యుగళం: బ్రాండు మేళం

-- మృణాళిని

డా// మృణాళిని గారు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేస్తూ, రేడియో స్పందనలో ప్రోగ్రాం డైరెక్టర్ గా చేస్తుంటారు. 7 పుస్తకాలను రచించడమేకాకూండ ఆమె వెయ్యి పైగా టి.వి. కార్యక్రమాలను నిర్వహించారు. హాస్యం ఆమె ప్రత్యేకం. ఆమె కూతురు జర్నలిస్ట్ గా చేస్తున్నారు. కుమారుడు ఇంజినీరింగ్ చేస్తున్నారు.

అవధూత ఏదో బొమ్మ గీయటానికి ప్రయత్నిస్తున్నాడు. మెరుగులు దిద్ది వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అక్కడ నించుని చూస్తూ పెదవి విరుస్తోంది ఆవని. అవధూతకు కోపం వచ్చింది.

విసుగ్గా బ్రష్ పడేసి లేచి నించున్నాడు. 'ఎలా వేసినా ఆ మూతేమిటి? ఒళ్ళు మండుతోంది. నిన్ను చూస్తే'

'మరేం చెయ్యను? ఎవీ బాగులేవు. అసలు ఎవరిని వేస్తున్నా వు?'

'అదే ఒళ్ళు మండించేది. నేనెవ్వరినీ వేయడం లేదు. ఒక అమ్మాయిని వేస్తున్నాను! '

'అదే నాకు నచ్చంది. ఎవరో ఒకరిని వేయాలి గాని ఏదో ఒక అమ్మాయిని వేయడమేమిటి?

రెండు చేతులూ జోడించాడు అవధూత.

"కాస్త అర్థమయ్యేలా చెప్పు తల్లీ"

ఇదిగో ఆ అమ్మాయి కళ్ళు ఇంకాస్త పెద్దగా ఉండి, పెదవులు వంపు తిరిగివుంటే సావిత్రి అనుకునేవాళ్లం. పన్ను పై పన్ను ఉండి, రెండు జళ్ళు వేసి వుంటే జమున అనుకునేవాళ్లం , కళ్ళు తూలిపోతూంటే జయలలిత అమ్మ సంధ్య అనుకునేవాళ్లం. నవ్వే సింగారంగా ఉంటే మాధురీ దీక్షిత్ అనుకునేవాళ్లం '

"అరే! యెవరైనా ఎందుకవ్వాలి ఆవిడ? ఆమె కేవలం అవధూత అమ్మాయి!' అంతే ఆవని నిట్టూర్చింది.

'ఎమిటీ నీ బ్రాండ్ వాల్యూ'?

నేనా? బ్రాండా? నేనేమన్నా సిగెరెట్టుననుకున్నావా? కోపంగా అన్నాడు అవధూత.

'చార్మినార్ సిగెరెట్టుకున్న వాల్యూ నీకుందా? కరోడ్ పతిలో అడుగు ఎవరినైనా! చార్మినార్ సిగెరెట్టు ఫాక్టరీ ఎక్కడ కనిపిస్తుంది మీకు అని! హైదరాబాద్ అని చెప్పి, లక్ష అరవై వేలు కొట్టెస్తారు. అదే అవధూత ఎక్కడ కనిపిస్తాడు అంటే ఎవరైనా చెప్పగలరా? నేను తప్ప. అదీ బ్రాండ్ అంటే.

'అంటే నేను ఓ సిగెరెట్టు కంటే కనాకష్టం అంటావు '

నువ్వే కాదు నువ్వు గీసిన ఆ అమ్మాయి కూడా అంతే. ఆపిల్ల ఎవరిలా ఉంటుందో చెప్పుకోగలరా ఎవరైనా?'

'ఎవరిలాగ అయినా ఎందుకుండాలి అందంగా ఉందా లేదా? అని చూడాలి గానీ

సో అందంగా ఉంటే?

నువ్వు షాపుకెళ్ళి ఏదైనా వాచీ కావాలి అంటావా? రోలెక్సు ఉందా? అంటావు. జీన్ సు కావాలంటే ఏమడుగుతావు? లివైసు ఉందా లేదా అంటావు గానీ ...

అసలు అంతదాకా ఎందుకు? ఓమధ్య తరగతి గృహిణి కిరాణా కొట్టుకు వెళ్తే గోధుమ పిండి కావాలి అని అంటుందా? అన్నఫూర్ణ ఆటా ఉందా? అంటుంది గానీ. అని అవధూత అన్నాడు బుర్రగోక్కుంటూ.

నిజమే మొన్ననే కూలింగ్ గ్లాసెస్ కోసం వెళ్ళి రేబాన్ లేవంటే ఒక షాపు నుంచి బయటకు వచ్చేసా '

'మరదే నువ్వేమో రేబాన్ వేసుకోవాలి పాపం ఆ కళాపోషకులేమో ఎవరో ఒక అందమైన అమ్మాయి బొమ్మతో సరిపెట్టుకోవాలేం?

అయితే ఇప్పుడేంటంటావు? ఐశ్వర్యారాయ్ బొమ్మ వేయాలా?'

'వద్దులే. పెద్దవారింటి కోడలైపోయింది. ఇంక ఆమె బొమ్మలు వేయటం బచ్చన్ బ్రాండుకు పరువు తక్కువ.'

'అయితే ప్రీతీజింటా వేస్తా '

'వద్దులే. కొట్టినా కొడుతుంది. అసలే ముక్కు సూటిమనిషి.

'ముక్కు సూటి బ్రాండ్ వేస్తున్నానని చెప్తా.'

'ప్రీతి ముక్కు బ్రాండ్ కాదు. ఆమె సొట్టబుగ్గలు బ్రాండ్ అయితే కావచ్చు.'

పోనీ బాపూ బొమ్మ వేస్తా.'

'బాపూ బొమ్మ! నువ్వు వేస్తే అది గీపూ బొమ్మ అయిపోతుంది. వద్దులే తెలుగువాడివి, తెలుగు పరువు తీయకు.

అవధూత నుదురు కొట్టుకున్నాడు. 'ఇంతకూ ఏమిటంటావు?

'ఏమీ అనను అమ్మాయిలయితే ఏదో సినిమా తారల్లా ఉండాలి కనక వెయ్యకు. ఎవ్వరూ చూడరు.

'అయితే ప్రకృతి దృశ్యాలు వేస్తా ' ఉత్సాహంగా అన్నాడు. ఆవని మెచ్చుకోలుగా చూసింది.

'అరే నీకు నిజంగా లాండ్ స్కేప్ వేయడంవచ్చా? స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, పారిస్, నార్వే, సింగపూర్...వీటిలో ఏది వచ్చు?.