నటరంజని : కూచిపూడి నాట్యహారంలో మరొక మణిపూస రేవతి కొమాండూరి

-- కాకుళవరపు రమ

నటరంజని శీర్షిక ద్వారా మీకు పరిచయం చేయబోయే నర్తకి అట్లాంటా పట్టణంలో నివసిస్తున్న కొమాండూరి రేవతి గారు. రేవతిగారు 1992 సంవత్సరంలో రఘురాం గారిని పెళ్ళి చేసుకుని, 1993 లో అమెరికాకి వచ్చి అట్లాంటా పట్టణంలో సెటిల్ అయ్యారు. రఘురాంగారు ప్రస్తుతం ఆల్టెల్ లో సాప్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. వీళ్ళకు ఒక పాప - శ్రీవాణి, బాబు - శ్రీకర్. రేవతి గారు సుమారు పది సంవత్సరంల నుండి అమెరికాలో నాట్య బోధన చేస్తున్నారు. ఆమె 1994 లో చినసత్యం మాస్టారు గారి ఆశీస్సులతో "శ్రీవాణి" కూచిపూడి నాట్య అకాడెమీని ప్రారంభించి, విద్యార్ధులకు శిక్షణ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆవిడ ఆరు ఆరంగేట్రములు కూడా చేసారు.

కొమండూరి రేవతి గురువు పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి ప్రప్రధమ శిష్యురాలలో ఒకరు. ఆవిడ పుట్టినది గుంటూరు పట్టణంలో నైనా, పెరిగినది మద్రాసు పట్టణంలోని సాలిగ్రామంలో. అమ్మగారి పేరు బాలాత్రిపుర సుందరి, ఆంధ్రాబ్యాంకులో మేనేజర్ గా చేసేవారు, నాన్నగారు అనందమోహన్, క్రాంప్టన్ గ్రీవ్స్ లో పని చేసేవారు.ఆవిడ తన చిన్నతనంలోనే తమ ఇంటిప్రక్కనే ఉంటున్న టీచర్ గారి దగ్గర ఒక సవత్సరం భరతనాట్యం నేర్చుకున్నారు. ఆ తరువాత పసుమర్తి కృష్ణ మూర్తి గారి దగ్గర కూచిపూడి నాట్యానికి నాందీ వచనం పలికారు. ఆ క్రమంలో వాళ్ళమ్మ గారి స్నేహితురాలు చెప్పగా విని టీనగరలో వుంటున్న వేంపటి చినసత్యం మాస్టారు గారి దగ్గర తన ఎనిమిదవ ఏట కూచిపూడి నాట్య శిక్షణ మొదలు పెట్టారు.

ప్రతీరోజూ స్కూలు అవగానే అరువై మైళ్ళు ప్రయాణం చేసి అకాడమికి వెళ్ళేవారు. వాళ్ళమ్మ గారి ప్రొత్సాహం, నాట్యం మీద ఆమెకున్న అభిరుచి, నేర్చుకోవాలన్న కుతూహలమే తమను అంత దూరం ప్రయాణం చేసేలా చేసిందని ఆవిడ చెప్పుకున్నారు. కొన్ని కొన్నిసార్లు అకాడమిలోనే రిహార్సల్స్ కోసం రాత్రి పూట పన్నెండు, ఒంటి గంట గంటల వరకు ఉండిపోవాల్సి వస్తుండేది. అలాంటప్పుడు అక్కడే భోజనం చేసి , అక్కడే స్కూలు హోం వర్కులు కూడా పూర్తి చేసుకునే వారు. వేసవి సెలవులకు అక్కడే అకాడెమిలో వుండడం చాలా ఇష్టంగా ఉండేది. ఉదయం టిఫిన్ దగ్గరినుండి, భోజన సదుపాయాలన్నీ మాస్టారు గారే స్వయంగా దగ్గర ఉండి చూసుకునే వారు. అలాంటప్పుడు ఇంటికి అసలు వెళ్ళాలనిపించేది కాదు. ఆ పధ్నాలుగు సంవత్సరాలు ఎంతో ఉత్తేజంగా, తనజీవితంలో ఒక స్వర్ణ యుగంగా, ఆ అనుభవాలు తన జీవితంలో ఎన్నటికీ మరువలేనివని ఆవిడ అన్నారు.

