రాతివనం - 5వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అనూష భయాలకు తగ్గట్టుగా అక్కడి వాతావరణం ఉండటం ఇంకాస్త అయిష్టతను పెంచుతుంది. ఆమె రూమ్మేటు, కల్పన, చదువు వత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి హాస్టలు పైకెక్కుతుంది. అందుకు వచ్చిన ఆమె తండ్రి, ఆమెను సముదయించక తిట్టడంతో అక్కడే ఉంటానని ఒప్పుకుంటుంది కల్పన. మరోపక్క అనూష తండ్రి, రమణా రవు, తన కొడుకుకు ఎనిమిదో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఎంట్రన్సు కు కోచింగు ఇప్పించేందుక్కు సన్నాహాలు చేస్తుంటాడు. "శాస్త్రి"లో ఎలాగో అప్లికేషను సంపాదిస్తాడు ఆయన. ఆ ఆనందంలో తమ కొడుకు భవిష్యత్తు ఊహించుకుంటూండగా అర్ధరాత్రి ఫోన్ మోగుతుంది. మరో వైపు సూర్యకుమార్ అనే ప్రతిభావంతుడైన హిస్టరీ లెక్చరర్ ఆర్ట్స్ కోర్సులలో విద్యార్థులు తగ్గిపోతుమటం చూసి మధనపడుత్ అటువైపు ఆసక్తి కలిగించేలా పోటీలు నిర్వహిస్తుంటాడు. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, సూర్య కుమార్ ఆమెను చూసి ముచ్చటపడతాడు. తనకు పోటీగా అనూష లేనందుకు బాధపడుతుంది మధుమిత.

"అనూషకు రెండురోజులనుంచీ జ్వరం. మీరొచ్చి అమ్మాయిని ఇంటికి పిల్చుకెళ్ళండి" వార్డెన్ మాటలకు కొద్దిగా కుదుట పడ్డాడు. రమణారావు

అర్థరాత్రి ఫోనొస్తే అనవసరమైన భయాలన్నీ కలిగి కంగారు పడ్డాడు. జ్వరమేగా.. జ్వరానికే ఫోన్ చేస్తారా? మరలా భయం.. ఏం జ్వరమో.. మామూలు జ్వరమేనా.. పిల్లకెలా ఉందో... సీరియస్ గా ఉంటేనే ఫొన్ చేసారేమో..

"మామూలు జ్వరమేనా" ఆపుకోలేక అడిగేశాడు

" హై టెంపరేచర్ ఉందండీ. మా రెసిడెంట్ డాక్టర్ ఇచ్చిన మందులకు తగ్గలేదు. అందుకే మీకు ఇన్ ఫాం చేస్తున్నాము. తొందరగా వచ్చి పిల్చుకెళ్ళండి."

"సరేనండీ. నేనొచ్చేవరకు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్" అలా అంటున్నప్పుడు అతనికి కన్నీళ్ళు వచ్చాయి.

పిచ్చిపిల్ల.. అమ్మా నాన్న. తమ్ముడు.. ఇల్లు తప్ప ప్రపంచం తెలీని అమాయకురాలు. జ్వరంతో ఎన్ని కస్టాలు పడ్తుందో.. ఇంట్లో ఉండి ఉంటే వేడినీళ్ళు కాచి ఇచ్చేది వాళ్ళమ్మ. జావ తాగించేది. కాళ్ళు నొప్పులు నాన్నా అంటే తను కాళ్ళు నొక్కేవాడు. తలకు జండూబాం రాసి మర్దన చేసేవాడు. వాళ్ళమ్మ పక్కనే పడుకొని రాత్రంతా ఏ అవసరం వచ్చినా చూసుకునేది. ఇప్పుడు ఎవరున్నారు తనకి? ఇవన్నీ ఎవరు చేస్తారు? తన కూతురు అనాధలా హాస్టల్ గదిలో పడుకుని ఉంటుందన్న ఊహకే అతనికి దు:ఖం వచ్చింది.

