తెలుగు తేజో మూర్తులు - గణిత రత్నాకర కొమరవోలు చంద్రశేఖరన్

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

భారత దేశ గణిత శాస్త్ర రంగానికీ, సంస్థాగత పరిశోధనలకు, అభివృద్దికి పునాది వేసి, ప్రపంచంలోనే అత్యున్నత గణితశాస్త్ర సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్ధి అనేక అగ్రశ్రేణి గణితజ్ఞులను తన శిష్య, ప్రశిష్య రూపేణా లోకానికి అంధించిన మహానుభావుడు, గణిత శాస్త్ర విజ్ఞాన తేజో మూర్తి, తెలుగు గడ్డ మీద పుట్టిన వాడూ, కొమరవోలు చంద్రశేఖరన్. 1920 లో కృష్ణా జిల్లా లోని మచలిపట్ణంలో శారదా, లక్ష్మినారయణరావు దంపతులకు జన్మించిన కొమరవోలు చంద్రశేఖరన్, గుంటూర్ జిల్లా (ఆంధ్ర ప్రదేశ్) బోర్డ్ ఉన్నత పాఠశాలలో చదివి, చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి డాక్టరేటు పట్టభద్రులైనారు.

శ్రీనివాసా రామానుజన్ కేంబ్రిడ్జి సహచరుడు, నాటి గణితజ్ఞులలో మేటి కే ఆనంద రావు శిష్యుడు కొమరవోలు చంద్రశేఖరన్. అమెరికాలోని, ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని, మార్షల్ స్టోన్, అనే గణిత అచార్యుడు చెన్నై సందర్సించిన్నప్పుడు (1944 సంవత్సరంలో), కొమరవోలు చంద్రశేఖరన్ లో ఇమిడి ఉన్న ప్రతిభను, సామర్ధ్యాన్ని గుర్తించి అమెరికా రావలసినదిగా కోరాడు. మార్షల్ స్టోన్ నిమంత్రణా, ప్రోత్సాహంతో ప్రఖ్యాత ప్రిన్స్టన్ విశ్వవిద్యలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ (ఐ యే ఎస్)లో చేరారు చంద్రశేఖరన్.

వీల్, బొరెల్ సరసన చంద్రశేఖరన్:

గణిత శాస్త్ర రంగంలో నిష్ణాతులైన అండ్రె వీల్, బొరెల్ సరసన చంద్రశేఖరన్ చేరారు. అనేక గణిత శాస్త్ర ముఖ్య అంశాలపై పరిశోధనలు జరిపి వ్యాసాలు (పేపెర్స్) వెలువడించారు.

ఈ తరుణంలో కొమరవోలు ప్రతిభ, నిర్వహణా శక్తి, కార్య నైపుణ్యం, సామర్ధ్యం, దీక్ష, దక్షతలు, యోగ్యత, క్రియశీలక శక్తి హోమి బాబాని ఆకట్టుకున్నాయి. ఐ యే ఎస్, ప్రిన్స్టన్, అమెరికా నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టి ఐ ఎఫ్ ఆర్) కు వచ్చి గణిత విభాగానికి సారధ్యం వహించాలని కోరారు. కొమరవోలు శిరసావహించి, గణిత విభాగం స్థాపించారు. ఇది భారత దేశ గణిత చరిత్రలోనే ఒక మైలు రాయి.

టి ఐ ఎఫ్ ఆర్ లో గణిత విభాగ స్థాపన:

ఇది గణితశాస్త్ర రంగ ఇతిహాసం లో మధుర సంఘటన. భారత దేశంలో గణితశాస్త్ర వికాసానికి అంకురార్పరణం జరిగింది. ఉన్నతమైన ప్రమాణాలు, విలువలను నెలకొల్పి, సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమస్యలకు ఉపాయాలు కనిపెడుతూ, అంతర్జాతీయ స్థాయి గణితశాస్త్ర మేధావులను రూపుదిద్దే సంస్థగా, గణితశాస్త్ర ఉత్కర్షకై పాటుపడుతూ, ప్రతీ భరతీయుడు గర్వించ తగ్గ రీతిలో తీర్చిదిద్ధారు ఈ సంస్థని. ఒక తెలుగు వాడు ఈ రంగంలో ఇంత సేవ చేయడం ఎంతో గర్వించ తగ్గ విషయం.

హేమా హేమీలు, ఈ తరం గణిత రంగ అగ్రగామి గణితశాస్త్రవేత్తలైన ఎం ఎస్ రఘునాథన్, అచర్య నరసింహన్, కే రామచంద్ర, సీ ఎస్ శేషాద్రి ఈ అత్త్యున్నతమైన సంస్థ నుండి రూపొందిన వారే. ఆర్ పార్థసారధి, పటౌడి, ఎస్ రమణన్ కొమరవోలు గారి ప్రశిష్యులే (ఎం ఎస్ నరసింహన్ శిష్యులును) వీరందరూ ఈ అతి విశిష్ట గణిత సంస్థ నుండి రూపొందిన వారే.

