సిన్నోడు

- - విన్నకోట సుశీలాదేవి

"అమ్మా! అయ్యా! నేను ఏడవక్లాసు స్కూలుకంతా ఫస్టున పాసయ్యాను," అంటూ అమ్మానాన్నలతో తన విజయాన్ని గూర్చి చెప్పాలని ఆశగా పరుగెట్టుకొచ్చాడు చిన్నోడు అనబడే నారాయణ.

కాని తీరా ఇంటికొచ్చేసరికి వాడికి చెప్పరాని నిరాశ ఎదురైంది. ఇంటి తలుపుకి గొళ్ళెం పెట్టి ఉంది.

"అమ్మా అయ్యా ఏమయ్యారో" అని ఆలోచించాడు. "అయ్య అన్నను తీసుకుని ఆటకు పోయిండేమో. మరి అమ్మ ఇంట్లోనే ఉండాలి కదా, ఎక్కడికెళ్ళిందబ్బా" అనుకుంటూ వెనుదిరిగాడు. మెల్లిగా నడుచుకుంటూ రోడ్డుమీది కొచ్చాడు.

సెవెన్తు క్లాసు పాసయిన వాళ్ళ లిస్టు స్కూల్లో కడతారని మాస్టారు నిన్న కనబడి చెప్పినప్పటినుండీ తన పరీక్ష ఏమవుతుందోనని భయపడ్డాడు. ఇవ్వాళ్ళ స్కూలుకెళ్ళగానే తన క్లాసు పిల్లలందరూ తనను చుట్టుముట్టి "స్కూలుకే ఫస్టొచ్చావురా!" అన్నారు. అది విని తనెంతో సంతోషించాడు. లిస్టు చూసి పొంగిపోయాడు. మాస్టర్లు కూడా తనని ఎంతో పొగిడారు. ముఖ్యంగా తమకు లెక్కలు చెప్పిన సత్యం మాస్టారు తనని పొగడ్తల్తో ముంచెత్తారు. "నాకు తెలుసురా నారాయణా! నువ్వు ఫస్టొస్తావని. నువ్విలాగే చదివితే కలెక్టరువైపోతావు" అన్నారు. నారాయణ సంతోషంతో ఉప్పొంగిపోయాడు.

ఆయనకు తనంటే ఇష్టం. ఎప్పుడూ తనని బాగా చదవమని ప్రోత్సహిస్తారు. ఆయన ప్రోత్సాహం వల్లనే తను బాగా చదివి ఫస్టున పాసయ్యాడు. ఇంకా బాగా చదివి మాస్టారు అన్నట్లుగా తను కలెక్టరయిపోవాలి అనుకున్నాడు నారాయణ.

ఆలోచిస్తూనే నారాయణ జంక్షన్ కొచ్చాడు. అక్కడ పెద్ద గుంపు కనబడింది. "ఏమిటో అక్కడ వింత" అని గుంపుని తీసుకుని ముందుకు వెళ్ళాడు నారాయణ.

ఆ గుంపు మధ్యలో నారాయణ కెదురైన దృశ్యం...

******** ********* ********* **********

వీరయ్య రోడ్డుకి ఒక ప్రక్కగా కూర్చుని గోనెపట్టా పరిచాడు. దానిమీద తన సంచీలోనుండి రకరకాల సామాన్లు తీసి పరిచాడు. తర్వాత డప్పు వాయిస్తూ పాట అందుకున్నాడు. క్రమంగా జనం పోగవసాగారు. జనం ఎక్కువయ్యాక పాట ఆపి -

"ఒరేయ్ పెద్దాడా! రా!" అంటూ పిలిచాడు.

రోడ్డు ప్రక్కగా కూర్చున్న పెద్దాడు అనబడే పన్నెండేళ్ళ కుర్రాడు లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు.

పగటి వేళ పదకొండు దాటింది. వేసవి కాలం అవడం వలన అప్పటికే ఎండ తీక్ష్ణంగా ఉంది.

ఆ పిల్లాడికి వయసు పన్నెండేళ్ళయినా సన్నగా ఎముకల గూడులాటి శరీరంతో ఏడెనిమిదేళ్ళ పిల్లాడిలా వుంటాడు. కాని వాడు గెడెక్కాడంటే రబ్బరులా సాగుతాడు. వాడి శరీరం కాల్చిన చువ్వలా ఎలా కావాలంటే అలా వంగుతుంది.