అతనికి కంటిమీద కునుకు లేదు. అతని భార్య సుశీల కూడా మంచంలో అసహనంగా కదుల్తూనే ఉంది.

" మనం అమ్మాయిని హాస్టల్లో చేర్పించి తప్పు చేసామేమోననిపిస్తోంది" అన్నాడతడు. ఆ మాటలు ఆవిణ్ణి ఉద్దేశించి మాట్లాడినట్లు కాకుండా సీలింగ్ వైపుకు చూస్తూ గొణుగుతున్నట్లు చెప్పాడు.

"మనుషులన్నాక జ్వరాలూ జబ్బులూ రావా? మన పిల్ల ఇక్కడ ఉంటే జ్వరాలు రాకుండా ఉంటాయా? చిన్న విషయానికే ఎందుకింత వర్రీ అవుతారు? ఆ హాస్టల్లో మనమ్మాయి ఒక్కతే కాదు. దాదాపు ఆరు వందల మంది అమ్మాయిలున్నారు. వాళ్ళందరికీ తండ్రులుంటారు. ఆ తండ్రులు వాళ్ళ కూతుర్లను మీకన్నా ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటారు. ప్రపంచంలో మీరొక్కరే తండ్రి అయినట్లు, మీ కూతురు అపురూపమైనట్లు మాట్లడకండి" అంది సుశీల.

రమణారావుకి తన హాస్టల్ జీవితం గుర్తుకొచ్చింది. ఇంటర్ పాసైనాక ఎంట్రన్స్ పరీక్ష రాసి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజిలో సీటు సంపాదించాడు. ప్రతిభగల విధ్యార్ధులకు మాత్రమే అందులో చదువుకునే అవకాశం దొరికేది. గవర్నమెంట్ స్కాలర్ షిప్తో చదువుకోవడమే ఆ రోజుల్లో గొప్ప..

సీటొచ్చిందని తెల్సినప్పుడు ఎంత సంబర పడ్డాడో, అమ్మానాన్నని వదిలి కర్నూలు వెళ్ళాల్సిన రోజోప్పుడు అంత బాధపడ్డాడు. ముఖ్యంగా అమ్మ.. అమ్మకు దూరంగా ఎలా బతకడం ... ఉదయం లేవగానేఎ కళ్ళకు అరచేతులు అడ్డం పెట్టుకొని "అమ్మా త్వరగా రావే' అని అరచి అమ్మ రాగానే చేతులు తీసేసి అమ్మ మొహం చూస్తేగానీ తెల్లారదే తనకు... బైటికెళ్ళే ముందు అమ్మా వెళ్ళొస్తా అని చెప్పకుండా బైటికి అడుగు పెట్టలేడే తను.. అమ్మ చేతివంట తప్ప మరేమీ రుచించని తనకు హాస్టల్ లో భోజనం సహిస్తుందా... రమణా అని పిచిచే అమ్మ తీయని పిలుపు వినకుండా తను అసలు బతగ్గలడా ......

మొదటి రోజు కాలేజీలో అడ్మిషన్లయ్యాక మెస్ లో భొంచేస్తుంటే వాంతి వచ్చింది. ముతక బియ్యంతో వండిన అన్నం.. రుచీ పచీ లేఎని కూరలు....

రెండ్రోజులకు మించి ఉండలేకపోయాడు. హోం సిక్ నెస్. ఏం చేస్తున్నా అమ్మ గుర్తుకొచ్చేది. పాఠాలు వింటున్నా ఇల్లు గుర్తుకొచ్చేది. హాస్టల్ రూం కొస్తే ఏడుపొచ్చేది. రాత్రి నిద్ర పట్టేది కాదు.

మూడో రోజుకే తిరిగొచ్చిన కొడుకుని చూసి "ఏరా రమణా.. అప్పుడే వచ్చేసావు" అంది వాళ్ళమ్మ ఆశ్చర్య పోతూ.

" నువ్వు గుర్తొస్తున్నావమ్మా. అక్కడ ఉండలేకపోయాను" అమ్మను పట్టుకు బావురుమన్నాడు తను.

