట్లు ఆ సూర్యోదయం తనకే సొంతం అయినట్లు భావించాడు ప్రకాష్.గత ఆరు నెలలుగా ఆ ఖాళీస్థలంలో ఇల్లు కట్టడం చూసి తన అనుభవాల్ని చెరిపేసి, అందమైన అనుభవాల్ని ఎవరో దూరం చేస్తున్న భావన. ఆ అరుణోదయ అందాలని ఇంకెవరో పంచుకోబోతున్నారని బాధ.సొంతవారినుంచి వేరుచేసి తనని ఎవరో ఒంటరిని చేస్తారనే భయం.ఇలాంటి రకరకాల ఆలోచనలతో మొదట్లో ఒకింత కంపించాడు ప్రకాష్.మళ్ళీ అంతలోనే మనసుని భయపెట్టే ఆలోచనలకి స్వస్తి చెప్పి, హృదయాంతరాంగాలని శృతిచేసి "మనస్సు" అనే "కుంచె"ని సరిచేసి ఆలోచనాసరళికి మళ్ళీ ఒక కొత్త రూపాన్ని కల్పించాడు గత ఆర్నెల్లుగా! ఈ వేళ ఆ ఇంటి గృహప్రవేశం.ఎదురుగా కట్టిన కొత్త ఇంట్లో జనాలు హడావిడి.మూడు నిద్దర్లు చేసి వెళ్ళిపోతారేమో! తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. తన పిచ్చిగానీ ఆర్నెల్లుగా దగ్గరుండి అంతబాగా కట్టించుకున్న వాళ్ళు ఇంట్లో ఉండకుండా ఉంటారా?చూద్దాం రేపట్నించీ సూర్యోదయం మరోలా ఉంటుంది అనుకున్నాడు.

పాలు,కూరలు, న్యూస్‌పేపర్ వేసే అబ్బాయి మొదలైన వివరాలు తన తల్లినే అడిగి తెలుసుకున్నారని విని అయితే వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉంటారన్నమాట అనుకున్నాడు ప్రకాష్.ఎంతమంది ఉంటారో? ఎవరెవరు ఉంటారో? అనుకుని అయినా తనకెందుకని అనుకున్నాడు.నేనే సూర్యోదయంలో కొత్త అందాల్ని వెదుక్కోవాలి అనుకున్నాడు.

తలుపు తీయగానే ఉదయాన్నే ఎదురుకుండా కిటికీలోంచి రెండు కళ్ళు తననే చూస్తున్నాయని తడబడింది అరుణ.అంతలోనే తనని కాదనుకొని పనిలో నిమగ్నమైంది.కానీ అలా ఒక్కరోజు కాదు.ప్రతీరోజూ ఆ రెండు కళ్ళనీ గమనించి "ఏమిటో ఈ మనుష్యులు! సిగ్గూ, సంస్కారం లేకుండా" అనుకుని తనపని తాను చేసుకుపోతున్నా, ఆ ఎదురింట్లో ఎవరు? ఎందుకు తనని అలా చూస్తున్నారు? అవతలివారికి ఎంత ఇబ్బందికరంగా వుంటుందోనని అనుకోరే? ఇలా ఆలోచిస్తూనే వుంది అరుణ.కొన్నాళ్ళయ్యాక ఇక లాభంలేదు. ఏదో ఒకటి చేయాలి. ముందీ విషయం సృజనకి చెప్పాలి అని నిశ్చయించుకొంది.