"రారా! ఏటా నడక!" అన్నాడు వీరయ్య విసుక్కుంటూ. పెద్దాడు వచ్చి తండ్రి ముందు నిలబడ్డాడు.

"ఏట్రా ఆ సూపు? గెడెక్కు!" అన్నాడు వీరయ్య. ఇవాళ్ళ పెద్దాడికి గెడెక్కి ఆడాలని లేదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. జొరం కాసిందేమో - ఆ మాట నిన్నటినుండీ ఎన్నిసార్లనుకున్నాడో. కాని అది ఆకలిజ్వరమని వాడికి తెలీదు. కాని తనకు జొరమని తెలిస్తే అమ్మ ఇచ్చే ఆ గంజినీళ్ళు కూడా ఇవ్వడం మానేస్తుంది. అన్ని జబ్బులకూ లంఖణం పరమౌషధం అన్నదే ఆమె సిద్ధాంతం, కాని పెద్దాడికి అదే ఇష్టం ఉండదు.

"అన్నం తిని ఎన్నాళ్ళయిందో! కమ్మగా కడుపునిండా కూడు తింటే ఎంత బాగుంటాదో" అనుకుంటాడు.

"గంజి నీల్లు కూడా లేకపోతే ఎలా? ఆకలెయ్యదూ!" అందుకే తనకి జొరమని ఎవ్వరితోనూ చెప్పలేదు.

"ఏంటయ్యా ఆలస్యం? ఆట మొదలెట్టూ!" అంటారెవరో జనంలోనుండి. వీరయ్య కంగారు పడుతూ "గెడెక్కురా" అంటూ కొడుకుని తొందర పెడతాడు.

నేలకి ఎంతో ఎత్తుగా

ఆకాశానికి చేరువగా

పెద్దాడికి అలాగే ఎప్పుడూ పైనే వుండి పోవాలనిపిస్తుంది. అక్కడినుండి చూస్తోంటే ఈ లోకం ఎంతో అందంగా కంపిస్తుంది. ఎత్తయిన మేడలు. రంగుల ప్రపంచం
నల్లటి తారు రోడ్లు. వాటిపైన గాజుపూసల్లా దొర్లిపోయే వాహనాలు. రోడ్డు పక్క గాజు అద్దాల్లోంచి రకరకాల పదార్థాలు నోరూరిస్తూ - వుంటాయి. ప్రక్కగా సోడా "కయ్" మంటూ మోగింది. పెద్దాడికి నోరూరింది - కనీసం సోడా అయినా తాగితే బాగుణ్ణు - కానీ ఎలా? అనుకున్నాడు పెద్దాడు నిరాశగా.

వీరయ్య కర్ర గుండ్రంగా తిప్పుతున్నాడు. పెద్దాడు దాన్ని బట్టి తనూ తిరుగుతున్నాడు. కాని చెమట.. దాహం .. ఆకలితో - అతని చేతులు పట్టు తప్పేలా వున్నాయి. భయంతో గట్టిగా కర్రని పట్టుకున్నాడు. అయ్య ఆట ఆపితే బాగుణ్ణు - అనుకుంటున్నాడు పెద్దాడు.

క్రింద వీరయ్య ఆలోచనలు వేరుగా వున్నాయి.

"ఇయ్యాల శానా జనం వచ్చారు. పైసలు బాగా పడ్తాయి. కాని పెద్దోడు ఆట సెడగొడుతున్నాడు. ఈడు బాగా ఆడితే బాగుణ్ణు" అనుకుంటున్నాడు వీరయ్య.

పెద్దాడు పైన కర్రపై కోతిలా కూర్చుని చుట్టూ చూశ్తున్నాడు. అప్పుడే స్కూలు వదిలి పెట్టినట్టున్నారు. తెల్లటి స్కూలు డ్రెస్సు వేసుకున్న పిల్లలు విచ్చిన పక్షుల్లా పకపకలాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చూడగానే పెద్దాడి ముఖం వెలిగిపోయింది.