మాస్టారు గారి ఆతిధ్యం, పిల్లల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ యెన్నటికీ మరువలేని తీయని అనుభవాలుగా ఆవిడ వర్ణిస్తూ ఒక ఉదాహరణగా ఒక అనుభవాన్ని ఇలా చెప్పారు. 1984 లో భద్రాచలంలొ రుక్మిణీ కళ్యాణం కూచిపూడి నృత్య నాటకంలో గౌరీదేవిగా అవకాశం ఇచినప్పుడు అప్పటికి రేవతి గారికి పదకొండు ఏళ్ళ వయసు. అందరూ టిఫిన్ తినడం ముగించాక టిఫిన్ తిన్నావా అని అడిగి తన దగ్గర కూర్చోపెట్టుకుని మళ్ళీ ఇంకో ప్లేటు బలవంతం చేసి మరీ తినిపించారుట. ఆయన ఎంత ప్రేమ చూపించే వారో అంత క్రమ శిక్షణ కూడా నేర్పించారు అని ఆవిడ అన్నారు.

బాల్యం నుంచి యుక్త వయస్సు వచ్చే వరకు ఆయన దగ్గరే శిష్యురాలిగా ఉంటూ నాట్యం నేర్చుకున్న తనకు ఆయన ఎన్నో జీవితపాఠాలను నేర్పించారు. ఆయన శిక్షణలో సామాన్య జీవితాన్ని ఎలా గడపాలో అనుభవ పూర్వకంగా నేర్చుకున్న రేవతి నాట్యాన్ని గురువుగారు తన జీవితానికి ఇచ్చిన ఒక అపురూపమైన కానుకగ గుర్తుంచుకుంటామన్నారు.

రేవతి గారు భారత దేశమంతటా మాస్టారు గారు రచించి, రూపకల్పన చేసి ఇచ్చిన ఎన్నో ప్రదర్శనలలో ప్రాముఖ్యమైనవి శ్రీనివాస కళ్యాణము (సరస్వతి, పార్వతి గా), హరవిలాసములో (రతి గా), రుక్మిణీ కల్యాణం, రామాయణం, అర్ధ నారీశ్వరము, శ్రీకృష్ణ పారిజాతము. ఆమె గురువు గారితో కలిసి 1991 లో జర్మని, 1994 మరియు 1998 అమెరికాలో ప్రదర్శనలిచ్చారు. ఆమె తను స్వంతముగా రూపకల్పన చేసిన మేనక విశ్వామిత్ర నృత్య రూపకాన్ని నాష్విల్, డెట్రాఇట్, పిట్స్ బర్గ్,న్యు యార్క్ పట్టణములలో ప్రదర్శన చేసి ఎంతో జనాదరణను పొందారు. ఆవిడ 2004 లో ఇంకా "శివోహం" నృత్య రూపకాన్ని తన శిష్యులతో కలిసి అట్లాంటా పట్టణంలో ప్రదర్శించారు.

కూచిపూడి ఆర్టు అకాడెమి నుండి మాస్టారు గారు ఆమెకు 'నాట్య విశారద' బిరుదును గుట్టు బిందు మాధవి అవార్డును ఇచ్చి సత్కరించారు. అమెరికాలోని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సెమెంట్ ఆఫ్ అర్ట్స్ వారు 'మాస్టర్ టీచర్ ' అవార్డును ఇచ్చారు.

రేవతి గారు ఇప్పుడు తన విద్యార్ధులకు చేస్తున్న ఈ నాట్య శిక్షణ తన తల్లి , గురువు గార్ల ప్రేమ, క్రమశిక్షణ వలనను సంక్రమించినదని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. తన సర్వస్వమైన వారిని తలుచుకోకుండా ఏ ఒక్కరోజూ గడవదని, తనకు జీవితంలో ఏ కష్టం వచ్చినా మాస్టారు గారిని గుర్తుకు తెచుకుంటానని చెప్తూ ఇలా ముగించారు.

"గురువు - మన జీవితంలో చీకటిని తొలగించి వెలుగు చూపించే మహా మనీషి."