సృజన అరుణ బాల్య స్నేహితురాలు.చిన్నప్పుడు ఒక కంచం, ఒక మంచం అన్నట్లు మసిలారు.ఈ మధ్యనే సృజన పెళ్ళిచేసుకుని భర్తతో కలిసి ఆ ఊళ్ళోనే ఉంటుంది.సృజన, అరుణ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. సృజన భర్త కిరణ్ చాలా మంచివాడు.కళారాధకుడు.ఇద్దరిదీ ప్రేమ వివాహం.ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.ఒడిదిడుకులులేని ఒద్దికైన సంసారం.అరుణ తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగరీత్యా క్యాంప్‌లూ, ట్రాన్స్‌ఫర్స్ కారణంగా మొదట్నించీ హాస్టల్‌లోనే ఉండి చదువుకుంది అరుణ.అదే హాస్టల్‌లో రూంమేట్, క్లాస్‌మేట్ అయిన సృజన అరుణకి అతిసన్నిహితురాలైంది.ఇద్దరూ అన్ని విషయాలు చర్చించుకుంటారు.అందుకే సృజనకి చెప్పాలని నిశ్చయించుకొంది అరుణ. ఆఫీస్‌లో తలమునకలయ్యే పనితో సతమతమవుతూ సృజనతో మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తుంది అరుణ. అరుణ అన్యమస్కంగా ఉండటం చూసి లంచ్ టైంలో " ఏమైందే అలా ముభావంగా ఉన్నావు" అడిగిండి సృజన. "ఏమీలేదు.చిన్న సమస్య. నీ సలహా కావాలి" "ఏమిటీ, కొత్త ఇంటి గార్డెనింగ్ గురించా? ఆదివారం నేనూ, కిరణ్ వస్తాంలే! ఏం కొనాలో? ఎక్కడ కొనాలో ? ఎక్కడ నాటాలో అన్నీ చూద్దాం!" "అదేం కాదే! అసలు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉందే. తలుపు తియ్యాలంటే ఏదోలా ఉంది" "అదేమిటే? అంతలా కలలుగని ఇలాఉండాలి, అలా ఉండాలి అంటూ అన్నీ దగ్గరుండి మరీ చేయించుకున్నావు కదే! కనీసం నాలుగు నెలలైనా అవ్వకముందే ఇదేమిటి?" "అదంతా కరక్టే! సమస్య అంటే పెద్దదేమీ కాదు.కాకపోతే పెద్ద ఇబ్బందికరంగా ఉంది.ఏం చెయ్యాలో చెప్తావని" అంటూ విషయం బయటపెట్టింది. అంతావిని పకపకా నవ్వి "బాగుందే! రెండు కళ్ళు నిన్నే చూస్తున్నాయని నీకెలా తెలిసింది? నువ్వూ చూడబట్టేకదా! అయినా చూస్తే చూడనీ!అది నిన్నే అని ఎందుకనుకోవాలి? ఒకవేళ నిన్నే అయినా తప్పేముంది? నచ్చావేమో చూస్తున్నాడు.అవునూ ఇంతకీ అవి ఆడకళ్ళా? మగ కళ్ళా?" అడిగింది సృజన.

"పోవే నీకంతా వేళాకోళమే! మగ కళ్ళే!అందుకే ఇబ్బందిగా వుంది.అదే ఆడవాళ్ళైతే పరిచయం చేసుకుని ఏంచూస్తున్నారని అడిగేయెచ్చు.ఇప్పుడైనా అలా అడగాలంటే ఎలాంటి సమాధానం వస్తుందోనని భయంగా వుంది" "భయం ఎందుకు? నా కళ్ళు నా ఇష్టం అంటాడని అవునా! నిజమే మనిషి "స్వేచ్చాజీవ"ని అనుకుంటాడు. అందులోనూ వాక్స్వాతంత్రం లాంటి రకరకాల స్వాతంత్రాలు కలిగివున్నవాడు.మనమేం చెయ్యలేం.కొన్నింటిని చూసీచూడనట్లు వదిలేయాలంతే!" అంది సృజన. "అంటే చూస్తే చూడనీ అని వదిలేయానా? సలహా ఇవ్వవే అంతే లెక్చర్ ఇస్తావేమిటి?" "సరేలే ఎల్లుండి ఎలాగో ట్రైనింగ్‌కని వారం రోజులు ఊరు వెళ్తున్నాం కదా! వచ్చాక సీరియస్‌గా ఆలోచిద్దాంలే" అంది సృజన.

