పక్షులు

-- జ్వాలాముఖి

నదులు, ఊళ్ళను కని పెంచి పోషిస్తాయని
గట్లను తెంపి, వరద బీభత్సాలను సృష్టించారు
తెగాకే ఊళ్ళలో ఉనికి ఉదృతంగా పోరాడింది
పోరాడే ఉనికిలో ఊరు ఊషిరై మసలింది

ప్రకృతిని పిడికిట పట్టాలనుకున్న వేటగాళ్ళు
పిట్టలమీద పగబట్టి విరుచుకు పడ్డారు
పాడిపాడి తమనిద్రను పాడు చేస్తాయని
పిట్టల్ని వెదకి వెదకి చెట్లతో పాటు నేల గూల్చారు
కలవరం, కాలాన్ని మురళి చేసి మారు మోగింది
వళ్ళు విరచిన ప్రకృతి అడవిని ఉద్యమంగా తీర్చింది

నిర్మలాకాశంలో నిశ్చల స్వేచ్చాశయాలు పక్షులు
ప్రకృతిశ్వాసకు బతుకు ధ్యాసకు కర్మ సాక్షులు
హృదయాల్ని మీటి ఉదయాల్ని చాటే జ్ఞాన చక్షువులు
విశ్వాసాల్ని నాటి విశ్వాన్ని వెలిగించే ధర్మ భిక్షువులు

మొలవక మట్టిలో మారాం చేసే
అంకురాల్ని తొలకరిపాటతో తట్టి
కింకర్తవ్య భయం నుండి బయట పడేస్తాయి
కదలని కాలాన్ని రెక్కలతో ముందుకు తోసి
చరిత్ర గతిని వేగవంతం చేస్తాయి పక్షులు

పక్షులకు నీటి జాడలు తెలుసు
జలల్ని నిద్రలేపి జనపదాలకు తరలిస్తాయి
పక్షులకు గాలి గమకం తెలుసు
రాగానికి తానం ఇచ్చి పల్లెకు పల్లవి చెప్పి
అరుణోదయాన్ని అమృత చరణాలిస్తాయి

పక్షులకు లక్ష్యాల ఔన్నత్యాలు తెలుసు
మనుగడ కళ్ళలో విశ్వాసాలు వెలిగించి
కాళరాత్రుల్ని అధిగమించి చుక్కలలో నేస్తం కడ్తాయి
ఉజ్వలాకాశంలో అనంత యాత్రికులై గమ్యం సాధిస్తాయి
పంచభూతాల సాక్షిగా పక్షులు యుగప్రవక్తలై సంచరిస్తాయి

ఊళ్లమీద, పచ్చిక బయళ్లమీద సంస్కృత సెలయేళ్లమీద
ఘాతుకాలతో పరమకిరాతులైన వేటగాళ్ళు
బర్బరులై కీకారణ్యాల్ని నేలమట్టం చేసి తగుల బెట్టారు
మనుగడ సాగకుండా ప్రకృతినంతా నిర్దూమధామం చేసారు

జనారణ్యంలోకి వలస వచ్చిన కలలు పక్షులైనాయి
స్నేహం ద్రోహమై ఆశ్రయం విచ్చిన కిరాతకమైంది
విశ్వాస ఘాతుకం వ్యూహంగా మారి సందర్బం శత్రువైంది
మార్గాయాసం తీర్చే చలివేందిర మృత్యువుని ధారపోసింది

కలల చుట్టూ వలలు తిరుగుతాయని
కలలుగనే కళ్ళకు ముందే తెలిసిరాదు
కళ్ళు తెరిచేసరికి కాలం కాటేసిపోతుంది
కలలు మూతబడ్డాయి, కళ్ళు బయట బడ్డాయి

జాతికలలు పీడకలలుగా వికటించిన విషాదం
పక్షులు పంజరంలో పెరిగి వచ్చిన చీకటి దుమారం
నెమలిని దేశంపక్షిగా తలచే వారి దేశవాళి ప్రక్రియ
పాలపిట్టను జాతిపిట్టగా కొలిచేదొరల భూతదయ

ధర్మ పక్షపాతాన్ని ముక్కలుచేసే
ఆయుధం ఏదీ, ఇంతవరకు పుట్టలేదు
సత్య సంధతను సమూలంగా దగ్ధం చేసే
నిప్పునెవరూ కనిపెట్టలేదు
నిబద్ధతను పూడ్చివేయాలనుకున్నా
వీరభోగ్య వసుంధర ఊరుకోదు
చిత్తసుద్దిని ముంచి వేద్దామనుకున్నా
దయా సముద్రుడు నోరు తెరువడు
త్యాగాన్ని తుడిచిపారేయాలనుకున్నా
సుడిగాలి ప్రతికూలం కాక మానదు
ఆదర్శాన్ని అణచిపారేయాలనుకున్నా
ద్రవించే ఆకాశం భీష్మించి మీద పడదు

నశించే శరీరం యుద్ధానికి జెండాకాదు
ఘోషించే విముక్తి యుగయుగానికీ మానవ ప్రవక్త
ఆశయం చావదు ధర్మ యుద్ధం ఆగదు
మా నిషాద చైతన్యంలో జటాయువు ధీర్ఘాయువు
రంగుల రవివర్మ సౌందర్యావేశం కూడా
రక్తసాక్షి ధర్మ వర్గానికి కుంచెనేయక తప్పలేదు
దుర్భర దృశ్యాన్ని ధర్మసాదృశంగా నిలపడమే చిత్రం

మానిషాదలో పుట్టిన కవి జటాయువుతోనే బతికాడు
కరుణలో కరిగిన కాల్యానికి ధర్మవీరమే పరమావధి
వీరం ప్రతీకారం కాదు, అది అహంకారనికి కాయకల్ప చికిత్స
పీడకలల్ని చెరిగే జాతికల మట్టిమనుషుల భూమికల
ఆర్తత్రాణ పరాయణుల ఘాతకహత్య
కావ్య ప్రపంచానికి అక్షర సూతకం కవి సమయాన్ని
ధర్మ యుద్ధంగా మారుస్తుంది
కవితాపం యుగకోపంగా మారి
వీరవాక్యాన్ని రచిస్తుంది
యుగవీరుల మహాభినిష్క్రమణం
మానవ మహాప్రస్తానానికి కీర్తిపతాకం

పుట్టిచచ్చి పోయేఎవారిని కాలం పట్టించుకోదు
చచ్చి పుట్టేవారిని భుజాలమీదెక్కించుకోక మానదు
పక్షులెప్పుడూ చచ్చిపుట్టె ప్రకృతి సందేశాలు
క్రాంతి దర్శులెప్పుడూ మమేకం చెందే అక్షర యుద్ధాలు

కీకారణ్యం ఇప్పుడు మహాకావ్యం
జటాయువు తరతరానికీ యుగసందేశం
జనారణ్యం వినిపించని పక్షిఘోష
సంఘటిత స్వప్నాల సంకల్పం నేటికావ్య భాష.