పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారిని ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు మే 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య

" కం// సందులు గొందులు వెదకుచు సత్యము కొఱకై "

క్రితమాసం సమస్య : ఇంటి కెడితేను టీవీని పెట్టి నారు

ఈ సమస్యలో యతి తప్పింది అని పాఠకులకు తెలుపడానికి చింతిస్తున్నాము. కానీ చాలా పూరణలు ఎన్నో విన్నూత్న విధంగా వచ్చాయని చెప్పడానికి ఆనందిస్తున్నాము కూడా. కొందరు చందస్సు మార్చుకొని, కొందరు సమస్యా సవరణలు చేసి, కొందరు ఈ చందస్సునే ఆధారంగా చేసుకొని, ఎంతో ఉత్సాహం కనపరిచారు. ఈ ఆధరణ ఇలాగే కొనసాగితే పద్యానికే మన మెరుగులు మనం పెట్టుకోవచ్చునేమో. ఇలా వచ్చిన పూరణలలో స్థలాభావం వల్ల, ఉత్తమమైన పూరణలను మాత్రమే ప్రచురిస్తున్నాము (ఇవి ఏ ఒక క్రమం లోనూ మేము పెట్టటం లేదు, ఎందుకంటే అన్ని మంచి పూరణలే)

మొదటి పూరణ - వామరాజు సత్యమూర్తి, సింగపూరు

తే.గీ.// వలపుతోడుత మర్యాద పలుకరించ
ఇంటికెడితేను టీవీని పెట్టినారు!
ధ్యాస యంతయు అటువైపె తలని తిప్పి
చూడరైతిరి నావంక చూపు కలిపి !


రెండవ పూరణ - డా. ఐ. యస్. ప్రసాద్

తే.గీ.// నాగరికతలు పెరిగిన నగరమందు
ముందు ఎన్నడో స్థిర పడ్డ బంధుజనులు
మంచి చెడులను మాట్లాడుటుంచి యటుల
ఇంటి కెళితేను టీవీని పెట్టినారు


మూడవ పూరణ - పుల్లెల శ్యామసుందర్

తే.గీ.// బుల్లితెర చూడ వలదని తల్లి చెప్ప,
మంచి అవకాశము కొఱకు పొంచి ఉన్న,
పిల్లలిద్దరు - నిద్రకై తల్లి పడక
టింటి కెడితేను - టీవీని పెట్టినారు!!



నాల్గవ పూరణ - ఉదయ రావు

ఇంటి కరుదెంచి, టీవీని గంటి నేను
వాంట యింటిలో సహితము వచ్చె బొమ్మ,
రాత్రి వేళయు, ప్రొద్దు విశ్రమము లేక
చలన చిత్రములను జూడ శక్యమయ్యె.



ఐదవ పూరణ - రానారె (రామనాధ రెడ్డి ఎర్రపు రెడ్డి)

ఆ.వె.// మనసు బాగులేదు మాటాడదామని ( లేదా మందు గొడ్దామని)
మిత్రుడొకడు బిలువ మిడిసె జివ్వ (జిహ్వ కు వికృతి, మిడిసె అనగా త్వరపడి)
అంట్ల వెధవ వాని ఇంటి కెడితేను, టీ
వీని పెట్టినారు పిచ్చిరేగ!



(వ్యావహారిక భాషలో పద్యంద్వారా ఆప్రక్రియను జనభాహుళ్యానికి అందుబాటులో ఉంచవచ్చునన్న మా ఆలోచనలను అభినందిస్తూ ఈ పద్యాన్ని వ్రాసారు. చాలా కృతజ్ఞతలు రానారే గారూ! మీ అభినందనలె మాకు శ్రీరామ రక్ష!) ఆరవ పూరణ - రానారె

తొలిదశలోనే పోటీ నుండి వైదొలగి ఇంటికొచ్చిన కాప్టెన్ ద్రవిడ్ తన అంతరంగిక మిత్రులతో ఇలా ఆటవెలదిలో వాపోయాడట.

ఆ.వె.// ఇండియా గెలుచును వెస్టిండియాలోనను
బాస భంగ పరచె బంగ భూమి
కంట నీరు పొంగ ఇంటి కెడితేను టీ
వీని పెట్టినారు వీధి లోన!



(పాపం ఖడ్గ తిక్కన తరువాత ఇటువంటి అవమానం భరించినవాడు మన ద్రావిడే నంటూ జాలి పడ్డారు.)