రోజూ సూర్యోదయంతో పాటుగా గత నాలుగు నెలలుగా కుందనపు బొమ్మలాంటి అమ్మాయి కూడా వచ్చిచేరింది తన చిత్రపటాల్లో! అలాంటిది వారం రోజులుగా ఆ అమ్మాయి కనిపించటంలేదు."ఏమైంది? ఎక్కడికెళ్ళింది? ఎవరో ఇద్దరు పెద్దవాళ్ళు మాత్రం కనపడ్తున్నారు.వాళ్ళు ఆఅమ్మాయి తల్లితండ్రులా?మరి తనేది? ఎలా తెలుస్తుంది? ఎందుకు ఆమ్మాయి దర్శనం కోసం తన మనసింత ఆరాటపడుతోంది? ప్రకృతిలో అందాలని ఆరాధించే తను అందమైన ఆ అమ్మాయిని ఆరాధిస్తున్నానా? లేక ప్రేమిస్తున్నానా?. తన ఆలోచనలికి తనే నవ్వుకున్నాడు ప్రకాష్. ప్రేమించేందుకు కానీ, ప్రేమించబడేందుకుగానీ తనకు అర్హత వుందా? అసలైనా ఆ అమ్మాయి ఏం చదువుకుందో? ఎవరో? ఏమిటో? తన కోరికలు, ఆశలు ఏమిటో? ఏమీ తెలియకుండా ఏమిటీ ఆలోచనలు? అయినా ఎప్పుడూ లేనిది ఒక ఆడపిల్ల గురించి తనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాడు?తనని ఇంతగా ఆకట్టుకున్న ఆ అమ్మాయి తన గురించి ఏమనుకుంటుందో? ఇలా కిటికీలోంచి చూసి ఆరాధిస్తున్నానంటే తప్పుగా అనుకుంటుందేమో?నేనొక రౌడీననుకుంటుందో? అయినా ఎదుటివారికి తెలియకుండా వారి చిత్రపటాల్ని గీయటం తప్పేకదా! మరి ఆ తప్పు తనకు తెలియకుండానే చేశాడు.మనసులో ఏ దురుద్దేశం లేకుండానే నా బొమ్మ గీశారా అని ఎప్పుడైనా ఆ అమ్మాయి అడిగితే తనేం సమాధానం చెప్పగలడు? "వద్దు.నేను చేస్తున్నది తప్పే" ఇలా అనుకుని కర్టెన్ వేద్దామని వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఆటో దిగి లోపలికి వెళ్తుంది.ఈరోజు నిజంగా ఆ అమ్మాయినే చూస్తున్నాడు.ఉదయభానుడి లేలేత కిరణాలు పడి ఆ ఒంటిఛాయ మెరుస్తుందనుకున్నాడు ఇన్నాళ్ళు.కానీ కాదు, తన ఒంటి ఛాయకే కిరణాలు ప్రకాశిస్తున్నాయా అన్నట్లుంది ఆమె మేనిరంగు.ఆలోచిస్తూ అటే చూస్తున్నాడు. గేటు వెయ్యటానికి వెనక్కి తిరిగి తనని రోజూ చూసే ఆ "రెండు కళ్ళ" కోసం వెతకసాగింది అరుణ.ఒకేసారి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.ఇద్దరి కళ్ళూ కలిశాయి.అంతే! ఒంట్లో విద్యుత్ కిరణం ప్రసరించినట్లయి ఒళ్ళు జలదరించింది అరుణకి.అటు ఇటు చూసి తననెవరూ గమనించలేదని ఊపిరి పీల్చుకొని, మనసులో రేగిన ఊహల కెరటాల్ని తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళింది అరుణ. ఎవరండీ ఇంట్లో! ఎవరూ లేరా? అంటూతలుపు తట్టి గుమ్మంలొంచే అడిగింది సృజన. "ఎవరమ్మా నీవు? ఏం పని మీద వచ్చావు?" అంటూ ఒక నడి వయసు స్త్రీ బయటకి వచ్చింది. "నా పేరు సృజన.మీ ఇంటి ఎదురుగా కొత్తగా వచ్చారు శశిధర్ గారు వాళ్ళు, వాళ్ళ స్నేహితులం.మేం కూడా ఈపక్క వీధిలో వుంటాం.