" అలాగైతే ఎలా నాయనా .. పాఠాలు పోతే కష్టం కదా. నువ్వింకా చిన్న పిల్లవాడివా ఏమిటీ? అమ్మను వదిలి ఉండలేనంటే ఎలా ... చదువు ముఖ్యం కదా" అని నచ్చ చెప్పి సున్ని ఉండలు, మురుకులు, పచ్చళ్ళు చేసిచ్చి మరలా కర్నూలుకు పంపింది.

రెండు వారాలు ఎలాగో ఉగ్గపట్టుకుని గడిపాడు. మరలా మూటా ముల్లె సర్దుకుని ఇంటికి చేరాడు.

" తప్పు నాయనా. వేరే దేశాలకెళ్ళి చదువుకుంటున్నారు పిల్లలు. కర్నూలు మనకు దగ్గిరే కద" అంది అమ్మ.

"దగ్గరా దూరం కాదమ్మా, నిన్నూ మనింటినీ వదిలి ఉండటం కష్టం గా ఉందమ్మా" అన్నాడు. రెండ్రోజులుండి తిరిగొచ్చిన వారానికి విపరీతమైన జ్వరం.

రూం మేట్లు మెస్సునుండీ పాలు, రొట్టి తెచ్చిచ్చి కాలేజీకెళ్ళిపోయారు.

తలనొప్పి, వొళ్ళు నొప్పులు, నీరసం.. అన్నిటికీ మించి ఒంటరితనం. ఏడుపొచ్చింది.రెండు సీరియళ్ళు కాగానే కరుణాకర్ రూం కొచ్చాడు. అతనికి డాక్టర్ కావాలని కోరిక. ఎంట్రన్స్ రాసాడు. సీటు రాకపోతే బి జెడ్ సి గ్రూపులో చేరాడు. ఈ సంవత్సరం మరలా ఎంట్రన్స్ కి ప్రిపేరవుతున్నాడు. మా రూం కి మూడు రూం ల అవతలి రూం అతనిది. స్నేహం కలిసింది.

" నువ్వు గుర్తొచ్చి క్లాసులు వదిలేసి వచ్చాను" అన్నాడు.

తల నొక్కాడు. కాళ్ళు పట్టాడు. నా మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. డాక్టర్ ఇచ్చిన బిళ్ళలు వేసుకోటానికి నీళ్ళ గ్లాసుతో పాటూ అందించాడు.

రాత్రికి దగ్గరుండి చారన్నం తినిపించాడు. తిన్న అరగంటకే భళ్ళున వాంతయ్యింది. వాసనకి రూమేట్లు ముక్కులు మూసుకున్నారు. కానీ కరుణాకర్ చీపురూ, బక్కెట్లో నీళ్ళూ పట్టుకొచ్చి రూమంతా కడిగాడు.

రాత్రికి జ్వరం ఎక్కువైంది. పలవరింతలు. కరుణాకర్ ధర్మామీటర్ తో టెంపరేచర్ చూసి నోట్ చేసాడు. " అమ్మో నూట నాలుగు" అన్నట్టు లీలగా గుర్తు.

ఉదయం డాక్టర్ వచ్చి చూసాడు. "గవర్నమెంట్ హాస్పిటల్ కి పిల్చుకెళ్ళటం మంచిది" అంటే కరుణాకర్ దగ్గరుండి పిల్చుకెళ్ళాడు. నేను హాస్పిటల్లో ఉన్న నాలుగు రోజులూ నాతోనే ఉన్నాడు.

" నువ్వు రేపు డాక్టరైతే నువ్వు చేసే సేవలు చూసి రోగులు నిన్ను దేవుడిలా చూస్తారు" అన్నాను కరుణాకర్ తో.

మరుసటి ఏడు అతను ఎంట్రన్స్ పాసై, యంబిబియస్ లో చేరాడు, కొన్నాళ్లకుత్తరాలు నడిచాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడొ?

అనూషకు అటువంటి స్నేహితురాళ్ళు ఊన్నారో లేరో? తను రూం లో ఒంటరిగా పడుకుని ఏడ్చినట్లు అనూష కూడా ఒంటరిగా బాధ పడ్తుందో ఏఎమో?