పాఠకుల నుంచీ ఇంకొన్ని మంచి పద్యాలు:

వామరాజు సత్యం మూర్తి గారి పద్యం

భుక్తాయాసము నరులకు
యుక్తా యుక్తంబు మాని ఊరక తింటే
శక్తియు కలుగదు తద్దను
రక్తిగ నిద్దర్యు వచ్చు రాతిరి పగలున్



భక్త హనుమ -- తల్లాప్రగడ

సందర్బం: అశోకవనంలో హనుమంతుడిని చూచి సీతామ్మవారు రాముడు ఎలా ఉన్నాడో సమర సన్నాహలు చేయగలుగుతున్నాడొ లేదో తెలుసుకోవాలని పించింది. అప్పుడు ఆ ఆంజనేయుడు ఇలా ఈ క్రింది విధంగా అని ఆతడుంటే, భయము కూడా తానే భయపడునన్నాడు.

సీ:// ప్రత్యయ ప్రహరణం శ్రీరామ బాణమౌ, సమర సంసిద్దుడా సవ్య సాచి!
పరిత పరిత్రాణ ప్రజా పరిష్కౄత, ప్రజా పరిష్వంగ ప్రసిత తిమిత,
పరిపాల సుదక్షితం, పవమాన వీక్షితం, తత్ రావణ ప్రోక్షితం స్మరామి!
నారామ శ్రీరామ సంగ్రామ జయరామ, కల్యాణ రామ లోకాభి రామ!

తే.గీ.// సర్వమానవ సామరస్యపు పరాయ
ణం, ఖదౌష్ట్యాదుల వినాశనం, ఖసాత్మ
జాది సమ్హరణార్ద, భుజాంతరముతొ
రమ్య గుణగణధామ శ్రీరామచంద్ర

ప్రతిపదార్థం:

ప్రత్యయ = గురి తప్పని(చాలా నమ్మకము గల )
ప్రహరణం = ఆయుధము
శ్రీరామ బాణమౌ= శ్రీరాముడి బాణమై ఉన్నటువంటి
సమర సంసిద్దుడా = యుద్దానికి సంసిద్దుడైన
సవ్య సాచి= రెండు చేతులతో బాణాలు వేయగలిగిన వాడైన రామచంద్రుడు
పరిత = అంతటా
పరిత్రాణ = అందరినీ రక్షించువాడై
ప్రజా పరిష్కౄత = ప్రజలే తన అలంకారమై జీవించువాడై
ప్రజా పరిష్వంగ = ప్రజల చేత కౌగలింపడు వాడు (అంటే ప్రజలు ఎప్పుడు తన చుట్టూ ఉండగా వారి మెప్పును పొందిన వాడు అనటం)
ప్రసిత తిమిత,= అటువంటి పేర్లలో (గుణాలతో) మునిగిన వాడు
పరిపాల సుదక్షితం = గొప్ప పరిపాలనా దక్స్త కలిగిన వాడు
పవమాన వీక్షితం = వాయుదేవుని చూపులతో
తత్ రావణ ప్రోక్షితం = ఆ రావణుని చంపడం
స్మరామి= స్మరణ చేసుకుంటాను.
నారామ శ్రీరామ = నా రాముడు శ్రీరాముడు
సంగ్రామ జయరామ = యుద్ధంలో ఎల్లప్పుడూ గెలుచు వాడు
కల్యాణ రామ = అంతా శుభం కలుగ జేయు రాముడు
లోకాభి రామ= లోకానికే అందగాడు!

సర్వమానవ సామరస్యపు = అందరి మానవుల క్షేమం కోరి
పరాయణం = ప్రయత్నించువాడు
ఖదౌష్ట్యాదుల = ఇంద్రియాల దుస్టత్వం (ఇంద్రియ నిగ్రహం సంపాదించడం గురించి)
వినాశనం = నాశనం చేసి
ఖసాత్మజాది = రాక్ససుల వంటి వారిని
సమ్హరణార్ద= చంపుట కొరకు
భుజాంతరముతొ = పెద్ద ఛాతీ కలవాడైన (బలవంతుడు లేక ధైర్యశాలి అనడం)
రమ్య గుణగణధామ = ఇలాంటి రమ్యమైన గుణ గణాలు కల్గిన
శ్రీరామచంద్ర = శ్రీరామచంద్రుడు!