"నేనూ సిన్నోడూ ఇలా బట్టలేసుకుని పుత్తకాలు పట్టుకుని బడికి పోతాంటే యెంత హాయిగా వుంటుందో." ఈ పాడు ఆట ఆడ్డం తనకు బొత్తిగా ఇష్టం లేదు. కానీ ఆడనంటే అయ్య వూర్కోడు గదా. పైసలెలా వత్తయ్యంటాడు. ఏవైనా సరే, తనూ బడికెళ్ళాలి. అవును. తనిక అస్సలీ ఆట ఆడడు.

"పెద్దాడా!" వీరయ్య పిలిచాడు.

పెద్దాడు కిందికి చూశాడు.

వీరయ్య చేతిలో తిరుగుతున్న కర్రతోపాటు పెద్దాడి కళ్ళు తిరగసాగాయి. హఠాత్తుగా వాడికి ప్రపంచం క్షణకాలం శూన్యమై పోయింది. కళ్ళముందు అనంతమైన చీకటి.

వాడి ఒళ్ళు తూలింది.వీరయ్య చేతిలోని కర్ర అదుపు తప్పింది.

పెద్దాడి శరీరం భూమిని తాకింది. వాడి శరీరంలో వున్న కొద్దిపాటి రక్తంతో నేల తడిసి ఎర్రబడింది.

******** ********* ********* **********

రాత్రి ఎనిమిది గంటల సమయం.

చల్లటిగాలి రివ్వున వీస్తోంది.

పగలంతా ఎండకి వేడెక్కిన వాతావరణం రాత్రివేళ గాలిలోని శైతల్యానికి చల్లబడుతోంది.

వెలుగు వెనక చీకటిలా .. సుఖాల వెనుక కష్టాల్లా .. ఆకాశాన్ని తాకే మేడల ప్రక్కనే నేలపై బురదలో .. గుడిసెలు. ఆ గుడిసెల ప్రక్కన మురికి గుంటలు. వాటిల్లో లుకలుకలాడే పురుగుల్లా ఆ గుడిసెల్లో మనుషులు. అక్కడివాళ్ళ ముఖాల్లో చీకటి తప్ప కాంతి వుండదు. వాళ్ళ శరీరాల్లో ఎముకలు తప్ప మాంసం వుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ నడిచే శవాలు.

ఆ రోజు పౌర్ణమి.

మనిషికున్న స్వార్థం వెన్నెలకి లేదు. అందుకే ఎత్తయిన మేడల పైనా, ప్రక్కనే ఉన్న గుడిసెల పైనా ఒకేలా వెన్నెల పకపకలాడుతోంది.

ఆ వీధుల్లో కరెంటు స్తంభాలున్నాయి కాని దీపాలు వెలగవు. అడిగేవారు లేరు. అడిగినా లైట్లు వేసేటంత విశాల హృదయం ఆ పట్టణంలోని ఏ అధికారికీ లేదు. మిగతా రోజుల్లో చీకటి. కాటుక లాంటి కారు చీకటి ఇంటా బయటా బాధిస్తుండేది.

ఆ వీధెంబడి వీరయ్య ఇంటి వేపు నడుస్తున్నాడు.

మాటి మాటికీ జేబులో డబ్బు తడిమి చూసుకుంటున్నాడు.

ఇదివరకైతే ఆటకి కాసిని డబ్బులొచ్చిన రోజున అతని కాళ్ళు అతనికి తెలీకుండానే సారాకొట్టు వేపు దారితీసేవి. కాని ఇవ్వాళ్ళ వీరయ్యకి తాగాలని లేదు. జేబుని ఉబ్బిస్తున్న డబ్బు సారాకన్నా మత్తు నిస్తోంది. ఇంటికెళ్ళి ఈ డబ్బుని పెళ్ళానికి చూపాలని ఆరాటపడ్తున్నాడు.

ఈ రోజు మామూలుగా ఆటకొచ్చే డబ్బు కాకుండా కొడుకు క్రింద పడి చావడంతో ప్రజలకు సానుభూతి పుట్టుకొచ్చింది.

"ప్చ్! పాపం కడుపు తిప్పల కోసం బంగారంలాంటి కొడుకుని పోగొట్టుకున్నాడు. దురదృష్టవంతుడు. శవాన్ని దహనం చేయడానికైనా కావాలిగా, తీసుకో!" అంటూ చుట్టూ ఉన్న ప్రజలు విశాల హృదయంతో దానం చేశారు.

