మా ఊరివాడు!

--తల్లాప్రగడ

సిలికానాంధ్ర నిర్వహించిన సర్వజిత్ ఉగాది కవిసమ్మేళనంలో ప్రస్తుతపఱచబడి శ్రోతలను ఉర్రూతలూగించిన ఈ కవితను మీకోసం అందిస్తున్నాం....

మీ ఊరి వాడనని ఎవడైనా పలకరిస్తే చాలు!
మీ ఊరు బావుంటుందనెవరైనా కనికరిస్తే చాలు!
ఒళ్ళు పులకరించి పోతుంది! కన్ను చెమర్చుకు పోతుంది!
మనసు తేలికైపోతుంది, వయస్సు వెనక్కెళి పోతుంది!

మీ ఊరివాడినని ఊదితే చాలు, ఉన్నదంతా ఇచ్చేస్తారు,
ఒల ఒల వాగేస్తారు, గలగల మని నవ్వేస్తారు,
తలకాయలు ఆడిస్తారు, పరఖాయలొ దూరేస్తారు,
అర నిమిషమని మొదలెడతారు, ఎవేవో తెరగేస్తారు!

అంతే,
ఊళ్ళోని గుళ్ళు గుర్తొస్తాయి, చిన్ననాటి బళ్ళు గుర్తొస్తాయి,
వీదిమీది తిళ్ళు గుర్తొస్తాయి, ఆనాటి గోళీలు గుర్తొస్తాయి,
చెరువులోని సుళ్ళు గుర్తొస్తాయి, ఎగిరే నెమళ్ళు గుర్తొస్తాయి,
తిరిగే కోళ్ళు గుర్తొస్తాయి, తిరిగిన కాళ్ళు గుర్తొస్తాయి!

ఏన్ని తీపి గురుతులురా నాన్నా!

బడ్డి కిళ్ళీలు గుర్తొస్తాయి, బీటేసిన కాలేజి వోణీలు గుర్తొస్తాయి,
ఓ అమ్మాయి కళ్ళు గుర్తొస్తాయి, మదిలో రైళ్ళు గుర్తొస్తాయి,
ఆమె ఇంటి చుట్టూ తిరిగిన కాళ్ళు గుర్తొస్తాయి, అలా గడిచిన ఏళ్ళు గుర్తొస్తాయి,
ఆమె మాటల ముళ్ళు గుర్తొస్తాయి, ఆ వొత్తిడికి కొరికిన గోళ్ళు గుర్తొస్తాయి,
చెళ్ళుమన్న చెంపలు గుర్తొస్తాయి, ఆమె అన్న విరిచిన ఓళ్ళు గుర్తొస్తాయి,
దాని దుంప తెగ, అన్నీ మధుర స్మృతులే!

చిన్ననాటి అల్లర్లు, ఆకతాయి పనులు,
రౌడీలు కిల్లర్లు, భయానక తన్నులు,
కాలేజీ సమ్మర్లు, ఆ లేజీ వెన్నులు,
అసలురాని గ్రామర్లు, పరీక్షల్లో సున్నలు,

ఇలా చెప్పి దొరికినోడికి సుత్తేస్తారు, కరకర మని నమిలిమింగేస్తారు!
ఏన్నో ఆపేక్షలు చూపించుకుంటారు, ఎవడెవడినో ఆక్షేపించుకుంటారు!
విషయాలన్నో విశధీకరిస్తారు, వింతలెన్నొ శొధిస్తారు!
ఇక్కడ కష్టాలన్ని వల్లిస్తారు, అక్కడ ఇష్టాలన్నీ కలపోస్తారు!

ఊర్లోని మంచిని గుర్తిస్తారు, మనవాళ్ళంతా అంతేనని గర్విస్తారు,
కలిసుండాలని కలకంటారు, కలిమిలేములు కల్లలంటారు,
ఈస్ట్ ఆర్ వెస్ట్ హోం ఈజ్ బెస్ట్ అంటారు, ఇక్కడేముంది అంతా వేస్ట్ అంటారు,
వరసగా నీతులు వల్లిస్తారు, లేనిపోని వరసలు కలిపి చెల్లిస్తారు,

ఊరికి వెళిపోతే బావుండు మామా అంటారు,
అక్కడల్లే ఇక్కడుండలేమా అంటారు,
ఇక్కడ ఇదేమి సంస్కృతిరా రామా అంటారు,
అక్కడ సంగతులివి వినుర వేమా అంటారు!

విచిత్రం ఏమిటంటే, ఆవూళ్ళో ఉన్నప్పుడు,

ఎప్పూడూ పట్టించుకోలేదు, పక్కింటి వాణ్ణి కూడ,
బికారికి కూడ దులపలేదు , చిల్లి కాణి కూడ,
మంచిమాట పలకలేదు, ఓ సారి కూడా,
తల్లినే సరిగా తలవలేదు , ఓ మారు కూడా!

అప్పటి కథ ఇలా సాగేది,
దేశీ చుట్టం రాబందనో సారీ, తెల్లోడే కన్నులకు విందనోసారీ,
ఇండియాలో అసలేముందనోసారి, అమెరికా నే మనసుకి మందనోసారీ,
మేముండేది చిన్న సందనో సారీ, కావాలి అమెరికా పొందనో సారి,
వీసా వస్తే బాగుండనో సారీ, తెలుగెవడికి కావాలి నీ బొందనో సారీ,

నిజానికి, నేననాలి, ఐ యాం సారీ!

ఇక్కడ పది మైళ్ళు వెళ్ళాలిగాని, అక్కడ ఇద్దరూ దగ్గిర వారే,
అంతేకాదు, ఇద్దరికీ తెలుసు ఇద్దరూ ఆ వూరికి వెడితే,
మళ్ళీ ఎవడి దారి వాడిదేనని, మళ్ళీ కలిసి మాట్లాడుకోరనీ,
ఎవడి గొడవ వాడిదే ననీ, ఎవడి పిలక వాడిదే నని!

అదీ వరస, ఎక్కడైనా కానీ,
మావూరివాడు - మావూళ్ళో కాడు!
మావూరివాడు - మా వూళ్ళో లేడు!
మావూరివాడు - బయటకొచ్చాకే మావూరివాడు !