ఉదయం ఐదు కాకముందే లేచి తయారయ్యి విజయవాడ వెళ్ళే బస్సెక్కాడు. మధ్యాహ్నం పన్నెండింటికి బస్సు విజయవాడ చేరింది. ఆటో మాట్లాడుకుని శ్రీ చరిత హాస్టలుకెళ్ళే సమయానికి పిల్లలందరూ మెస్ లో భోజనాలు చేస్తున్నారు.

నేరుగా వెళ్ళి వార్డెన్ ని కల్సుకున్నాడు.

"మీ అమ్మాయి క్లినిక్ లో ఉంది. వెళ్ళిచూడండి" అంది భావరహితంగా.

కింది ఫ్లోర్ లోనే క్లీనిక్ లోపలికి ఆదుర్దాగా వెళ్ళాడతను. ఓ మంచం మీద అనూష పడుకుని ఉంది. మొహమంతా వాడిపోయి, పిల్ల తోటకూర కాడలా సన్నబడిపోయింది. మంచానికి ఓ పక్కగా కూచుని "అమ్మా అనూ" అని పిలిచాడు. ఆ గొంతులో అనంతమైన ఆవేదన... నా వల్లనే తల్లీ నీకిన్ని కష్టాలు.. ఆ రోజు అమ్మతో దెబ్బలాడైనా సరే మాంపించి ఉంటే ఈ రోజు ఇంత దయనీయమైన స్థితిలో ఒంటరిగా పడి ఉండే ఖర్మ నీకు తప్పేది. నన్ను క్షమించు తల్లీ అనే అభ్యర్థన...

అనూష మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా నాన్న.. పోయిన ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది. ' నేనిక్కడ ఉండను నాన్నా. నన్ను పిల్చుకెళ్ళు నాన్నా" అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న కూతుర్ని చూసి ఆ తండ్రి గుండె చెరువయ్యింది.

రూం కెళ్ళి సూట్ కేసులో బట్టలు సర్దాక వార్డెన్ దగ్గిరకొచ్చి "మా అమ్మాయిని పిల్చుకెళ్తున్నానండీ' అన్నాడు.

" ప్రిన్సిపల్ గారొచ్చి పర్మిషన్ లెటర్ ఇస్తే గానీ పంపడానికి వీలు కాదు" అందావిడ.

"అదేమిటి? మీరేగా ఫోన్ చేసి అమ్మాయిని పిల్చుకెళ్ళమని చెప్పింది? ఇప్పుడి అభ్యంతరం ఏమిటి?"

ఇది హాస్టల్. మాకూ కొన్ని పద్ధతులుంటాయి. ఎవర్నంటే వారిని, ఎప్పుడంటే అప్పుడు, ఎవర్తో అంటే వారితో బైటకి పంపడానికి వీలు కాదు."

ఆ మాటలకు రమణారావుకి కోపం వచ్చింది. " నేను నా కూతుర్ని, అదీ మూడూ రోజులుగా జ్వరంతో బాధ పడ్తోన్న కూతుర్ని తీసికెళ్ళడనికి వచ్చాను. దానికోసం ఎవరి ఫర్మిషనూ నాకు అక్కరలేదు."

" మీ ఇస్టం. అలా అయితే మీ అమ్మాయిని ఈ హాస్టల్ నుంచే పిల్చుకుపోయి, వేరే కాలేజీలో జాయిన్ చేసుకోంది. మీ అమ్మాయి మా కాలేజీలో చదువుకొవాలంటే మా పద్ధతులు పాటించాల్సిందే"

మీ కాలేజీ వద్దు-మీ అర్థంలేని పద్ధతులూ వద్దు అందామనుకున్నాడు. భార్య గుర్తొచ్చి కోపాన్ని అదుపు చేసుకున్నాడు.

"నేనోస్తానని చెప్పాకదా. మీరు ముందే పర్మిషన్ తీసుకుని పెట్టాల్సింది" అన్నాడు.