వచ్చి నాలుగు నెలలైనా ఒకరికొకరు పరిచయం కాలేదుకదా! అందుకే పరిచయం చేసుకుందామని వచ్చాను" అంది సృజన. "అలాగా! రామ్మా కూర్చో! నా పేరు కౌసల్య.వచ్చిన కొత్తల్లో వారితో ఒకసారి మాట్లాడాను.తరువాత కుదరలేదు" "మీరేమీ అనుకోనంటే ఒక విషయం అడుగుదామని వచ్చాను. ఆంటీ" అంటూ కాస్త మొహమాతంగా అంది సృజన "ఫరవాలేదు చెప్పమ్మా! ఇరుగుపొరుగు అన్నాక ఒకరికొకరు సహాయంగా ఉండాలి" అంది కౌసల్య. "అహ! అదేం కాదు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వీధి వైపు ఆ గదిలో ఎవరు ఉంటారు ఆంటీ? " అంటూ మొహమాటంగానే అయినా డైరెక్టుగా విషయనికొచ్చింది. "ఏమ్మా ఏదైనా ఇబ్బందా? మావారు బిజినెస్ పనుల మీద ఎక్కువగా బయటే ఉంటారు.ఇంట్లో నేనూ, మా అబ్బాయి ఉంటాము. వీధి వైపు గది మా అబ్బాయిదే.ఏమిటో చెప్పమ్మా? " అడిగింది కౌసల్య. ఎక్కువ నాంచకుండా నసుగుతూనే అసలు విషయం వెంటనే చెప్పేసింది సృజన. అంతా విన్న ఆవిడ "రామ్మా! మా అబ్బాయిని పరిచయం చేస్తా" అని లోపలికి తీసుకెళ్ళింది. "బాబూ ప్రకాష్. ఈ అమ్మాయి సృజన. మన ఎదురింట్లో వాళ్ళు.మనల్ని పరిచయం చేసుకోవాలని వచ్చింది.మీరు మాట్లాడుతూ ఉండండి,నేను ఇప్పుడే వస్తానని వారిని ఒకరికొకరు పరిచయం చేసి బయటకి వెళ్ళింది". అతని గదిలోకి అడుగుపెట్టిన సృజన నిర్ఘాంతపోయి అలా చూస్తూనే ఉండిపోయింది చాలా సేపు.ఎంతటి కళాకారులైనా "ఆహా" అనకుండా ఉండలేరు అతని గదిలోని పెయింటింగ్స్ చూసి.ఎన్ని రకాల సూర్యోదయాలు.ఈ సృష్టి ఉన్నంతవరకు నిరంతరం అలుపెరగకుండా సంవత్సరంలో వచ్చే పన్నెండ్రు మాసాల్లో, ఆరు ఋతువుల్లో, మూడు కాలాల్లో ప్రతినిత్యం ఉదయించే సూర్యుడు ఒక్కొక్కరోజు ఒక్కొక్క కొత్త కాంతిని సంతరించుకొని ఎంత అందంగా ఈ భూమిమీద ఎదుగుతాడో ప్రస్ఫుటంగా ప్రకాశిస్తున్న ఆ పెయింటింగ్స్, కళాకారుడి ఆలోచనలని అద్దం పట్టేలా, అతని మస్తిష్కంలో ఉన్న ఉషస్సుకి ఉషోదయాల్లా కనిపిస్తున్నాయి.ఇంతటి కళాదృష్టినా అరుణ తప్పుగా అనుకుంది, అని ఆలోచిస్తూఅతను వేసిన ప్రతి పెయింటింగ్‌ని శ్రద్ధగా తిలకించింది సృజన.ఒక్కొక్క పెయింటింగ్ ఎంత సహజంగా ఉందంటే అన్ని కాలాల్లోనూ, అన్ని ఋతువుల్లోనూ ప్రతి నిత్యం బాలభానుడు అప్పుడే అక్కడే ఒకేసారి ఉదయిస్తున్నాడా అన్నట్లు ఉన్నాయి.కొన్ని పెయింటింగ్స్‌లో నిర్మాణలో ఉన్న ఇల్లు, ఆ తర్వాత పూర్తయిన ఇల్లు, ఆ తర్వాత ఇంటి ఆవరణలో ముగ్గు వేస్తూ అరుణ, బట్టలు ఆరవేస్తూ అరుణ, మొక్కలకి నీళ్ళు పోస్తూ అరుణ ఇలా రకరకాల ఉదయకాంతుల్లో కొత్త అందాలతో అరుణ కనిపించటం చూసి ఇతనిని ఇప్పుడెలా అర్థం చేసుకోవాలి? అనుకుంది సృజన.