చేసిన పనులు, సాదించిన విజయాలు, అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించడం:

దాదాపు ఇరవై నాలుగు యేళ్ళు ఐ ఎం యు (అంతర్జాతీయ గణితశాస్త్ర సమాఖ్య) కార్య నిర్వాహక సభ్యుడిగా ఉన్నారు, వివిధ హోదాలలో వ్యవహరించారు. 1955-61 వరకు ఈ సంస్థ కార్యనిర్వాహక సభ్యుడిగా వుండి, తరువాత కార్యదర్శిగా వ్యవహరించారు. 1971-74 లో ఐ ఎం యు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇట్టి పేరొందిన అంతర్జాతీయ సంస్థలకు యెంపికైన భారతీయులు చాలా తక్కువ.

1959 లో భారత ప్రభుత్వం కొమరవోలు చంద్రశేఖరానికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 1963 లో శాంతిశ్వరూప్ భట్నాగర్ అవార్డు, 1966 లో రామానుజన్ పతకం లభించాయి.

భారతీయ గణిత మండలి [ఈండియన్ మేథమేటికల్ సొసైటి] పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించి, ఆ నాటి ప్రముఖులచేత విభిన్న అధునాతనమైన గణితశాస్త్ర విషయాలమీద వ్రాయించి ప్రచురించారు. అలా గణిత శాస్త్ర అభివృద్ధికి తోడ్పడ్డారు.

వీరు అధిరోహించిన కొన్ని శిఖరాలు:

  • - ఆస్ట్రియన్ ఎకాడమి ఆఫ్ సైన్సెస్ గౌరవ సభ్యుడిగా ఉన్నారు.
  • - అంతర్జాతీయ వైజ్ఞానిక పరిషత్తుల కూటమి [ఇంటర్నేష్నల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యునియన్స్] (1963-66) కి ఉపాధ్యషుడిగా ఉండి, 1966-70 వరకు అధినేతగా రథసారధ్యం వహించారు.
  • - 1961 నుండి 1966 వరకు భారత ప్రభుత్వ శాస్త్ర సమాఖ్య (సైంటిఫిక్ కౌన్సిల్) సభ్యుడిగా ఉన్నారు. 1965 - 1987 వరకు జూరిచ్ లోని ఈ పి ఎఫ్ సంస్థలో గణిత అచార్యుడిగా ఉన్నారు.

శ్రీనివాస రామానుజన్ గ్రంధాలు వెలుగులోకి:

1957 లో టి ఐ ఎఫ్ ఆర్ ద్వరా "నోట్ బుక్స్ ఆఫ్ శ్రీనివసా రామానుజన్" ప్రచురించి ఆ ఉపజ్ఞుడు రచించిన గ్రంధాలను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఈ ప్రచురణలు అఖండుడైన రామానుజన్ గణితశాస్త్రంలో కనపరచిన కౌసలం నలుగురికి తెలియడానికి దోహద పడింది. తపనా, జిజ్ఞాసలతో పాటు చిత్తశుద్ధి ఉంటేకాని ఇలాటి పనులు సంపూర్ణం కావుమరి!

కొమరవోలు గణిత గ్రంధాలు:

కొమరవోలు రచనలు గణితశాస్త్రంలో ఆణి ముత్యాలే. ఈయన రాసిన కొన్ని పుస్తకాలు ఫ్రెంచ్, జపనీస్, తదితర అంతర్జతీయ భాషలలోకి అనువదించబడ్డాయి.

  • - దీర్ఘవర్తుల ప్రమీయాత్మకం (ఎల్లిప్టిక్ ఫంక్షన్స్)
  • - ఇంట్రడక్షన్ టు అనెలిటికల్ నంబర్ థీరీ
  • - క్లాసికల్ ఫూరియర్ ట్రాన్స్ఫార్మ్

తన వంతు పని చేశిన కొమరవోలు చంద్రశేఖరన్ హోమి బాబా, టాటా ఆసించిన ఫలితాలు అందించారు. నేటికి ఆయన స్థాపించిన టి ఐ ఎఫ్ ఆర్ గణితశాస్త్ర సంస్థ ప్రపంచంలోనే ఒక మహోన్నత స్థానాన్ని సంపాయించుకుంది. ఈ సంస్థ నుండి అత్యున్నత ప్రమాణాలుగల గణిత శాస్త్రవేత్తలు రూపొందేరు, ఇంకా రూపొందుతున్నారు. భారతావనిని రతావనిని గణితశాస్త్ర రంగంలో అంత్యంత క్రియాశీలక దేశంగా తయారు చేయడానికి కారకులైయారు.