సిలికానాంధ్ర కుటుంబము

సంస్కృతీ సుసంపన్నం :

అఖిల భారత అన్నమాచార్య జయంత్యుత్సవం

సిలికానాంధ్ర గత సంవత్సరం అన్నమాచార్య 598వ జయంతిని అంధ్రప్రదేశ్ లో నలుమూలల అత్యంత వైభవంగా నిర్వహించడం అందరికి విదితమే. అంతకంటే ఎక్కువ స్ఫూర్తితో, 2007 మే, 2వ తేదీ బుధవారం అఖిలభారత స్థాయిలో అన్నమాచార్య 599వ జయంతి మహోత్సవాన్ని అయా ప్రాంతాల్లోని తెలుగు సాహితీ, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నది.

యవ గాయనీగాయకులు, వర్దిష్ణువులు, లబ్దప్రతిష్ఠులు, కళాభిమానులు, మరియూ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గోనే ఈ కార్యక్రమం ఆరోజు ఉదయం 7:30 గంటలకి నగర సంకీర్తనతో ప్రారంభమవుతుంది. అనతరం, 9 గంటలనుండి ప్రధానవేదికపై సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆతర్వాత అన్నమయ్య అష్టోత్తర (108) సంకీర్తనలని గానం చేస్తారు.

ఈ సందర్భంగా సిలికానాంధ్ర ప్రతీ తెలుగువాణ్ణి ఆహ్వానిస్తూ తెలుగులో ప్రప్రథమ వాగ్గేయకారుడైన అన్నమాచార్యునికి ఘన నివాళులు అర్పించమని కోరుకుంటుంది.

వసంతంలో వసుదైక కుటుంబం

ఈ సంవత్సరం కూడా సిలికానాంధ్ర మే 11 శుక్రవారం నుండి మే 13 ఆదివారం వరకు లాహోండా కొండల్లో 'ఆంధ్రకుటుంబ శిబిరం' నిర్వహించటానికి సర్వసన్నధ్దమవుతోంది. ఎల్లప్పుడు పనితో తలమునకలయ్యే సిలికాన్ వేలీ జీవితానికి దూరంగా కోనల్లో మూడురోజుల వనవాసానికి అన్నిరకాల హంగులు దిద్దబడుతున్నాయి. అచ్చ తెలుగు జీవితాన్ని ప్రతిబింబిస్తూ ప్రతిరోజు ఉల్లాసపరిచే క్రీడలు, షడ్రుచుల భోజనాలు, మనోరంజక సంగీత నృత్య నాటక రూపకాలు పకడ్బందీగా రూపొదించబడుతున్నాయి. 400 మందికి పైగా వచ్చే 'వసంతంలో వసుదైక కుటుంబం' సంరంభం మరిన్ని వివరాలకై సిలికానాంధ్ర అంతర్జాలాన్ని సందర్శించండి. నారల దేవేందర్ ను (408-603-7734) సంప్రదించండి.

రాగం, తానం, పల్లవి

ఏప్రిల్ 20వ తేదీన సిలికానాంధ్ర శ్రీ మేడసాని మోహన్ గారి (డైరక్టర్, అన్నమాచార్య ప్రాజెక్ట్, తితిదే) నుండి స్వరపరచటానికి 150 అన్నమాచార్యుని కృతులను స్వీకరించింది. హిమాయత్ నగర్ వెంకటేశ్వర దేవస్థానం పూజారి దీవెనలచే ఇవ్వబడ్డ ఈ ప్రతి కృతిపై తామ్రపత్రానికి సంబంధించిన నెంబరు మరియు నిర్దేశిత రాగం ఇవ్వబడ్డాయి. ఈ మహద్భాగ్యాన్ని ఎంతో అపురూపంగా స్వీకరించిన సిలికానాంధ్ర సకాలంలో స్వరాలను పొందుపరిచి అన్నమయ్య పదాలకు ప్రజాదరణ తేవాలని సంకల్పిస్తోంది.

తెలుగు కథానిలయం

ఏప్రిల్ 20వ తారీఖున సిలికానాంధ్ర హైద్రాబాదులోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో 'కథానిలయం' వెబ్ సైట్ ని ప్రారంభించింది. కారా మాస్టారుగా పేరొందిన శ్రీ కాళీపట్నం రామారావుగారు మొదలెట్టిన 'కథానిలయం' సంస్థతో సన్నిహితంగా పనిచేస్తూ తెలుగులో పేరొందిన కథలను అంతర్జాలం ద్వారా ఎల్లలు తగ్గుతున్న ఈ జగమంత కుటుంబానికి అందిచాలన్నది సిలికానాంధ్ర తాపత్రయం. ఈ ప్రయత్నం ద్వారా గొప్ప కథలు చదువరులకు కొనుక్కోటానికి చేరువలో ఉండడమే కాకుండా ఆయా రచయితలకు కొద్దోగొప్పో ధన రూపేణ సహాయం లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఇప్పుడిప్పుడే చిగురులు తొడుగుతున్న www.kathanilayam.org ని సందర్శించండి.

సంతాపం:

ఏప్రిల్ 13, 2007న నర్సారావుపేట వాస్తవ్యులైన చివుకుల నరసిం హా రావుగారు పరమపదించారు. కీ.శే. నరసిం హారావుగారు సిలికానాంధ్ర క్రియాశీలక సభ్యురాలైన శ్రీమతి సరోజా హరిగారి తండ్రిగారు. గుంటూరు జిల్లా వినుకొండలో పుట్టిన నరసిం హారావుగారికి భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్ళు ఉన్నారు.