ఎదురింటినుంచా? రోజూ నేను చూసే అమ్మాయి కాదే?ఈవిడ ఎవరో అని ఆలోచిస్తున్న అతని ఆలోచనలలకి అంతరాయం కలిగిస్తూ "ఇదిగోనమ్మా కాఫీ" అంటూ వచ్చింది కౌసల్య. సృజన వెళ్ళి చెప్పటం వల్లనో ఏమిటో గత నాలుగైదు రోజులుగా తనని చూసే ఆ రెండు కళ్ళి కనిపించటంలేదు అరుణకి.ఏదో వెలితిగా అనిపించింది. మాటిమాటికీ బయటకి చూసి, నిరాశతో లోపలికి వెళ్తోంది.ఏం చెప్పిందో ఏమిటో మళ్ళీ అతను కనిపించనే లేదు. అదే అడిగింది సృజనని. "ఏమిటే ముందు చూస్తున్నాడని ఇబ్బందిగా ఉందన్నావు? ఇప్పుడు కనిపించటంలేదని బాధపడుతున్నావు? అంతే నీ మనసులో అతని గురించి ఆలోచిస్తున్నట్లే కదా! అంటే ప్రేమిస్తున్నావన్నమాటే కదా!అదేదో చెప్పు. రాయబారం నడిపేస్తాను.అయినా నేను అతనితో ఏమీ మాట్లాడలేదు.వాళ్ళమ్మగారితో చెప్పాను అంతే!" "ఏమోనే! నాకెందుకో చాలా గిల్టీగా వుంది.నువ్వు అతని గురించి చెప్పింది అంతా విన్నానా. అంతటి కళాహృదయాన్ని బాధపెట్టామా అనిపిస్తోంది.సాయంత్రం మనిద్దమ్రం కలిసి వాళ్ళింటికి వెళ్దామా!?" "సరే! కిరణ్ ఎటూ ఊళ్ళో లేడు.నేను రాత్రికి అక్కడే ఉంటాను"

సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కలిసి ఎదురింటికి వెళ్ళారు. కౌసల్య వారిని ఆహ్వానించి "ఒరేయ్! ప్రకాశం, ఎదురింటి అమ్మాయి, సృజన వచ్చారు" అని చెప్పి వాళ్ళని లోపలికి వెళ్ళమని ఆవిడ పనుందని లోపలికి వెళ్ళిపోయింది. నమస్కారమండీ ప్రకాష్ గారు! నేను సృజనని గుర్తు పట్టారా? నంస్కారమండీ, బాగున్నారా? అని అడిగాడు ప్రకాష్ నేను బాగున్నాను.మీరెలా వున్నారు?ఇదిగో తను నా స్నేహితురాలు అరుణ.మీ ఎదురింట్లో వుండేది, మీ పెయింటింగ్స్‌లో బంధించింది ఈమెనే. అరుణా! ఇతనే ప్రకాష్ అని పరిచయం చేసింది. నమస్కారమండీ! అంది అరుణ "నమస్కారమండీ! సారీ అండీ! మీ అనుమతి లేకుండా మీ బొమ్మల్ని నాకు తెలియకుండానే చిత్రించాను.కావాలంటే ఆ పెయింటింగ్స్ మొత్తం మీకే ఇచ్చేస్తాను.అంతే గానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి" అన్నాడు ప్రకాష్. "అయ్యొయ్యో! అదేం లేదండీ! మీరెవరో తెలియక ముందు అపార్థం చేసుకున్నాను.సృజన చెప్పిందంతా విన్నాక మీ పెయింటింగ్స్ చూడాలనే ఉత్సాహంతో వచ్చాను.మీకేం అభ్యంతరం లేకపోతే మీ పెయింటింగ్స్ చూడచ్చా?" అతనినే చూస్తూ, అన్నీ చెప్పిన సృజన "ఆ ఒక్కవిషయం" ఎందుకు దాచిందో తెలియక ఆలోచిస్తూ అడిగింది ప్రకాష్‌ని తప్పకుండా! ఏదో నా మనోభావాలకి ప్రతిరూపాలు అంతే! చూడండి అంతూ చూపించాడు ప్రకాష్. "అన్నీ సూర్యోదయాలే కదా! వేరే ఇంకేవీ ట్రై చేయ్యలేదా?" "చాలానే వేశానండీ. కానీ నాకు సూర్యోదయం అంటే చాలా ఇష్టం.