కొడుకు రక్తపు మడుగులో కాస్సేపు కొట్టుకుని నిర్జీవమవడం చూసి వీరయ్య దుఖంతో బావురుమన్నాడు. కాని చుట్టూ ఉన్న వాళ్ళు పెద్దాడి శవం మీద విసిరేసిన డబ్బులు చూసేసరికి అతని దుఖం తగ్గింది. డబ్బులన్నీ ఏరుకుని కొడుకుని బుజం మీద వేసుకోబోయే సరికి బిలబిలమంటూ నలుగురు వ్యక్తులు వచ్చారు.

"అయ్యో, ఎంత పని జరిగింది! పిల్లాడిని ఇటివ్వు. మేం దహనం చేస్తాం. నీకెందుకు డబ్బు దండగ!" అన్నారు వాళ్ళు.

"వద్దు బాబూ, మీకెందుకా కట్టం" అనబోయాడు వీరయ్య.

అతని గుప్పిట్లో ప్రత్యక్షమైన ఐదు పచ్చనోట్లు అతని నోరు మూసేశాయి.

"నీకు తెలీదులే. మా డ్యూటీయే యిది." పెద్దాడి శవాన్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.

ఐదు వందలు! వీరయ్య జన్మలో ఎప్పుడూ అంత డబ్బు ఒక్కసారి తన చేతిలో పట్టుకుని ఎరగడు. అతని మనసులో ఇదివరకటి దుఖం స్థానంలో చిన్న ఆనందం తలెత్తింది. వాళ్ళు శవాల వ్యాపారం చేసేవాళ్ళని అతనికి తెలీదు. తన కొడుకు శవం ఐదొందల పెట్టుబడిని కొన్ని వేలుగా వృద్ధిచెందించే వ్యాపారసాధనమని అతను ఊహించను కూడా లేదు.

******** ********* ********* **********

తడిక తోసుకుని గుడిసె లోపలికి అడుగు పెట్టాడు వీరయ్య.

ఇల్లంతా పొగతో నిండిపోయి వుంది. లోపల వీరయ్య పెళ్ళాం ఆదెమ్మ పొయ్యిముందు కూర్చుని మండని కట్టెల్తో అవస్తపడుతోంది.

"అబ్బ. ఏటే ఈ పొగ!" వుక్కిరిబిక్కిరవుతూ అడిగాడు వీరయ్య.

"వచ్చావూ? నీకేం తినడానికి వస్తావు. నేనిక్కడ ఈ పుల్లలతో సస్తన్నా. ఆ! ఇంతకీ సరుకులేమైనా తెచ్చావా? వొచ్చిందంతా ఆ సారాకొట్టుకే ఇచ్చేశావా? అంటూ చేతులు తిప్పుతూ అరవసాగింది.

"ఆపవే పురానం. ఇదుగో ఇలా సూడు!" అంటూ బుజానికున్న సంచీ లోనుండి ఒక్కొక్కటీ బయట పెట్టసాగాడు.

"నూకలు కాదే. బియ్యం .. బియ్యం తెచ్చా. ఇవిగో సేపలు. ఆ, ఇవిగో నీకూ సిన్నోడికీ మిటాయిలు." అవన్నీ చూడగానే ఆదెమ్మ సంతోషంతో పొంగిపోయింది. "ఎక్కడిదయ్యా ఇంత డబ్బు?"

"సంపాయిచ్చాలేవే. ముందర సేపల పులుసెట్టు. కారం మెతుకులు, గంజి నీల్లు తిని తాగి నోరు సచ్చిపోయింది" అంటూ నులక మంచం మీద పడుకుని పొట్లం విప్పి పకోడీలు ఒక్కొక్కటే తినసాగాడు.

"అబ్బ. సేపల పులుసేసుకుని అన్నం తిని సుట్టకాల్సుకుంటే .. సొరగం కనబడుతుందే. బేగి కానీ. ఆకలి మండిపోతుంది."

ఆదెమ్మ హుషారుగా లేచి వంట మొదలెట్టింది. మరో అరగంటలో అన్నం ముందు కూర్చున్నాడు వీరయ్య.