"అలా వీలు కాదు. స్టూడెంట్ తరఫు బంధువులు ఎవరొస్తారో వారే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి"

"ఇప్పుడు ఏం చేయమంటారు? " నిస్పృహగా అడిగాడు.

"ప్రిన్సిపాల్ ఈశ్వరరావుగారు వచ్చేవరకూ ఆగాలి"

"ఇప్పుడొస్తారా ఆయన?"

"చెప్పలేం. సాయంత్రం ఏడు గంటల లోపల ఎప్పుడైనా రావొచ్చు"

"అప్పటిదాకా వేచి ఉండాలా? నా వల్ల కాదు. పిల్లకు ఆరోగ్యం బాగో లేదని హైరానా పడ్తూ పరిగెత్తుకుంటు వస్తే సాయంత్రం ఏడు వరకూ ఉండమంటారేమిటి? మీ ప్రిన్సిపాల్ ఇల్లు ఇక్కడేగా నేను వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాను."

"మీ ఇస్టం" అందావిడ.

అనూషని క్లీనిక్ లోని మంచం మీదే వదిలేసి హాస్టల్ బైటకి వచ్చాడు. అక్కడ వాచ్ మన్ నడిగి ప్రిన్సిపాల్ గారి ఇల్లు కనుక్కుని వెళ్ళాడు. ఎర్రటి ఎండ నిప్పులు చెరుగుతోంది. బెజవాడని బ్లేజ్ వాడ అని ఎందుకు అంటారో పెనంలా ఉన్న నేలని, పొయ్యిలా ఉన్న నింగినీ చూస్తే అర్థమైంది.

కాలింగ్ బెల్ నొక్కాడు. నిమిషం విరామం తర్వాత ఒకావిడ వచ్చి తలుపు తీసింది. ఆవిడ వయసు నలభై ఐదుకి దగ్గిరగా ఉంటుంది. మొహం విశాలంగా ఉండి కాంతివంతంగా ఉంది. మిట్ట మధ్యాహ్నం అపరిచితుడెవడో కాలింగ్ బెల్ కొడితే సహజంగానె చిరాగ్గా మొహం పెట్టి ఎవరు కావాలని అడుగుతారు. కానీ ఈవిడ నవ్వుతూ రమణారావు వైపుకు చూసింది.

"ప్రిన్సిపాల్ గారు ఉన్నారాండీ" అడిగాడతను.

"లేరు పనిమీద బైటికెళ్ళారు"

ఆ సమాధానం వినగానే అతని ప్రాణం ఉసూరుమంది.

మీ పిల్లలెవరైనా మా హాస్టల్లో చదువుకుంటున్నారా?

అవునండీ మా అమ్మాయి అనూష ఫస్టియర్ ఇంటర్ చదువుతోంది.

అక్కడే నిలబడ్డారేం? ఎండ బాగా ఉంది. లోపలికి రండి అందామె.

పర్లేదండి. సార్ ఎప్పుడొస్తారో చెప్తే మరలా వస్తాను.

మీరు మొదట లోపలికొచ్చి కొద్ది సేపు కూచోండి. ఎండన పడి వచ్చారు. మజ్జిగిస్తాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆమె లోపలికెళ్ళింది.

రమణారావు హాల్ళోని సోఫాలో కూచున్నాడు. ఆమె గ్లాసునిండా మజ్జిగతో తిరిగొచ్చింది.

మజ్జిగలో నిమ్మకాయ కూడా పిండాను తాగండి అందామె.

గటగటా తాగేశాడు. చల్ల్గగా ఉందిప్పుడు. కడుపులోనే కాదు, మనసులోకూడా.

ఇప్పుడు చెప్పండి ప్రిన్సిపాల్ గారితో ఏం పనో.

అనూష జ్వరంతో భాధపడ్తోన్న విషయం, తను హైదరాబాద్ కి పిల్చుకెళ్ళాలనుకుంటున్న విషయం చెప్పాడు.