ఈ నాలుగు గోడల మధ్యనే ప్రపంచం.ఎప్పటికైనా నా జీవితానికి ఒక కొత్త ఉదయం వస్తుందనే ఆశతోనే ప్రతిరోజూ ఎదురుచూస్తూ, రోజూ ఉదయించే సూర్యుడ్ని నా కుంచెలతో నింపుతాను.ఇదిగో ఇవన్నీ కూడా నేను వేసినవే.అంటూ ఇంకా చాలా పెయింటింగ్స్ బయటపెట్టాడు ప్రకాష్. ఎన్నో పోట్రెయిట్స్ కూడా వున్నాయి.జీవకళ ఉట్టిపడుతూ సజీవ శిల్పాల్లా ఉన్నాయి ఒక్కొక్కటీ.దేనికదే చాలా బాగున్నాయి.ఎక్కువగా "ల్యాండ్‌స్కేప్స్" ఉండటం చూసి "ఎంతైనా ప్రకృతినే ఆరాధిస్తారనుకుంటా! అందుకే అవే ఎక్కువ ఉన్నాయి.ఇంత కళని ఇలా నాలుగు గోడల మధ్య బంధించకపఓతే బయటకి తేవచ్చుగా" అంది అరుణ. "తేవచ్చు.కానీ నాకు ఎవరూ తెలియదు.స్నేహితులు కూడా ఎవరూ లేరు.నాన్న ఇంట్లో వుండేది తక్కువ.అమ్మ ప్రోత్సాహం, సహకారం పూర్తిగా ఉన్నాయి.కానీ తనకి కూడా తెలిసినవారెవ్వరూ లేరు.కాబట్టి ఇదంతా నా ఆత్మానందానికే పరిమితం అయిపోయింది.అయినా ఈరోజుల్లో ఇలాంటి కళలని ఇష్టపడేవారు ఎక్కడో ఒకరిద్దరు మీలాంటివారుంటారు. అంతే కదండీ" అన్నాడు ప్రకాష్. "భలేవారే! అదేంకాదు.వెలకట్టలేని మీ పెయింటింగ్స్‌కి ఎంతో గుర్తింపు వస్తుందో మీరే చూడండి.ఇప్పట్నించి మనందరం స్నేహితులం సరేనా! సృజన భర్త కిరణ్ని కూడా మీకు పరిచయం చేస్తాం.తనకి ఈ ఫీల్డ్‌లో తెలుసున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.అతను కూడా గొప్ప కళారాధకుడు.ఇక మేమంతా మీ పనిమీదే వుంటాం. సరేనా!" అంటూ ప్రారంభమైన వారి పరిచయం స్నేహంగా మారి ఏడాదిలోపే ప్రేమ అంకురించింది వారి హృదయాల్లో. అరుణ, సృజన కలిసి కిరణ్ సహకారంతో ఒక చిన్న ప్రదర్శన ఏర్పాటుచేశారు.అందులో ప్రకాష్ పెయింటింగ్స్‌ని పెట్టారు.మొదట్లో చిన్న చిన్న ఎక్గ్జిబిషన్‌లో ఒక స్టాల్ రెంట్‌కి తీసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కేవలం అతని పెయింటింగ్స్‌కే ప్రదర్శన పెట్టించే స్థాయిలో గుర్తింపు తెచ్చారు.ఇప్పుడతను నాల్గుగోడల మధ్య ఉండే ప్రకాష్ కాదు, దేశం నలుమూలలా మంచి చిత్రకారుడిగా ప్రకాశిస్తున్న ఒక కిరణం.అతనిలోని కళామూర్తిని గౌరవించి అతనికి మనసు అర్పించింది అరుణ.తనలో ఉన్న కళని గుర్తించి బయట ప్రపంచానికి తెలియచేసి తనకింతటి గుర్తింపు తెచ్చిపెట్టిన ఆమెలోని కళాతృష్ణని అభిమానించి ఆమెని ఆరాధిస్తున్నాడు ప్రకాష్.