"సిన్నోడేడీ?" అడిగాడు వీరయ్య.

"సిన్నోడా!" అని పిలిచింది ఆదెమ్మ.

మూలనించి నారాయణ లేచొచ్చి కంచం ముందు కూర్చున్నాడు కానీ వాడికి నోటమాట రావడంలేదు.

దుఖంతో బాధతో వాడి గొంతు పూడుకు పోయింది.

మరో కంచంలో అన్నం పెట్టి సేపల పులుసేసి,

"పెద్దోడా" అని పిలిచింది ఆదెమ్మ.

"అన్న ... రాలేదమ్మా!" వణికి పోయింది నారాయణ కంఠం.

"రాలేదా? ఏవయాడయ్యా?" అనడిగింది మొగుణ్ణి. అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్న వీరయ్యకి పొలమారింది. గ్లాసు నీళ్ళు గటగటా తాగేశాడు.

"ఏడయ్యా ఆడు?" రెట్టించింది ఆదెమ్మ. వీరయ్యకి చెప్పక తప్పలేదు.

"ఆడు లేడే. మద్దేనం ఆడుతూ గెడమీంచి పడ్డాడు." "పడితే?"

"పడితే ఏటి? నీ అబ్బ దగ్గిరికెల్నాడు. నాకింకాస్త పులుసెయ్యి!" అన్నాడు వీరయ్య.

ఆదెమ్మ ఆ మాట వినగానే పెద్దపెట్టున శోకాలు పెట్టసాగింది. నారాయణలో అంతవరకూ ఆపుకున్న దుఖం కట్టలు తెంచుకుంది. బిగ్గరగా ఏడవసాగాడు.

"ఓరి నా కొడకా! నీకప్పుడే నూరేల్లు నిండిపోయినాయా?" అంటూ గుండెలు బాదుకుంటూ ఏడవ సాగింది ఆదెమ్మ.

"ఏయ్! ఊరుకుంటావా లేదా? ఏడిసావంటే కర్రెట్టి బాది సంపుతా. ఇదేవన్నా మనకు కొత్తా? మా అయ్య ఇలాగే పోయాడు. నీ అన్న ఇలాగే సచ్చాడు. ఏం సేత్తాం? కడుపులోకి తిండి రావల్నంటే మనం ఆడాల, సావాల!" అన్నాడు వీరయ్య ఎంతో నిర్లిప్తంగా.

"అయినా ఏది శాస్సతమే? అంతా బెమ!" అన్నాడు పరమ వేదాంత ధోరణిలో.

ఆదెమ్మ కుళ్ళికుళ్ళి ఏడుస్తోంది.

"ఏడుపు ఆపకపోతే సంపుతా. నిన్ను సూసి సిన్నోడు కూడ ఏడుస్తున్నాడు." అన్నాడు వీరయ్య ఈ సారి కోపంగా.

మొగుడు కర్ర కోసం కోపంగా లేవడం చూసి ఆదెమ్మ తన నోరు నొక్కేసుకుని నారాయణ నోరుకూడా మూసేసింది.

దుఖం మెల్లగా తగ్గు మొహం పట్టి ఆ చోటులో ఒక భయం మొదలైంది ఆదెమ్మ గుండెలో?

రేపణ్ణించీ తిండెలాగ? ఇన్నాళ్ళూ పెద్దోడు గడెక్కి ఆడితేనే కలో గంజో తాగగలుగుతున్నాం అందరం. వాడు చచ్చాడు. ఇక తాము కూడా తిండికి మొహం వాచి చావాల్సిందేనా!

ఆదెమ్మ తన భయాన్ని మెల్లగా మొగుడి ముందు బయటపెట్టింది.

"మరి .. రేపట్నించీ మనకెట్టాగయ్యా?"