అయ్యో అలానా.... ఆయన్ని వెంటనే పిలిపిస్తాను అంటూ అతని ఎదురుగానే సెల్ కి ఫోన్ చేసింది. భోజనానికని బంధువులింటికి వెళ్ళారు. విజయవాడలో సూర్యరావుపేటలో ఉంది వాళ్ళ ఇల్లు. నన్నూ రమ్మన్నారు ఒంట్లో నలతగా ఉండి నీను వెళ్ళలేదు అంది.

ఇరవై నిమిషాలు కాకముందే ఈశ్వరరావు గారు కార్లో వచ్చారు.

తన లెటర్ హెడ్ మీద పర్మిషన్ లెటర్ తో పాటు మూడు రోజుల శెలవు గ్రాంట్ చేస్తున్నట్లు రాసిచ్చారు. మీ ఇంట్లో మీ కూతుర్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారో మా హాస్ట్లల్లో అమ్మాయిల్ని అంతే జాగ్రత్తగా కాపాడాల్సిన భాధ్యత నా మీద ఉంది. అందుకే ఇలాంటి రూల్సు పెట్టాను. మా హాస్టల్ నుంచి ఏ అమ్మాయి బైటికెళ్ళినా నాకు తెలిసి, నా పర్మిషన్ తో మాత్రమే బైటికెళ్ళాలి. మీ కు అసౌకర్యం కలిగిస్తే సారీ, అన్నాడతను.

ఆటో మాట్లాడుకొనొచ్చి అమ్మాయిని పిల్చుకుని బస్టాండ్ కి బయల్దేరాడు. ప్రయాణంచేసే స్థితిలో లేదు అనూష. అతనికేం చేయాలో పాలుపోలేదు. ఇంత ఎండలో బస్సు ప్రయాణం మంచిది కాదనిపించింది. హొటల్లో ఓ రూం తీసుకున్నడు. ట్రెయిన్ రాత్రి పదకొండున్నరకుంది. బోలెడంత సమయం ఉంది. అందుకని సాయంత్రం చల్లబడ్డాక అనూషని పిల్చుకుని సుర్యారావు పేట లో ఉన్న డాక్టరు దగ్గరకు పిల్చుకెళ్లాడు. డాక్టరు రాసిచ్చిన టెస్టులు చేయించాడు. మలేరియాతో పాటు టైఫాయిడ్ కూడా ఉందట.

శ్రీచరిత హాస్టల్ అన్నారుగా. అది పొలాల మధ్యలో ఉంది. ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం ఈశ్వరరావు వాళ్ళ న్నాన పదెకరాలు కొని పడేశాడు. అప్పుడు చాలా చీప్ లో కొన్నాడు. ఇప్పుడు బంగారం. ఆ హాస్టలో చదువుకునే వారికి మలేరియా రాక పోతే ఆశ్చ్రర్యపోవాలి.

టైఫాయిడ్ అంటారా... కలుషితమైన ఆహారం...కలుషితమైన నీరు అన్నాడు డాక్టర్. మందులు రాసిచ్చి వెంటనే కోర్సు స్టార్ట్ చేయండి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారమే ఇవ్వండి. వీలైనంతవరకు లిక్విడ్ ఫుడ్డే ఇవ్వండి.అన్నాడు.

అమ్మాయికి యంసెట్లో ర్యాంకు వస్తుందో రాదో తెలీదు కానీ హాస్టల్ పుణ్యమా అంటూ మలేరియా, టైఫాయిడ్ ఒకేసారి వచ్చాయి. రాత్రికి మజ్జిగన్నం బాగా పిసికి మెత్తగా చేసి తినిపించాడు. మూడురకాల మాత్రలు వేసి పడుకోబెట్టాడు. పదకొండింటికి లేపి స్టేషనుకి పిల్చుకెళ్తుంటే పిల్ల పడ్తున్న యాతన చూసి "అమ్మాయిని తిరిగి హాస్టల్ కి పంపకూడదు. ఏమైనా కాని తను హైదరాబాద్ లోనే చదువుకుంటుందీ.అని బలంగా నిర్ణయించుకున్నాడు.

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.