కిరణ్! వీళ్ళిద్దరికీ పెళ్ళి చేసేస్తే బావుంటుంది కదా! అంది సృజన నేనూ అదే అనుకుంటున్నాను.వెళ్ళి అరుణ అమ్మా,నాన్నలతో మాట్లాడదాము అంటూ బయలుదేరి అరుణ వాళ్ళింటికి బయలుదేరారు. "నువ్వు చెప్పినదంతా బానే వుందమ్మా!ఏదో స్నేహభావంతో వాళ్ళింటికి వెళ్ళి వస్తున్నారు.అతనికి వేరే స్నేహితులి ఎవరూ లేకపోవటం వల్ల మీ అందరూ కలిసి ఇంత గుర్తింపు తెచ్చారు.సరే! అలాగని చదువులేని అతని ఎలాగమ్మా ఒప్పుకునేది? అన్నారు అరుణ తండ్రి శశిధర్ గారు. "పొరపాటు పడ్తున్నారు అంకుల్! అతను చదువులేనివాడని ఎవరు చెప్పారు?కాలేజీకి వెళ్ళి చదువలేదు. ఇంట్లోనే వుండి ఎం.ఏ పూర్తి చేశాడు.ఇంకో ఆరు నెలల్లో ఎం.బి.ఏ కూడా పూర్తి కావస్తుంది" అన్నాడు కిరణ్ "అది కాదు బాబూ! కాలేజీకి వెళ్ళి చదవలేదని కాదు.అసలు నడవలేని వాడు, బయట ప్రపంచాన్ని చదవలేడు కదా! ఎలా అల్లుడిగా ఒప్పుకోమంటావు?" "తప్పు అంకుల్! అతను కాళ్ళతో నడవలేడని చూస్తున్నారు.అతనిలో ఉన్న కళ పరుగెత్తి దేశం నలుమూలలా చుట్టివస్తోంది.అన్నిటికీ మించి ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నారు.అరుణ కూడా చిన్న పిల్ల కాదు.దాని పట్టుదలతో, కృషితో అతనిలో ఉన్న కళని నలుగురికీ తెలిసేలా నడిపించింది.అలాంటిది రేపు పెళ్ళి అయినాక అతనిని నాలుగుగోడల నించి ప్రపంచంలోకి నడిపించలేదంటారా? చెప్పండి.వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.మీరు అంగీకరిస్తే ఇద్దరి జీవితాలు ఆనందంగా వుంటాయి.లేకపోతే నిష్కారణంగా ఒక మంచి భవిషత్తు, జీవితం పాడు చేసినవారవుతారు.ఎందుకంటే అరుణకి వేరే సంబంధం చూసి పెళ్ళి చెయ్యగలరు.కానీ అతని జీవితంలో ఉదయించటనికి ఇంకో అరుణ ముందుకి రాదు.అరుణ లేని అతని భవిషత్తు ఎప్పటికీ సూర్యాస్తమయంలోనే ఉండిపోతుంది. ఆలోచించండి" అని సృజన, కిరణ్‌లు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెల్లాళ్ళకి ప్రకాష్ అరుణతో ఇలా అన్నాడు."నడవలేని నా జీవితం అంధకారంలోనే ముగిసిపోతుందనుకున్నాను.నిరాశతో జీవితం గడపటం కష్టం అని రంగులతో స్నేహం పెంచుకుని, సూర్యుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని ఎప్పటికైనా నడవగలనేమోనని ఆశాకిరణాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నో ఉషోదయాలు ఎదురుచూశాను.కానీ నా జీవితంలో 'అరుణోదయం' అవుతుందని ఊహించలేదు.కాళ్ళిఉ లేకపోయినా నిన్ను నా గుండెల్లో కొలువుంచుకుంటాను" అని అరుణని దగ్గరకు తీసుకున్నాడు. "కాళ్ళు లేవని ఇంకెప్పుడూ అనుకోవద్దు ప్రకాష్. నా కాళ్ళతో మిమ్మల్ని నడిపిస్తాను.ఈ ఒక్క ప్రదేశంలోనే కాదు,ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలలో సూర్యోదయాల్ని చూపిస్తాను.మరి ప్రస్తుతం సూర్యాస్తమయం అయి చాలాసేపయింది. ఇప్పుడు మనం నిద్రపోతే కదా రేపు ప్రొద్దున్నే కొత్త సూర్యోదయాన్ని చూడగలిగేది" అంటూ లేత అరుణకిరణాల ఎరుపు రంగు తన చెక్కిట చేరుకోగా సిగ్గుతో అతని గుండెల మీద వాలిపోయింది అరుణ.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)