"సిన్నోడున్నాడు గదే!" అన్నాడు వీరయ్య. ముగ్గురూ అన్నాలు తిని లేచారు. వీరయ్య గుడిసె బయట తన మంచం వేసుకున్నాడు. వెల్లికిలా పడుకుని చుట్ట కాల్చసాగాడు. ఎన్నోరోజుల తరవాత కడుపునిండా అన్నం తిని చుట్టాకాలుస్తోంటే అతనికి స్వర్గంలో ఉన్నట్లుంది. ఆదెమ్మ చిన్న కొడుకుతోపాటు లోపల గోనెపట్టా పరుచుకుని పడుకుంది. ఆమెకిప్పుడు చచ్చిన పెద్దోడు గుర్తుకి రావడం లేదు. చిన్నోడికి ఆట తెలీదు. సిన్నప్పట్నించీ బడికంటూ పోయేవాడు. ఆడిప్పుడు గెడెక్కి ఆడాల. రేపట్నించీ ఆడు బాగా ఆడగలడో లేదో? డబ్బులొస్తాయా? తాము పస్తులుండాలా? అనుకుంటోంది. ఈ సృష్టిలో ఆకలి ఒక్కటే నిజం. మిగిలినవన్నీ అసత్యాలే.

అన్ని మమతానురాగాలు ఆకలి మంటలకు ఆహుతి కావల్సిందే.

రేపట్నించీ తన వాళ్ళ కడుపు నింపడానికి తను బలిపశువు కాబోతున్నానని తెలుసుకున్న నారాయణ మాత్రం భయంతో వణికి పోతున్నాడు.

"తను అయ్య చెప్పినట్లుగా ఆడకూడదు. అన్నలా చావకూడదు. మాష్టారు చెప్పినట్లు బాగా చదువుకోవాలి. గొప్పోడై పోవాలి."

వాడికి అకస్మాత్తుగా పెద్దోడి గొంతు చెవులో గుసగుసగా వినపడింది.

"నువ్వు బాగా సదువుకో. నాలాగా సావకు!" అంటున్నట్లు తోచింది.

నారాయణ చటుక్కున లేచాడు.

చాలారోజుల తర్వాత కడుపునిండా అన్నం తినడం వలన తల్లీ తండ్రీ గాఢ నిద్ర పోయారు.

లోపలంతా చీకటిగా వుంది.

నారాయణ తడిక తీసుకుని బయట్కొచ్చాడు.

బయట తెల్లని వెన్నెల .. అమృత వర్షం కురిపిస్తోంది.

ఆ వెలుగులో నిర్భయంగా అడుగులు వేస్తూ సత్యం మాష్టారి ఇంటివేపు సాగిపోయాడు నారాయణ అనబడే సిన్నోడు.

"సిన్నోడు" కథకు విశ్లేషణ

పిల్లలు చదువుకోవలసిన చిన్న వయసులో బడికి పంపించకుండా కుటుంబ పోషణకై వారిని శారీరకంగానూ మానసికంగానూ కష్టపెట్టడమన్నది చాలా బాధాకరమైన విషయం. ఎన్నో దిగువ తరగతి కుటుంబాలలో ఇంటిల్లిపాది కడుపునిండా రెండు పూటలా భోజనం చెయ్యడమన్నది గగనకుసుమమే అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలని చదివించాలన్న ఆలోచన వారికి రాకపోవడం ఆశ్చర్యపోవలసిన విషయమేమీ కాదు. చిన్నవయసునించే తమ పిల్లలు పనుల్లో చేరిపోయి అంతో ఇంతో సంపాయించి తేవాలన్న ఆరాటంలో ఉంటారు. వీరయ్య ఆలోచన అందుకు భిన్నం కాదు. మృత్యువాత పడిన పెద్దకొడుకు శవానికై తనకి లభించిన అయిదు పచ్చనోట్లు అమిత ఆనందాన్నిచ్చాయి. మళ్ళీ మర్నాటి నించీ చిన్నకొడుకుని గెడమీద ఆడిస్తానని భార్యతో అనడం ఆ నిర్ణయం అతని అజ్ఞానానికి నిదర్శనం. మంచి తెలివి తేటల్తో చదువులో రాణిస్తున్న చిన్నకొడుకునైనా చదివించుకుందామన్న ఆలోచన రాకపోవడం శోచనీయం. బడికి వెళ్ళి చదువుకోవాలన్న తపనతో ధైర్యం చేసి చిన్నకొడుకు నారాయణ తీసుకున్న నిర్ణయం ఎంతో సమంజసమైనది, సంతోషించదగినది.

- తమిరిశ జానకి